culture
-
గిరి ‘గడబ’ ప్రకృతితో మమేకం
ఆధునిక ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న గిరిజన తెగ ‘గడబ’ ఇప్పుడిప్పుడే తన రూపు మార్చుకుంటోంది. అయితే, వీరి అరుదైన సంస్కృతి అంతరించిపోకుండా కాపాడుకుంటోంది. ప్రాచీన కాలం నుంచి ఈ తెగ గోదావరి పరివాహక ప్రాంతానికి దాపుగా ఉంటోంది. ‘గ’ అంటే గొప్పతనం అని, ‘డ’ అంటే నీటికి సూచిక అని అర్థం. ‘గడ’ అంటే గొప్పదైనా నీరు అని, గోదావరి అనే పేరు ఉంది. ఒరియాలో ‘గడబ’ అంటే సహనం గలవాడు అని అర్థం. గడబ తెగలు ఒరిస్సా వింద్య పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోనూ ఈ తెగ ఉంది. ఈ తెగను భాష గుటబ్! వీరిలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులూ ఉన్నారు. మన రాష్ట్రంలో గడబలు విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రముఖంగా కనిపిస్తారు. అటవీ ఉత్పత్తులే ఆధారంగా!వీరు గడ్డి, మట్టి, కలపను ఉపయోగించి ఇండ్లను నిర్మించుకుంటారు. ఈ గుడెసెలు త్రికోణాకారంలోనూ, మరికొన్నింటికి కింది భాగం గుండ్రంగా ఉండి పైకప్పు కోన్ ఆకారంలో ఉంటుంది. మహిళలు కుట్టని రెండు వస్త్రాల ముక్కలను ధరిస్తారు. అలాగే, రెండు వలయాలుగా ఉండే నెక్‌పీస్‌ను ధరిస్తారు. వీటిలో అల్యూమినియమ్, వెండి లోహం ప్రధానమైంది. తృణధాన్యాలు, వరి పండిస్తారు. అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడే వీరంతా సహజ పద్ధతుల్లో తయారుచేసుకున్న సారాయి, కల్లు పానీయాలను సేవిస్తారు. థింసా నృత్యంమహిళలు అర్థచంద్రాకారంలో నిలబడి, ఒకరి మీద ఒకరు చేతులు వేసి, ఒక వైపుకు లయబద్ధంగా కాళ్లు కదుపుతూ నృత్యం చేస్తారు. వీరు నృత్యం చేస్తున్నప్పుడు పురుషులు సంగీతవాయిద్యాలను వాయిస్తారు. ఈ థింసా నృత్యం ఆధునిక ప్రపంచాన్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సులువైన జీవనంఇంటిపేర్లను బట్టి వావివరసలను లెక్కించుకుంటారు. మేనబావ, మేనమరదలు వరసలు గలవారు వీరిలో ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి వద్దని అమ్మాయి అనుకుంటే కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించి వారి సమక్షంలో ఓలి ఖర్చు పెట్టుకుంటే చాలు విడిపోవచ్చు. అబ్బాయి కూడా ఇదే పద్ధతి పాటిస్తాడు.అన్నీ చిన్న కుటుంబాలే!గడబలో ఎక్కువగా చిన్నకుటుంబాలే. వీరికి ఇటెకుల, కొత్త అమావాస్య, తొలకరి, కులదేవత పండగలు ప్రధానమైనవి. వీరిని గడ్బా అని మధ్య ప్రదేశ్‌లో, గడబాస్ అని ఆంధ్రప్రదేశ్‌లో పేరుంది.(చదవండి: నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!) -
'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..
యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ తయారీ చేరింది. చైనాలో టీ అనేది ప్రజల రోజువారీ జీవితంలో అల్లుకుపోయిన పానీయం, టీ తో అక్కడి ప్రజలకు లోతైన సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.బీజింగ్ టీ మ్యూజియంలో ఉత్తర– దక్షిణ రాజవంశాల (క్రీ.పూ. 386– క్రీ.పూ. 589) నాటి 100కి పైగా టీ–సంబంధిత కళాఖండాల సేకరణ ఉంది. ఇక్కడి కాలిగ్రఫీ, పెయింటింగ్‌లు, సాంస్కృతిక అవశేషాలు, పురాతన టీ సెట్లు, టీల నమూనాలు ఉన్నాయి, ఇవి చైనా గొప్ప టీ సంస్కృతి, సమగ్ర, క్రమబద్ధమైన సేకరణను అందిస్తాయి. టీ సంస్కృతిని ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ టీ సంస్కృతికి కేంద్రంగా ఈ మ్యూజియం సంవత్సరాలుగా టీ–సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులకు సాంప్రదాయ సాంçస్కృతిక విద్యా కార్యక్రమాలను, చైనాలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు టీ సంస్కృతి అనుభవాలను అందిస్తుంది.. ‘టీ తయారీ కోసం చైనీస్ ప్రజలు సృష్టించిన అనేక మార్గాలు, వస్తువులను చూసి విదేశీ రాయబారులు ఆశ్చర్యపోతారు. తూర్పు తీసుకువచ్చిన టీ ఆకుతో ఇక్కడి ప్రజలు రకాల రకాల టీ లను ఎలా సృష్టిస్తారో తెలియజేస్తుంది. వారసత్వ జాబితాలో..టీ సంస్కృతికి పుట్టినిల్లుగా చైనీస్ టీ చరిత్రను క్రీ.పూ హాన్ రాజవంశాల నుండి గుర్తించవచ్చు, చైనాలో సాంప్రదాయ టీ ప్రాసెసింగ్ పద్ధతులు, అనుబంధ సామాజిక పద్ధతులు 2022లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. చైనీయుల దైనందిన జీవితంలో టీ సర్వవ్యాప్తి చెందుతుంది, ఎందుకంటే కుటుంబాలు, కార్యాలయాలు, టీ హౌస్‌లు, రెస్టారెంట్లు, దేవాలయాలలో వేడి వేడి తేనీటిని అందిస్తారు. వివాహాలు, సమూహాలుగా జరిగే వేడుకలలో కూడా ముఖ్యమైన భాగం అని యునెస్కో తెలిపింది. వాస్తవానికి ‘తు‘ అని పిలిచే టీ, పురాతన చైనీస్ ఔషధ పుస్తకాలలో విరుగుడుగా ఉపయోగించబడటానికి కనుక్కున్నట్టు రాయబడి ఉంది. ముఖ్యమైన టీ సంగతులు...టీ తాగే ధోరణి ప్రారంభమైనప్పుడు టాంగ్ రాజవంశం (క్రీ.పూ.618– క్రీ.పూ.907) నుండి టీ ని విశ్వవ్యాప్తంగా ‘చా‘ అని పిలిచారు. 1987లో పురావస్తు శాస్త్రవేత్తలు ఆలయంలోని భూగర్భ ప్యాలెస్ నుండి తొలి, అత్యున్నత స్థాయి టాంగ్ ఇంపీరియల్ టీ సెట్‌ను కనుగొన్నారు. 8వ శతాబ్దంలో టాంగ్ పండితుడు లు యు రచించిన క్లాసిక్ ఆఫ్ టీ, టీ– సంబంధిత అభ్యాసాల గురించి క్రమపద్ధతిలో వివరించిన మొదటి గ్రంథం.సాంగ్ రాజవంశం (960–1279)లో ప్రజలలో ప్రజాదరణ పొదింది: మ్యూజియంలోని కుడ్యచిత్రం టీ పోటీలో పాల్గొనడానికి ప్రజలు తమ సొంత టీ, టీ సెట్లను తీసుకువచ్చిన దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. మ్యూజియంలో అతి ముఖ్యమైనది ‘గోల్డెన్ మెలోన్ ట్రిబ్యూట్ టీ‘, దీనిని ‘రెన్ టౌ చా‘ (తల ఆకారపు టీ) అని కూడా పిలుస్తారు. ఇది ఒక శతాబ్దానికి పైగా భద్రపరచబడిన అరుదైన, వయస్సు గల ప్యూర్ టీ. దీని ఆకారం గుమ్మడికాయ, బంగారు రంగును ΄ోలి ఉంటుంది కాబట్టి దీనికి గోల్డెన్ మెలోన్ టీ అని పేరు పెట్టారు. ఆకుపచ్చ, పసుపు, ముదురు, తెలుపు, బ్లాక్ .. టీలతోపాటు యువ తరం కొత్త మార్గాలతో సంప్రదాయాన్ని స్వీకరించింది. వారు స్థానిక టీ ఆకులను బేస్‌గా ఉపయోగిస్తారు. టీని తాజా పాలు, బెర్రీ, పీచెస్ వంటి పండ్లతో కలిపి కొత్త టీ డ్రింక్స్‌ను తయారు చేస్తారు. (చదవండి: ఇలాంటి డైట్ గురించి తెలిసే ఛాన్సే లేదు..! కానీ ఒక్క ఏడాదిలోనే 50 కిలోలు..) -
కళాత్మక రాజసం జైపూర్ ఆర్ట్ సెంటర్
‘రండి, చూడండి, తినండి, కొనండి’ ఇది షాపింగ్ మాల్ చేసే హడావుడి కాదు. జైపూర్‌లోని సిటీ ప్యాలెస్ చేస్తున్న ఆర్టిస్టిక్ హంగామా. పింక్‌సిటీ జైపూర్‌లోని గంగోరి బజార్లో ఉంది సిటీ΄్యాలెస్. ఈ ప్యాలెస్ మొదటి గేట్ నుంచి లోపలికి ప్రవేశిస్తే ఒక విశాలమైన హాలు. అందులో ఇటీవల జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ ప్రారంభమైంది.రాజభవనాలంటే రాజుల కాలం నాటి వస్తువులకే పరిమితం కావాలా? కొత్తగా ఏదైనా చేయాలి అదే ఇది అంటున్నారు యువరాజు పద్మనాభ సింగ్, యువరాణి గౌరవికుమారి. రాజపుత్రుల ఘనత, కళాభిరుచి పరంపర కొత్తతరాలకు తెలియాలంటే కొత్త కళాకృతులకు స్థానం కల్పించాలి. వాటిని చూసిపోవడమే కాకుండా తమ వెంట తీసుకుని వెళ్లగలగాలి అంటున్నారామె. అందుకోసం జైపూర్ సెంటర్ ఫర్ ఆర్ట్ పేరుతో కళాకృతుల మ్యూజియం ఏర్పాటు చేశారు.సర్వతో రుచులుఈ ప్యాలెస్‌ను 18వ శతాబ్దంలో మహారాజా సవాయ్ రెండవ జయ్సింగ్ నిర్మించాడు. నిర్మంచాడనే ఒక్కమాటలో చెప్పడం అన్యాయమే అవుతుంది. ప్యాలెస్ అంటే రాళ్లు, సున్నంతో నిర్మించిన గోడలు కాదు. దేశంలోని రకరకాల నిపుణుల సమష్టి మేధ. పర్యాటకులు జైపూర్ కోటలను, రాజులు ఉపయోగించిన కళాకృతులను చూసి ముచ్చటపడితే సరిపోదు. అలాంటి వాటిని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లాలి. ఇలాగ కళాకృతుల తయారీదారులకు ఉపాధికి మార్గం వేయాలన్నారు గౌరవి కుమారి. అంతేకాదు... రాజస్థాన్ రుచులు ముఖ్యంగా జైపూర్‌కే పరిమితమైన వంటకాలను వడ్డించే సర్వతో రెస్టారెంట్ కూడా ప్రారంభించారు. ప్యాలెస్ అట్లీయర్ పేరుతో ఆభరణాల మ్యూజియానికి కూడా తెరతీశారు. ఇందులో స్థానిక చేనేతకారులు రూపుదిద్దిన చీరలు, సంప్రదాయ ఆభరణాలు, గృహోపకరణాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా రాజుల ప్యాలెస్ పర్యటనకు వెళ్లాలంటే కనీసం రెండు–మూడు గంటల సమయం కేటాయించాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసి లోపల ప్రవేశిస్తే మధ్యాహ్నం భోజనం సమయానికి బయటకు రాగలుగుతాం.ఈ సమయాలను పాటించకపోతే ప్యాలెస్ విజిట్‌ని అర్థంతరంగా ముగించుకుని బయటపడాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారమే ఈ సర్వతో రెస్టారెంట్. ప్యాలెస్ ఆవరణలో భోజనం చేయవచ్చు. సాధారణంగా ప్యాలెస్ విజిట్ హైటీ లేదా డిన్నర్ ప్యాకేజ్‌లలో టికెట్ మధ్యతరగతికి అందనంత ఎక్కువగా వేలల్లో ఉంటుంది. ఈ ప్రయోగం మాత్రం అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి జైపూర్ టూర్లో సిటీ ప్యాలెస్ విజిట్‌ని భోజన సమయానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు. -
పండుగలకే పండుగ!
నాగాలాండ్‌లో జరిగే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ను అక్కడి ప్రజలు ‘పండుగలకే పండుగ’గా అభివర్ణిస్తారు. పది రోజుల పాటు అత్యంత అట్టహాసంగా జరిగే పండుగ ఇది. ప్రతి ఏటా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ పండుగ నాగాలాండ్ కళా సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పడుతుంది. పదిహేడు తెగలకు చెందిన ప్రజలు ఈ వేడుకలో పాల్గొంటారు. నాగాలాండ్ రాజధాని కోహిమాకు చేరువలోని కిసామా హెరిటేజ్ విలేజ్‌లో పది రోజుల పాటు రకరకాల ప్రదర్శనలు, పోటీలు జరుగుతాయి. ఈ వేడుకలలో పాల్గొనే పదిహేడు తెగల ప్రజలు ఇక్కడ తమ తమ సంప్రదాయ రీతుల్లో గుడారాలను వేసుకుని ఉంటారు. ఉదయం వేళల్లో ఆరుబయట మైదానంలోను, వీథుల్లోను వివిధ రీతులకు చెందిన సంప్రదాయ సంగీత నృత్య ప్రదర్శనలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం వేళ ఆరుబయట విందు భోజనాలు జరుగుతాయి. ఈ వేడుక జరిగినన్ని రోజులూ ఆహార మేళాలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య సాంస్కృతిక స్నేహబాంధవ్యాలను పెంపొందించే ఉద్దేశంతో నాగాలాండ్ ప్రభుత్వం 2000 సంవత్సరం నుంచి రాష్ట్ర పర్యాటక శాఖ, కళా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించడం ప్రారంభించింది. ఈ వేడుకల్లో భాగంగా హస్తకళల ప్రదర్శనలు, స్థానిక పోరాట విద్యల ప్రదర్శనలు, రకరకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. వేడుకలు జరిగే మైదానంలో ఆహారశాలలు, వనమూలికల విక్రయశాలలు, హస్తకళల ప్రదర్శనశాలలు వంటివి ఏర్పాటవుతాయి.ఈ వేడుకల్లో ప్రతిరోజూ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆరుబయట ఏర్పాటు చేసిన వేదికలపైన సంప్రదాయ, ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటక ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ‘మిస్ నాగాలాండ్’ అందాల పోటీలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘హార్న్‌బిల్ ఇంటర్నేషనల్ రాక్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ వేడుకల్లో స్థానిక, అంతర్జాతీయ రాక్ బ్యాండ్ బృందాలు వేడుక జరిగే పదిరోజులూ కచేరీలు చేస్తారు. నాగాలాండ్ ప్రభుత్వం ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ నిర్వహణను ప్రారంభించిన తర్వాత రాష్ట్ర పర్యాటక ఆదాయం గణనీయంగా పెరిగింది. -
అంబరాన్నంటే జానపద సంబరం అక్టోబరు 25-27 దాకా
బెంగాల్లో గ్రామీణ వారసత్వం – సంస్కృతిని అన్వేషించే అవకాశం ఈ అక్టోబర్ నెలలోనే లభిస్తోంది. మొన్నటి దసరా వేడుకల్లో దుర్గా మాత పూజలు, దాండియా నృత్యాల ఆనందాన్ని పొందాం. ఆ ఆస్వాదనకు కొనసాగింపుగా రంగుల కళతో నిండిన మరో ప్రపంచం ఆహ్వానిస్తుంటే... ఎలా మిస్ అవగలం.. ఇష్టమైన హస్తకళల నుండి నోరూరించే వంటకాల వరకు అక్కడ ప్రతిదీ గొప్పగా జరుపుకుంటారు. బెంగాల్ గ్రామాల్లోని వారి గొప్ప వారసత్వం, కనుల విందు చేసే వారి సంస్కృతిలో మనమూ ఇట్టే లీనమైపోతాం. దీనిని గుర్తించిన కోల్ ఇండియా లిమిటెడ్, బంగ్లానాటక్ డాట్ కామ్‌తోపాటు ఎక్స్ప్లోర్ రూరల్ బెంగాల్ పండుగలు, జాతరల శ్రేణిని మన ముందుకు తీసుకువస్తోంది. దీని ద్వారా బీర్భూమ్, పురూలియా బంకురా, నదియా ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో గల 16 గ్రామాలలో ప్రయాణించవచ్చు. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం, తోలుబొమ్మలాటలు, హస్తకళల ద్వారా వారి సాంస్కృతిక వారసత్వంలో మనమూ పాల్గొనవచ్చు. అక్టోబర్‌లో చివరి వారాంతాల్లో ఇక్కడ పండుగ, జాతరలు ఘనంగా నిర్వహిస్తారు. బీర్భూమ్లోని అంత్యంత అట్టహాసంగా జరిగే కాంత మేళా, శాంతినికేతన్ మేళాను సందర్శించవచ్చు. పురూలియాలో చౌ ఉత్సవ్, పాత చిత్రాల మేళాను సందర్శించి, వారి కళను ఆస్వాదించవచ్చు. బురాద్వన్లోని డోక్రా మేళా, చెక్క బొమ్మల మేళాలో షాపింగ్ చేయవచ్చు. ఈ గ్రామీణ జాతర అక్టోబర్ 25 నుంచి 27 వరకు జరుగుతుంది. -
సమ్‌థింగ్ డిఫరెంట్
సరదాగా కాఫీనో, టీనో తాగడానికి కేఫ్స్కి వెళ్తున్నారా? ఇష్టమైన వంటకాలు రుచి చూడడానికి వెళ్తున్నారా? అయితే నగరంలో లేటెస్ట్ కేఫ్ కల్చర్‌ని మీరింకా టేస్ట్ చేయలేదన్నట్టే. ఇప్పుడు కేఫ్స్ అంటే ఆఫీస్.. కేఫ్స్ అంటే వెరైటీ ఈవెంట్లకు కేరాఫ్‌గా మారుతున్నాయి.. ఆధునిక కల్చర్‌కు అసలైన చిరునామాగా నిలుస్తున్నాయి నగరంలోని పలు కేఫ్‌లు. ఈవెంట్స్ నుంచి వెరైటీ మీట్స్ వరకూ కేఫ్‌లు వేదికలవుతున్నాయి. వర్క్‌ప్లేస్‌ల నుంచి వర్క్‌షాపుల వరకూ కేఫ్‌లు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. టాప్ క్లాస్ చిత్రకారుని చిత్రాలను వీక్షించడానికో.. ఓ బెస్ట్ సాక్సాఫోన్ ఆర్టిస్ట్ సంగీతాన్ని వినడానికో.. స్టోరీటెల్లర్ కథల విందుకో, సెలబ్రిటీల సక్సెస్ సీక్రెట్స్ వినేందుకో.. ఒకప్పుడైతే ఏదైనా కల్చరల్ సెంటర్‌కో లేదా వాటికి ప్రత్యేకించిన మరో చోటుకో వెళ్లేవారు. అయితే ఇప్పుడు వాటితో పాటు అవీ ఇవీ అనే తేడా లేకుండా అన్నీ ఒకే వేదికపై అందుకోడానికి ఒక్క కేఫ్‌కి వెళితే చాలు. ఫుడ్‌కీ, డ్రింక్స్‌కి మాత్రమే పరిమితమైతే కాదు.. రోజుకో ఈవెంట్‌తో తన వెంట తిప్పుకుంటేనే అది కేఫ్ అని పునర్ నిర్వచిస్తున్నాయి నగరంలోని నయా ట్రెండ్స్. మ్యూజిక్ ఈవెంట్ల.. పంట.. పేరొందిన రాక్ బ్యాండ్ సంగీత ప్రదర్శనలతో కేఫ్స్ హోరెత్తుతున్నాయి. బంజారాహిల్స్‌లోని హార్డ్‌రాక్ కేఫ్ లాంటివి అచ్చంగా వీటికే పేరొందాయి. డ్రమ్స్, ఫ్లూట్స్, సాక్సాఫోన్, వయోలిన్.. తదితర విభిన్న రకాల పరికరాలను పలికించడంలో నైపుణ్యం కలిగిన మ్యుజీషియన్స్ తరచూ కేఫ్ సందర్శకులకు వీనుల విందును పంచుతుంటారు. ఇక గజల్ గానామృతాలు, సినీ గాయకుల స్వరమధురిమల సంగతి సరేసరి. ఓ వైపు రుచికరమైన విందును, మరోవైపు పాటలతో వీనుల విందును సైతం అతిథులు ఆస్వాదిస్తున్నారు.కేఫ్స్‌లో నిర్వహించే ఈవెంట్స్‌లో మ్యూజిక్ తర్వాత కామెడీ షోస్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా స్టాండప్ కామెడీకి అతిథుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సిటీలో ఇప్పుడు పదుల సంఖ్యలో స్టాండప్ కమెడియన్స్ ఉన్నారంటే దానికి కారణం కేఫ్స్ యజమానులు వారికి కల్పిస్తున్న అవకాశాలే అని చెప్పొచ్చు. ఇతర నగరాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేరొందిన కమెడియన్స్, థియేటర్ ఆరి్టస్ట్స్, టీవీ షోస్ ద్వారా పాపులర్ అయినవారు, సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా సిటీ కేఫ్స్‌కు తరలివస్తున్నారు.వర్క్‌ప్లేస్‌లోనూ..ఒకప్పుడు సాయంత్రాల్లో, వారాంతాల్లో మాత్రమే కేఫ్స్ కళకళలాడేవి అయితే ఆ తర్వాత పగటి పూట, అలాగే అన్ని రోజుల్లోనూ చెప్పుకోదగిన సంఖ్యలోనే కస్టమర్స్ కనిపిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలను చెప్పొచ్చు. ఆఫీస్ స్పేస్‌ను కూడా కేఫ్స్ ఆఫర్ చేస్తుండడం ఇందులో ఒకటి. వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ తదితర కరోనా నేపథ్యంలో పుట్టుకొచ్చిన వర్క్ కల్చర్స్ వల్ల ఇప్పుడు కేఫ్స్‌లో కూర్చునే ఆఫీస్ వర్క్ చేసుకోవడం నగరవాసులకు అలవాటైంది. కేవలం ఐటీ నిపుణులు మాత్రమే కాకుండా విభిన్న రకాల వృత్తి వ్యాపకాల్లో ఉన్నవారు కూడా కేఫ్స్‌ను వర్క్‌ప్లేస్‌లుగా వినియోగిస్తున్నారు.వర్క్‌షాప్స్.. విందు వినోదాలకు మాత్రమే కాకుండా విభిన్న రకాల అంశాల్లో శిక్షణా తరగతులకు కూడా కేఫ్స్ నిలయంగా మారుతుండడం విశేషం. గత రెండేళ్లుగా ఈ ట్రెండ్ కేఫ్స్‌లో బాగా పెరిగిందని నగరానికి చెందిన ఫుడీస్ క్లబ్ నిర్వాహకులు సంకల్ప్ చెబుతున్నారు. పోటరీ వర్క్‌షాప్, పెయింటింగ్ వర్క్‌షాప్, కేక్ డెకరేటింగ్, రెసిన్ ఆర్ట్, క్యాండిల్ మేకింగ్, బేకింగ్ తదితర కళలకు సంబంధించిన వర్క్‌షాప్‌లతో నగరవాసులను ఆకర్షిస్తున్నాయి.డేటింగ్స్.. మీటప్స్.. పలు సంస్థలు, క్లబ్స్ తమ మీటప్ పాయింట్లుగా కేఫ్స్‌ను ఎంచుకుంటున్నాయి. నిర్వాహకులు వారి కార్యకలాపాలకు తగ్గట్టుగా థీమ్స్‌ను సిద్ధం చేసి మరీ ఆతిథ్యం అందిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో నగరంలో ఊపందుకున్న డేటింగ్స్కు కూడా పలు కేఫ్స్ వారధిగా నిలుస్తున్నాయి. కొన్ని కేఫ్స్ ప్రత్యేకంగా ఒంటరి వ్యక్తుల కోసం ఒక రోజును కేటాయిస్తూ ఫ్రెండ్షిప్ ఈవెంట్స్, పెయిరింగ్ ఈవెంట్స్ తరహా థీమ్స్‌తో ఆకర్షిస్తున్నాయి. సహజంగానే ఇవి సోలో లైఫ్‌లో ఉన్నవారిని ఆకట్టుకుంటున్నాయి. -
సినిమాలు మన సంస్కృతిలో భాగమే – ఎంపీ రఘునందన్ రావు
‘‘ఎవరు ఎంత బిజీగా ఉన్నా సినిమాలు చూడటం అనేది మన సంస్కృతిలో ఓ భాగమే. కరోనా తర్వాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ‘కళింగ’ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధించి, నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి’’ అని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు. ధృవ వాయు హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా రేపు(శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎం.రఘునందన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ధృవ వాయు మాట్లాడుతూ–‘‘కళింగ’ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ‘కాంతార, విరూ΄ాక్ష, మంగళవారం’ సినిమాల్లా ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ సరికొత్త కాన్సెప్ట్‌తో మా సినిమా రూ΄÷ందింది’’ అన్నారు. ‘‘కళింగ’ అద్భుతంగా వచ్చింది’’ అని దీప్తి కొండవీటి పేర్కొన్నారు. ‘‘మా చిత్రాన్ని అందరూ చూసి, ఆదరించాలి’’ అని పృథ్వీ యాదవ్ కోరారు. నటీనటులు ప్రగ్యా నయన్, ప్రీతి సుందర్, తిరువీర్, సంజయ్ మాట్లాడారు. -
తెలుగు వారిని తక్కువ చేసినట్లే హిందీతో పోల్చి చూడకూడదు : రాహుల్
వాషింగ్టన్: తెలుగు భాష చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ టెక్సాస్ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. లోక్‌సభలో విపక్షనేతగా ఎన్నికయ్యాక భారతీయ సంతతి ప్రజలతో రాహుల్ మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తెలుగు భాషను ఆయన ప్రస్తావించారు. భాషల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని పరోక్షంగా ఆరోపించారు. భారతీయ భాషలు మాట్లాడే ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు బీజేపీ కారణమవుతోందని విమర్శించారు. ‘‘ ఇప్పుడు మన భారత జాతీయగీతం వినిపిస్తోందని అనుకుందాం. నా వరకైతే గీతం విన్నంత సేపు అన్ని రాష్ట్రాలు సమానం అనే భావన మదిలో నిలిచే ఉంటుంది. ఒక రాష్ట్రం గొప్పదని, మరో రాష్ట్రం వెనుకబడిందని, తక్కువ స్థాయిది అని ఎక్కడా ఉండదు. భారత్ అనేది ఒక దేశం మాత్రమేకాదు. అన్ని రాష్ట్రాల సమాఖ్య. అమెరికాలాగే భారతదేశం కూడా రాష్ట్రాల సమాఖ్య అని గుర్తుంచుకోవాలి. భాషలు, సంప్రదాయాలు కూడా అలాంటివే. ఒక భాష గొప్ప, మరో భాష తక్కువ అనే భావన ఉండకూడదు’’ అని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. ‘‘ అమెరికా, భారత రాజ్యాంగాల్లో ఒకటి ఉంది. అదేంటంటే ఏ ఒక్క రాష్ట్రమూ గొప్పది కాదు, ఏ ఒక్క రాష్ట్రమూ తక్కువ కాదు. అన్నీ సమానం. ఏ ఒక్క భాషో, ఏ ఒక్క మతమో గొప్పది కాదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తెలుగు భాష ప్రస్తావన తెచ్చారు. ‘‘ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు వాళ్లతో ‘మీరు హిందీ వాళ్ల కంటే తక్కువ’ అని అన్నారనుకోండి. మనం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అవుతుంది. తెలుగు అనేది కేవలం భాష మాత్రమే కాదు. అది ఓ చరిత్ర. సంప్రదాయం, సంగీతం, నృత్యాలు, భిన్న ఆహార అలవాట్లను తనలో ఇముడ్చుకుంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందీతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, వారి పూరీ్వకులను మీరు తక్కువ చేసి మాట్లాడినట్లే’’ అని రాహుల్ అన్నారు. -
మనం మీనం
పెంపుడు జంతువులు అనగానే మనకు కుక్కలు, పిల్లులు గుర్తొస్తాయి. ఎందుకంటే అవి మనుషులను గుర్తు పెట్టుకోవడమే కాదు విశ్వాసంగానూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటే వస్తుంటాయి. చాలా ఫ్రెండ్లీగా ఇంట్లో కలియదిరుగుతాయి. అయితే కుక్కలు, పిల్లులే కాదు.. చేపలు కూడా చాలా విశ్వాసంగా ఉంటాయని మీకు తెలుసా..? అవి మనతో ఫ్రెండ్లీగా ఉంటాయని విన్నారా? అలాంటి చేపలను మన ఇంట్లోని అక్వేరియంలో పెంచుకుంటే? అలాంటి ఫ్రెండ్లీ చేపల గురించి తెలుసుకుందాం.. మనసుకు ప్రశాంతత, కాలక్షేపం కోసం ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పెంపుడు జంతువులతో సమయం గడుపుతున్నారు. మరికొందరైతే పని ఒత్తిడితో అలిసిపోయి ఇంటికి వచ్చాక కాసేపు వాటితో దోస్తానా చేస్తుంటారు. బిజీ లైఫ్‌స్టైల్‌తో మాన సిక ప్రశాంతత కోసం ఒక్కొక్కరూ ఒక్కో రకమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటారు. తాజాగా హైదరాబాద్ వాసులు కాసేపు రిలాక్స్ అయ్యేందుకు చేపలను పెంచేస్తున్నారు.జీబ్రా చేపలుఈ చేపల శరీరంపై నల్లటి, తెల్లటి చారికలు ఉంటాయి. అందుకే వీటికి జీబ్రా అని పేరుపెట్టారు. జీబ్రా డానియోస్ పూర్తి పేరు. ఇవి యాక్టివ్‌గా ఉంటాయి. భిన్న పరిసరాలకు అనుకూలంగా ఒదిగిపోయే లక్షణాల కారణంగా వీటిని శాస్త్రవేత్తలు రీసెర్చ్ కోసం వాడుతుంటారు. ఇవి ఆరేడు చేపలతో కలిసి గుంపుగా పెరుగుతాయి.నెమలి నాట్యంలా.. నెమలి ఫించం లాంటి మొప్పలు ఉన్న చేపలు కదులుతుంటే అచ్చం నెమలి నాట్యం చేస్తున్నట్లే అనిపిస్తుంది. అవి నీటిలో అలాఅలా కదులుతుంటే మనసు గాల్లో తేలిపోక మానదు. ఇవి యజమానులను గుర్తించడమే కాదు.. మనం నేరి్పంచే టాస్్కలు కూడా నేర్చుకుంటాయి.‘ఆస్కార్’ ఇచ్చేయొచ్చు.. ఆస్కార్ ఫిష్‌లు గోల్డెన్, బ్లాక్, బ్లూ కలర్లో ఉంటాయి. అందంగా, ఫ్రెండ్లీగా ఉండి పెంచుకునే వారిని ఇట్టే గుర్తుపట్టేస్తాయి. వీటికి ట్రైనింగ్ ఇస్తే ముద్దు ముద్దుగా చెప్పినట్టు వింటాయి.ఇంటెలిజెంట్.. గోల్డ్ ఫిష్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్వేరియం ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరూ గోల్డ్ ఫిష్ పెంచుకుంటారు. వీటికి జ్ఞాపక శక్తి, తెలివి చాలా ఎక్కువ. వీటికి కూడా మనకు నచ్చినట్టు ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు.హచ్ డాగ్స్‌లా.. పేరుకు తగ్గట్టే ఏంజెల్లా ఉంటాయి ఈ చేపలు. అక్వేరియంలోని ఇతర చేపలతో ఫ్రెండ్షిప్ చేస్తాయి. యజమానులు ఎటువెళ్తే అటు చూస్తాయి. ఇక ఫుడ్ పెట్టేటప్పుడు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంటాయి.వెరీ.. క్యూరియస్ గయ్..గౌరమి అనే రకం చేపలు క్యూరియస్‌గా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటాయి. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటూనే.. చుట్టుపక్కల ఏం ఉన్నాయనే విషయాలు తెలుసుకుంటాయి. చుట్టుపక్కల చేపలతో ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా యజమానులను గుర్తుంచుకుంటాయి. సిచిల్డ్ చాలా భిన్నం..సిచిల్డ్ చేపలు చాలా భిన్నమైనవి. వాటి ప్రవర్తన క్లిష్టంగా ఉండటమే కాకుండా, చుట్టూ ఉన్న వాతావరణంతో కలగలిసి పోతాయి. ఏదైనా సమస్యలు వస్తే చాకచక్యంగా పరిష్కరించడంలో దిట్ట. జాగ్రత్తగా కాపాడుకోవాలి.. చేపలను పెంచాలని ఇష్టపడటమే కాదు. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన సమయంలో ఫుడ్పెట్టాలి. ఎప్పటికప్పుడు నీటిని మారుస్తుండాలి. మోటార్లతో ఆక్సిజన్ అందేలా జాగ్రత్తపడాలి. లేదంటే వైరస్ బారినపడి చేపలు చనిపోతుంటాయి. – షేక్ నసీరుద్దీన్ మన బాధ్యత.. ఎలాంటి చేపలను పెంచితే ఎక్కువ కాలం జీవించగలవో తెలుసుకుని పెంచాలి. పెద్ద అక్వేరియం ఏర్పాటు చేసి, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. చేపలకు మన మీద నమ్మకం రావడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత అవి మనతో ఫ్రెండ్లీగా ఉండి, మనల్ని గుర్తుపడతాయి. – ఇబ్రహీం అహ్మద్ దస్తగిర్ -
ఫ్లవర్ ఫేవర్
ముసి ముసి నవ్వులలోన.. కురిసిన పువ్వుల వాన.. ఏ నోము నోచినా.. ఏ పూజ చేసినా.. తెలిసి ఫలితమొసగే వాడు.. ఈ పాట వినడానికి ఎంత అందంగా ఉంటుందో.. పువ్వును చూస్తే.. మనసు అంత ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఎవరినన్నా కలిసేందుకు వెళ్లేటప్పుడు వారి ఆనందంగా ఉండాలని కోరుతూ గౌరవ సూచికంగా పుష్పగుచ్ఛాలు తీసుకెళతారు.. ఇప్పుడిది ట్రెండ్‌గా మారింది.. ఒకప్పటి దండల స్థానాన్ని బొకేలు భర్తీ చేస్తున్నాయి.. దీనికోసం దేశీయ పూలనే కాకుండా, దేశ విదేశాల నుంచి వివిధ రకాల పూలను దిగుమతి చేసుకుంటున్నారు. ఆ కథేంటో తెలుసుకుందాం.. సాధారణంగా పువ్వులు అనగానే బంతి, చామంతి, గులాబీ, లిల్లీ, కనకాంబరాలు, మల్లి, సన్నజాజి వంటి రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఫ్లవర్ డెకరేషన్, బొకేల్లో వినియోగించేందుకు మాత్రం హైబ్రిడ్ గులాబీ, చామంతి, సన్‌ఫ్లవర్, మొదలైన రకాలకు తోడు ప్రొటీయా, పింక్షన్, సింబిడియం, పియోని, చేయి, బటర్ఫ్లైగిట్, టాన్జేరియన్, తులిప్స్, డెలి్పనియం, జిప్సోఫిలా, ఆసరిన, డ్రైసిన, జొనడా, ఓరెంటీ లిల్లి, సూడాటియం, క్రైశాంతిమం మొదలైన రకాల పువ్వులు దిగుమతి చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇండోర్ ప్లాంట్లకు సైతం డిమాండ్ పెరిగింది. పిండోడియం అనే ఫ్లవర్ ఒక్కొక్కటీ కనీసం రూ.800 నుంచి రూ.3 వేల వరకూ ఉంటుంది. ఈ పూలతో బొకే తయారు చేస్తే దాని ధర ఎంత ఉంటుందో చెప్పనక్కర్లేదు.థాయ్‌లాండ్ నుంచి..నగరంలో ఫ్లవర్ డెకరేషన్‌కు అవసరమైన ముడి సరుకు, ఫ్లవర్స్, ఇతరత్రా అన్నీ థాయ్‌లాండ్, బెంగళూరు, ఊటీ, పూణే, కోల్‌కతా తదితర నగరాలపై ఆధారపడుతున్నారు. దీంతో అక్కడి వ్యాపారులతో సత్సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్, ఫ్లవర్స్, ఇతర అంశాలను తెలుసుకుని అప్డేట్ అవుతున్నారు. మార్కెట్‌ను బలోపేతం చేసుకుంటూ, ఫ్రెష్ ఐటమ్స్, మంచి ధరకు తెచ్చుకుంటున్నారు. స్థానికంగా మెహిదీపట్నం, ఇతర మార్కెట్లో పువ్వులు దొరుకుతున్నప్పటికీ వాటిని ఆధ్యాతి్మకం, గృహ అవసరాలకు, దండల తయారీలో వినియోగిస్తున్నారు.బొకేలకు డిమాండ్ ..భాగ్యనగరంలో గతంలో పూల బొకే కావాలంటే ఫలానాదగ్గర మాత్రమే ఉంటాయని ల్యాండ్ మార్క్ ఉండేది. ఇప్పుడు బొకేలు, ఫ్లవర్ బాక్స్‌లు, ఇతర ఫ్లవర్ ఐటమ్స్‌కు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో ప్రధాన కూడళ్ల నుంచి ఎక్కడ చూసినా దుకాణాల్లో రకరకాల అలంకరణలతో విరివిగా బొకేలు లభిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరిని కలవాలన్నా బొకే తప్పనిసరైంది. దీంతో సుమారు ఒక్కో బొకేకి రూ.350 నుంచి రూ.10 వేల వరకూ వెచి్చస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బొకేలో వినియోగించే పువ్వుల రకాలను బట్టి ధర నిర్ణయిస్తున్నారు.డెకరేషన్ రూ.లక్షల్లో..గృహ ప్రవేశం నుంచి వివాహాది శుభకార్యాలు, సత్యన్నారాయణ వ్రతం, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల వరకూ సందర్భం ఏదైనా స్వాగత తోరణాలు, పూల అలంకరణలు తప్పనిసరి అయ్యింది. ఫ్లవర్ డెకరేషన్ స్టేటస్‌గా సింబల్‌గా భావిస్తున్నారు. దీంతో లక్షలు వెచి్చంచి ఫ్లవర్ డెకరేటర్స్‌కు కాంట్రాక్టులు అప్పగిస్తున్నారు. ఆన్లైన్లో కొత్తకొత్త మోడల్స్ ఎంపిక చేస్తున్నారు. ఆర్థికంగా ఉన్నవారు మరో అడుగు ముందుకేసి ఇంపోర్టెడ్ ఐటమ్స్ డిమాండ్ చేస్తున్నారు. ఖర్చు ఎంతైనా వెనుకడుగు వేయట్లేదు. స్థోమతను బట్టి ఒక్కో ఫంక్షన్‌కు డెకరేషన్ కోసం సుమారుగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ వెచి్చస్తున్నారు.లక్షతో బర్తడే డెకరేషన్మా పాప మొదటి బర్తడే సందర్భంగా బందువులు, స్నేహి తులతో కలసి చిన్నగా ఫంక్షన్ పెట్టుకున్నాం. ఫొటో షూట్లో బ్యాక్‌గ్రౌండ్ ఫ్లవర్ డెకరేషన్ చేద్దాం అన్నారు. సరే అన్నాను. డెకరేటర్‌ను సంప్రదిస్తే మాకు నచి్చన మోడల్‌కు రూ.1.20 లక్షలు చెల్లించాను. – మనోజ్, మణికొండఅభిరుచికి అనుగుణంగా... దశాబ్దకాలంగా ఫ్లవర్ బిజినెస్ చేస్తున్నాను. ప్రస్తుత ఫంక్షన్లకు ఫ్లవర్ డెకరేషన్ చేయించడం, ప్రతి చిన్న సందర్భంలోనూ బొకేలు ఇచ్చిపుచ్చుకోవడం ట్రెండ్‌గా మారింది. దీంతో పాటే ఇండోర్ మొక్కలకు సైతం మంచి డిమాండ్ ఉంది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా బొకే, బాక్స్, బంచ్, ఇతర మోడల్స్ సరఫరా చేస్తున్నాం. – సూర్య, వీజే పెటల్స్, రోడ్ నెం–1, బంజారాహిల్స్ -
