‘గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌.. బుర్ర పనిచేయడం లేదా’?!.. కావ్యా మారన్‌ ఫైర్‌! | Kavya Maran Fumes in Disbelief as Mendis Misses Free Hit Chance Viral | Sakshi
Sakshi News home page

CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్‌పై కావ్యా మారన్‌ ఫైర్‌!

Published Sat, Apr 26 2025 10:51 AM | Last Updated on Sat, Apr 26 2025 1:30 PM

Kavya Maran Fumes in Disbelief as Mendis Misses Free Hit Chance Viral

Photo Courtesy: BCCI

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎట్టకేలకు ఓ విజయం.. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం సత్తా చాటింది.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK vs SRH)ను తమ సొంత గడ్డపైనే ఓడించి ఈ సీజన్‌లో మూడో విజయం సాధించింది.

అంతేకాదు.. పన్నెండేళ్ల తర్వాత మొట్టమొదటి సారి చెపాక్‌లో జయభేరి మోగించి.. చెన్నైకి ఊహించని షాకిచ్చింది. ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ యజమాని కావ్యా మారన్‌ (Kavya Maran) పలికించిన భావోద్వేగాలు, ఆమె ఇచ్చిన రియాక్షన్స్‌ వైరల్‌గా మారాయి.

బుర్ర పనిచేయడం లేదా?!
ముఖ్యంగా లక్ష్య ఛేదనలో రైజర్స్‌ స్టార్‌ కమిందు మెండిస్‌ (Kamindu Mendis) చేసిన పొరపాటు కావ్యకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ‘ఇంత చెత్తగా కూడా ఆడతారా?.. బుర్ర పనిచేయడం లేదా?!’ అన్నట్లు ఆమె ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చారు. అసలేం జరిగిందంటే.. చెపాక్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. రైజర్స్‌ బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. హర్షల్‌ పటేల్‌ నాలుగు వికెట్ల (28/4)తో చెలరేగి సీఎస్‌కేను దెబ్బకొట్టగా.. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌ రెండేసి వికెట్లు కూల్చారు. మహ్మద్‌ షమీ, కమిందు మెండిస్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రైజర్స్‌కు షాకులు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (0), ట్రవిస్‌ హెడ్‌ (19) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ జట్టును ఆదుకున్నాడు. 34 బంతుల్లో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

అయితే, ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ ​క్లాసెన్‌ (7) విఫలం కావడం.. అనికేత్‌ వర్మ (19) కూడా పెవిలియన్‌కు చేరడంతో రైజర్స్‌ శిబిరంలో మరోసారి నిరాశ ఆవహించింది. ఈ క్రమంలో ఆల్‌రౌండర్లు కమిందు మెండిస్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి చక్కటి సమన్వయంతో ఆడారు.

మెండిస్‌ 22 బంతుల్లో 32, నితీశ్‌ 13 బంతుల్లో 19 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే, సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ పదహారో ఓవర్లో చెన్నై స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ వేసిన బంతి నోబాల్‌గా తేలింది.

గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌
ఈ క్రమంలో ఫ్రీ హిట్‌ రాగా.. కమిందు మెండిస్‌ మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆఫ్‌ స్టంప్‌ దిశగా వచ్చిన బంతిని స్లాగ్‌ షాట్‌కు యత్రించి విఫలమయ్యాడు. ఇంతలో బంతి అందుకున్న వికెట్‌ కీపర్‌ ధోని.. స్టంప్స్‌ను గిరాటేశాడు. దీంతో ఒక్క పరుగు కూడా రాకుండానే ఫ్రీ హిట్‌ వృథా అయిపోయింది. ఇదే కావ్యా మారన్‌ ఆగ్రహానికి కారణమైంది.

ఇక 18.4 ఓవర్లలోనే మెండిస్‌, నితీశ్‌ కలిసి లక్ష్యాన్ని పూర్తి చేయగానే.. కావ్యా మారన్‌ సంబరాలు అంబరాన్నంటాయి. తీవ్ర భావోద్వేగానికి గురైన ఈ విజయం ఎంతో ముఖ్యమైనది అంటూ పక్కన ఉన్న వాళ్లను ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు.

చదవండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement