
టీమిండియా విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడిన పాకిస్తాన్ జర్నలిస్టుకు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గట్టి కౌంటర్ ఇచ్చాడు. వేదిక ఏదైనా పాక్‌పై గెలుపు తమకు ఎల్లప్పుడూ మధురంగానే ఉంటుందని.. ఆదివారం నాటి మ్యాచ్‌లో తనకు మజా వచ్చిందంటూ అతడికి తమ జట్టు ఓటమిని గుర్తు చేశాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆతిథ్య హక్కులను డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) నిరాకరించగా.. ఐసీసీ జోక్యంతో హైబ్రిడ్ విధానంలో టోర్నీ జరుగుతోంది. తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడుతోంది.
42.3 ఓవర్లలోనే..
ఇందులో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌ను ఓడించిన రోహిత్ సేన.. తాజా మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్‌ను 241 పరుగులకు కట్టడి చేసింది. ఇక 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్‌పై గెలుపొందింది.
ఈ విజయంలో విరాట్ కోహ్లి(100 నాటౌట్)తో పాటు శుబ్‌మన్ గిల్(46), శ్రేయస్ అయ్యర్(56)లది కూడా కీలక పాత్ర. ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రేయస్ మీడియా సమావేశంలో మాట్లాడగా.. ఓ పాకిస్తానీ జర్నలిస్టు.. దుబాయ్‌లో గాకుండా పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌ను ఓడించి ఉంటే ఇంకా బాగుండేది కదా అని ప్రశ్నించాడు.
ఇరుజట్లకు తటస్థ వేదికే..
సదరు జర్నలిస్టు మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ హుందాగానే కౌంటర్ వేశాడు. ‘‘పాకిస్తాన్‌లో నేను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి అక్కడ గెలిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయితే, దుబాయ్ అనేది ఇరుజట్లకు తటస్థ వేదికే.
ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అయినా మేము దుబాయ్‌లో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. ఏదైతేనేం ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించాము కదా. అదే ఓ మధురానుభూతి. బయట నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించి మరీ మా పని పూర్తి చేశాం.
నేనైతే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. పాకిస్తాన్‌పై ఇది నాకు మూడో మ్యాచ్. ఇందులో గెలవడం ఎంతో మజాన్నిచ్చింది’’ అని శ్రేయస్ అయ్యర్ సమాధానమిచ్చాడు. సొంతగడ్డపై పాక్ బలమైన జట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ దేశ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను తన మాటలతో ఇలా తిప్పికొట్టాడు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు
👉వేదిక: దుబాయ్
👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్
👉పాకిస్తాన్ స్కోరు- 241(49.4) ఆలౌట్
👉భారత్ స్కోరు- 244/4 (42.3)
👉ఫలితం: పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి(100 పరుగులు నాటౌట్).
చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
Comments
Please login to add a commentAdd a comment