ఎక్స్ట్రా.. ఎఫెక్ట్
బోడుప్పల్లో నివసించే ప్రవీణ్..కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు. అదే సమయంలో తమ కంపెనీతో పాటు మరో రెండు కంపెనీలకు కూడా ఫ్రీలాన్స్‌గా పనికి కుదిరాడు. హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని మూడు జాబ్లూ చేస్తూ ట్రిపుల్ ఇన్కమ్ ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. పైగా ఎక్స్ట్రా జాబ్స్ విషయం ఇంట్లో వారికి తెలీదు కాబట్టి వాటి వల్ల వచ్చే ఆదాయం పూర్తిగా ప్రవీణ్ సొంతం. ఎలా ఖర్చుపెట్టుకున్నా అడిగేవారు లేరు... కట్ చేస్తే... ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రవీణ్ కొండాపూర్‌లోని ఒక రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. నగరంలో మల్టిపుల్ జాబ్స్ కల్చర్ వల్ల దెబ్బతింటున్న యువతకు ప్రవీణ్ ఓ ఉదాహరణ మాత్రమే. ⇒వారానికి 60 పని గంటలకు మించితే అనర్థాలే⇒ఒత్తిడి హార్మోన్లతో ఆందోళన, డిప్రెషన్⇒నగరానికి చెందిన వైద్య నిపుణుల హెచ్చరికలు సాక్షి, హైదరాబాద్: నగరాల్లో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మల్టీ జాబ్ కల్చర్ పెరుగుతోంది.. ఒక సంస్థలో ఉద్యోగిగా ఉంటూనే మరో సంస్థలో కూడా పనిచేసే మల్టీ జాబ్ కల్చర్ పేరే... ‘మూన్ లైటింగ్’... కరోనా అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పుట్టుకొచి్చన ఈ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ... నగరంలోనూ కనిపిస్తోంది. నాలుగు చేతులా సంపాదించడం ఎలా ఉన్నా... నానా రకాల అనారోగ్యాల పాలుకావడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. తీవ్రపరిణామాలు తప్పవు... తమ ఉద్యోగ పనివేళలు అయిపోయాక రెండో ఉద్యోగం చేయడం.. గత కొంత కాలంగా ఐటి సంబంధిత రంగాల్లో ఎక్కువగా, ఇతర రంగాల్లో కొద్దిగా కనిపిస్తోంది. ఈ మూన్‌లైటింగ్ సంస్కృతిపై... పలు బహుళజాతి కంపెనీలు విధానపరమైన ఆదేశాలనూ జారీ చేశాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన కంపెనీల వల్ల అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. నైతికంగా ఇది తప్పా.. ఒప్పా అనేది పక్కన పెడితే న్యాయవ్యవస్థ దీని చట్టబద్ధతను త్వరలో తేల్చనుంది. మరోవైపు ఇప్పటికే ఇది వ్యవస్థలో వేళ్లూనుకుంటుండడంతో... దీని లాభనష్టాలను కూడా యువత చవిచూస్తోంది.వారానికి 60 గంటలు మించితే.. అనతికాలంలోనే విజృంభించిన మల్టిపుల్ జాబ్స్ ట్రెండ్ వల్ల కలిగే అదనపు ఆదాయాలను లెక్కించే పనిలోనే అందరూ మునిగిపోయారు. ఇప్పటి దాకా దు్రష్పభావాల గురించి పెద్దగా చర్చ లేదు. అయితే, వారానికి 60 గంటలకు మించి పనిచేస్తే మెదడు, గుండె మీద తీవ్ర ప్రభావం పడుతుందని.. ఒక్కోసారి అవి శాశ్వతంగానూ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం, వాటిలో ఉండే పని ఒత్తిడి, పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సి రావడం... ఇవన్నీ మెదడు, గుండెను దెబ్బతీస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్న బాధితులు... లక్షలాది మంది టెక్నాలజీ నిపుణులకు నిలయమైన నగరంలోని ఆస్పత్రులకు ఇప్పుడు మూన్‌లైటింగ్ దు్రష్పభావాలతో వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. దీనిని ఉచ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ డైరెక్టర్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్, రిహాబిలిటేషన్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ బత్తిన థృవీకరించారు, ‘బ్రెయిన్ స్ట్రోక్ లేదా గుండెపోటుకు గురైన, లేదా ఏదైనా శస్త్రచికిత్స చేయించుకుని మా పునరావాస కేంద్రానికి వస్తున్న వారిలో ఎక్కువమందిని ఈ మల్టిపుల్ జాబ్స్ బాధితుల్నే చూస్తున్నాం. వీరిలో ఐటీ నిపుణులు, అందులోనూ ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నవారు, రాత్రుళ్లు సైతం నిద్ర లేకుండా, వారానికి 60 గంటలకు పైగా పనిచేస్తూన్న వారే అధికంగా ఉన్నారు. ఈ కొత్త కల్చర్...ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని తెలుస్తోంది. అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశ్రాంతీ అవసరమే... ఎక్కువ గంటలు పనిచేయడం దీర్ఘకాలిక ఒత్తిడికి దారితీస్తుంది. ఇది నాడీ సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. మెదడులో ప్రి–ఫ్రంటల్ కార్టెక్స్లో వాల్యూమ్ తగ్గడం వంటి మార్పులకు కూడా కారణమవుతుంది. దీనివల్ల సరైన నిర్ణయం తీసుకోవడం, ప్రణాళిక, ప్రేరణ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. ఈ సందర్భంగా అమోర్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ మనోజ్ వాసిరెడ్డి మాట్లాడుతూ ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్, ఆడ్రినలిన్ హార్మోన్లు విడుదలవుతాయి. వీటివల్ల ఆందోళన, డిప్రెషన్ వస్తాయి. నిరంతర ఆందోళన లేదా నిరాశ వల్ల రక్తపోటు అధికమై గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జీవితం–పని బ్యాలెన్స్ గురించి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ గంటలు పనిచేసే ప్రొఫెషనల్స్ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యానికి వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. సూచనలు ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా పనిచేస్తే, రోజువారీ ఒత్తిడి నుంచి కోలుకోవడానికి, పునరుత్తేజం పొందడానికి అతనికి అంత ఎక్కువ విశ్రాంతి అవసరం. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసేటప్పుడు మన గురించి మనం పట్టించుకోవడం కూడా ఒక బాధ్యతగా గుర్తించాలి. పనికీ పనికీ మధ్య తగిన విరామం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేదా ధ్యానం వంటి ఒత్తిడిని తగ్గించే అలవాట్లను అనుసరించాలి. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: చదువు – లోకహితం కోసమే
రామాయణంలో ఒక చోట ‘‘సర్వే వేద విదః శూరః సర్వే లోకహితే రతః /సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః’’ అని ఉంటుంది. రామలక్ష్మణ భరత శతృఘ్నులకు గురువులు ఎన్నో విషయాలు నేర్పారు.ఎన్ని నేర్పినా, వాళ్ళకు నేర్పుతున్నప్పుడే అంతర్లీనంగా ఒక బోధ చే శారు. ‘‘ఈ చదువు మీకు ఒక కొత్త విభూతిని కట్టబెడుతుంది. ఈ చదువు మీకు ఒక కొత్త అధికారాన్ని తీసుకొస్తుంది. మీకున్న ఏ విభూతిని కూడా స్వార్థ ప్రయోజనానికి వాడుకోకుండా కేవలం ప్రజాహితానికి మాత్రమే వాడాలి.’’–అని.చదువు లేనివాడు మోసం చేయడానికి సంతకం కూడా పెట్టలేడు. చదువుకున్నవాడు వాడిని పిలిచి నిలదీస్తే వాడు భయపడి ‘ఇంకెప్పుడూ ఇలా చేయనండీ ...’ అంటాడు. కానీ బాగా చదువుకున్నవాడు అందరికీ నియమనిష్టలు చెప్పగలిగినవాడు తప్పు చేసినప్పుడు.. ... తన తప్పును అంగీకరించక΄ోగా అదే ఒప్పు అని సమర్థించుకోవడానికి సవాలక్ష వాదనలు ముందు పెడతాడు. రావణాసురుడికి ఏ విద్యలు తెలియవని!!! అయినా ‘‘స్వధర్మో రక్షసాం భీరు సర్వథైన న సంశయః! గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా!!’’ అని వాదించాడు. ‘నా తప్పేముంది కనుక. నేను రాక్షసుడిని.నా జాతి ధర్మం ప్రకారం నాకు కావలసిన స్త్రీలను అవహరిస్తాను, అనుభవిస్తాను. నేను చూడు ఎంత ధర్మాత్ముడినో’’ అని సమర్ధించుకునే ప్రయత్నం చేసాడు. అంత చదువుకున్నవాడు అంత మూర్ఖంగా వాదిస్తే అటువంటివాడిని అభిశంసించగలిగిన వాడెవడుంటాడు!!! చదువు సంస్కారవంతమై ఉండాలి.సామాజిక నిష్ఠతో ఉండాలి. అందరి మేలు కోరేదై ఉండాలి. విశ్వామిత్రుడుకానీ, వశిష్టుడు కానీ రామలక్ష్మణులకు విద్యను నేర్పించేటప్పుడు ‘ఇంత ధనుర్వేదాన్ని వీళ్లకు అందచేస్తున్నాం. వీళ్ళు తలచుకుంటే ముల్లోకాలను లయం చేయగలరు. అంత శక్తిమంతులవుతారు..’ అన్న ఆలోచనతో దానిని ఎక్కడా దుర్వినియోగపరచకుండా ఉండేవిధంగా విద్యాబోధనలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. నిజానికి రామచంద్రమూర్తి నేర్చుకున్న ధనుర్విద్యా΄ాటవం అటువంటిది. ఆచరణలో ఆయన దానికి పూనుకుంటే ఆపడం ఎవరితరం కాదు. ఆయన బాణ ప్రయోగం చేస్తే అగ్నిహోత్రం కప్పేస్తుంది సమస్త భూమండలాన్ని... అది ప్రళయాన్ని సృష్టించగలదు. కానీ అంత బలాఢ్యుడై ఉండి కూడా రాముడు ఒక్కసారి కూడా స్వార్థం కోసం హద్దుదాటి ఎవరినీ శిక్షించలేదు. అంటే గురువులు ఇచ్చిన విద్య లోకప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగపడాలన్న స్పృహతో ఉండడమే కాదు, అందరికీ తన నడవడిక ద్వారా ఒక సందేశం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు.రుషులు లోకహితం కోరి మనకు అందించిన పురాణాలు మనల్ని వారికి రుణగ్రస్థుల్ని చేసాయి. ఎప్పుడో వయసు మీరిన తరువాత, పదవీవిరమణ తరువాత చదవాల్సినవి కావు అవి. చిన్నప్పటినుంచి వాటిని చదువుకుంటే, అవగాహన చేసుకుంటే మన జీవితాలు చక్కబడతాయి. అదీకాక రుషిరుణం తీరదు కూడా. ఇది తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం చాలు. బ్రహ్మచారిగా ఉండగా రామాయణ భారత భాగవతాదులు, ఇతర పురాణాలు, వేదాలు ఏవయినా చదువుకోవచ్చు. కానీ మిగిలిన రెండు రుణాలు–పితృరుణం, దేవరుణం మాత్రం గృహస్థాశ్రమ స్వీకారంతోనే తీరతాయి.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు సినిమా స్టార్స్స్పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్‌పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు, నిషేధిత మత్తుమందులు కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పలువురితోపాటు, ఇటీవల ప్రముఖ ఎల్విష్ యాదవ్‌పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలకు ఎందుకంత క్రేజ్ విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్‌కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్‌లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక(ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం. -
Lok Sabha Election 2024: ఎలక్షన్ టూరిజం జోరు!
