Hyderabad Meteorological Centre
-
ఈసారి మంటలే.. మించిపోనున్న వేసవి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఎండలు మండిపోనున్నాయి. వడగాడ్పులూ తీవ్రరూపం దాల్చనున్నాయి. ఈ వేసవి సీజన్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు 2025 మార్చి నుంచి మే నెల వరకు వేసవి సీజన్‌కు సంబంధించిన అంచనాలను శనివారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఈ ఎండాకాలంలో వరుసగా ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. సాధారణంగా వేసవిలో నాలుగైదు రోజుల పాటు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం, తర్వాత సాధారణ స్థాయికి తగ్గడం వంటివి జరుగుతాయి. కానీ ఈసారి వరుసగా ఎక్కువ రోజులు ఎండలు మండిపోతాయని, దానితో వడగాడ్పులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా వడగాడ్పులు ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మధ్య వరకు ఉంటాయని, కానీ ఈసారి మార్చి నెలలోనే ఈ పరిస్థితి కనిపించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. విభిన్నంగా వాతావరణం.. వేసవి సీజన్లో ఉష్ణోగ్రతల తీరు ఎప్పుడూ కూడా.. అంతకు ముందు వర్షాలు, శీతాకాల వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత వానాకాలంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినా.. కృష్ణా పరీవాహకంలో అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటు కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనా.. చాలా ప్రాంతాల్లో లోటు ఉండటం గమనార్హం. ఇక చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గినా.. గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగా నమోదయ్యాయి. అంతేకాదు సగటున చూస్తే ఈసారి జనవరి, ఫిబ్రవరి నెలలు అత్యధిక వేడిమి నెలలుగా నిలుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. లానినా బలహీనపడటంతో.. పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఏర్పడిన లానినా బలహీనంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. దీనితో ముందస్తు వేసవిని ఆహ్వానించినట్టు అయిందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే జనవరి, ఫిబ్రవరి నెలల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదైనట్టు చెబుతున్నారు. మరోవైపు హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయని పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో లానినా పరిస్థితులు మరింత బలహీనపడతాయని, అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలలో వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 125 ఏళ్ల రికార్డులు దాటేయొచ్చు! రాష్ట్రంలో గతేడాది జగిత్యాల, నల్లగొండ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈసారి అంతకంటే అధికంగా నమోదవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 1901 నుంచి 2025 వరకు గత 125 సంవత్సరాల కాలంలో సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుంటే... 2025 వేసవిలో ఎక్కువ సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
TS: పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న ద్రోణి గురువారం బలహీనపడిందని... దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో గద్వాల జిల్లా జూరాలలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా ఖిలా ఘన్‌పూర్‌లో 4, నల్లగొండ జిల్లా దేవరకొండలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కొమురం భీం జిల్లా కుంచవెల్లిలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
మరో రెండ్రోజులు ఉక్కపోతే..
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులపాటు రాష్ట్రంలో సాధారణం కంటే ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య, గ్రేటర్ హైదరాబాద్ సమీప జిల్లాల్లో మాత్రం 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు సూచించింది. కాగా, ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నల్లగొండ జిల్లా నిడమనూరులో 46.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే...గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 42.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 24.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉపరితలద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు మరోవైపు విదర్భ నుంచి తెలంగాణ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితలద్రోణి ఏర్పడిందని ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సూచించింది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు ప్రాంతం జిల్లా గరిష్ట ఉష్ణోగ్రత నిడమనూరు నల్లగొండ 46.1 దామెరచర్ల నల్లగొండ 45.6 బయ్యారం మహబుబాబాద్ 45.5 తంగుల కరీంనగర్ 45.5 కేతెపల్లి నల్లగొండ 45.3 రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లో) కేంద్రం గరిష్టం కనిష్టం ఖమ్మం 42.4 30.0 భద్రాచలం 42.2 28.0 నల్లగొండ 42.2 24.8 ఆదిలాబాద్ 41.5 26.2 రామగుండం 41.4 25.0 హనుమకొండ 41.0 25.0 నిజామాబాద్ 40.9 29.5 మెదక్ 40.6 24.0 మహబూబ్‌నగర్ 40.5 28.5 హైదరాబాద్ 39.4 26.6 దుండిగల్ 38.5 24.9 హకీంపేట్ 37.5 23.9 -
తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్‌పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా చాప్రాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై ముగ్గురు మృతిచెందారు. వారిలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లాలో ఒక ఉపాధి కూలీ ఉన్నారు. ఎండల తీవ్రతకు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండ వేడి కారణంగా అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. వరి కోత యంత్రాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ధాన్యం రాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని, మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు తెలిపింది. వేసవి ప్రణాళిక అమలులో నిర్లక్ష్యం... ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వేసవి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని విపత్తు నిర్వహణ శాఖ ఆదేశించినా సంబంధిత శాఖలు మాత్రం దీనిపై పెద్దగా దృష్టిపెట్టడంలేదన్న ఆరోపణలున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి, ఆశ వర్కర్లు, పారామెడికల్ సిబ్బందికి ఎండల తీవ్రత నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కల్పించడంతోపాటు వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇవేవీ పెద్దగా అమలు కావట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. వడదెబ్బ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను పట్టించుకొనే పరిస్థితి కనిపించట్లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం దాదాపు ఎక్కడా అమలుకావడంలేదని ప్రజలు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు పనిచేసే చోట షెల్టర్లు కట్టించాలన్న నిబంధన కాగితాలకే పరిమితమైంది. కార్మికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు ఉల్లంఘిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. ఎంత ఎండకు ఏ అలర్ట్? ► రెడ్ అలర్ట్ (సాధారణం కంటే 6 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులు ఉంటే జారీ చేసేది) ► ఆరెంజ్ అలర్ట్ (సాధారణం కంటే 4–5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే) ► ఎల్లో అలర్ట్ (హీట్‌వేవ్ వార్నింగ్. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కాస్త ఎక్కువ నమోదైతే) ► వైట్ అలర్ట్ (సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే జారీ చేసేది) ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ► తరచూ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీళ్ల సీసాను వెంట తీసుకెళ్లాలి. ► తెలుపు, లేతవర్ణంగల పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. ► తలకు వేడి తగలకుండా టోపీ లేదా రుమాలు చుట్టుకోవాలి. ► వడదెబ్బ తగిలిన వారిని నీడలో ఉంచాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడిగుడ్డతో తుడవాలి. ► ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. ► వడగాడ్పులు వీస్తుంటే భవన నిర్మాణ కార్మికులకు యాజమాన్యాలు నీడ కల్పించాలి. తాగునీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ► ఉపాధి హామీ కూలీలకు పనిచేసే చోట టెంట్లు ఏర్పాటు చేయాలి. నీటి వసతి కల్పించాలి. ► బస్టాండ్లలో, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో తాగునీరు అందుబాటులో ఉంచాలి. -
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
-
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు మరిన్ని వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దక్షిణ ఝార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు చెప్పారు. ఈ రోజు అనేక చోట్ల మరియు రేపు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రేపు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. (ఆఖరి నిమిషంలో ఆశలు ‘గల్లంతు’) హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద వర్షాలతో 513.64 మీటర్లకు చేరిన నీటిమట్టం 24 గంటల పాటు వరద పరిస్థితిని పరిశీలిస్తున్న అధికారులు నగరంలో నిరంతరం పనిచేస్తున్న మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ -
కొనసాగుతున్న రుతుపవనాల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాల విస్తరణ కొనసాగుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, డయ్యూలలోని మొత్తం ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్లలో మిగిలిన ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి సోమవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల్లోకి మరో 48 గంటల్లో రుతు పవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. దీంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
తెలంగాణలో ‘తొలకరి’ ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతాంగం వానాకాలం సాగు కోసం పొలం బాట పడుతోంది. రుతుపవనాల ప్రవేశానికి ముందే తొలకరి జల్లులతో ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయనే ఆశలు రైతుల్లో చిగురిస్తున్నాయి. సాగుకు వీలుగా భూమిని చదును చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగంలో ఈ తొలకరి జల్లులు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే ఏరువాకతో దుక్కి దున్ని, గొర్లు సిద్ధం చేసుకుని, నార్లు పోసుకునేందుకు సిద్ధంగా ఉన్న కర్షకుడు.. గత రెండ్రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలు మరో 3, 4 రోజులు కొనసాగితే ఇక పూర్తిస్థాయిలో పొలం బాట పట్టనున్నాడు. బుధ వారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగుతాయని, గురువారం 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భువనగిరిలో అత్యధికం.. బుధవారం రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైందని వాతావరణ గణాంకాలు వెల్లడించాయి. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అత్యధికంగా 16.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, వరంగల్ (అర్బన్, రూరల్), యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జనగామ జిల్లాల్లో ఒకట్రెండుచోట్ల గురువారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. యాదాద్రి జిల్లా భువనగిరిలో అత్యధికంగా కురిసిన వర్షపాతం - 16.9 సెం.మీ. నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే జిల్లాల సంఖ్య -12 రుతుపవనాల విస్తరణ తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, త్రిపుర మిజోరంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు బుధవారం విస్తరించాయి. మధ్య అరేబియా సముద్రం, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మరికొన్ని ప్రాంతాల్లోకి వచ్చే 48 గంటల్లో విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాతి 48 గంటల్లో మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, బంగాళాఖాతం, ఈశాన్య భారతదేశంలో మిగిలిన ప్రాంతాలు, సిక్కింలోని మొత్తం ప్రాంతాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. కొనసాగుతున్న అల్పపీడనం తూర్పు, మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ ఎత్తు వరకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది 48 గంటల్లో పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని, దీని కారణంగానే రాష్ట్రానికి వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం అత్యధిక వర్షపాతం (సెం.మీ.) నమోదైన ప్రాంతాలు జిల్లా గ్రామం/పట్టణం వర్షపాతం యాదాద్రి భువనగిరి 16.9 యాదాద్రి మర్యాల 13.7 ఆదిలాబాద్ పోచర 11.8 యాదాద్రి వెంకిర్యాల 10.5 ఖమ్మం మధిర 9.3 యాదాద్రి యాదగిరిగుట్ట 8.85 ఖమ్మం ఎర్రుపాలెం 8.85 వరంగల్ అర్బన్ కాశీబుగ్గ 8.75 (రంగారెడ్డి, వరంగల్ (అర్బన్/రూరల్ జిల్లాలు), సిద్దిపేట, యాదాద్రి, ఖమ్మం,నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 7 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది) -
రెండ్రోజుల్లో ‘నైరుతి’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి వచ్చే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని మంగళవారం వివరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశముందని తెలిపింది. ఇటు ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రెండ్రోజుల పాటు కురిసే అవకాశముందని పేర్కొం ది. బుధవారం మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గురువారం కూడా ఒకట్రెం డుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం వివరించింది. -
తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశం సమీపిస్తున్న వేళ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురుస్తాయని, అలాగే బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని ప్రాంతాల్లో మధ్యస్థ ట్రోపోస్పీయర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి మరో 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని వివరించింది. మధ్య అరేబియా సముద్రం, గోవా, కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమలో మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కోస్తా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు, మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనికి నైరుతి రుతుపవనాలు రెండ్రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని, తర్వాతి ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సోమవారం నాటి ఉష్ణోగ్రతలు: పట్టణం/ నగరం ఉష్ణోగ్రత ఆదిలాబాద్ 39.3 భద్రాచలం 39.2 హన్మకొండ 38.5 హైదరాబాద్ 37.5 ఖమ్మం 40.2 మహబూబ్‌నగర్ 35.4 మెదక్ 37.6 నల్లగొండ 39.5 నిజామాబాద్ 38.4 రామగుండం 39.6 -
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం
-
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల వాతావరణం చల్లబడి.. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, మలక్‌పేట్, సంతోష్‌నగర్, అబిడ్స్, కోఠి, బంజారాహిల్స్, ఉప్పల్, ఘట్కేసర్, మోహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్, పంజాగుట్టలలో వర్షం కురుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరయిన జనాలు.. వర్షం పలకింపుతో వేసవితాపం నుంచి కాస్త ఉపశమనం పొందారు. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో.. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపు లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవ కాశం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీంతో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు... రాష్ట్రంపై భానుడి ప్రతాపం కాస్త తగ్గింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. శనివారం ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్, హన్మకొండ, రామగుండంలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
తెలంగాణ: రాగల 3 రోజుల్లో వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. దక్షిణ జార్ఖండ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు, ఇంటీరియర్ ఒరిస్సా నుంచి దక్షిణ చత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కీమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. దీంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అంతేగాక శుక్రవారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. -
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, నిజాంపేట్, కేపీహెచ్‌బీ, సికింద్రాబాద్, కంటోన్మెంట్, కూకట్పల్లి, మూసాపేట్, ఈసీఐఎల్, అల్వాల్, బొల్లారం, పాతబస్తీ, రాజేంద్రనగర్, నాగారం, జవహార్ నగర్, కీసరలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ దానిని అనకుని ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో అక్కడక్కడ 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, ఖమ్మం, జనగామ, యాదాద్రి భువనగిరి, మెహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్ వనపర్తి, మెహబూబాబాద్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంని పేర్కొంది. -
రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: కోమోరిన్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడటంతోపాటు ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో శనివా రం పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు పేర్కొన్నారు. తేమ గాలుల కారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో నిజామాబాద్‌లో 7.3 డిగ్రీలు అధికంగా 21.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 6.2 డిగ్రీలు అధికంగా 20.6 డిగ్రీలు, నల్లగొండలో 1.2 డిగ్రీలు తక్కువగా 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈశాన్యం నుంచి వచ్చే చలి గాలుల తీవ్రత భూమిని తాకే పరిస్థితి లేకపోవడంతో చలి అంతగా లేదని వివరించింది. -
రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు దగ్గర్లో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుండి గాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రానున్న మూడురోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 8 డిగ్రీలు అధికంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 7.6 డిగ్రీలు ఎక్కువగా 23 డిగ్రీలు, భద్రాచలంలో 7.5 డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.1 డిగ్రీలు తక్కువగా 19 డిగ్రీలుగా రికార్డయింది. అక్కడ పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.1 డిగ్రీలు తక్కువగా 28.4 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 3 డిగ్రీలు తక్కువగా 27.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ శ్రీలంక తీరం దగ్గరలోని హిందూ మహాసముద్రం నుంచి ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఉన్న నైరుతి బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి చలి గాలులు వీస్తాయని పేర్కొంది. -
పండుగపూట తడిసి ముద్దయిన నగరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు వీడటంలేదు. వరుస వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో బతుకమ్మ ఉత్సవాలకు అనేకచోట్ల ఆటంకం కలిగింది. ఈ వర్షాల కారణంగా పలు పంటలపై వ్యతిరేక ప్రభా వం చూపే పరిస్థితి కనిపిస్తుంది. పత్తి కాయ పగిలే దశలో ఉన్నందున నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇంటీరియర్ ఒడిశ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో సోమవారం కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఒకట్రెండుచోట్ల భారీవర్షాలతోపాటు, చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. నగరంలో 10 సెంటీమీటర్ల వర్షం రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరం వరుస వర్షాలతో నిండా మునుగుతోంది. ఆదివారం క్యుములోనింబస్ మేఘాల కారణంగా నగరంలో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం మధ్యా హ్నం నుంచి హైదరాబాద్‌లోని కూకట్పల్లి మండ లం రాజీవ్‌గృహకల్ప, జగద్గిరిగుట్ట ప్రాంతా ల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుతు్బల్లాపూర్ మండలం గాజులరామారం, ఉషోదయపార్కు వద్ద 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక షాపూర్‌నగర్‌లో 8.5, సుభాష్‌నగర్, ఆలి్వ న్ కాలనీలలో 7, అంబర్‌పేట, రామంతాపూర్‌లలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోని వందకుపైగా బస్తీలు నీటమునిగాయి. ప్రధాన రహదారులపై ఉన్న భారీ వృక్షాలు కుప్పకూలడంతో వాటి కింద పార్కింగ్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటిని తోడేందుకు పలు బస్తీల వాసులు నానా అవస్థలు పడ్డారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టాయి. పలు నాలాలు ఉగ్రరూపం దాల్చడంతో వాటికి ఆనుకుని ఉన్న బస్తీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇంట్లోకి చేరిన నీటిలో మునిగి వ్యక్తి మృతి బొల్లారం: తిరుమలగిరిలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం ఓ వ్యక్తి ప్రాణాలను హరించింది. ఇక్కడి శాస్త్రీనగర్‌లోని నాలా ఉప్పొంగి దానికి ఆనుకొని ఉన్న ఇంట్లోకి ప్రవహించడంతో నిద్రలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం మేరకు శాస్త్రీనగర్‌కు చెందిన జగదీశ్(35), తల్లితో కలిసి గత రెండేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తల్లి బాయమ్మ స్థానిక చర్చితో పాటు పలు చర్చిల వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం జగదీశ్ ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఇదే సమయంలో భారీగా వర్షం కురవడంతో అతని ఇల్లు కూడా నాలా వెంట ఉండడంతో వరద నీళ్లు ఉప్పొంగి వారి ఇంట్లోకి ప్రవేశించాయి. గాఢ నిద్రలో ఉన్న జగదీశ్ ఈ విషయం తెల్సుకునేలోపే ఊపిరందనిస్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోయాడు. వర్షం తగ్గిన తరువాత ఇంట్లోని గడప వద్ద పడివున్న జగదీశ్ మృతదేహాన్ని స్థానికులు గమనించి తల్లికి విషయాన్ని చేరవేశారు.విగతజీవుడిగా ఉన్న కుమారుడిని చూసి తల్లి కుప్పకూలింది. కాగా అతనికి మూర్ఛవ్యాధి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బస్తీవాసులతో పాటు బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ, టీఆర్ఎస్ ఏడోవార్డు అధ్యక్షుడు కేబీశంకర్‌రావు ఆర్థిక సాయం చేయడంతో జగదీశ్‌కు అంత్యక్రియలు జరిపారు. -
రానున్న మూడ్రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: వర్ని (నిజామాబాద్) 6 సెం.మీ., కోటగిరి (నిజామాబాద్) 5 సెం.మీ., బెజ్జూరు (కొమురం భీం) 4 సెం.మీ., గాంధారి (కామారెడ్డి) 4 సెం.మీ., జుక్కల్ (కామారెడ్డి) 3 సెం.మీ., లింగంపేట్(కామారెడ్డి) 3 సెం.మీ., మద్నూర్ (కామారెడ్డి) 3 సెం.మీ., నిజామాబాద్ 3 సెం.మీ, అశ్వారావుపేట్లలో (భద్రాద్రి కొత్తగూడెం) 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు వానలు..
సాక్షి, హైదరాబాద్: రాగల మూడురోజులు రాష్ట్రంలో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో నేడు, రేపు ఒకటిరెండుచోట్ల, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటలలో ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం: సుల్తానాబాద్ (పెద్దపల్లి) 8 సెం.మీ, జోగిపేట్ (సంగారెడ్డి) 7 సెం.మీ, దుమ్ముగూడెం(భద్రాద్రి కొత్తగూడెం), పరకాల (వరంగల్ రూరల్), ఎంకూరు (ఖమ్మం), కరీంనగర్, దండెపల్లి (మంచిర్యాల), ఆర్మూర్ (నిజామాబాద్)లో 6 సెం.మీ, కొండాపూర్ (సంగారెడ్డి), నేరేడ్చర్ల (సూర్యాపేట్), నర్మెట్ట (జనగాం), కాళేశ్వరం (జయశంకర్ భూపాలపల్లి), పెద్దేముల్ (వికారాబాద్), నందిపేట్ (నిజామాబాద్)లలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: తూర్పు ఉత్తరప్రదేశ్, దాన్ని ఆనుకుని ఉన్న బిహార్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ.. ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంది. ఈ అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి కోస్తాంధ్ర వరకు ఒడిశా మీదుగా ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇక తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో వచ్చే రెండు రోజులు చాలాచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గురువారం ఒకట్రెండు చోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా బుధవారం సాయంత్రం రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మాచర్లలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. జగిత్యాల, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, జనగాం, కామారెడ్డి, మంచిర్యాల, నారాయణపేట, నిర్మల్, వరంగల్ రూరల్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. జోరుగా వరినాట్లు రాష్ట్రంలో వరి నాట్లు జోరుగా పడుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. ఈ ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.83 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 19.47 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గత వారంతో చూస్తే దాదాపు 5 లక్షల ఎకరాల వరినాట్లు అధికంగా పడినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడించింది. రానున్న వారం పది రోజుల్లో వంద శాతం అంచనాలు దాటి వరినాట్లు పడతాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
వచ్చేస్తోంది జల‘సాగరం’
సాక్షి, హైదరాబాద్: పదిహేను రోజులుగా ఎగువన కురుస్తున్న కుంభవృష్టితో కృష్ణానదికి భారీ వరదలొస్తున్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో 3, 4 రోజులుగా రోజుకు సగటున 25 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తుండడంతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో మరో రెండు, మూడ్రోజుల్లో శ్రీశైలం నిండనుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ)కు నీటిని విడుదల చేస్తారు. సాగర్‌కు నీరు త్వరలోనే వస్తోందనే వార్తతో పరీవాహక ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సకాలంలో కురవని వర్షాలు, సాగర్‌లో అడుగంటిన నీటి మట్టాలతో జూన్, జూలైలో ఖరీఫ్ డీలాపడగా.. ఇకపై పుంజు కోనుంది. ఇప్పటికే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా 82వేల క్యూసెక్కుల నీటిని వినియోగి స్తుండగా.. సాగర్‌కు 74వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 135 టీఎంసీల నీరుంది. శ్రీశైలంకు డబుల్ వరద కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి భారీగా వరద కిందకు వదులుతున్నారు. దీనికితోడు మహారాష్ట్ర లో భీమానదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు సైతం పూర్తిస్థాయిలో నిండి అక్కడి నుంచి 1.25లక్షల క్యూసెక్కులకు పైగా భారీ ప్రవాహాలు దిగువకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దిక్కుల నుంచి ఉధృతంగా వస్తున్న వరదలతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోనుంది. గురువా రం నుంచి 5లక్షల క్యూసెక్కుల మేర వరద ఈ ప్రాజెక్టులోకి చేరే అవకాశముంది. 2 రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోనుంది. మరో 59 టీఎంసీలు నిండితే.. ఎగువన వర్షాలతో మరింత వరద వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి నిల్వలను ఖాళీ చేయాలని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ఆల్మట్టిలో 90టీఎంసీల మేర మాత్రమే ఉంచి 4లక్షల క్యూసెక్కులు, నారాయణ పూర్లో 22 టీఎంసీలు మాత్రమే ఉంచి 4.64 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. ఈ నీరంతా జూరాలకు వస్తోంది. ప్రస్తుతం జూరాలకు 3.25లక్షల క్యూసెక్కుల వరద నమోదవుతుండగా, 3.47లక్షల క్యూసె క్కుల నీటి ని శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి బుధవారం ఏకంగా 2.81 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 215.8టీఎంసీలకుగానూ 156 టీఎంసీల నీరు చేరింది. శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయానికల్లా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందని నీటిపారుదల అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 17 సెం.మీ. కుండపోత వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాష్ట్రంలోని జయశంకర్ భూపాల్పల్లి, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. తాగునీటికి పక్కనపెట్టి.. మిగతాది సాగుకు ఏఎమ్మార్పీ కింద, హైదరాబాద్ జంట నగరాలకు, మిషన్ భగీరథ, నల్లగొండ జిల్లా తాగు అవసరాలకై సాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన కనిష్టంగా 30 టీఎంసీల మేర నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు విడుదలయ్యే అవకాశం ఉంది. రేపు కృష్ణా బోర్డు సమావేశం శ్రీశైలం, సాగర్‌లో ఉన్న లభ్యత జలాలు, వాటి పంపకంపై చర్చించేందుకు ఈ నెల9న కృష్ణా బోర్డు భేటీ కానుంది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లు హాజరుకానున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలు తమ తమ అవసరాలపై చర్చించనున్నాయి. ఇందులోనే సాగర్ కింది తాగు, సాగు అవసరాలపై చర్చ జరగనుంది. -
రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు శుక్రవారం పశ్చిమ రాజస్తాన్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించడంతో మొత్తం భారతదేశం అంతా విస్తరించాయని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: దేవరకొండ (నల్లగొండ) 7 సెం.మీ., కొత్తగూడ (మహబూబాబాద్) 6 సెం.మీ., లక్ష్మణ్‌చాంద (నిర్మల్) 5 సెం.మీ., మద్దూర్ (మహబూబ్‌నగర్) 5 సెం.మీ., అల్లాదుర్గ్ (మెదక్) 4 సెం.మీ., శాయంపేట (వరంగల్ రూరల్) 4 సెం.మీ., తాండూర్ (వికారాబాద్) 4 సెం.మీ., మగనూర్ (మహబూబ్‌నగర్) 3 సెం.మీ., నిడమనూర్ (నల్లగొండ) 3 సెం.మీ., ఆత్మకూర్ (వరంగల్ రూరల్) 3 సెం.మీ., కెరిమెరి (కొమురం భీం) 3 సెం.మీ., మునిపల్లి (సంగారెడ్డి) 3 సెం.మీ., పోచంపల్లి 3 సెం.మీ., బూర్గంపాడు 3 సెం.మీ., భద్రాచలంలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది తీవ్రంగా మారి రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో సోమవారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అనేక చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మంగళవారం కొన్నిచోట్ల భారీ వర్షాలతోపాటు ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. గత 24 గంటల్లో దుండిగల్‌లో 6 సెంటీమీటర్లు, గజ్వేల్, బజర్హతనూర్, తూప్రాన్లలో 5 సెంటీమీటర్ల చొప్పున, ధర్మసాగర్, నర్మెట్ట, వర్నిలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్‌లో 11 శాతం అధిక వర్షపాతం జూన్‌లో హైదరాబాద్‌లో 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ నెల రోజుల్లో 105.6 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షం కురవాల్సి ఉండగా 116.9 ఎంఎం కురిసింది. కరీంనగర్ జిల్లాలో ఆరు శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల రోజుల్లో రాష్ట్రంలో సరాసరి 132 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా 86.2 ఎంఎం కురిసింది. ఖమ్మం జిల్లాలో మాత్రం ఏకంగా 73 శాతం లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం. జిల్లాలో గత నెల రోజుల్లో సాధారణంగా 130.5 ఎంఎం మేర వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 35.2 ఎం.ఎం. మాత్రమే నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో 3.1 కి.మీ. నుంచి 3.6 కి.మీ. మధ్య ఉపరితల ఆవర్తనం కోనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కొమురం భీం, సంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో నమోదైన వర్షపాతం మక్లూర్ (నిజామాబాద్) 11 సెం.మీ., దిలావర్పూర్ (నిర్మల్) 10 సెం.మీ., పిట్లం (కామారెడ్డి) 8 సెం.మీ., జైనూర్ (కొముం భీం) 7 సెం.మీ., కోహిర్ (సంగారెడ్డి) 7 సెం.మీ., సిర్పూర్(కొమురం భీం) 7 సెం.మీ., లింగంపేట్ (కామారెడ్డి) 6 సెం.మీ., నేకల్ (సంగారెడ్డి) 6 సెం.మీ., ఆర్మూర్ (నిజామాబాద్) 6 సెం.మీ., ఎడపల్లి (నిజామాబాద్) 6 సెం.మీ., జక్రాన్‌పల్లి (నిజామాబాద్) 5 సెం.మీ., నిజామాబాద్ 5 సెం.మీ., నిర్మల్ 5 సెం.మీ., కెరిమెరి (కొమురం భీం) 5 సెం.మీ., దండెపల్లి (మంచిర్యాల) 4 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
చురుగ్గా రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాజస్తాన్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా తూర్పు పశ్చిమ బంగాళాఖాతం వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించిందని వివరించింది. అలాగే ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. రుతుపవనాలు, ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వచ్చే 3 రోజులు చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూలు, మహబూబాబాద్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. కాగజ్‌నగర్, సిర్పూరు, పాలకుర్తిలో 4 సెంటీమీటర్లు.. ఆలంపూర్, నర్సంపేట్, జైనూర్, ఉట్నూరు, పినపాక, జఫర్‌గఢ్, వంకిడిలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. రుతుపవనాలు ప్రవేశించడం, వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. అనేకచోట్ల సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా 28 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హకీంపేట, హన్మకొండల్లో సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాష్ట్రంలోకి రుతుపవనాలు
-
రెండ్రోజుల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు. రుతుపవనాలకు ముందు వచ్చే వర్షాలు రాష్ట్రంలో మొదలైనట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయని, పెద్దపల్లి జిల్లా భోజన్నపేటలో 13.7 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసిందని ఆయన తెలిపారు. కునూరులో 12.3 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా రేగొండ, కొత్తపల్లి గోరిలలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. కమాన్‌పూర్‌లో 8.8, భూపాలపల్లి, జనగాం జిల్లా రఘునాథపల్లిలో 8.7 సెంటీమీటర్ల చొప్పున వర్ష పాతం రికార్డు అయ్యింది. పెద్ద పల్లి జిల్లా శ్రీరాంపూర్ లో 8.3 సెంటీమీటర్లు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ములుగు జిల్లా మల్లంపల్లి లో 7.8 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వైకేరెడ్డి తెలిపారు . పెద్దపల్లి జిల్లా కనుకులలో 7.4, భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 7.1, ఖమ్మం జిల్లా లింగాల, వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో 6.9, వరంగల్ అర్బన్ జిల్లా మర్రిపల్లిగూడెంలో 6.8, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 6.5, మల్లారంలో 6.4, కరీంనగర్ జిల్లా చింతకుంటలో 6.2 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. -
22 లేదా 23న నైరుతి..
సాక్షి, హైదరాబాద్ : ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న రుతుపవనాలు త్వరలోనే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాల ఆగమనానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయని, ఈ నెల 22 లేదా 23వ తేదీల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. కేరళలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయని, తమిళనాడులోనూ దాదాపు మొత్తం విస్తరించే దశలో ఉన్నాయని, ఇప్పుడు కర్ణాటకలో విస్తరిస్తున్నాయని ఆయన తెలిపారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయన్నారు. అక్కడకు వచ్చిన మరుసటి రోజు తెలంగాణలోకి వస్తాయన్నారు. ఇదిలావుండగా వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయన్నారు. రైతన్నల ఎదురుచూపులు... రాష్ట్రంలో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ నెల 8వ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అనుకున్నారు. కానీ పలు కారణాలతో 8న రుతుపవనాలు రాలేదు. తర్వాత ఆ తేదీ నుంచి 11, 13, 16, 18 లేదా 19 తేదీలన్నారు. చివరకు ఈ నెల 22, 23 తేదీల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈసారి తప్పనిసరిగా వస్తాయని, అత్యంత సానుకూల వాతావరణ నెలకొందని అంటున్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో వాతావరణం చాలా వరకు చల్లబడింది. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 39, హన్మకొండ, మహబూబ్‌నగర్, రామగుండంలో 38 డిగ్రీల చొప్పున నమోదైంది. హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. -
రుతుపవనాలు మరింత ఆలస్యం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోకి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తొలుత ఈనెల 8న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ప్రకటించారు. అనంతరం 11న అని ఓసారి, 13న అని మరోసారి, చివరకు 16న వస్తాయని ఇంకోసారి పేర్కొన్నారు. తాజాగా అవి 18న వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడటంతో రుతుపవనాలు వెనక్కి వెళ్లిపోయాయని అధికారులు చెబుతున్నారు. తుఫాను వెళ్లిపోయినా, వాతావరణంలో ఇంకా అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో రుతుపవనాలు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. తగ్గని వడగాడ్పులు... రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఏప్రిల్‌లో మొదలైన వడగాడ్పులు జూన్ రెండో వారంలోకి వచ్చినా తగ్గడంలేదు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వేసవిలో ఇప్పటివరకు 36 వడగాల్పుల రోజులు నమోదయ్యాయి. గత దశాబ్దంలో ఇంతటి పరిస్థితి లేనే లేదు. మరో నాలుగు వడగాల్పుల రోజులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
నైరుతి.. నత్తనడక
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు మందకొడిగా సాగుతున్నాయి. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడి గాలిలోని తేమ అటువైపు వెళ్తుండటంతో రుతుపవనాలు మందకొడిగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించే అవకాశముందన్నారు. ఈ నెల 16 నాటికి తెలంగాణలోకి ప్రవేశిస్తాయని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల 44 డిగ్రీ వరకూ నమోదు కావడం గమనార్హం. సాధారణం కంటే మూడు నుంచి ఏడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ముందు ప్రకటించినట్లుగా ఈ నెల 6న కేరళలోకి, 11న తెలంగాణలోకి ప్రవేశించాలి. కానీ రెండ్రోజులు ఆలస్యంగా అంటే ఈ నెల 8న కేరళలోకి ప్రవేశించాయి. అనంతరం 13న తెలంగాణలోకి ప్రవేశిస్తాయని తర్వాత ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా మారుతోంది. పోనీ ఈ నెల 16వ తేదీనైనా కచ్చితంగా వస్తాయా? లేదా? అన్న అనుమానాలను కొందరు వాతావరణ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంతో పోలిస్తే ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ ప్రకారం సాధారణ నైరుతి సీజన్ వర్షపాతం 755 మిల్లీమీటర్లు (ఎంఎం) కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది. గతేడాది జూన్ 8నే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. కానీ ఇప్పుడు మరింత ఆలస్యం కావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఖరీఫ్ సాగుపై ఆందోళన... నైరుతి రుతుపవనాలు ఇంకా కేరళ దాటి పైకి రాలేదు. తెలంగాణలోకి ఎప్పుడు వస్తాయో స్పష్టత రావడంలేదు. ఈపాటికి రుతువపనాలు వచ్చి వర్షాలు కురిస్తేనే రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసే పరిస్థితి ఉంటుంది. కానీ వేడి సెగలు కక్కుతుండటం, వర్షాలు లేకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడుతుండటంతో కొందరు రైతులు ఇవే రుతుపవనాల వర్షాలుగా భావించి దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. కానీ అధిక ఉష్ణోగ్రతలతో అవి భూమిలోనే మాడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే సూచనలున్నాయి. గతేడాది 1.03 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయితే, ఈసారి అదనంగా 7 లక్షల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేశారు. ఆ మేరకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశారు. కానీ వరుణుడు కరుణించకపోవడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉం టుందోనని రైతులను, వ్యవసాయాధికారులు ఆందో ళన చెందుతున్నారు. అనేకచోట్ల ఇప్పటికీ 40–45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్, రామగుండంలో 44, మెదక్, నిజామాబాద్‌లో 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక వేడితో భూమి సెగలు కక్కుతోంది. దుక్కి దున్నుతుంటే వేడి పైకి వస్తోందని రైతులు అంటున్నారు. ఉపరితల ఆవర్తనం.. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాగల మూడు రోజులు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. -
