
నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరు
ఓడిన జట్టు ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి అవుట్!
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
చెన్నై: ఈ ఐపీఎల్ సీజన్‌లో పరాజయలతో సతమతమవుతోన్న గత ఏడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)... ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మాజీ చాంపియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడి... 2 విజయాలు, 6 పరాజయాలతో నాలుగేసి పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. పట్టికలో సన్‌రైజర్స్ తొమ్మిదో స్థానంలో ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.
ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ విజయం తప్పనిసరి అయిన నేపథ్యంలో... ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. చెన్నై జట్టు ఈ ఏడాది కనీస ప్రదర్శన కనబర్చలేక ఇబ్బంది పడుతుంటే... బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంటోంది. ఇరు జట్లకు మరో ఆరేసి మ్యాచ్‌లు మిగిలి ఉండగా... అన్నీ మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తేనే సులువుగా ప్లే ఆఫ్స్‌కు చేరే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో... స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉన్న పిచ్‌పై హైదరాబాద్‌ను పడగొట్టి ముందంజ వేయాలని ధోనీ సారథ్యంలోని చెన్నై భావిస్తోంది.
మరోవైపు బ్యాటింగ్ లోపాలను సరిచేసుకొని తిరిగి భారీ స్కోర్లతో విజృంభించాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది. బుధవారమే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముంబై చేతిలో ఓటమి మూటగట్టుకున్న రైజర్స్... 48 గంటలు తిరిగేసరికి చెన్నైతో మ్యాచ్‌కు రెడీ అయింది. మరి ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో పరాజయాలతో సహవాసం చేస్తున్న ఇరు జట్లలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!
తీవ్ర ఒత్తిడిలో ధోనీ సేన...
సాధారణంగా చెపాక్‌లో మ్యాచ్ అంటే... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగడం పరిపాటి. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఫలితాలు అందుకు భిన్నంగా వస్తున్నాయి. ధోని సేన స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుంటంతో ఆ జట్టుకు పరాజయాలు తప్పడం లేదు. కోల్‌కతాతో మ్యాచ్‌లో అయితే చెన్నై మరీ నాసిరకం ఆటతీరు కనబర్చింది. క్రీజులో నిలవడమే తెలియదన్నట్లు బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరమవడంతో... జట్టు పగ్గాలు అందుకున్న ధోని కూడా సీఎస్‌కే రాత మార్చలేకపోతున్నాడు.
టాపార్డర్‌లో ధాటిగా ఆడే బ్యాటర్ లేకపోవడం... మిడిలార్డర్‌లో మునుపటి మెరుపులు లోపించడం... ధోని స్వేచ్ఛగా భారీ షాట్‌లు ఆడలేకపోవడం... ప్రత్యర్థి స్పిన్నర్లు విజృంభిస్తున్న చోట చెన్నై బౌలర్లు నామమాత్ర ప్రదర్శన కనబర్చడం... వెరసి చెన్నై తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు కాస్త ఆశ ఏదైనా ఉంది అంటే... అది యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే మెరుపులే.
గత మ్యాచ్ ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 17 ఏళ్ల మాత్రే... ముంబై పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 15 బంతుల్లో 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తుండగా... రచిన్ రవీంద్రలో నిలకడ కొరవడింది. మిడిలార్డర్‌లో జడేజా, దూబే, విజయ్ శంకర్ కీలకం కానున్నారు. ఓవర్టన్, పతిరణ, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, అశ్విన్, జడేజాతో బౌలింగ్ మెరుగ్గా ఉంది.
ఏవీ ఆ మెరుపులు!
సీజన్ ఆరంభ పోరులోనే దాదాపు మూడొందల పరుగులతో బీభత్సం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత లయ కోల్పోయింది. పంజాబ్ కింగ్స్‌పై భారీ లక్ష్యాన్ని ఛేదించి తిరిగి గాడిన పడింది అనుకుంటే... పాత పాటే పునరావృతం చేస్తోంది. గత రెండు మ్యాచ్‌లను ముంబైతోనే ఆడిన సన్‌రైజర్స్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయం పాలైంది. రైజర్స్ ఓటముల సంఖ్య కన్నా... ఆరెంజ్ ఆర్మీ ఆడుతున్న తీరే అభిమానులను కలవరపెడుతోంది.
పిచ్, పరిస్థితులతో సంబంధం లేకుండా క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వెనుదిరగడం... జట్టు ఆలోచన విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిõÙక్ శర్మ నిలకడ కొనసాగించలేకపోతుండగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో క్లాసెన్‌పై అధిక భారం పడుతోంది. అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ మరింత ఆశిస్తోంది. దూకుడుకు మారుపేరుగా నిలిచిన రైజర్స్... ఇప్పుడు అదే తొందరపాటులో వికెట్లు కోల్పోయి చతికిలబడుతోంది.
ఇక చెన్నైలో రైజర్స్‌కు మంచి రికార్డు లేదు. చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరెంజ్ ఆర్మీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. కమిన్స్, షమీ, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ ఇషాన్ మలింగతో కూడిన బౌలింగ్ బృందం ఎలాంటి అద్భుతాలు చేయలేకపోతోంది. ‘అభిషేక్, హెడ్ విఫలమవుతున్నప్పుడు ఇతర ఆటగాళ్లు బాధ్యత తీసుకోవాల్సిన అవసరముంది. ఈ సీజన్‌లో అదే కొరవడింది. భాగస్వామ్యాలు నమోదు చేయడంలో మా ఆటగాళ్లు విఫలమవుతున్నారు’ అని సన్‌రైజర్స్ కోచ్ వెటోరీ అన్నాడు.
400
టి20ల్లో ధోనికి ఇది 400వ మ్యాచ్. ఈ మార్క్ చేరుకున్న నాలుగో భారత ప్లేయర్‌గా అతడు నిలవనున్నాడు. రోహిత్ శర్మ (456), దినేశ్ కార్తీక్ (412), విరాట్ కోహ్లి (407) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
తుది జట్లు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్, జీషన్ అన్సారీ, ఇషాన్ మలింగ.
చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రచిన్ రవీంద్ర, షేక్ రషీద్, ఆయుశ్ మాత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, జేమీ ఓవర్టన్, అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ.