ముగ్గురు మొనగాళ్లు.. కానీ పాపం! అయితేనేం పాక్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు | WC 2023 Ind Vs SL: Gill Kohli Iyer India Break Pakistan Record In WC History | Sakshi
Sakshi News home page

WC 2023: ముగ్గురు మొనగాళ్లు.. కానీ పాపం! అయితేనేం పాక్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు

Published Thu, Nov 2 2023 6:32 PM | Last Updated on Thu, Nov 2 2023 7:36 PM

WC 2023 Ind Vs SL: Gill Kohli Iyer India Break Pakistan Record In WC History - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. వాంఖడే వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లంక ఆహ్వానం మేరకు భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. 

ఆరంభంలోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(4) వికెట్‌ కోల్పోగా.. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ కలిసి 150కి పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

సెంచరీ కోసం నువ్వా- నేనా
ఈ క్రమంలో సెంచరీ సాధించేందుకు నువ్వా- నేనా అన్నట్లు గిల్‌ తన రోల్‌మోడల్‌ కోహ్లితో పోటీపడటం విశేషం. అయితే, ఇద్దరూ శతకానికి చేరువగా వచ్చారు గానీ.. వంద పరుగుల మార్కును అందుకోలేకపోయారు. 

మొత్తంగా 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో గిల్‌ 92 పరుగులు చేయగా.. కోహ్లి 94 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 88 పరుగులు సాధించాడు. వీరిద్దరి వికెట్‌ను మధుషాంక తన ఖాతాలోనే వేసుకోవడం గమనార్హం.

సిక్సర్ల వర్షంతో విరుచుకుపడ్డ అయ్యర్‌
తొలుత రోహిత్‌ను అవుట్‌ చేసిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. తర్వాత ఇలా గిల్‌, కోహ్లిల సెంచరీలకు అడ్డుపడ్డాడు. వీరిద్దరు అవుటైన అనంతరం.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌, లోకల్‌ బాయ్‌ శ్రేయస్‌ అ‍య్యర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

లంక బౌలింగ్‌ను చిత్తు చేస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు. ఆఖరి పది ఓవర్లలో టీమిండియా 93 పరుగులు సాధించిందంటే అది అయ్యర్‌ చలవే.

 అయితే, మధుషాంకకు మరోసారి అదృష్టం కలిసి రావడంతో ఈజీ క్యాచ్‌ ఇచ్చి అయ్యర్‌ పెవిలియన్‌ చేరాడు. దీంతో గిల్‌, కోహ్లిలతో పాటు అతడూ సెంచరీ మిస్‌ అయ్యాడు.

మధుషాంకకు ఐదు వికెట్లు
ఇదిలా ఉంటే.. మిగతా బ్యాటర్లలో రవీంద్ర జడేజా (24 బంతుల్లో 35 పరుగులు) ఒక్కడు ఫర్వాలేదనిపించాడు. కేఎల్‌ రాహుల్‌(21). సూర్యకుమార్‌ యాదవ్‌(12) పూర్తిగా నిరాశ పరచగా.. ఆఖరి ఓవర్లో మహ్మద్‌ షమీ(2), జడేజా రనౌట్‌ అయ్యారు. 

దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించింది. లంక బౌలర్లలో దిల్షాన్‌ మధుషాంక ఐదు వికెట్లు తీయగా.. దుష్మంత చమీర రాహుల్‌ రూపంలో ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

పాకిస్తాన్‌ వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
కాగా గిల్‌, కోహ్లి, అయ్యర్‌ సెంచరీలు మిస్‌ అయినప్పటికీ.. సమిష్టి కృషితో ప్రపంచకప్‌లో టీమిండియా అరుదైన రికార్డు సాధించేందుకు దోహదం చేశారు. వరల్డ్‌కప్‌ హిస్టరీలో ఒక్క బ్యాటర్‌ కూడా సెంచరీ చేయకుండానే అత్యధిక స్కోరు సాధించిన జట్ల జాబితాలో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది.

వరల్డ్‌కప్‌ టోర్నీ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ నమోదు కాకపోయినా అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే:
►357/8 - భారత్ వర్సెస్ శ్రీలంక- ముంబై వాంఖడే స్టేడియం, 2023
►348/8 - పాకిస్తాన్‌ వర్సెస్ ఇంగ్లండ్, నాటింగ్‌హాం, 2019
►341/6 - దక్షిణాఫ్రికా వర్సెస్ యూఏఈ, వెల్లింగ్టన్, 2015
►339/6 - పాకిస్తాన్‌  వర్సెస్ యూఏఈ, నేపియర్, 2015
►338/5 - పాకిస్తాన్‌ వర్సెస్ శ్రీలంక, స్వన్సీ, 1983.

చదవండి:  అయ్యో శుబ్‌మన్‌.. సెంచరీ జస్ట్‌ మిస్‌! సారా రియాక్షన్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement