
ఠారెత్తిస్తున్న ఎండలు
రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వేసవి ప్రారంభంలోనే 32 డిగ్రీల నమోదు
10 దాటితే బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం
నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
జాగ్రత్తలు పాటించాలంటున్న డాక్టర్లు
వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం పది దాటిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మిట్టమధ్యాహ్నం అనూహ్యంగా ఎండలు దంచి కొడుతుండటంతో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇళ్లలో ఉన్న జనాలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఇక మూలన పడి ఉన్న కూలర్లకు, ఫ్యాన్లకు పని చెబుతున్నారు. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు చల్లటి మట్టికుండల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
మిరుదొడ్డి(దుబ్బాక): రోజురోజుకు ముదురుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. మండుతున్న ఎండలతో చెరువులు, కుంటలు, వాగులు వంకల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో బోరుబావులు సైతం వట్టి పోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ప్రారంభంలోనే భూ గర్భ జలాలు అడుగుంటిపోతుండటంతో ఇక మున్ముందు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎండలతో అనారోగ్య సమస్యలు
ఎండలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరగడం, పనులు చేయడం వల్ల చర్మం పొడిబారిపోయి పూర్తిగా డీ హైడ్రేషన్‌కు గురై కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. సకాలంలో వైద్యం చేయించకపోతే సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందనీ, తద్వారా చనిపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మున్ముందు ఎండలు మరింత ముదిరే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
తేలికపాటి దుస్తులు ధరించాలి
ఎండాకాలంలో ఎక్కువ ముదురు రంగులు కాకుండా, తేలికపాటి లైట్ కలర్ దుస్తులను ధరించాలి. ముఖ్యంగా నలుపు రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. నలుపు రంగు దుస్తులు ఎక్కువ ఎండవేడిని గ్రహించి అసౌకర్యానికి గురి చేసే అవకాశాలున్నాయి.
జాగ్రత్తలు తప్పని సరి
వేసవిలో ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులు ఎక్కువగా ఎండలో తిరగకుండా, ఆడకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలి. చిన్నపాటి ఎండలకు చిన్నారులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక వృద్ధులు ఇంట్లో నుంచి బయట రాకుండా జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాళ్లు, కరీ్చఫ్‌లు, టోపీలు, గొడుగులు ధరించాలి.
ద్రవపదార్థాలు తీసుకోవాలి
ఎండాకాలంలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలనే ఎక్కువ తీసుకోవాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. ఎండలో తిరిగివచ్చిన వారు షర్భత్, మజ్జిగ, కొబ్బరి నీళ్లను తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. మార్కెట్లో విరివిగా లభించే, పుచ్చ, తర్బూజ, నిమ్మ, ద్రాక్ష ఫలాలతోపాటు, చల్లటి పండ్ల రసాలను తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించక పోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.
బోరుబావిలో నీటి మట్టం తగ్గింది
ఆరుతడి కింద సాగు చేస్తున్న పంటలకు నీరు అందించే బోరు బావిలో నీటి మట్టం తగ్గుతోంది. ఇదివరకు వచ్చిన నీటి ధారలు రావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. – ఎల్లయ్య, రైతు, అందె
పనులు ఉదయం వేళే చేస్తున్నం
మధ్యాహ్నం ఎండలు దంచి కొడుతుండటంతో కూలీ పనులు చేసుకోలేక పోతున్నాం. ఉదయం పది అయ్యిందంటే చాలు మంట పుట్టిస్తున్నాయి. పొద్దున్నే ఉపాధి పనులకు పోయి 10 గంటల వరకు పనులు ముగించుకుంటున్నాం. – లక్ష్మి, ఉపాధి కూలీ, లక్ష్మీనగర్
జాగ్రత్తలు పాటించాలి
ఎండల పట్ల జాగ్రత్తలు పాటించాలి. రైతులు, వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలు ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే పనులు చేసుకోవాలి. ఎండలో ఎక్కువగా పని చేయడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. – డాక్టర్ సమీనా సుల్తానా, పీహెచ్‌సీ, మిరుదొడ్డి
చెట్లు మోడుబారె.. అడవి ఎడారె!|
దట్టమైన మల్లన్నసాగర్ అడవి ఎడారిని తలపిస్తోంది. అడవిలో ఉన్న పెద్దపెద్ద చెట్లన్నీ ఆకురాల్చడంతో ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు.. మరోవైపు చెట్లు ఆకురాల్చడంతో అడవిలో కొలువైన రేకులకుంట మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు నీడ లేక ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దట్టమైన మల్లన్నగుట్టల అడవి బోసిపోయి కనిపిస్తున్న దృశ్యాలను సాక్షి క్లిక్ మనిపించింది. – దుబ్బాక

ఠారెత్తిస్తున్న ఎండలు
Comments
Please login to add a commentAdd a comment