![CT 2025 Bumrah Ruled Out Of Indian Squad Spinners To Play Key Role](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/rana.jpg.webp?itok=yvCMyAJE)
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు ఇంగ్లండ్‌తో నిర్వహించిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ద్వారా భారత్ బ్యాటింగ్‌పై ఇటీవల రేకెత్తిన అనేక ప్రశ్నల కి సమాధానం లభించింది. ఈ సిరీస్ తో భారత్ బ్యాటింగ్ ఇబ్బందులు మాత్రం తొలిగినట్టే కనిపిస్తున్నాయి. ఇంతకుముందు కటక్ లో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ
సాధించాడు.
ఇక బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 52 పరుగులు సాధించి తన ఫామ్ పై వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసాడు. ఇక ఓపెనర్‌గా వచ్చిన యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కూడా సెంచరీ సాధించడంతో భారత్ బ్యాటింగ్ మళ్ళీ గతంలో లాగా పటిష్టంగా కనిపిస్తోంది.
కోహ్లీ రికార్డ్
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 4,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్ కూడా సాధించాడు. ఇంగ్లండ్‌పై 4,000 పరుగుల మైలురాయిని అధిగమించిన ఆరో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ ఘనత వహించాడు. ఇంగ్లాండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి 87వ మ్యాచ్ లలో ఎనిమిది సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు, 41.23 సగటు తో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ ఇంగ్లండ్‌పై 37 టెస్ట్ మ్యాచ్‌ల్లో 5,028 పరుగులు సాధించి తో ఈ పట్టిక లో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత ఆస్ట్రేలియా కి చెందిన అలన్ బోర్డర్ (124 ఇన్నింగ్స్‌లలో 4850), స్టీవ్ స్మిత్ (114 ఇన్నింగ్స్‌లలో 4815), వెస్టిండీస్ బ్యాటర్ వివియన్ రిచర్డ్స్ (84 ఇన్నింగ్స్‌లలో 4488), ఆస్ట్రేలియాకే చెందిన రికీ పాంటింగ్ (99 ఇన్నింగ్స్‌లలో 4141) వరుసగా తర్వాత స్థానాలలో ఉన్నారు.
ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ అంతకుముందు స్వదేశంలో జరిగిన శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ లలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ పేలవంగా ఆడటంతో వీరిద్దరి ఫామ్‌పై పలు విమర్శలు చెలరేగాయి. కానీ ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో వీరిద్దరూ కూడా పరుగులు సాధించడంతో భారత్ జట్టు మేనేజిమెంట్ ఊపిరి పీల్చుకుంది.
బుమ్రా లేని భారత్ బౌలింగ్
అయితే బ్యాటింగ్ విషయం పర్వాలేదనిపించినా ప్రస్తుతం బౌలింగ్ పెద్ద సమస్య గా పరిణమించే ప్రమాదముంది. భారత్ ప్రధాన బౌలర్ వెన్ను నొప్పి కారణంగా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. జనవరిలో ఆస్ట్రేలియా తో జరిగిన సిడ్నీ టెస్ట్ సమయంలో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ నుంచి వైదొలిగిన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కూడా తాత్కాలిక జట్టు నుంచి తొలగించారు అతని స్థానంలో ఇటీవల కాలంలో నిలకడగ రాణిస్తున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు.
బుమ్రా తాజాగా బెంగళూరులో తీయించుకున్న స్కాన్లలో తీవ్రమైన ఇబ్బంది కనిపించక పోయినప్పటికీ, పూర్తి స్థాయిలో కోలుకోడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నందున అతనికి మరింత విశ్రాంతి ఇవ్వాలని మేనేజిమెంట్ నిర్ణయించింది. గాయం కారణంగా బుమ్రా దూరమవుతున్న రెండవ ఐసీసీ టోర్నమెంట్ ఇది. గతంలో వెన్నునొప్పి కి ఆస్ట్రేలియాలో జరిగిన శస్త్రచికిత్స కారణంగా 2022 టి20 ప్రపంచ కప్ నుంచి కూడా బుమ్రా వైదొలిగిన విషయం తెలిసిందే.
స్పిన్నర్ల పైనే భారం
బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో వన్డే అరంగేట్రం చేశాడు. జనవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఇంగ్లండ్ సిరీస్ కోసం తాత్కాలిక జట్టును ప్రకటించినప్పుడు, ఇంగ్లండ్ వన్డేలకు బుమ్రాకు పూర్తిగా కోలుకోని కారణంగా రాణాని జట్టులోకి ఎంపిక చేశారు. గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన మహమ్మద్ షమీ కూడా ఇంకా పూర్తి స్థాయి ఫామ్ సాధించలేక పోతున్నాడన్న విషయం, ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో తేటతెల్లమైంది.
ఇక వీరిద్దరి తర్వాత మూడవ అత్యంత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ని ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత జట్టు నుంచి తప్పించడం తో భారత్ పేస్ బౌలింగ్ షమీ , అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా ల పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పేస్ బౌలింగ్ కన్నా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ల పైనే ఎక్కువ భారం పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment