అతడి ఆట ముందు గిల్‌ శతకం కూడా చిన్నబోయింది: టీమిండియా దిగ్గజం | Ind vs Aus: Sunil Gavaskar Lauds Shreyas Iyer Statement Century Ahead WC 2023 | Sakshi
Sakshi News home page

WC 2023: అతడి ఆట ముందు గిల్‌ శతకం కూడా చిన్నబోయింది: టీమిండియా దిగ్గజం

Published Wed, Sep 27 2023 11:19 AM | Last Updated on Wed, Sep 27 2023 3:39 PM

Ind vs Aus: Sunil Gavaskar Lauds Shreyas Iyer Statement Century Ahead WC 2023 - Sakshi

ICC World Cup 2023- Shreyas Iyer: ‘‘వరల్డ్‌ కప్‌నకు ముందు ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యను పరిష్కరించుకునేందుకు ఇండోర్‌ మ్యాచ్‌ భారత్‌కు ఉపకరించింది. ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సిన స్థితిలో నిలిచిన శ్రేయస్‌ అయ్యర్‌ ఒక చక్కటి ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. అతని ఆట ముందు గిల్‌ శతకం(104) కూడా చిన్నబోయినట్లు అనిపించింది.

అర్ధరాత్రి నిద్రలో నుంచి లేపి బ్యాటింగ్‌ చేయమన్నా సరే తడబడకుండా ఆడే ఫామ్‌లో ఉన్న గిల్‌ను అయ్యర్‌ వెనక్కి తోసిన తీరు ఈ ఇన్నింగ్స్‌ ప్రత్యేకతను చూపించింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఇలాంటి సమన్వయం ఉండటం భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుంది.  

జట్టులో తన స్థానం గురించి రేకెత్తిన అన్ని సందేహాలను పటాపంచలు చేసే ఉద్దేశ్యంతో అయ్యర్‌ బ్యాటింగ్‌కు దిగాడు. అతను కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడిన తీరు సాధారణంగా ముభావంగా కనిపించే కోచ్‌ ద్రవిడ్‌ ముఖంపై కూడా చిరునవ్వులు పూయించింది.

గిల్‌ ఎప్పటిలాగే ఒక్క పొరపాటు లేని ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌ ద్వారా భారత్‌కు మేలు చేసిన మరో అంశం అశ్విన్‌ బౌలింగ్‌. అతని గురించి సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో మరో ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది. కానీ మొహాలీతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో అతని బౌలింగ్‌ మరింత మెరుగ్గా కనిపించింది.

వరల్డ్‌ కప్‌కు ముందు తమ ఆటను సానుబెట్టుకునేందుకు భారత సీనియర్లకు రాజ్‌కోట్‌ వన్డే అవకాశం కల్పిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా నుంచి మొదలైన పరాజయాలకు ఎలా విరామం ఇవ్వాలో తెలియక ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది’’ అని టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అన్నాడు.

వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ భారత క్రికెటర్లకు ఉపకరిస్తుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌ పుంజుకున్న తీరు అమోఘమని.. అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడని కొనియాడాడు. కాగా ఇప్పటికే మొహాలీ, ఇండోర్‌లలో గెలిచిన టీమిండియా.. బుధవారం రాజ్‌కోట్‌ వేదికగా నామమాత్రపు మూడో వన్డేకు సిద్ధమైంది.

ఇక రెండో వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌ తన వరుస వైఫల్యాలకు తెరదించుతూ 90 బంతుల్లో 105 పరుగులతో మెరిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

చదవండి: పరుగుల సునామీ.. ఏకంగా 8 సిక్సర్లు.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ.. యువీ రికార్డు బ్రేక్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement