
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ కథ దాదాపు ముగిసినట్లే!.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH)తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమిపాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) స్పందించాడు.
తమ పరాజయానికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశాడు. చెపాక్ వికెట్ మీద తమ వాళ్లు బ్యాట్ ఝులిపించలేకపోయారని విచారం వ్యక్తం చేశాడు. చిదంబరం స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
బ్రెవిస్ ఒక్కడే
ఓపెనర్లలో షేక్ రషీద్ డకౌట్ కాగా.. ఆయుశ్ మాత్రే (19 బంతుల్లో 30) రాణించాడు. మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (21), దీపక్ హుడా (22) ఫర్వాలేదనిపించగా.. కొత్తగా జట్టుతో చేరిన డెవాల్డ్ బ్రెవిస్ ధనాధన్ దంచికొట్టాడు. ఈ సౌతాఫ్రికా స్టార్ 25 బంతుల్లో 42 పరుగులతో సీఎస్‌కే టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
రైజర్స్ గెలిచి నిలిచింది
కెప్టెన్ ధోని (6) సహా మిగతా వాళ్లంతా విఫలం కావడంతో చెన్నై 19.5 ఓవర్లలోనే కేవలం 154 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రైజర్స్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి.. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆడిన తొమ్మిదింట చెన్నైకి ఇది ఏడో పరాజయం.
మా వాళ్లు విఫలం
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ మరీ అంత కఠినంగా ఏమీ లేదు. కానీ మేము వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయాం. ఈ పిచ్ మీద 155 పరుగుల స్కోరు చెప్పుకోదగ్గది కానేకాదు. అసలు వికెట్ ఎక్కువగా టర్న్ కాలేదు.
అయితే, 8-10 ఓవర్ల తర్వాత పిచ్ స్వభావం కాస్త మారింది. అయినా సరే పరుగులు రాబట్టేందుకు ఆస్కారం ఉన్నా మేము ఆ పని చేయలేకపోయాం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ స్పిన్నర్లకు సహకరించింది.
మా వాళ్లు నాణ్యంగానే బౌలింగ్ చేశారు. సరైన సమయంలో వికెట్లు తీశారు. కానీ మేము ఇంకో 15- 20 పరుగులు చేసి ఉంటే.. వాళ్లు సులువుగా పని పూర్తి చేసేవారు’’ అని పేర్కొన్నాడు.
ఒక్కరంటే పర్లేదు.. అందరూ అంతే
ఇక డెవాల్డ్ బ్రెవిస్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మాకు మిడిలార్డర్‌లో అలాంటి ఆటగాడే కావాలి. స్పిన్నర్లు బరిలోకి దిగినప్పుడు మా వాళ్లు కాస్త ఇబ్బంది పడుతున్నారు.
అలాంటి సమయంలో బ్రెవిస్ లాంటి వాళ్లు నిలదొక్కుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది’’ అని ధోని తెలిపాడు. ఏదేమైనా జట్టులో ఒకరిద్దరు బాగా ఆడకపోయినా పెద్దగా తేడా ఉండదని.. అయితే, మూకుమ్మడిగా అందరూ విఫలమైతే ఇలాంటి ఫలితాలే వస్తాయని తలా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అదే విధంగా.. ప్రతిసారీ 180- 200 పరుగులు స్కోరు చేయాల్సిన అవసరం లేదన్న ధోని.. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా కనీస ప్రదర్శన చేయాలని తమ బ్యాటర్లను విమర్శించాడు. జట్టులో ఎక్కువ మంది విఫలమవుతుంటే ఎలాంటి మార్పులు చేయాలో కూడా అర్థం కాదంటూ పెదవి విరిచాడు.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
A milestone victory 👏#SRH register their first ever win at Chepauk with a strong performance against #CSK 🔝💪
Scorecard ▶ https://t.co/26D3UampFQ#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/lqeX4CiWHP— IndianPremierLeague (@IPL) April 25, 2025