ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో భాగమయ్యే ఆటగాళ్ల పేర్ల((India Squad For Champions Trophy 2025)ను శనివారం వెల్లడించింది.
సిరాజ్, సంజూకు మొండిచేయి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) జట్టు వివరాలను మీడియాకు తెలిపాడు. ఈ టోర్నీలో రోహిత్ శర్మకు డిప్యూటీగా శుబ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు.
అయితే, తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి మాత్రం ట్రావెలింగ్ రిజర్వ్స్‌లో చోటు దక్కింది. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా అతడిని ఎంపిక చేశారు.
బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తాడా?
మరోవైపు.. స్పిన్నర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ఆధారంగా ఈ టోర్నీలో ఆడేది లేనిది తేలుతుంది. పేసర్ల విభాగంలో షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్ స్థానం సంపాదించాడు. అయితే, అందరూ ఊహించినట్లుగా సంజూ శాంసన్‌కు మాత్రం ఈసారి ఈ జట్టులో చోటు దక్కలేదు.
కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడి వెళ్లకుండా తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకు ఐసీసీని బీసీసీఐ ఒప్పించగా.. ఐసీసీ జోక్యంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ మేరకు హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.
ఎనిమిది జట్లు
ఇక ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధించగా.. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో అదరగొట్టిన ఏడు జట్లు తమ ప్రదర్శన ఆధారంగా చోటు దక్కించుకున్నాయి. వరల్డ్‌కప్ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియాలతో పాటు.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యాయి.
వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఉన్నాయి.
ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.
ఇక చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టీ20తో మెగా సమరం మొదలుకానుంది.
జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ టీమిండియా- ఇంగ్లండ్‌కు ఈ వన్డే సిరీస్ ద్వారా చాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ప్రాక్టీస్ లభించనుంది. ఇక ఇంగ్లండ్‌తో వన్డేలలో కూడా ఇదే జట్టు ఆడనుండగా.. బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా టీమ్‌లోకి వస్తాడు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనబోయే భారత జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా(ఫిట్‌నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదే
ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- బంగ్లాదేశ్ vs భారత్
ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- పాకిస్తాన్ vs భారత్
మార్చి 2, 2025 (దుబాయ్) న్యూజిలాండ్ vs భారత్.
Comments
Please login to add a commentAdd a comment