టీ20 ఫార్మాట్‌లో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. సారథిగా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) టైటిల్ గెలిచిన ఈ ముంబై బ్యాటర్.. దేశీ టీ20 టోర్నీలోనూ ట్రోఫీ గెలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT) ఫైనల్లో అయ్యర్ కెప్టెన్సీలోని ముంబై జట్టు ఆదివారం మధ్యప్రదేశ్‌ను చిత్తు చేసింది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో
టోర్నీ ఆసాంతం రాణించిన శ్రేయస్ సేన టైటిల్ పోరులో మధ్యప్రదేశ్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. సమష్టి ప్రదర్శనతో ఫైనల్‌కు వచ్చిన ముంబై.. ఆఖరి మెట్టుపై కూడా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై మధ్యప్రదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
రజత్ పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (40 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) కారణంగా మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అయితే, పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, రాయ్‌స్టన్ డయాస్ రెండు వికెట్ల చొప్పున తీసుకున్నారు.
ఇరగదీసిన సూర్యకుమార్ యాదవ్
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. 174 పరుగులతో స్కోరు సమమయ్యాక ముంబై బ్యాటర్ అథర్వ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే (37; 4 ఫోర్లు) రాణించాడు.
చివర్లో సూర్యాంశ్ షెగ్డే (15 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అథర్వ అంకొలేకర్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేశ్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. సూర్యాంశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అజింక్య రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ముంబై సొంతమైంది.
ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన తొలి సారథిగా
ఈ నేపథ్యంలో భారత్‌లో ఒకే ఏడాదిలో రెండు టీ20 టైటిళ్లు గెలిచిన కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన అతడు.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా అందుకోవడం విశేషం. కాగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అయ్యర్‌ను ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే.
భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్
రంజీల్లో ఆడకుండా తప్పించుకునేందుకు గాయం తగ్గినప్పటికీ.. దానిని సాకుగా చూపాడని తేలడంతో బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేసినట్లు తెలిసింది. అయితే, ఐపీఎల్‌లో తనను తాను నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్‌కు మళ్లీ టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. కానీ.. టీ20 జట్టులో మాత్రం అతడికి స్థానం ఇవ్వడం లేదు.
టీమిండియా తరఫున గతేడాది డిసెంబరులో చివరగా శ్రేయస్ అయ్యర్ టీ20 మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే, తాజాగా దేశీ టీ20 టోర్నీలోనూ సత్తా చాటి.. టీమిండియా సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. భవిష్య కెప్టెన్ ఆప్షన్లలో తానూ ఒకడిననే మెసేజ్ పంపించాడు.
వచ్చే ఏడాది పంజాబ్ జట్టుకు
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా శ్రేయస్ అయ్యర్‌ను రిలీజ్ చేయగా.. పంజాబ్ కింగ్స్ వేలంపాటలో అతడిని కొనుక్కుంది. ఈ స్టార్ ప్లేయర్ కోసం ఏకంగా రూ. 26.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. రూ. 27 కోట్ల ధర పలికిన రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్) అయ్యర్ కంటే ముందున్నాడు.
చదవండి: ‘రోహిత్, గంభీర్ మధ్య విభేదాలు?.. ద్రవిడ్‌తో చక్కగా ఉండేవాడు.. కానీ’
Comments
Please login to add a commentAdd a comment