‘షాట్‌ సెలక్షన్‌ చెత్తగా ఉంది.. నీ ఇమేజ్‌ను వదిలెయ్‌’ | 'Leave Your Image': Gavaskar Slams Gill For Poor Shot Selection At Gabba | Sakshi
Sakshi News home page

షాట్‌ సెలక్షన్‌ చెత్తగా ఉంది.. ఇమేజ్‌ను కాస్త పక్కన పెట్టు: టీమిండియా దిగ్గజం విమర్శలు

Published Tue, Dec 17 2024 12:13 PM | Last Updated on Tue, Dec 17 2024 12:23 PM

'Leave Your Image': Gavaskar Slams  Gill For Poor Shot Selection At Gabba

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆట తీరును భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో గిల్‌ షాట్‌ సెలక్షన్‌ను సన్నీ తప్పుబట్టాడు. బ్యాటింగ్‌కు వచ్చే ముందు డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే ఇమేజ్‌ను వదిలేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవంటూ చురకలు అంటించాడు.

అడిలైడ్‌లో అలా
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా గిల్‌ దూరమయ్యాడు. అయితే, రెండో టెస్టు నాటికి అతడు అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్‌బాల్‌ మ్యాచ్‌లో గిల్‌ ఫర్వాలేదనిపించాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 31, 28 పరుగులు చేశాడు.

అయితే, బ్రిస్బేన్‌ టెస్టులో మాత్రం గిల్‌ పూర్తిగా నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో ఆఫ్‌ స్టంప్‌ వెలుపలా వెళ్తున్న బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. 

నీ ఇమేజ్‌ను డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే వదిలెయ్‌
అయితే, షాట్‌ సరిగ్గా కనెక్ట్‌ కాలేదు. ఈ క్రమంలో బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిన బంతి గల్లీ పాయింట్‌లో ఉన్న మిచెల్‌ మార్ష్‌ చేతిలో పడింది. దీంతో గిల్‌ పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘నీ ఇమేజ్‌ను డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే వదిలెయ్‌. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఇలాంటి షాట్లు ఆడటం ప్రమాదకరమని తెలిసినా.. నువ్వు జాగ్రత్త పడలేదు.

చెత్త షాట్‌ సెలక్షన్‌
కాస్త కుదురుకున్న తర్వాత ఇలాంటివి ప్రయత్నించవచ్చు. 30- 40- 50 పరుగులు సాధించిన తర్వాత రిస్క్‌ తీసుకోవచ్చు. కానీ ఆరంభంలోనే ఇలాంటి చెత్త షాట్‌ సెలక్షన్‌ ఏమిటి? నిజానికి మార్ష్‌ క్యాచ్‌ పట్టిన తీరు అద్భుతం. ఈ విషయంలో గిల్‌కు కాస్త దురదృష్టం ఎదురైందని చెప్పవచ్చు.

ఏదేమైనా.. ఆ బంతిని ఆడకుండా.. అలా వదిలేసి ఉంటే బాగుండేది. అనవసరపు షాట్‌కు యత్నించినందుకు గిల్‌ డగౌట్లో కూర్చోవాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో భాగంగా గావస్కర్‌ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కష్టాల్లో టీమిండియా
కాగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. భారత్‌ కనీసం మూడు వందల పరుగుల మార్కును కూడా చేరుకునేలా కనిపించడం లేదు. 

గాబ్బాలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో టీ బ్రేక్‌ సమయానికి రోహిత్‌ సేన ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో టీమిండియా, అడిలైడ్‌లో ఆసీస్‌ గెలిచి ప్రస్తుతానికి 1-1తో సమంగా ఉన్నాయి.

చదవండి: కెప్టెన్‌గా రింకూ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement