
ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వేదికగా భారీసభ
సభాస్థలిలి సందర్శించిన నేతలు
సభ నిర్వహణకు భూములివ్వడానికి రైతుల అంగీకారం
నేడు కేసీఆర్‌తో ఉమ్మడి వరంగల్ నేతల భేటీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు వేదికగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఖరారైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉమ్మడి వరంగల్ నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సతీష్‌బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాల మల్లు, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితదితరులు శుక్రవారం పరిశీలించారు. సభ నిర్వహణకు సంబంధించి భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర అనుమతుల కోసం కాజీపేట ఏసీపీ తిరుమల్‌ను వరంగల్ ముఖ్య నాయకులు కలిసి దరఖాస్తు ఇచ్చారు.
భారీగా జన సమీకరణ
ఎల్కతుర్తి మండల కేంద్రంలో లక్షలాది మందితో బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,200 ఎకరాలకు సంబంధించిన రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. మొత్తం 1,200 ఎకరాల్లో పార్కింగ్, సభా వేదికలు ఏర్పాటు చేయనున్నారు.
సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కేసీఆర్ సూచించిన నేపథ్యంలో 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి జాతీయ రహదారిలో అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ, ఇతర వాహనాలు కలిపి 40 నుంచి 50 వేల వరకు రావొచ్చని అంచనా వేస్తున్న నాయకులు ఆ మేరకు పార్కింగ్ ఏర్పాట్లు చూస్తున్నారు. వలంటీర్లను ఎంపిక చేసి రిటైర్డ్ పోలీసులతో శిక్షణ ఇప్పిస్తున్నారు.
రెండు రోజుల్లో సభ నిర్వహణ కమిటీలు..
ఎల్కతుర్తి రజతోత్సవ సభపై శనివారం ఉమ్మడి వరంగల్ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ మేరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో చర్చించనున్నారు. అనంతరం సభ సక్సెస్ కోసం రెండు రోజుల్లో సుమారు 20 రకాల సన్నాహక కమిటీలు ఖరారు చేయనున్నట్టు పార్టీవర్గాల సమాచారం.