ఆసీస్‌తో మూడో టెస్ట్ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) అనంతరం టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అశ్విన్ సడెన్‌గా ఆటకు వీడ్కోలు పలికినందుకు భారత అభిమానులంతా బాధపడుతుంటే.. క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాత్రం అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాడు. సిరీస్ మధ్యలో ఈ ఆకస్మిక నిర్ణయమేంటని ప్రశ్నిస్తున్నాడు.
అశ్విన్ రిటైర్ కావాలనుకుంటే సిరీస్ అయిపోయే దాకా వేచి ఉండాల్సిందని అన్నాడు. అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటన టీమిండియా ప్రణాళికలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇలాంటి దశలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన సిరీస్ ఫలితాన్ని తారుమారు చేయగలదని అంచనా వేశాడు.
అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్ కావడం వల్ల భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఒక ఆటగాడి సేవలు కోల్పోతుందని అన్నాడు. గతంలో ఎంఎస్ ధోని కూడా ఇలాగే సిరీస్ మధ్యలో రిటైరైన విషయాన్ని ప్రస్తావించాడు. సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్ట్‌లో అశ్విన్ తన ప్రభావాన్ని చూపేందుకు ఆస్కారముండేదని అభిప్రాయపడ్డాడు. సిడ్నీ పిచ్‌కు స్పిన్నర్లకు సహకరించిన చరిత్ర ఉందని గుర్తు చేశాడు. అశ్విన్ నిర్ణయాన్ని తప్పుబడుతూనే గవాస్కర్ మరో కీలక వ్యాఖ్య చేశాడు. మిగిలిన సిరీస్ కోసం అశ్విన్‌తో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ ముందున్నాడని అన్నాడు.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌తో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌ల్లో గెలవాల్సి ఉంది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
మ్యాచ్ ఐదు రోజులు వర్షం అంతరాయాలు కలిగించడంతో మూడో టెస్ట్‌లో ఫలితం తేలలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడగా.. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆకాశ్‌దీప్, బుమ్రా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు.
రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. అయినా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి రోజు మరోసారి వరుణుడు విజృంభించడంతో కొద్ది సేపటికే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment