కెప్టెన్‌గా రింకూ సింగ్‌ | Vijay Hazare Trophy: Rinku Singh to lead UP IPL Biggies Make cut to Squad | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా రింకూ సింగ్‌

Published Tue, Dec 17 2024 11:22 AM | Last Updated on Tue, Dec 17 2024 11:52 AM

Vijay Hazare Trophy: Rinku Singh to lead UP IPL Biggies Make cut to Squad

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రింకూ సింగ్‌కు సువర్ణావకాశం వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2024లో అతడు ఉత్తరప్రదేశ్‌ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రింకూకు ఈ అవకాశం దక్కింది.

టీ20 టోర్నీలో అదరగొట్టిన రింకూ
కాగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఉత్తరప్రదేశ్‌ జట్టుకు భారత వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో యూపీ క్వార్టర్‌ ఫైనల్స్‌ వరకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో రింకూ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 277 పరుగులు చేశాడు.

ఇక లిస్ట్‌-ఏ(వన్డే ఫార్మాట్‌) క్రికెట్‌లోనూ రింకూ సింగ్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ ఖాతాలో 1899 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ శతకాలు ఉన్నాయి.

ఈసారి రింకూ కెప్టెన్సీలో భువీ
ఈ నేపథ్యంలో విజయ్‌ హజారే ట్రోఫీ-2024కు ప్రకటించిన జట్టుకు రింకూ సింగ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన జట్టులో సారథిగా ఛాన్స్‌ కొట్టేశాడు. అయితే, భువీ ఈసారి కేవలం బౌలర్‌గానే బరిలోకి దిగనున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్‌.. ఆటగాడిగానూ రాణించాడు.

ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్‌ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్‌ హజారే ట్రోఫీలో మాత్రం రింకూ కెప్టెన్సీలో భువీ ఆడనున్నాడు. ఇక యూపీ జట్టులో రింకూ, భువీతో పాటు నితీశ్‌ రాణా, మొహ్సిన్‌ ఖాన్‌, శివం మావి వంటి ఐపీఎల్‌ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి ఆరంభం కానుంది.

విజయ్‌ హజారే ట్రోఫీ-2024కు ఉత్తరప్రదేశ్‌ జట్టు
రింకూ సింగ్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మాధవ్ కౌశిక్, కరణ్ శర్మ, ప్రియమ్ గార్గ్, నితీశ్‌ రాణా, అభిషేక్ గోస్వామి, అక్షదీప్ నాథ్, ఆర్యన్ జుయాల్, ఆరాధ్య యాదవ్, సౌరభ్ కుమార్, కృతజ్ కుమార్ సింగ్, విప్రాజ్ నిగమ్, మొహ్సిన్‌ ఖాన్, శివం మావి, అక్విబ్ ఖాన్, అటల్ బిహారీ రాయ్, కార్తికేయ జైస్వాల్, వినీత్ పన్వర్.

చదవండి: ‘రోహిత్‌ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్‌ చేయండి’
ఇప్పటికైనా చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్‌ మెసేజ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement