ఆస్ట్రేలియా పర్యటనలో శుభారంభం అందుకున్న టీమిండియా అదే జోరును కొనసాగించలేకపోతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో గెలుపొందిన భారత్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక మూడో టెస్టులోనూ రోహిత్ సేన పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది.
బ్రిస్బేన్‌లో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాలో కూరుకుపోయింది. గబ్బా మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్‌కు ఆసీస్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు సాధించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ రెండు, నితీశ్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక బ్యాటింగ్‌లోనూ టీమిండియా తేలిపోతోంది. సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 51 పరుగులు చేసింది. వర్షం గనుక అడ్డుపడకపోయి ఉంటే.. పరిస్థితి ఇంకాస్త దిగజారేదే! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
గంభీర్‌తో రోహిత్‌కు విభేదాలు?
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య అవగాహన లేదని బసిత్ అన్నాడు. వీరిద్దరి భిన్నాభిప్రాయాల కారణంగానే భారత జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్‌తో చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన రోహిత్‌కు.. గౌతీతో అంతటి కో ఆర్డినేషన్ ఉన్నట్లు కనిపించడం లేదన్నాడు.
‘‘రోహిత్ శర్మ, గౌతం గంభీర్ ఆలోచనలు ఒకే విధంగా లేవని జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో భారత్ పరాభవం ఎదుర్కొంది. బంగ్లాదేశ్ వంటి పసికూనపై మాత్రం గెలవగలిగింది.
ద్రవిడ్‌తో చక్కగా ఉండేవాడు
ఇక ఆస్ట్రేలియాలో రెండో టెస్టులో ఓడిన భారత్.. మూడో టెస్టులోనూ ఇబ్బందులు పడుతోంది. ఇక్కడ కూడా రోహిత్- గౌతీ మధ్య ఏకాభిప్రాయం లేదని తుదిజట్టును ఎంపికను చూస్తే అర్థమైపోతుంది. ఎందుకో ద్రవిడ్ మాదిరి గౌతీతో రోహిత్ ఇమడలేకపోతున్నాడని అనిపిస్తోంది.
వారిని ఎందుకు తీసుకోలేదు?
బ్రిస్బేన్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎందుకు చేసినట్లు? ఇక ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురి దాకా లెఫ్టాండర్ బ్యాటర్లు ఉన్నారు. అయినా.. మీరెందుకు వాషింగ్టన్ సుందర్ లేదంటే రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోలేదు? క్రికెట్ గురించి జ్ఞానం ఉన్నవాళ్లకు ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఆస్ట్రేలియాలో టీమిండియా ఎక్కువగా బుమ్రాపైనే ఆధారపడుతోంది. జట్టులో ఒక్కరు కూడా లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ లేరు. అదే టీమిండియాకు ఉన్న అతిపెద్ద బలహీనత. ఈ మ్యాచ్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా, ట్రవిస్ హెడ్ వర్సెస్ టీమిండియా అన్నట్లుగా అనిపించింది’’ అంటూ బసిత్ అలీ యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’
Comments
Please login to add a commentAdd a comment