
వేసవిలో జోరుగా విక్రయాలు
మండే ఎండల్లో చల్లని తాటిముంజలు
జ్యోతినగర్(రామగుండం): మండే వేసవిలో చల్లదనంతోపాటు సంపూర్ణారోగ్యాన్ని చేకూర్చే తాటిముంజల వ్యాపారంతో వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. తెలంగాణ లో తాటిముంజలు అంటే తెలియని వారుండరు.. అందుకే వీటికి ఏటా డిమాండ్ పెరుగుతూ వ స్తోంది.. దీన్ని దృష్టిలో పెట్టుకున్న చిరు వ్యా పారులు, రోజువారీ కూలీలు.. గీత కార్మికు ల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తూ పట్టణా లు, నగరాలకు తరలిస్తూ విక్రయిస్తున్నారు. మరికొందరు గీత కార్మికులే నేరుగా విక్రయిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏటా 46–48 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం శ్రామికులు, కార్మికులే కాదు.. అధికారులూ తాటిముంజల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని ఆధారం చేసుకుని పెద్దపల్లి జిల్లాలో సుమారు 100 మంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే దాదాపు 500 మంది వరకు తాటిముంజలు విక్రయి స్తూ సీజనల్ ఉపాధి పొందుతు న్నారు.
వైద్యులు ఏమంటున్నారంటే..
» అరటిపండ్లలో మాదిరిగానే పొటాషియం ఉంటుంది
» గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది
» రక్తపోటును అదుపులో ఉంచుతుంది
» విటమిన్ కే, సీ, బీ, జింక్, ఐరన్, కాల్షియం, పోషకాలు లభిస్తాయి
» శరీరంలో ద్రవాలు పెరుగుతాయి
» అధిక బరువును నియంత్రిస్తుంది
» చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి, జీర్ణశక్తిని పెంచుతుంది
సీజన్ వ్యాపారం బాగుంది
ప్రతీ సీజన్‌లో దొరికే మామిడి, దోసకాయలు అమ్ముత. ఈసారి కూడా పల్లెటూరులో గౌడ కులస్తుల వద్ద ముంజకాయలు కొనుగోలు చేసి ఎన్టీపీసీ తీసుకొచ్చిన. గిరాకీ బాగుంది. ఖర్చుపోనూ రోజూవారీ కూలి మంచిగనే గిట్టుబాటవుతోంది. వారం నుంచి ఈ వ్యాపారం చేస్తున్న. – బాకం మల్లేశ్, చిరు వ్యాపారి, ఎన్టీపీసీ రింగ్‌రోడ్డు
చిన్నప్పుడు తినేవాళ్లం
చిన్నప్పుడు మా ఊరిలో గౌడ్ నుంచి మా నాన్న ముంజకాయలు తీసుకొచ్చేవారు. ఇప్పుడు తిందామంటే ఊరికి వెళ్లడానికి కుదరడం లేదు. గోదావరిఖనికి వెళ్లి తాటిముంజలు కొనుగోలు చేసి తీసుకొస్తున్న. మా పిల్లలకు కూడా వీటి గురించి చెప్పి తినిపిస్తున్న. ఎండాకాలంలో మంచిది. – స్వరూప, నర్రాశాలపల్లె, ఎన్టీపీసీ
అమ్మ తీసుకొచ్చింది
నేను పాఠశాల నుంచి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన తాటిముంజలు చూసిన. అవి కావాలని మా అమ్మకు చెప్పిన. వెంటనే వెళ్లికొని తీసుకొచ్చింది. చాలా రుచిగా ఉన్నయి. మా పాఠశాలలో కూడా వీటిగురించి చెప్పిన. ఫాస్ట్‌ఫుడ్ కన్నా ఇవి ఆరోగ్యానికి ఎంతోమంచివని మా ఉపాధ్యాయులు కూడా చెప్పారు. – నిత్యశ్రీ, విద్యార్థిని, ఎన్టీపీసీ, రామగుండం
తెలంగాణలో కల్లు ఫేమస్
తెలంగాణలో తాటి, ఈతకల్లు ఫేమస్. వేరే ప్రాంతాల్లో కల్లు గీయడం, తాటి ముంజలు అమ్ముకోవడం చాలా తక్కువ. తెలంగాణలో చాలామంది గీత కార్మికులు ఉన్నారు. తెల్లకల్లు మూడు సీజన్లలో దొరుకుతుంది. వీటిని పొద్దాటి, పరుపుదాటి, పండుతాటి అని అంటారు. నీరా, అడగల్లు కూడా ఉంటుంది. – సింగం మల్లికార్జున్‌గౌడ్, మేడిపల్లి
ఆరోగ్యానికి మంచిది
తాటిముంజలు తింటే గుండె, లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి వేసవిలో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వాటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగకరం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా దోహదపడుతాయి. ఎండలో బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ రాజశేఖరరెడ్డి, ఫిజీషియన్, ప్రభుత్వ ఆస్పత్రి, గోదావరిఖని