సాంస్కృతిక పర్యాటకం, వైల్డ్‌లైఫ్ టూరిజం, మెడికల్ టూరిజం, గ్రామీణ టూరిజం, హిమాలయన్ ట్రెక్కింగ్, టెంపుల్ టూరిజం. ఇలా మన దేశంలో పర్యాటకం ఎన్నో రకాలు! లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల పర్యాటకం కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది! మన దేశంలో మామూలుగానే రైళ్లు, బస్సులు ఎప్పుడూ కిక్కిరిసే ఉంటాయి. పండుగలప్పుడైతే వాటిలో కాలు పెట్టే సందు కూడా ఉండదు! లోక్‌సభ ఎన్నికల సీజన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణాలు ఏకంగా 27 శాతం పెరిగాయట! ఇక్సిగో, అభీబస్ వంటి ట్రావెల్ ప్లాట్‌ఫాంలు చెబుతున్న గణాంకాలివి. ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రయాణాలు బాగా పెరిగినట్టు అభీబస్ సీవోవో రోహిత్ శర్మ తెలిపారు. తమిళనాడు, ఒడిశా, బిహార్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అంతర్రాష్ట ప్రయాణాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైందట. ‘‘బస్సు ప్రయాణాలకు డిమాండ్ తమిళనాడులో 27 శాతం, రాజస్తాన్‌లో 26 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 24 శాతం, బీహార్‌లో 16 శాతం, ఒడిశాలో 10 శాతం పెరిగింది. కర్నాటక నుంచి తమిళనాడుకు బస్సు ప్రయాణం 21 శాతం, ముంబై నుంచి ఢిల్లీకి 52 శాతం, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు 45 శాతం, చండీగఢ్ నుంచి శ్రీనగర్‌కు 48 శాతం, బెంగళూరు నుంచి ముంబైకి ఏకంగా 104 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది’’ అని అభీబస్, ఇక్సిగో వెల్లడించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !
ఆకలికి ఏదో ఒక ఆహారం తింటేసరి అని మనం అనుకుంటాం. చాలావరకు ఆ తినేదేదో రుచికరంగా ఉంటే చాలని కోరుకుంటాం అందరం. ఆఖరికి సన్యాసులు, పశుపక్ష్యాదులైనా!.. ఉత్త అన్నంమెతుకులే వేస్తే..కుక్కయినా సరే ముఖం చిట్లించేస్తుంది. ఏదో ఓ కూర కలిపి వేస్తే కాస్తయినా రుచి చూస్తుంది. అదే చికెన్, మటన్ లాంటిదైతే కృతజ్ఞతగా తోక కూడా ఊపుతూ మరీ లాగించేస్తుంది. మనం చెట్టుమీదున్న పండు అక్కడికక్కడ తెంపుకొని గబుక్కున తినేస్తాం మనం. కానీ అమెరికావాళ్ళకు ‘ ఏమి తింటున్నాం అనేదానికన్నా ఎలా తినాలి ’ అన్నది చాలా ముఖ్యం. చేతితో మాత్రం ముట్టరు..వాళ్ళు అదే పండును శుభ్రంగా కడిగి, ప్లేట్ లో పెట్టుకొని, ఎడమ చేతిలో ఫోర్క్, కుడి చేత చాకు పట్టుకొని కోసి తినడాన్నే ఇష్టపడతారు. అది శాఖాహారమైనా మాంసాహారమైనా చేతితో మాత్రం ముట్టుకోరు . ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చిన కొత్తలో.. నేను పనిచేస్తున్న సంస్థ మార్కుఫెడ్ వారు ,సహకార శిక్షణలో భాగంగా మూడు మాసాల కోసం నన్ను బెంగుళూరు పంపారు. అక్కడి మెస్సులో భోజనాల దగ్గర బయటి రాష్ట్రాల మిత్రులను చూసి పట్టిన ‘ చెంచా ’ అలవాటును నేను ఇప్పటికీ వదలడం లేదు. మా ఇంట్లో ఈ కొత్త అలవాటును చూసి ‘ ఇదేం చెంచాగిరి ’ అని వెక్కిరించినా, ఆతర్వాత వాళ్లే అర్థం చేసుకున్నారు.అలా చేస్తే అమర్యాద కింద లెక్క..ఎటైనా బయటికి వెళ్తున్నామంటే చాలు ఎందుకైనా మంచిదని ఒకటి రెండు చిన్న చెంచాలు బ్యాగులో పెట్టేవారు. అమెరికాలో ఆతిథ్యం విషయంలో ఎన్నో కొత్త విషయాలు గమనించవచ్చు. వాళ్ళు ఆహ్వానించినప్పుడు వస్తామని రాకపోవడం, ఆలస్యంగా వెళ్లడం అమర్యాద కిందే లెక్క. అతిథులకు ముందు నాప్కిన్స్ పెడితే మనం చేతి, మూతి తుడుచుకొని పక్కకు పడేస్తాం. కానీ దాన్నే అమెరికన్స్ బట్టలు పాడుకాకుండా ఉండడానికి పైన వేసుకుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర మనను ఆహ్వానించిన గృహస్తు అందరికీ వడ్డించి, తాను తినడం ప్రారంభించాకనే వచ్చిన అతిథులు తినడం, వైన్ లాంటి డ్రింక్ ఇస్తే గ్లాస్ పైకి లేపి ‘ చీర్స్ ’ చెప్పడం అక్కడి వారి మర్యాద (etiquette ). అంతేకాదు నోరు మూసుకొని తినాలంటారు వారు, లొట్టలేసుకుంటూ శబ్దంచేస్తూ తినడం, తింటూ తింటూ మాట్లాడడం, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, ముక్కు చీదాల్సి వచ్చినా రెస్ట్ రూంకు వెళ్లకుండా అక్కడే కూర్చోవడం, వాళ్లకు అస్సలు నచ్చని విషయాలు.కచ్చితంగా థాంక్స్ చెప్పడం వంటివి..ఏదైనా కావాలనుకుంటే ముందు ‘ప్లీజ్ ’ జతచేసి అడగడం, వాళ్ళు అది మీకు వడ్డించినప్పుడు ‘ థాంక్స్ ’ చెప్పడం విధిగా పాటించాల్సిన మర్యాదలు. ముందు గబగబా ప్లేట్ నింపుకొని తర్వాత తినలేక అవస్థపడి వదిలేసినా అక్కడ బాగోదు సుమా! ఎంత అవసరమో.. అంతే వడ్డించుకుని అది తిన్న తర్వాత మళ్లీ పెట్టుకోవడం అక్కడ గమనించిన విషయం. ఫుడ్ వేస్టేజ్‌ను చాలా మంది అమెరికన్లు ఒప్పుకోరు. భోజనం తర్వాత బ్రేవుమని త్రేన్చితే అతిథి దేవుడు తృప్తిపడ్డట్టు మనం భావిస్తాం . వాళ్ళ లెక్కలో అదీ శబ్దకాలుష్యమే. అమెరికావాళ్ళు తెలివిగలవాళ్ళు. లంచ్, డిన్నర్లే కాదు బ్రేక్ ఫాస్ట్‌లను కూడా వాళ్ళ కుటుంబ, వ్యాపార వ్యవహారాలు చక్కదిద్దుకోడానికి వాడుకుంటారు. క్లాసుమేట్స్తో కలిసి ఇంటికి వచ్చిన మా మనవరాలు స్నేహితురాలయిన ఒక తెల్లపిల్లను చూసి ‘ నీకన్నా చాల పెద్దదానిలా ఉందే ఈ అమ్మాయి ’ అన్నాను పొరపాటున. మా గ్రాండ్ డాటర్ చెవి పిండకుండానే నా చెవిలో చెప్పిన రహస్యం ‘ యూ ఎస్ లో ఎప్పుడూ ఎవరి ఏజ్ ప్రస్తావన తేవద్దు , వాళ్ళ పెళ్ళి గురించి , పిల్లల గురించి అస్సలు మాట్లాడొద్దు జాగ్రత్త ! వేముల ప్రభాకర్(చదవండి: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు: తానా ఈవెంట్) -
మన సంస్కృతికి చిహ్నం చీరకట్టు
ఖైరతాబాద్ (హైదరాబాద్): చీరకట్టు అంటే భారతదేశ సంప్రదాయం, సంస్కృతికి చిహ్నం అని...చీర అంటే సంతోషం, గౌరవానికి చిరునామా అని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ‘శారీ వాకథాన్’లో గవర్నర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహోత్సవాలు– 2024 వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన శారీ వాకథాన్‌లో వందలాది మంది మహిళలు, విద్యార్థినులు చీరలు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తాను విదేశాల్లో చదువుకునే సమయంలో ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా చీర ఎలా కడతారంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోయేవారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, 75 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో పాసైన సందర్భంగా ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 33 శాతం రిజర్వేషన్ ఉపయోగించుకుని అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న మహిళలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. అనంతరం బెలూన్స్ ఎగురవేసి శారీ వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దర్శన జర్దోష్, పద్మశ్రీ ఆనంద శంకర్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్‌తో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
అందరికీ ‘రామ్ రామ్’
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై స్పష్టత రావడం లేదు. అధిష్టానం ఆదేశాల మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డీవీ శర్మ తదితర ముఖ్య నేతలతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం ఓ నిర్ణయానికి రానుంది. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ‘అందరికీ రామ్ రామ్’అంటూ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇకపై తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని పరోక్షంగా చెప్పేందుకే ఆయన అలా ట్వీట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై చౌహాన్ స్పందిస్తూ.. తన ట్వీట్ అంతరార్థం అది కాదని చెప్పారు. ఎవరినైనా పలకరించేటప్పుడు ‘రామ్..రామ్’అని చెప్పడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైందని, రాముడి పేరుతో దినచర్యను ప్రారంభించడం మన సంస్కృతిలో భాగమని అందుకే అలా ట్వీట్ చేశానని చెప్పుకొచ్చారు. కానీ, ఆయన ట్వీట్లో ద్వంద్వ అర్థం ఉండటం రాజకీయంగా దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లో సీఎం రేసులో ప్రధానంగా శివరాజ్ సింగ్‌తోపాటు జ్యోతిరాదిత్య సింథియా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు. -
Kanyaputri Dolls: బిహార్ బొమ్మలట- కొలువుకు సిద్ధమట
ప్రతి సంస్కృతిలో స్థానిక బొమ్మలుంటాయి. మనకు కొండపల్లి, నిర్మల్... బిహార్‌లో కన్యాపుత్రి. అయితే బార్బీలు, బాట్‌మేన్‌ల హోరులో అవన్నీ వెనుకబడ్డాయి. కాని పిల్లలకు ఎటువంటి బొమ్మలు ఇష్టమో తెలిసిన టీచరమ్మ నమితా ఆజాద్ అక్కడ వాటికి మళ్లీ జీవం పోసింది. కొలువు తీర్చింది. సంస్కృతిలో భాగమైన ఆ బొమ్మలను చూడగానే పిల్లలకు ప్రాణం లేచివస్తు్తంది. నమిత చేస్తున్న కృషి గురించి.. ఒక టీచరమ్మ కేవలం పిల్లలు ఆడుకునే బొమ్మల కోసం బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగం వదిలేసింది. మనుషులు అలాగే ఉంటారు. ఏదైనా మంచి పని చేయాలంటే చేసి తీరుతారు. పట్నాకు చెందిన నమితా ఆజాద్‌ను వారం క్రితం బిహార్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘బిహార్ హస్తకళల పురస్కారం–2023’తో సత్కరించింది. పిల్లల బొమ్మల కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేయడమే అందుకు కారణం. కన్యాపుత్రి బొమ్మలు వీటిని బిహార్‌లో ‘గుడియా’ అని కూడా అంటారు. బిహార్‌లో చంపారన్ జిల్లాలో గుడ్డ పీలికలతో తయారు చేసే బొమ్మలు ఒకప్పుడు సంస్కృతిలో భాగంగా ఉండేవి. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఒక ప్రత్యేకమైన రోజున ఇంటి ఆడపిల్లలు ఈ బొమ్మలను విశేషంగా అలంకరించి దగ్గరలోని చెరువు ఒడ్డున నిమజ్జనం చేస్తారు. వారి అన్నయ్యలు ఆ బొమ్మలను వెలికి తెచ్చి చెల్లెళ్లకు ఇస్తారు. ఆ తర్వాత మిఠాయిలు పంచుకుంటారు. కన్యాపుత్రి బొమ్మలు ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ఇళ్లల్లో ఉంచుతారు. పిల్లలు ఆడుకుంటారు. కొత్త పెళ్లికూతురు అత్తారింటికి వచ్చేటప్పుడు తనతో పాటు కొన్ని అలంకరించిన కన్యాపుత్రి బొమ్మలు తెచ్చుకోవడం ఆనవాయితీ. ‘నా చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మలు ఈ బొమ్మలు చూపిస్తూ ఎన్నో కథలు చెప్పడం జ్ఞాపకం’ అంటుంది నమితా ఆజాద్. వదలని ఆ గుడియాలు నమితా ఆజాద్... చంపారన్ జిల్లాలో పుట్టి పెరిగింది. ఎం.ఏ. సైకాలజీ చేశాక చండీగఢ్‌లోని ‘ప్రాచీన్ కళాకేంద్ర’లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌లో మాస్టర్స్ చేసింది. ఆ సమయంలోనే ఆమెకు బాల్యంలో ఆడుకున్న కన్యాపుత్రి బొమ్మలు గుర్తుకొచ్చాయి. వాటిని తిరిగి తయారు చేయాలని అనుకుంది. ఇంట్లో పని చేసే ఇద్దరు మహిళలతో కొన్ని బొమ్మలు తయారు చేసి ఒక ప్రదర్శనలో ఉంచితే వెంటనే అమ్ముడుపోయాయి. ఆమెకు ఉత్సాహం వచ్చింది ఆ రోజు నుంచి ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కన్యాపుత్రి బొమ్మలను తయారు చేస్తూ హస్తకళల ప్రదర్శనలో ప్రచారం చేసింది. 2013 నాటికి వాటికి దక్కుతున్న ఆదరణ, వాటి అవసరం అర్థమయ్యాక ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్నే మానేసింది. పిల్లల సైకాలజీ తెలిసి పిల్లల సైకాలజీ తెలిసిన వారికి బొమ్మలు పిల్లల వికాసానికి ఎంతగా ఉపయోగపడతాయో తెలుస్తుంది అంటుంది నమితా. ఆ బొమ్మలతో పశు పక్ష్యాదులను తయారు చేస్తారు కనుక కవాటి వల్ల సమిష్టి కుటుంబాలు, మైక్రో కుటుంబాలు, అన్నా చెల్లెళ్ల బంధాలు, సామాజిక బంధాలు, పర్యావరణ స్పృహ అన్నీ తెలుస్తాయి అంటుంది నమితా. పిల్లలకు సామాజిక సందేశాలు ఇవ్వాలన్నా, కొన్ని పాఠాలు వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నా ఈ బొమ్మలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆమె టీచర్లకు నిర్వహించి వర్క్‌షాప్‌ల ద్వారా తెలియచేస్తోంది. నమితా లాంటి సంస్కృతీ ప్రేమికులు ప్రతిచోటా ఉంటే సిసలైన పిల్లల బొమ్మలు వారిని సెల్ఫోన్ల నుంచి వీడియో గేమ్స్ నుంచి కాపాడుతాయి. ఎకో ఫ్రెండ్లీ బొమ్మలు కన్యాపుత్రి బొమ్మలు ప్లాస్టిక్ లేనివి. అదీగాక మారణాయుధాలు, పాశ్చాత్య సంస్కృతి ఎరగనివి. మన దేశీయమైనవి. టైలర్ల దగ్గర పడి ఉండే పీలికలతో తయారు చేసేవి. అందుకే నమితా ఇప్పుడు ‘ఎన్‘ క్రియేషన్స్ అనే సంస్థ పెట్టి 15 మంది మహిళలకు ఉపాధి కల్పించి ఈ బొమ్మలు తయారు చేస్తోంది. అంతే కాదు బిహార్ అంతా తిరుగుతూ వాటిని తయారు చేయడం మహిళలకు నేర్పించి వారికి ఉపాధి మార్గం చూపుతోంది. -
యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? ఏడు అడుగులు దేనికి చిహ్నం?
యూదు సంస్కృతిలో వివాహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జీవితంలో వివాహమనేది తప్పనిసరిగా జరగాలని యూదులు భావిస్తారు. ఇతర మతాలలోని మాదిరిగానే వివాహాన్ని పవిత్ర బంధంతో కూడిన ఒప్పందంగా పరిగణిస్తారు. 18, 19వ శతాబ్దాల మధ్య కాలంలో యూదుల మతం, సంస్కృతి పరిఢవిల్లింది. వివాహ ఆచారాలు కూడా ఏర్పడ్డాయి. జుడాయిజంలో వివాహం అనేది ఒక పవిత్ర ఒప్పందం. దీనికి శుభ సమయం అంటూ ఉండదు. సాధారణంగా వివాహాలను ఆదివారం నిర్వహిస్తుంటారు. సన్నిహితుల సమక్షంలో వధువు- వరుడు తమ వివాహానికి సమ్మతి తెలియజేస్తారు. జీవితాంతం ఒకరికి ఒకరుగా కలిసి జీవిస్తామని వాగ్దానం చేస్తారు. యూదుల సంస్కృతిలో వివాహాన్ని కిద్దుషిన్ అంటారు. వివాహ వేడుకకు ముందు యూదులు ఉంగరాన్ని ధరించే వేడుకను నిర్వహిస్తారు. దీనిని హిందూ, ఇతర మతాలలో నిశ్చితార్థం అని అంటారు. యూదులలో వివాహానికి ముందు వధూవరులు కలుసుకునే సంప్రదాయాన్ని ‘యోమ్ కిప్పూర్ విడ్డూయ్’ అని అంటారు. దీనిలో అబ్బాయి, అమ్మాయి కలుసుకుంటారు. ఒప్పుకోలు ప్రార్థనలో పాల్గొంటారు. గత జీవితంలోని అన్ని తప్పులకు క్షమించాలని పరస్పరం వేడుకుంటారు. ఒకరికొకరు నమ్మకంగా మెలుగుతామని ప్రమాణం చేస్తారు. యూదుల వివాహాల్లో చుప్పా(వివాహ వేదిక)కు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. చుప్పాలో వధూవరులు ఏడు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ఆచారం ప్రకారం జరిగే తంతు ఉంటుంది. వధూవరులు ఏడు అడుగులు వేయడం అనేదాన్ని పరిపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. వధూవరులు ఉంగరాలు మార్చుకుంటారు. వరుడు.. వధువు కుడి చూపుడు వేలుకు ఉంగరాన్ని అలంకరిస్తాడు. తరువాత వధూవరులు అందరి సమక్షంలో తాము జీవితాంతం కలసి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాగే వధూవరుల వివాహ ఒప్పందాన్ని ఆహ్వానితుల సమక్షంలో చదువుతారు. వేడుక ముగింపులో వరుడు ఒక గాజు గ్లానుసు పగలగొట్టి, దానిని తన కుడి పాదంతో చూర్ణం చేస్తాడు. ఈ సమయంలో అతిథులు ‘మజెల్ తోవ్’ అని అరుస్తారు. ఇది ఇది హీబ్రూలో శుభాకాంక్షలు తెలియజేయడాన్ని సూచిస్తుంది. దీని తరువాత వరునికి ఒక చిన్న కప్పులో వైన్ అందిస్తారు. ఇదేవిధంగా వధువు కూడా వైన్ తాగుతుంది. వారం రోజుల తర్వాత అతిథులు, బంధువులు కలిసి వధూవరులకు ఘనమైన విందు ఇస్తారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన సంప్రదాయ నృత్యం కూడా చేస్తారు. ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో విషాదం -
Vishala Reddy Vuyyala: విశాల ప్రపంచం
ఈ ఏడాది మనదేశంలో జీ 20 సదస్సులు జరిగాయి. దేశదేశాల ప్రతినిధులు మనదేశంలో అడుగుపెట్టారు. వారికి మనదేశం గురించి సరళంగా వివరించాలి. ఆ వివరణ మనకు గర్వకారణంగా సమగ్రంగా ఉండి తీరాలి. అందుకు ఒక గిఫ్ట్ బాక్స్‌ను రూపొందించారు విశాల రెడ్డి. మిల్లెట్ బ్యాంకు స్థాపకురాలిగా తన అనుభవాన్ని జోడించారు. మన జాతీయ పతాకాన్ని గర్వంగా రెపరెపలాడించారు. విశాలాక్షి ఉయ్యాల. చిత్తూరు జిల్లాలో ముల్లూరు కృష్ణాపురం అనే చిన్న గ్రామం ఆమెది. ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన జీ 20 సదస్సులో సమన్వయకర్తగా వ్యవహరించారు. మనదేశంలో విస్తరించిన అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్, కళావారసత్వాలను కళ్లకు కట్టారు. అంత గొప్ప అవకాశం ఆమెకు బంగారు పళ్లెంలో పెట్టి ఎవ్వరూ ఇవ్వలేదు. తనకు తానుగా సాధించుకున్నారు. ‘ఆడపిల్లకు సంగటి కెలకడం వస్తే చాలు, చదువెందుకు’ అనే నేపథ్యం నుంచి వచ్చారామె. ‘నేను బడికెళ్తాను’ పోరాట జీవితంలో ఆ గొంతు తొలిసారి పెగిలిన సమయమది. సొంతూరిలో ఐదవ తరగతి పూర్తయిన తర్వాత మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్‌కి వెళ్లడానికి ఓ పోరాటం. కాళ్లకు చెప్పుల్లేకుండా పదికిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజ్... కుప్పంలో ఉంది. రోజూ ఇరవై– ఇరవై నలభై కిలోమీటర్ల ప్రయాణం. డిగ్రీ కర్నాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో. అప్పటికి ఇంట్లో పోరాడి కాలేజ్‌కి వెళ్లడానికి ఒక సైకిల్ కొనిపించుకోగలిగారామె. ప్రయాణ దూరం ఇంకా పెరిగింది. మొండితనంతో అన్నింటినీ గెలుస్తూ వస్తున్నప్పటికీ విధి ఇంకా పెద్ద విషమ పరీక్ష పెట్టింది. తల్లికి అనారోగ్యం. క్యాన్సర్‌కి వైద్యం చేయించడానికి బెంగుళూరుకు తీసుకువెళ్లడం, డాక్టర్లతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగిన చదువు ఉన్నది ఇంట్లో తనకే. బీఎస్సీ సెరికల్చర్ డిస్కంటిన్యూ చేసి అమ్మను చూసుకుంటూ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్‌లో బీఏ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం పోరాటమే మిగిలింది, అమ్మ దక్కలేదు. ఆమె పోయిన తర్వాత ఇంట్లో వాళ్లు ఏడాది తిరక్కుండా పెళ్లి చేసేశారు. మూడవ నెల గర్భిణిగా పుట్టింటికి రావాల్సి వచ్చింది. ఎనిమిది నెలల బాబుని అక్క చేతిలో పెట్టి హైదరాబాద్‌కు బయలుదేరారు విశాలాక్షి ఉయ్యాల. ‘తొలి ఇరవై ఏళ్లలో నా జీవితం అది’... అంటారామె. ‘మరో ఇరవై ఏళ్లలో వ్యక్తిగా ఎదిగాను, మూడవ ఇరవైలో వ్యవస్థగా ఎదుగుతున్నా’నని చెప్పారామె. హైదరాబాద్ నిలబెట్టింది! ‘‘చేతిలో పదివేల రూపాయలతో నేను హైదరాబాద్‌లో అడుగు పెట్టిన నాటికి ఈవెంట్స్ రంగం వ్యవస్థీకృతమవుతోంది. ఈవెంట్స్ ఇండస్ట్రీస్ కోర్సులో చేరిపోయాను. ఇంగ్లిష్ భాష మీద పట్టుకోసం బ్రిటిష్ లైబ్రరీ, రామకృష్ణ మఠం నుంచి పుస్తకాలు తెచ్చుకుని చదివేదాన్ని. మొత్తానికి 2004లో నెలకు మూడు వేల జీతంతో ఈవెంట్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత నోవాటెల్‌లో ఉద్యోగం నా జీవితానికి గొప్ప మలుపు. ప్రపంచస్థాయి కంపెనీలలో ఇరవైకి పైగా దేశాల్లో పని చేయగలిగాను. నా పేరుకు కూడా విశాలత వచ్చింది చేసుకున్నాను. హైదరాబాద్‌లో రహగిరి డే, కార్ ఫ్రీ డే, వన్ లాక్ హ్యాండ్స్ వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాను. ప్రదేశాలను మార్కెట్ చేయడంలో భాగంగా హైదరాబాద్‌ని మార్కెట్ చేయడంలో భాగస్వామినయ్యాను. ఒక ప్రదేశాన్ని మార్కెట్ చేయడం అంటే ఆ ప్రదేశంలో విలసిల్లిన కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నింటినీ తెలుసుకోవాలి, వచ్చిన అతిథులకు తెలియచెప్పాలి. అలాగే రోడ్ల మీద ఉమ్మడం, కొత్తవారి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి పనులతో మన ప్రదేశానికి వచ్చిన వ్యక్తికి చేదు అనుభవాలు మిగల్చకుండా పౌరులను సెన్సిటైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తూ నా రెండవ ఇరవై ముగిసింది. అప్పుడు కోవిడ్ వచ్చింది. హాలిడే తీసుకుని మా ఊరికి వెళ్లాలనిపించింది. అప్పుడు నా దగ్గరున్నది పదివేలు మాత్రమే. నాకు అక్కలు, అన్నలు ఏడుగురు. నా కొడుకుతోపాటు వాళ్ల పిల్లలందరినీ చదివించాను. అప్పటికి నేను పెట్టిన స్టార్టప్ మనుగడ కూడా ప్రశ్నార్థకమైంది. పదివేలతో వచ్చాను, ఇరవై ఏళ్ల తర్వాత పదివేలతోనే వెళ్తున్నాను... అనుకుంటూ మా ఊరికెళ్లాను. ఊరు కొత్త దారిలో నడిపించింది! నా మిల్లెట్ జర్నీ మా ఊరి నుంచే మొదలైంది. మా అక్క కేజీ మిల్లెట్స్ 15 రూపాయలకు అమ్మడం నా కళ్ల ముందే జరిగింది. అవే మిల్లెట్స్ నగరంలో యాభై రూపాయలు, వాటిని కొంత ప్రాసెస్ చేస్తే వంద నుంచి రెండు– మూడు వందలు, వాటిని రెడీ టూ కుక్‌గా మారిస్తే గ్రాములకే వందలు పలుకుతాయి. తినే వాళ్లకు పండించే వాళ్లకు మధ్య ఇంత అగాథం ఎందుకుంది... అని ఆ అఖాతాన్ని భర్తీ చేయడానికి నేను చేసిన ప్రయత్నమే మిల్లెట్ బ్యాంక్. ఈ బ్యాంక్‌ను మా ఊరిలో మొదలు పెట్టాను. ఒక ప్రదేశం గురించి అక్కడి అగ్రికల్చర్, కల్చర్, ఆర్ట్, క్రాఫ్ట్ అన్నీ కలిస్తేనే సమగ్ర స్వరూపం అవగతమవుతుంది. నేను చేసింది అదే. మా మిల్లెట్ బ్యాంకు జీ 20 సదస్సుల వరకు దానంతట అదే విస్తరించుకుంటూ ఎదిగింది. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేర్యాల పెయింటింగ్స్, ఉత్తరాది కళలు, మన రంగవల్లిక... అన్నింటినీ కలుపుతూ ఒక గిఫ్ట్ బాక్స్ తయారు చేశాను. ప్రతినిధులకు, వారి భాగస్వాములకు భారతదేశం గురించి సమగ్రంగా వివరించగలిగాను. జీ20 ద్వారా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న నా మిల్లెట్ బ్యాంకు మరింతగా వ్యవస్థీకృతమై ఒక అమూల్లాగా ఉత్పత్తిదారుల సహకారంతో వందేళ్ల తర్వాత కూడా మనగలగాలనేది నా ఆకాంక్ష. మిల్లెట్ బ్యాంకుకు అనుబంధంగా ఓ ఇరవై గ్రీన్ బాక్స్‌లు, సీడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలి. రైతును తన గింజలు తానే సిద్ధం చేసుకోగలిగినట్లు స్వయంపోషకంగా మార్చాలనేది రైతు బిడ్డగా నా కోరిక’’ అని మిల్లెట్ బ్యాంకు, సీడ్ బ్యాంకు స్థాపన గురించి వివరించారు విశాలరెడ్డి. స్త్రీ ‘శక్తి’కి పురస్కారం టీసీఈఐ (తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ) నిర్వహిస్తున్న ‘స్త్రీ శక్తి అవార్డ్స్ 2023’ అవార్డు కమిటీకి గౌరవ సభ్యురాలిని. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్, గచ్చిబౌలిలో పురస్కార ప్రదానం జరుగుతుంది. గడచిన ఐదేళ్లుగా స్త్రీ శక్తి అవార్డ్స్ ప్రదానం జరగనుంది. ఇప్పటి వరకు తెలంగాణకు పరిమితమైన ఈ అవార్డులను ఈ ఏడాది జాతీయస్థాయికి విస్తరించాం. పదిహేనుకు పైగా రాష్ట్రాలతోపాటు మలేసియా, యూఎస్‌లలో ఉన్న భారతీయ మహిళల నుంచి కూడా ఎంట్రీలు వచ్చాయి. అర్హత కలిగిన ఎంట్రీలు 250కి పైగా ఉండగా వాటిలో నుంచి 50 మంది అవుట్ స్టాండింగ్ ఉమెన్ లీడర్స్ పురస్కారాలందుకుంటారు. జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు, ఆత్మస్థయిర్యం కోల్పోకుండా ముందుకు సాగిన వైనం, వారు సాధించిన విజయాలు– చేరుకున్న లక్ష్యాలు, ఎంతమందికి ఉపాధినిస్తున్నారు, వారి భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ ఎలా ఉన్నాయనే ప్రమాణాల ఆధారంగా విజేతల ఎంపిక ఉంటుంది. – విశాల రెడ్డి ఉయ్యాల ఫౌండర్, మిల్లెట్ బ్యాంకు – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్. ఎస్. ఠాకూర్ -
హృదయాన్ని తాకేది... పాటే..!
శరీరం బలంగా ఉండి మనసు సంస్కారవంతంగా లేనప్పుడు అది లోకానికి ప్రమాదం. రావణుడు బలవంతుడే, కానీ సంస్కారవంతుడుకాదు.. దానితో లోకమంతా క్షోభించి పోయింది. అందువల్ల మనకు బలం అవసరమే. కానీ దానిని ఎలా ఉపయోగిస్తున్నామనే దాని మీద వ్యక్తిగత శాంతి, సమాజ శాంతి ఆధారపడి ఉంటుంది. మంచి కీర్తన విన్నారు. కీర్తనకు ఉన్న లక్షణం– అది సామవేదగానం. త్వరగా మనసుకు హత్తుకుంటుంది. దానితో మనసుని ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుంది. దానిలోని సాహిత్యం ఆలోచనలను మధిస్తుంది. మనసుని పోషిస్తుంది. మనసు ఉద్వేగంతో, అశాంతితో ఉన్నప్పుడు అది రాక్షసత్వానికి కారణం అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి ఉద్వేగరహితం అయిందనుకోండి అది సత్వగుణానికి కారణమవుతుంది. ఎక్కడ సత్వగుణం ఉంటుందో అక్కడ ఉత్తమ కర్మ ఉంటుంది. ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ ఉత్ప్రేరకం ఉందో అక్కడ ఆ వ్యక్తి ఎంత ప్రమాదకరమైన పని అయినా చేస్తాడు...అందుకే ‘‘క్రుద్ధం పాపం న కుర్యాత్కాః క్రుద్ధో హన్యాద్గురువునపి/క్రుద్ధః పరుషయా వాచా నరః సాధునాధిక్షిపేత్ ’’ అంటాడు హనుమ రామాయణంలో. క్రోధానికి గురయిన వ్యక్తిఎంతటి దుస్సాహసానికయినా పూనుకుంటాడు. వారించబోయిన పెద్దలను కూడా లెక్కచేయడు. అశాంతి ఎంత పాపాన్నయినా చేయిస్తుంది. ఆ అశాంతిని తొలగించడానికి ప్రధాన సాధనం సంగీతమే. గజాసుర సంహార వృత్తాంతంలో ఒక విచిత్రం కనబడుతుంది. గజాసురుడు కాశీపట్టణంలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాడు. పరమశివుడు త్రిశూలంతో పొడిచి పైకెత్తిపెట్టాడు. త్రిశూలం అతనిలో గుణాత్మక స్థితిని కల్పించింది. గజాసురుడు ప్రాణాంతకస్థితిలో ఉండికూడా సామవేదగానం చేసాడు. ద్వంద్వాలకు అతీతుడయిన శివుడు ఆ అసురుడిలో లోపాలను పక్కనబెట్టి మార్పు వచ్చిందా లేదా అని చూసాడు. నీకేం కావాలని అడిగాడు. నా తోలు వలిచి నువ్వు కట్టుకోవాలని కోరాడు. నీవు నన్ను సంగీతంతో, సామవేద మంత్రాలతో సంతోషపెట్టావు కనుక నిన్ను అనుగ్రహించడానికి గుర్తుగా కృత్తివాసేశ్వరుడుగా ఉంటాను..అని ఆ పేర కాశీలో వెలిసాడు. సంగీతం అంత త్వరగా హృదయాన్ని తాకుతుంది. అదే గంభీరమైన విషయాలను మరో రూపంలో.. పద్యం, శ్లోకం వంటి రూపాల్లో చెబితే ఇంత త్వరగా మనసును ప్రభావితం చేస్తుందని చెప్పలేం. అందుకే వాల్మీకి రామాయణాన్ని లవకుశులకు గానంగా నేర్పాడు... అని ఉంది బాలకాండలో. అది వాద్య తంత్రులకు కట్టుబడుతుంది. మంచి సంగీతం అంటే... త్యాగబుద్ధితో, ఎటువంటి స్వప్రయోజనం ఆశించకుండా లోకానికి అందించిన వారు దానిని పాటగా అందించారు. దానిని ఎలా పాడాలో కూడా వారే నిర్ణయించేసారు. అంటే వారే స్వరపరిచారు. సాహిత్యం కూడా వారే సమకూర్చారు. అది కూడా ప్రణాళికతో కాదు. భగవంతుని గుణాలతో లోలోపల రమించి పోయి, ఆ పరవశంతో గీతంగా వారి నోటినుంచి ప్రవహించింది.. అదీ వాగ్గేయకారుల గొప్పదనం. పాట సంస్కృతికి శాశ్వతత్త్వాన్ని ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కళలు అనే వర్షం కావాలి! అప్పుడే..
అన్నార్భవంతు భూతాని... అసలు ప్రాణుల పుట్టుకకు, మనుగడకు అన్నం కావాలి. అన్నం దొరకాలంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. ఆకాశంలో నుంచి పడిన వర్షంతో భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్లు, ఒక దేశసంస్కృతి నిలబడాలంటే కళలు.. అనే వర్షం కావాలి. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. సంస్కృతి పెరిగితే ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి, నడవడిక, ఆ దేశపు కీర్తిప్రతిష్ఠలు నిర్ణయింప బడతాయి. కళలు... అంటే కవిత్వం, శిల్పం, నృత్యం, వాద్యం.. ఎప్పుడూ అవతలివారికి సంస్కృతిని కల్పించేవి అయి ఉంటాయి. ఇవన్నీ కళలు కాబట్టి ఇవి వర్షం లాంటివి. అవి సంస్కృతిని మొలకెత్తించడానికి కారణం కావాలి. మన దేశానికి ఇన్ని కీర్తిప్రతిష్ఠలు రావడానికి కారణం ఏమిటి? భగవద్గీత పుట్టిన భూమి. రామాయణం, భారతం, భాగవతం వంటివి పుట్టిన భూమి. గంగానది ప్రవహిస్తున్న భూమి. ఒకనాడు తాళంకప్ప అవసరం తెలియని భూమి. సంస్కృత భాషలో తాళం కప్ప అన్నదానికి పదం లేదు.. ఆ అవసరం రాలేదు. కారణం – పరద్రవ్యాణి లోష్ఠవత్... రహదారిమీద రాయి దొరికితే నాది కాదు అని ఎలా అంటామో అలాగే నాది కానిదేదీ, పరవాడివస్తువు ఏదయినా నాకు దొరికితే నాది కాదు కాబట్టి అది నాకు రాయితో సమానమే... అన్న భావన. అదీ ఈ దేశ సంస్కృతి. ఇది ఎక్కడినుంచి వచ్చింది? రామాయణంలో నుంచి, భారతంలోంచి.. వచ్చింది. నీదికానిది నీవు కోరుకుంటే .. పతనమయి పోతావన్న హెచ్చరిక... దాని జోలికి వెళ్ళనీయదు. కళలు ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబించేవి అయి ఉంటాయి. మీరు ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, మనశ్శాంతికి కారకమైన భగవంతుని తత్త్వాన్ని ఆవిష్కరింపచేసేవిగా ఉంటాయి. ఒక నృత్యం జరుగుతోంది. ‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభమ్ నాసాగ్రే నవమౌక్తికమ్...’ అంటూ సాగుతున్న కీర్తనకు నర్తకి అభినయిస్తుంటే నర్తకి క్రమేణా కనుమరుగై కృష్ణపరమాత్మ కనబడడం మొదలవుతుంది. పాట అభినయంగా మీకు శ్రీకృష్ణ దర్శనం చేయించి, మీ ఉద్వేగాలను శాంతపరుస్తుంది. పాలగిన్నె కింద అగ్నిహోత్రం పెడితే పాలు పొంగుతాయి. నీళ్ళు చల్లితే పొంగు చల్లారుతుంది. అలా మనదేశంలో ఉన్న కళలు మన భావోద్వేగాలను అణచి ప్రశాంతతను, మనశ్శాంతిని కల్పించడానికి ఉపయుక్తమయ్యాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని, ఆదరణనూ పొందాయి. ఈ కళలన్నీ శాంతిని ప్రసాదించగల దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ కూడా వేదాలకు ఉపవేదాలయినటువంటి వాటి నుంచి వచ్చాయి. సామవేదానికి గాంధర్వ వేదం ఉపవేదం. మిగిలినవి ఇతర వేదాలకు ఉపవేదాలు. వేదానాం సామవేదోస్మి... అన్నాడాయన. ఎందుకు అంతస్థాయిని పొందింది? అంటే తినడం ఒక్కటే కాదు, శరీరం పెరగడం ఒక్కటే కాదు ప్రధానం, అది ఎంత అవసరమో, మనసు సంస్కారవంతంగా తయారు కావడం కూడా అంతే ప్రధానం. (చదవండి: మెట్ట వేదాంతం..?) -
అమెరికాలో ఘనంగా శ్రావణమాస మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆధ్వర్యంలో అమెరికాలోని పలు నగరాల్లో శ్రావణమాస మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. అమెరికాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు తమ తమ పండుగలను వేడుకలను వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా తమ ప్రాంత వైభోగాన్ని, పండుగలను అందరితో కలిసి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఏఏఏ డెలావేర్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమపూజను ఘనంగా నిర్వహించారు. డెలావేర్‌లోని మిడిల్ టౌన్‌లోని జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పూజ కార్యక్రమాలతో పాటు పాటలు, డ్యాన్స్‌లు అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యాలు, డ్యాన్స్‌లు, సంగీత విభావరులు, ఆట పాటలతో కార్యక్రమం ఉత్సహంగా సాగింది. ప్రముఖ సంగీత దర్శకులు కోటి సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ప్రముఖ సింగర్స్ హిట్టయిన పాటలను పాడి అందరిలో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసులు ఈ స్టాల్స్ వద్ద సందడి చేశారు. మహిళలకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ పిండివంటలతో తయారు చేసిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికీ పంపిణీ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పసందైన విందు భోజనం అందించారు. వరలక్ష్మీ వ్రతాన్ని అమెరికాలో ఉంటున్న భారతీయుల చేత ఘనంగా జరిపేందుకు వీలుగా శ్రావణ మహోత్సవాలు పేరిట కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల ఏఏఏ డెలావేర్ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ) -
మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే..
ఊపిరి వాక్కుగా మారిన కారణంగా శరీరం పడిపోయినా, కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. నిజానికి మనకు సనాతన ధర్మంలో గొప్పది వేదం. వేదం అపౌరుషేయం. ఈశ్వరుడిచేత చెప్పబడినది. ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదం అంత సనాతనమైనది. నా ఊపిరి రెండు కాదు, ఊపిరి తీస్తున్నంతసేపే ‘నేను’ నేనుగా ఉన్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడమంటే మాట్లాడలేను. ఊపిరి విడిచి పెడుతున్నప్పుడు అది వాక్కుగా మారుతుంది. తీసిన ఊపిరులను సమాజ శ్రేయస్సు కోసం వాక్కులుగా మార్చిన వారున్నారు. తామేదీ ఆశించకుండా కేవలం సమాజ శ్రేయస్సే కోరుకున్నారు వారు. భగవంతుడిచ్చిన ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడుతున్నాను, అది నన్ను శాశ్వతుడిని చేస్తుందన్నాడు పోతన. శాశ్వతమైనది పరబ్రహ్మము. దానిలో చేరిపోతాను... అన్నాడు. శంకరాచార్యులవారు శివానందలహరి చేస్తూ..అసలు భక్తికి చివరి మాట ఏది అన్నదానికి సమాధానంగా ... ‘‘అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా/ సాధ్వీ నైజ విభుం లతా క్షితి రుహం సింధు స్సరిద్వల్లభమ్/ ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదార వింద ద్వయమ్/ చేతో వృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే ’’ అంటారు. నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నదికి రంగు, రుచి ఇవేం ఉండవు. అటువంటి త్యాగమయ జీవితాన్ని గడిపి భగవంతునిలో ప్రవేశించాడు, నది సముద్రంలో కలసిపోయినట్లు కలిసిపోయాడు. కానీ ఆయన మాత్రం లోకంలో చిరస్థాయిగా ఉండిపోయాడు. ఎలా ... వాక్కు కారణంగా. భారతం ద్వారా నన్నయ అలా ఉండిపోయాడు. ఎర్రాప్రగడ, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, రామదాసు... వీళ్ళందరూ అలాగే వాక్కుల కారణంగా ఉండిపోయారు. ఆ వాక్కును కొందరు పద్యరూపంగా, కొందరు గద్యరూపంగా, శ్లోకంగా, పాటగా చెప్పారు. పాటకున్న లక్షణం .. అది సంస్కృతికి మూలకందమై నిలబడుతుంది. భూమినుంచి మొక్కలు పుట్టాలి... అంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. అందుకే గ్రీష్మం తరువాత వర్షరుతువు వస్తుంది. దానిముందు ఆషాఢమాసం ప్రవేశించగానే ప్రతి ఊరిలోనూ అధిష్ఠాన దేవతయిన గ్రామదేవతను దర్శించుకుని నైవేద్యం పెడతారు. ఎందుకు! ఆమె అనుగ్రహంతో నేను ఈ ఊరిలో ఉండి అన్నం తినగలుగుతున్నా... కాబట్టి ఏడాదికొక్కసారి నేను ఆమెకు నైవేద్యం పెట్టాలి. ఆమె భూమికి ఆర్ద్రత కలిగిస్తుంది, వర్షరూపంలో. తడి తగలగానే ఏడాదికి సరిపడా నేను తినగలిగిన అన్నం నాకు దొరుకుతుంది... అన్న భావన. భూమికి తడి తగలకపోతే, ఎండి పడిపోయిన జామ గింజలు, బత్తాయి గింజలు, ధాన్యపు గింజలు ఏవీ మొక్కలుగా పైకి లేవవు. తడి తగలగానే గడ్డిపరకనుంచి మొదలుపెట్టి, భూమికి చేరిన గింజలన్నీ మొక్కలై పెరుగుతాయి. అంటే ఆర్ద్రత ఉండాలి. ప్రాణుల మనుగడకు అది ఆధారం. అలాగే ఒక దేశ సంస్కృతి నిలబడాలంటే... భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్టు, కళలుండాలి. కళలద్వారా సంస్కృతి పెరుగుతుంది. (చదవండి: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? శ్రావణంలో వచ్చే రెండో శుక్రవారం ప్రత్యేకత ఏంటి?) -
సాంస్కృతిక ఏకీకరణతో సుస్థిరాభివృద్ధి
వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సాంస్కృతిక ఏకీకరణ ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూనే, ప్రపంచంలోని భిన్న సంస్కృతులను కాపాడుకునే దిశగా జీ 20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశం కాశీ కల్చరల్ పాత్వేకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కాశీలో మూడు రోజులపాటు జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ప్రపంచంలోని వైవిధ్యమైన సంస్కృతి మనందరినీ కలుపుతుందని సమావేశంలోని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తన సహచర దేశాల మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ...అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే శక్తి సంస్కృతి, సంప్రదాయాలకే ఉందన్నారు. ‘కల్చర్ యునైట్స్ ఆల్’అని వ్యాఖ్యానించారు. భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతుల నిలయమైన భారతదేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’ప్రదర్శిస్తున్నట్లే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంస్కృతిక వైవిధ్యత అన్ని దేశాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు, ఒకరినొకరు సంస్కృతి, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకునేందుకు వీలవుతుందన్నారు. యావత్ మానవాళిని ఏకం చేసే విషయంలో సంస్కృతి కీలకపాత్ర పోషిస్తోందని, విలువలు, భాషలు, కళలు మొదలైనవి దేశాలు, ప్రజల మధ్య సత్సంబంధాలకు బాటలు వేస్తాయని మంత్రి కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఒకరోజు ముందు జరిగిన నాలుగో వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ ఈ అంశాలపై మరింత విస్తృతమైన చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా ‘కాశీ కల్చరల్ పాత్వే’కు రూపకల్పన జరిగిందని ఆయన వెల్లడించారు. రోమ్ డిక్లరేషన్, బాలి డిక్లరేషన్లలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు అంశాలు, సభ్యుల అభిప్రాయాల ఆధారంగానే ‘కాశీ కల్చరల్ పాత్వే’ను రూపొందించినట్లు కిషన్ రెడ్డి వివరించారు. ‘కాశీ కల్చరల్ పాత్వే’లోని కొన్ని ముఖ్యాంశాలు సాంస్కృతిక ఆస్తులకు పునర్వైభవాన్ని కల్పించడం, వాటిని ఆయా దేశాలకు తిరిగి అప్పగించడం ద్వారా సామాజిక న్యాయంతోపాటు నైతిక విలువలకు పట్టం గట్టాలని నిర్ణయించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంస్కృతి, సంప్రదాయాలకు ఉన్న శక్తి, సామర్థ్యాలను గుర్తెరిగి సరైన ప్రాధాన్యత కల్పించాలి. సంస్కృతికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితులకు సరైన పరిష్కారాలను కనుగొనడం. అన్ని సభ్యదేశాల మధ్య సమయానుగుణంగా చర్చలు జరుపుతూ.. అందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకెళ్లడం. ఈ సమావేశంలో పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రులు.. ఆయా దేశాలకు ప్రతినిధులుగానే కాకుండా.. ఆయా దేశాలలో సాంస్కృతిక సంరక్షకులుగా ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణకు ఏకతాటిపైకి వచ్చి పని చేయాలి. రోమ్, బాలి డిక్లరేషన్లు ఈ దిశగా వేసిన బలమైన పునాదుల ఆధారంగా మరింత స్పష్టమైన విధానాలతో ముందుకెళ్లాలి.