వడగళ్ల బీభత్సం
రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడి న వడగళ్ల వానలు కురిశాయి. ఉదయం నుం చి తీవ్రంగా ఉన్న ఎండ సాయంత్రానికి ఒక్క సారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై గాలివానలు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు చోట్ల పంటలకు నష్టం కలుగగా.. కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. పిడుగుపాటుకు గురై జగి త్యాల జిల్లా లంబాడిపల్లికి చెందిన ఓ గొర్రెల కాపరి మృతి చెందాడు. ఉత్తర మధ్య కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్ప డడమే ఈ వర్షాలకు కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
కీసరలో భారీ నష్టం
వడగళ్లు, గాలివాన కారణంగా మేడ్చల్ జిల్లా కీసర మండలంలో పంటలు, తోటలకు భారీ నష్టం కలిగింది. మండలంలోని కీసర, బోగా రం, కీసరదాయర, రెడ్డిగూడెం, బర్షిగూడెం, చీర్యాల, యాద్గార్‌పల్లి తదితర గ్రామాల్లో వడగళ్లు, గాలివాన బీభత్సం సృష్టించాయి. దీంతో వంద ఎకరాల్లో వరి, 30 ఎకరాల్లో ద్రాక్ష, 50 ఎకరాల్లో మామిడి, మరో 50 ఎకరాల్లో కూరగాయల పంటలు, పలు పాలీహౌజ్ షెడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు రూ.2.5 కోట్ల వరకు పంట నష్టం కలిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇక బోగారం, కీసర, కీసరదాయర తదితర గ్రామాల్లో వందకు పైగా రేకుల ఇళ్లు దెబ్బతిన్నాయి.
నేడు కీసరలో బీజేపీ నేతల పర్యటన
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్లతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ , కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదనరెడ్డి తదితరులు మేడ్చల్ జిల్లాలోని కీసర మండలంలో పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలిస్తారని ప్రకటించింది.
విరుచుకుపడిన గాలివాన, వడగళ్లు
యాదాద్రి జిల్లా భువనగిరిలోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 1,500 క్వింటాళ్ల కందులు నీటిలో తడిసిపోయాయి. బీబీనగర్, బొమ్మల రామారం, భువనగిరి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బీబీనగర్‌లో 270 ఎకరాల్లో వరి, 8 ఎకరాల్లో మామిడికి నష్టం వాటిల్లింది. భువనగిరి మండలంలో 500 ఎకరాల వరిచేను నెలకొరిగింది. వలిగొండ మండలంలో పిడుగుపడి ఒక కొబ్బరిచెట్టు దగ్ధమైంది. ఇక కరీంనగర్ జిల్లా మానకొం డూర్, రామడుగు, చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిశాయి. కరీంనగర్–జగిత్యాల ప్రధా న రహదారిపై దేశరాజ్‌పల్లి వద్ద పెద్ద చెట్టు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు చోట్ల స్తం భాలు ఒరిగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరా యం కలిగింది. ఇక పిడుగుపాటు కారణంగా జగి త్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లికి చెందిన గొర్రెల కాపరి కొండవేని మల్లయ్య (60) మృతి చెందాడు. మరో ఇద్దరితో కలసి గొర్రెలు మేపుతుండగా వర్షం రావడంతో.. ముగ్గురూ ఓ చెట్టు కింద కూర్చు కున్నారు. వారిలో మల్లయ్యపై పిడుగుపడి, అక్కడికక్కడే మరణించాడు. మిగతా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
మరో నాలుగు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశముం దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న వెల్లడించారు. ఉత్తర మధ్య కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ సీజన్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురవడం సహజమేనని.. ఉదయం నుంచి బాగా ఎండగా ఉండి, సాయంత్రం మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కాగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గత 24
గంటల్లో హైదరాబాద్ శివార్లలోని హకీంపేటలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.