
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్(India vs Pakistan)తో మ్యాచ్‌లో అనవసర చర్య ద్వారా వికెట్ కోల్పోయే ప్రమాదం తెచ్చుకున్నాడని.. అయితే, అదృష్టవశాత్తూ బయటపడటంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్ ఆదివారం పాకిస్తాన్‌తో తలపడింది.
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన రోహిత్ సేన తొలుత ఫీల్డింగ్ చేసింది. బౌలర్ల విజృంభణ కారణంగా దాయాదిని 241 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించిన టీమిండియా.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆచితూచి నిలకడగా ఆడింది.
సెంచరీ మార్కు.. విన్నింగ్ షాట్
ముఖ్యంగా ఓపెనర్ శుబ్‌మన్ గిల్(46), నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(56)లతో కలిసి విరాట్ కోహ్లి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
ఏ దశలో నిర్లక్ష్యపు షాట్లకు యత్నించకుండా.. సహచర బ్యాటర్లతో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. దానిని శతకంగా మలిచాడు.
అంతేకాదు బౌండరీ బాది సెంచరీ మార్కు అందుకున్న ఈ రన్‌మెషీన్.. టీమిండియాను గెలుపుతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై భారత్‌తో పాటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి చేసిన ఓ పని మాత్రం సునిల్ గావస్కర్‌కు ఆగ్రహం తెప్పించింది. భారత ఇన్నింగ్స్‌లో 21 ఓవర్‌ను పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ వేయగా.. ఐదో బంతికి కోహ్లి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో సురక్షితంగానే క్రీజులోకి చేరుకున్న కోహ్లి.. ఆ తర్వాత ఓవర్ త్రో కాబోతున్న బంతిని తన చేతితో ఆపేశాడు.
నిజానికి అక్కడ దగ్గర్లో పాకిస్తాన్ ఫీల్డర్లు ఎవరూ లేరు. ఒకవేళ ఓవర్ త్రో అయినా ఓ అదనపు పరుగు వచ్చేది. అయినా, ఎంసీసీ నిబంధనల ప్రకారం ఓ బ్యాటర్ బంతి లైవ్‌లో ఉన్నపుడు దానిని తన మాటలు, చేతల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అతడు అలా చేసినట్లు భావించి ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అప్పీలు చేస్తే.. సదరు బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించవచ్చు.
అబ్‌స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద..
కోహ్లి విషయంలో ఒకవేళ పాక్ జట్టు ఈ విషయంలో అప్పీలుకు వెళ్లి ఉంటే పరిస్థితి చేజారిపోయేదని గావస్కర్ అన్నాడు. కామెంట్రీ సమయంలో.. ‘‘అతడు తన చేతితో బంతిని ఆపాడు. ఒకవేళ పాకిస్తాన్ గనుక అప్పీలు చేస్తే ఏమయ్యేది?.. అబ్‌స్ట్రక్ట్ ఫీల్డ్ నిబంధన కింద అతడు అవుటయ్యేవాడేమో?!.. కానీ వాళ్లు అలా చేయలేదు. ఎందుకంటే.. అక్కడ దగ్గర్లో ఫీల్డర్ లేడు.
అంతేకాదు ఓవర్ త్రో ద్వారా అదనపు పరుగు రాకుండా ఉండిపోయిందని భావించి ఉండవచ్చు. నిజానికి మిడ్‌వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడు డైవ్ చేస్తే బాగుండేది. కానీ ముందుకు వెళ్లిపోతున్న బంతిని కోహ్లి జోక్యం చేసుకుని మరీ ఆపడం సరికాదు. అదృష్టవశాత్తూ ఎవరూ అప్పీలు చేయలేదు కాబట్టి సరిపోయింది’’ అని గావస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.
కాగా 21వ ఓవర్ ముగిసే సరికి కోహ్లి కేవలం 41 పరుగుల వద్ద ఉండటం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో అతడికి ఇది 51వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్‌లో 82వది కావడం విశేషం. సచిన్ టెండ్కులర్ వంద సెంచరీల రికార్డుకు కోహ్లి ఇంకా 18 శతకాల దూరంలో ఉన్నాడు.
చాంపియన్స్ ట్రోఫీ-2025: భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు
👉పాకిస్తాన్- 241(49.4) ఆలౌట్
👉భారత్- 244/4 (42.3)
👉ఫలితం: పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.
చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!