ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 మెగా వేలం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) చేసిన ప్రతిపాదనను.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. పాత నిబంధనలు మళ్లీ ప్రవేశపెట్టి.. మహేంద్ర సింగ్ ధోని వంటి దిగ్గజాలను అవమానపరచడం సరికాదని ఆమె చెన్నై ఫ్రాంఛైజీకి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి టీమిండియా లెజెండరీ కెప్టెన్ ధోని సీఎస్‌కేతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే చెన్నైని అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి.. సీఎస్‌కేకు పర్యాయపదంగా మారిపోయాడు ఈ మిస్టర్ కూల్. అయితే, ఐపీఎల్-2024లో రుతురాజ్ గైక్వాడ్‌ను తన వారసుడిగా ఎంపిక చేసుకున్న 43 ఏళ్ల ధోని.. వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగాడు. అవసరమైనపుడు రుతుకు సూచనలు, సలహాలు ఇస్తూ జట్టును ముందుకు నడిపించడంలో సహాయపడ్డాడు.
నలుగురికే అవకాశం?
అయితే, వయసు, ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా ధోని వచ్చే ఏడాది ఆటగాడిగా కొనసాగే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జట్టుకు వెన్నెముక అయిన ధోనిని ఇప్పుడే వదులుకునేందుకు సీఎస్‌కే సిద్ధంగా లేదని.. ధోని కూడా మరో ఏడాది పాటు ఫ్రాంఛైజీతో కొనసాగాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, మెగా వేలం నేపథ్యంలో కేవలం నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకునే అవకాశం ఉందన్న వార్తల నడుమ.. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరానా కోసం ధోని తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
అదే జరిగితే.. ఒకవేళ ధోని ఇంకా ఐపీఎల్‌లో ఆటగాడిగా కొనసాగాలనుకుంటే వేలంలోకి రావాల్సి ఉంటుంది. అయితే, సీఎస్‌కే యాజమాన్యం ఇందుకు ఇష్టపడటం లేదట. ఈ నేపథ్యంలో జూలై 31న భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులతో భేటీ సందర్భంగా ఆసక్తికర చర్చ లేవలెత్తినట్లు సమాచారం. ధోని కోసం పాత రూల్‌ను తిరిగి తీసుకురావాలని కోరినట్లు సమాచారం.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోని
ఇందులో భాగంగా ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా గుర్తించాలని బీసీసీఐకి విన్నవించినట్లు తెలుస్తోంది. కాగా ఓ క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ ఏళ్లు గడిస్తే అతడిని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలోకి తీసుకోవచ్చని.. 2008- 2021 వరకు ఐపీఎల్‌లో నిబంధన ఉండేది. ఈ రూల్‌ను తిరిగి తీసుకువస్తే.. ధోనిని ఆ విభాగంలో ఆటగాడిగా చేర్చి.. అన్‌క్యాప్డ్‌ప్లేయర్‌గా రిటైన్ చేసుకోవాలని సీఎస్‌కే తమ అభిప్రాయాన్ని సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.
అలా చేస్తే అవమానించినట్లే
ఇందుకు స్పందించిన సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్.. సీఎస్‌కే ప్రపోజల్‌ను తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ‘‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధించిన ఆటగాళ్ల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు. ఇలా చేస్తే వారి విలువను తగ్గించినట్లే అవుతుంది. అలా కాదని.. అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటాలో ఇలాంటి వాళ్లను రిటైన్ చేసుకుంటే వారికి చెల్లించే మొత్తం మిగతా వాళ్లకు వేలంలో లభించే కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పాత నిబంధనలు తిరిగి తీసుకురావాల్సిన అవసరం లేదు. ధోని ఐపీఎల్-2025 మెగా వేలంలోకి వస్తేనే మంచిది’’ అని కావ్యా మారన్ అన్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment