
మంత్రపురి దర్శన్ నిలయం
పురాతన వస్తువుల ప్రదర్శనకు ‘మంత్రపురి దర్శన్’ నిర్మాణం
సీతారామ సేవా సదన్ సంస్థ కృషి
మంత్రముగ్ధుల్ని చేస్తున్న అలనాటి పరికరాలు
తిలకించేందుకు వస్తున్న ప్రవాసులు, విద్యార్థులు
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) ప్రాచీన పట్టణం. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఆ గ్రామంలో ప్రజల ఆహారపు అలవాట్లు, వినియోగించే వస్తువులు.. ఇలా అన్నీ భిన్నంగానే ఉంటాయి. ఉన్నతోద్యోగాలు, ఉపాధి కోసం.. మంత్రపురి (Mantrapuri) వాసులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడిపోయారు. సమాజంలో మార్పులకు ఇక్కడి ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. కానీ మంథనిలోని సీతారామ సేవా సదన్ స్వచ్ఛంద సేవా సంస్థ.. ఈ గ్రామస్తులు తరతరాలుగా వినియోగించిన విలువైన పురాతన వస్తు సామగ్రిని భవిష్యత్‌తరాలకు అందించేందుకు కృషి చేస్తోంది.
అందుకోసం మంత్రపురిలోని పురాతన ఇళ్లు, వాటిలోని వస్తుసామగ్రి, వంటలు, వ్యవసాయ.. తదితర అవసరాలకు ఉపయోగించే పురాతన వస్తువులను సేకరించి ప్రదర్శించేందుకు మంత్రపురి దర్శన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పురాతన వంటసామగ్రి, ధాన్యం నిల్వచేసే గాదెలు, కొలతలు, ప్రమాణాల పరికరాలు, వ్యవసాయ పరికరాలు, ఎండ, వేడి, చలిని తట్టుకునేలా సొనార్చి (మిద్దె), పాలతం.. తదితర సుమారు ఐదు వందల రకాల వస్తువులను ప్రదర్శనగా ఉంచారు. ఇందు కోసం ఓ ఇంటిని ప్రత్యేకంగా నిర్మించారు.

ప్రజల సందర్శనార్థం రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శన శాలను తెరిచి ఉంచుతున్నారు. వివిధ దేశాల్లో స్థిరపడి స్వస్థలానికి వచ్చిన ప్రవాసులు.. ఈ పురాతన వస్తువులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. మంథనితోపాటు చుట్టు పక్కల ప్రాంతాల విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. పురాతన వస్తుసామగ్రి సేకరణకు దాదాపు మూడేళ్లకు పైగా సమయం పట్టిందని, మరో 50 ఏళ్లు ఇవి ఉండేలా ఇంటిని నిర్మించామని సేవా సదన్ (Seva Sadan) వ్యవస్థాపకుడు గట్టు నారాయణ గురూజీ, అధ్యక్షుడు కర్నే హరిబాబు తెలిపారు.

ఎన్టీపీసీ, సింగరేణిలో ప్రదర్శన
మంత్రపురి దర్శన్‌లోని తాళపత్ర గ్రంథాలతోపాటు ఇతర పురాతన వస్తువులను ఎన్టీపీసీ, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఇలా పలుమార్లు పలు సంస్థలు.. ఇతర ప్రాంతాల వారు వచ్చి ఈ పురాతన వస్తువులను తీసుకెళ్లి తమ కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ తీసుకొచ్చి మంత్రపురి దర్శన్ నిర్వాహకులకు అప్పగిస్తున్నారు.
చదవండి: మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలం
నేటితరం కోసం..
భారతీయ ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతిలో లభించే అనేక వస్తువులు కనుమరుగవుతున్నాయి. ఈక్రమంలో నాటి కుటీర, గ్రామీణ వ్యవస్థ, వస్తువులను నేటితరానికి చూపించాలనే ఆకాంక్షతోనే గట్టు నారాయణ గురూజీ ఈ అవకాశం కల్పించారు. విద్యార్థులు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment