విరాట్ కోహ్లితో శ్రేయస్ అయ్యర్
ICC ODI WC 2023- Virat Kohli: టీమిండియా యువ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌ల ఆట తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ మండిపడ్డాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుని భారీ స్కోర్లు చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారని విమర్శించాడు.
ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్‌కు క్రీజులో నిలబడే ఓపిక ఉండటం లేదని.. విరాట్ కోహ్లిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ యువ ప్లేయర్‌కు చురకలు అంటించాడు. అయ్యర్‌తో పోలిస్తే గిల్ కాస్త నయమేనని.. అయితే, ఇలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో ఫిఫ్టీలను సెంచరీలుగా మార్చడంపై మరింత దృష్టి సారించాలని గావస్కర్ సూచించాడు.
వన్డే ప్రపంచకప్-2023లో పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. తద్వారా వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది.
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌లో 78వ సెంచరీ నమోదు చేశాడు. క్రీజులో నిలదొక్కుకుని ఓపికగా ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ తన వ్యక్తిగత స్కోరు పెంచుకోవడంతో పాటు.. జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు.
సిక్స్‌తో విజయలాంఛనం పూర్తి చేసి వన్డేల్లో 48వ శతకం పూర్తి చేసుకుని పలు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా తర్వాత వేగం పెంచి 53 పరుగులతో రాణించాడు.
అయితే, బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో మహ్మదుల్లాకు క్యాచ్ ఇవ్వడంతో గిల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక గిల్ ఫర్వాలేదనిపించినా.. అయ్యర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.
మరో ఎండ్‌లో కోహ్లి తన అనుభవాన్ని రంగరించి అద్భుతంగా ముందుకు సాగుతున్న వేళ.. శ్రేయస్ అయ్యర్ మాత్రం 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ నాలుగో నెంబర్ బ్యాటర్ కూడా మిరాజ్ చేతికే చిక్కి చెత్త షాట్ సెలక్షన్‌తో వికెట్ సమర్పించుకున్నాడు.
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్‌కు ఓపిక లేదు. 19 పరుగుల వద్ద ఉన్నపుడు తన వికెట్ పారేసుకున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ ఫిఫ్టీ(53) పూర్తి చేసుకున్న తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు.
ఇలాంటి టోర్నీల్లో సెంచరీ ఎలా చేయాలో అయ్యర్, గిల్ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే, గిల్ ఇటీవల సెంచరీలు సాధించి ఫామ్‌లోనే కనిపిస్తున్నాడు. కానీ.. శ్రేయస్ అయ్యర్ నుంచి మంచి ఇన్నింగ్స్ కరువైంది.
బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో వచ్చిన ఆటగాడికి అప్పటికే పిచ్ గురించి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. నిజానికి నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం ఒకరకంగా సువర్ణావకాశం లాంటిదే. పరిస్థితులను అర్థం చేసుకుని ముందు సాగాలే తప్ప సహనం కోల్పోతే ఇలాగే వికెట్ పారేసుకోవాల్సి వస్తుంది’’ అని అయ్యర్ ఆట తీరును విమర్శించాడు.
ఇక శతకాల వీరుడు కోహ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఎప్పుడూ ఇలా నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నది లేదు. జాగ్రత్తగా ఆడటం అతడికి అలవాటు. ప్రతిఒక్క క్రికెటర్‌కు ఉండాల్సిన లక్షణం ఇదే.
70-80 పరుగుల వద్ద ఉన్నపుడు సెంచరీ ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ముందుకు సాగుతాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం సహా అనుకున్నది సాధించడం కోసం ఓపికగా ఎదురుచూస్తాడు. ప్రతిరోజూ.. ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ చేసే అవకాశం రాదు కదా!’’ అని గావస్కర్.. కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment