ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. బ్రిస్బేన్‌లో శనివారం మొదలైన ఈ టెస్టులో భారత జట్టు పేలవంగా ఆడుతోంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేన.. ఆసీస్‌ను కట్టడి చేయలేకపోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 445 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.
పెవిలియన్‌కు క్యూ
అయితే, ఆసీస్ స్టార్లు ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాలతో చెలరేగిన గబ్బా మైదానంలో.. టీమిండియా బ్యాటర్లు మాత్రం తేలిపోతున్నారు. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) విఫలం కాగా.. శుబ్‌మన్ గిల్(1), విరాట్ కోహ్లి(3) పూర్తిగా నిరాశపరిచారు.
48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి
ఇక వికెట్ కీపర్ రిషభ్ పంత్ సైతం తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. సోమవారం నాటి మూడో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించే సమయానికి కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 30 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ సున్నా పరుగులతో ఆడుతున్నాడు. కేవలం 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్ కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గబ్బాలో టాస్ గెలిచిన రోహిత్.. తొలుత బౌలింగ్ ఎంచుకోవడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వంటి వాళ్లు తప్పుబట్టారు.
చెత్త సెటప్ అంటూ విమర్శలు
మరోవైపు.. ఆదివారం నాటి రెండో రోజు ఆటలో ఫీల్డింగ్ సెట్ చేసిన తీరుపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి రోహిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘చెత్త సెటప్’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఇక ఆసీస్ మాజీ స్టార్ డేవిడ్ వార్నర్ సైతం రోహిత్ తీరును విమర్శించాడు. హెడ్, స్మిత్‌లను షార్ట్ బాల్స్‌తో అటాక్ చేయాల్సిందిపోయి.. వారికి బ్యాట్ ఝులిపించే అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు సైతం రోహిత్ శర్మ కెప్టెన్సీ, ఆట తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి
‘‘ఇప్పుడు కూడా రోహిత్ శర్మను సమర్థిస్తే అంతకంటే ఘోర తప్పిదం మరొకటి ఉండదు. ఇంత డిఫెన్సివ్‌గా కెప్టెన్సీ చేస్తారా? ఇప్పటికైనా అతడు వాస్తవాలు అంగీకరించాలి. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే రోహిత్ తప్పుకోవాలి. భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు కోసం మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయం తీసుకోవాలి. బుమ్రాను టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమించాలి’’ అని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్యాన్స్.
బుమ్రా కెప్టెన్సీలో ఆసీస్ గడ్డపై భారత్‌కు భారీ విజయం
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది టీమిండియా. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. పితృత్వ సెలవుల కారణంగా అతడు అందుబాటులో లేకపోవడంతో.. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో కంగారూ జట్టును చిత్తు చేసింది. అయితే, అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టుకు రోహిత్ తిరిగి రాగా.. ఆతిథ్య జట్టు చేతిలో భారత్ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అడిలైడ్ టెస్టులో రోహిత్ బ్యాటింగ్ పరంగా(3, 6)నూ నిరాశపరిచాడు.
రోహిత్ కెప్టెన్సీలో చెత్త రికార్డు
ఇక ఆసీస్ టూర్ కంటే ముందు రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. భారత క్రికెట్ చరిత్రలో పర్యాటక జట్టు చేతిలో టీమిండియా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడం అదే తొలిసారి.
చదవండి: ‘నా వేలు విరగ్గొట్టేశావు పో’.. సిరాజ్‌పై మండిపడ్డ జడేజా!
Comments
Please login to add a commentAdd a comment