రోహిత్‌, కోహ్లి, బుమ్రా లేకున్నా భారత్‌ గెలిచింది: టీమిండియా దిగ్గజం | "India Has Won Without Rohit Kohli...": Indian legend Sunil Gavaskar Makes Huge Statement On CT 2025 Win | Sakshi
Sakshi News home page

రోహిత్‌, కోహ్లి, బుమ్రా లేకున్నా భారత్‌ గెలిచింది: టీమిండియా దిగ్గజం

Published Mon, Mar 17 2025 9:22 PM | Last Updated on Tue, Mar 18 2025 9:11 AM

India Has won without Rohit Kohli: Indian legend makes huge statement

కోహ్లి- బుమ్రా- రోహిత్‌ (PC: BCCI)

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా దూసుకుపోతోంది. తొమ్మిది నెలల వ్యవధిలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలవడమే ఇందుకు నిదర్శనం. రోహిత్‌ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో గతేడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత్‌.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (ICC Champions Trophy)ని సొంతం చేసుకుంది.

ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)జట్టుతో లేకపోయినా అద్భుత ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అంతకు ముందు పొట్టి వరల్డ్‌కప్‌ టోర్నీలో పరాజయమన్నదే లేకుండా ట్రోఫీని ముద్దాడింది. ఈ రెండు ఐసీసీ ఈవెంట్లలో వంద శాతం విజయాలతో రోహిత్‌ సేన తమ సత్తా చాటింది.

అత్యంత పటిష్టంగా
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉందన్న సన్నీ.. బెంచ్‌ స్ట్రెంత్‌లోనూ మిగతా జట్లతో పోలిస్తే ముందు వరుసలో ఉందని పేర్కొన్నాడు. వ్యక్తులకు అతీతంగా జట్టుగా భారత్‌ ఎదిగిందని.. రోహిత్‌, కోహ్లి, బుమ్రా లాంటి వాళ్లు లేకపోయినా గెలవగల స్థాయికి చేరుకుందని అన్నాడు.

రోహిత్‌, కోహ్లి లేకుండానే
ఈ మేరకు ‘మిడ్‌-డే’కు రాసిన కాలమ్‌లో.. ‘‘బుమ్రా లేకుండానే టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీలో అద్భుత విజయం సాధించిన తర్వాత.. వ్యక్తులను మించి టీమిండియా స్థాయి పెరిగిందని అర్థమవుతోంది. గతంలో కూడా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి లేకుండానే టీమిండియా చాలాసార్లు గెలిచింది.

అయితే, వాళ్లిద్దరు ఉంటే జట్టు మరింత పటిష్టంగా మారినట్లు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో జస్‌ప్రీత్‌ బుమ్రాపై టీమిండియా ఎక్కువగా ఆధారపడింది. ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.

అయితే, అతడు లేకుండానే ఆస్ట్రేలియా వెలుపల స్వల్ప టార్గెట్లను కూడా టీమిండియా డిఫెండ్‌ చేసుకుంది. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20, వన్డే సిరీస్‌లలో టీమిండియా పరిపూర్ణ విజయాలు సాధించింది. 

భారత క్రికెట్‌ జట్టుతో పాటు బెంచ్‌ కూడా ఎంత బలంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు’’ అంటూ గావస్కర్‌ టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్‌, కోహ్లి లేకుండానే యువ ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో భారత్‌కు అద్భుత విజయాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

ఏకంగా 17 గెలిచిన సూర్య సేన
కాగా టీ20 ప్రపంచకప్‌​-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్‌- కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా విశ్రాంతి పేరిట ఈ దిగ్గజాలు పలు మ్యాచ్‌లకు దూరమయ్యారు. 

ఇక రోహిత్‌- కోహ్లి రిటైర్మెంట్‌ తర్వాత టీమిండియా 20 టీ20 మ్యాచ్‌లు ఆడితే.. అందులో ఏకంగా 17 గెలవడం విశేషం. సూర్యకుమార్‌ సేన విజయాల శాతం 85గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గావస్కర్‌ పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వగా.. రోహిత్‌ సేన మాత్రం ఈ వన్డే టోర్నీలో తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది. గ్రూప్‌ దశలో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌లను ఓడించిన భారత్‌.. సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్లో న్యూజిలాండ్‌లపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ఇక సెమీస్‌ మ్యాచ్‌లో కోహ్లి.. ఫైనల్లో రోహిత్‌ శర్మ అద్భుత అర్ధ శతకాలతో జట్టు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్‌ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్‌: కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement