
రేపు శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు
ఓదెల (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈనెల 6న నిర్వహించనున్న శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివస్తారు. ఉదయం సుప్రభాత సేవతో పూజలు, వేడుకలు ప్రారంభమవుతాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు శ్రీసీతారాముల కల్యాణ ప్రక్రియ ప్రారంభిస్తారు. దేవతామూర్తులను మంగళవాయిద్యాలతో వేదికపైకి తీసుకొచ్చి ఆశీనులు చేస్తారు.
చకచకా ఏర్పాట్లు..
ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. భక్తులకు నీడ సౌకర్యం కల్పించేందుకు చలువ పందిళ్లు నిర్మిస్తున్నారు. మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ఇప్పటికే సమీక్షించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్వామివారికి పట్టువ్రస్తాలను సమరి్పస్తారు. అర్చకుడు ఆరుట్ల శ్రీనివాసచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం జరిపిస్తారు.
వైభవంగా కల్యాణం
ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అ«ధికారుల ఆధ్వర్యంలో స్వామివార్ల కల్యాణం సుమారు మూడుగంటల పాటు నిర్వహిస్తాం. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులు తీర్థప్రసాదాలు అందిస్తాం. – ఆరుట్ల శ్రీనివాసచార్యులు, అర్చకుడు
ఏర్పాట్లు చేస్తున్నాం
ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆదివారం జరిగే సీతారాముల కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాం. నీడ, మంచినీరు, వసతి గదులు అందుబాటులో ఉంచుతాం. ఆలయాన్ని విద్యుద్ దీపాలతో అలంకరిస్తాం. – బొడ్క సదయ్య, ఆలయ ఈవో, ఓదెల
కనుల పండువగా ఉంటుంది
ఓదెల మల్లన్న సన్నిధిలో ఏటా శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిపిస్తారు. మూడుగంటల పాటు మంగళవాయిద్యాలతో కల్యాణం జరుగుతుంది. అధికసంఖ్యలో భక్తులు తరలిరావాలి. – రంగు బ్రహ్మచారి, భక్తుడు కొలనూర్