హైదరాబాద్ శివార్లలో భారీ వర్షం
- ఉరుములు, మెరుపులతో వాన
- పలు చోట్ల విరిగి పడిన చెట్ల కొమ్మలు, హోర్డింగులు
- విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం హైదరాబాద్ శివార్లలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఈదురుగాలులు బలంగా వీయడంతో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. హోర్డింగులు దెబ్బతిన్నాయి. తీగలు తెగిపడి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన అధికారులు మరమ్మతులు చేపట్టి.. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇక భారీ వర్షం కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
నేడు కూడా పలు చోట్ల వర్షాలు
బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరు ములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. కాగా మంగళవారం ఆదిలాబాద్‌లో 42 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, మెదక్‌లలో 41 డిగ్రీల చొప్పున, మహబూబ్‌నగర్‌లో 40, హైదరాబాద్‌లో 39.5, రామగుండంలో 39 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.