ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలి
► సామ్రాజ్య విష సంస్కృతికి వ్యతిరేకంగా ఉద్యమించాలి
► హామీలను నెరవేర్చని చంద్రబాబు
► పీవైఎల్ జిల్లా మహాసభలో వక్తలు
టెక్కలి: సామ్రాజ్య వాద విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న యువతను అణగదొక్కేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి ఉద్యమాలు కొనసాగించాలని వివిధ ప్రజా సంఘాలకు చెందిన వక్తలు పిలుపునిచ్చారు. ప్రగతి శీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా ప్రథమ మహాసభను టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ కళాశాల ఆవరణలో ఆదివారం నిర్వహించారు. తొలుత పీవైఎల్ మహాసభల పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మానవ హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాథం మాట్లాడుతూ హిందూ మతోన్మాదం, కులోన్మాదం పెట్రేగిపోతున్నాయన్నారు.
విశ్వ విద్యాలయాల్లో సైతం విద్యార్థుల మధ్య చిచ్చు రేపుతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే మతోన్మాద శక్తులు మరింత బలపడ్డాయని ఆరోపించారు. యువతకు సరైన శాస్త్రీయ భావజాలం లేకుండా ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని పేర్కొన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పైల చంద్రమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో యువతకు ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారం రాగానే వారిని మోసగించే చర్యలు చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమాలకు యువత సిద్ధం కవాలని పిలుపునిచ్చారు. డీటీఎఫ్ రాష్ట్ర ప్రతినిధి కోత ధర్మారావు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు రాజ్యాంగ హక్కును తమ చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
సమాజంలో మార్పు కోసం యువత సన్మార్గంలో నడచి ఉద్యమాలు కొనసాగించాలన్నారు. పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు వంకల మాధవరావు మాట్లాడుతూ సామ్రాజ్య వాద విష సంస్కృతికి వ్యతిరేకంగా యువత పోరాటాలు చేయాలన్నారు. మహాసభలో పీఓడబ్ల్యూ ఉపాధ్యక్షురాలు పోతనపల్లి జయమ్మ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి కె.సోమేశ్వరరావు, ప్రతినిధులు రామారావు, పీడీఎస్‌యూ ప్రతినిధులు ఎం.వినోద్, పెంటయ్య, భాస్కరరావు, ఇంద్ర పాల్గొన్నారు.