కేరళలో రుతుపవనాల విస్తరణ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ అరేబియా సముద్రం, లక్ష దీవులు, కేరళ ప్రాంతాలకు రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. అయితే ఆదివారంలో పలుచోట్ల సూర్యుడు మండిపోయాడు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, హన్మకొండ, ఖమ్మం, రామగుండంలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. నిజామాబాద్‌లో 42, నల్లగొండలో 41, మెదక్‌లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదు కాగా, మహబూబ్‌నగర్‌లో మాత్రం అత్యంత తక్కువగా 37 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39 డిగ్రీలు రికార్డయింది. -
నైరుతి రుతుపవనాల రాక.. కాస్త ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల రాక కాస్తంత ఆలస్యం అయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. కేరళలోకి గురువారం (నేడు) రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఇటీవల ప్రకటించగా, ఇప్పుడు 8వ తేదీన వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. అలాగే తెలంగాణలోకి ఈ నెల 11న వస్తాయని ఇటీవల అంచనా వేయగా, ఇప్పుడు 13వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఆయన వివరించారు. అయితే ఈ తేదీలకు రెండ్రోజులు అటూ ఇటూ తేడా ఉండొచ్చని పేర్కొన్నారు. వాస్తవంగా గతేడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాలు ఆలస్యమవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గత నెల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆలస్యం కావడం పట్ల రైతుల్లో ఆందోళన మొదలైంది. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 29వ తేదీనే కేరళను తాకాయి. ఆ తర్వాత జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించాయి. -
నేడు, రేపు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మరో రెండు రోజులు ఉత్తర తెలంగాణలో వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 44, నల్లగొండ, మెదక్‌లో 43 డిగ్రీలు, భద్రాచలం, ఖమ్మంలో 42 డిగ్రీలు, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో 41 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుండగా ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఫణి తుఫాను ఉత్తర దిశగా ప్రయాణించి ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఇది 12 గంటలలో తీవ్ర తుఫానుగాను, తదుపరి 24 గంటలలో అతి తీవ్ర తుఫానుగాను మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అనంతరం మే 1వ తేదీ సాయంత్రం వరకు వాయవ్య దిశగా ప్రయాణించి, తరువాత దిశ మార్చుకుని క్రమంగా ఉత్తర ఈశాన్య దిశ వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వచ్చే మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వడదెబ్బతో నలుగురు మృతి ధర్మపురి/వెల్గటూర్/కథలాపూర్/కోల్‌సిటీ: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడదెబ్బతో ఆదివారం ఒక్కరోజే నలుగురు మృత్యువాతపడ్డారు. వెల్గటూర్ మండలం ఎండపెల్లి గ్రామానికి చెందిన ముస్కు ఆదిరెడ్డి (80) వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామానికి చెందిన ముత్తునూరి శాంతమ్మ (58) వారం రోజుల క్రితం వడదెబ్బకు గురైంది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందింది. కథలాపూర్ మండలం పెగ్గెర్లలో వార్డు సభ్యుడు మామిడిపెల్లి గంగారెడ్డి(50) వడదెబ్బకుగురై సాయంత్రం మృతిచెందారు. అలాగే గోదావరిఖనిలో అనిల్‌కుమార్ షిండే (55) ఇంట్లో అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
నేడు, రేపు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నింపుల కుంపటిలో మగ్గుతోంది. తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. ఆది, సోమవారాల్లోనూ కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. నిర్మల్, ఆదిలాబాద్, కొమురంభీం, మంచి ర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించింది. శనివారం రాష్ట్రంలో అన్నిచోట్లా తీవ్రమైన ఎండలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, రామగుండం, నల్లగొండల్లో 44 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 43, భద్రాచలం, హన్మకొండ, ఖమ్మం, మెదక్‌లలో 42 డిగ్రీలు, హైదరాబాద్‌లో 41 డిగ్రీల వంతున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నేడు అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల హిందూ మహాసముద్రం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో శ్రీలంకకు ఆగ్నేయ దిశగా గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది 36 గంటలలో వాయుగుండంగా మారి శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు ప్రయాణించి, ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో గురువారం తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజారావు వెల్లడించారు. శుక్రవారం మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో 43 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 42 డిగ్రీలు, ఖమ్మం, హన్మకొండలలో 40 డిగ్రీలు, హైదరాబాద్, నల్లగొండలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మే రాకుండానే మంటలు
సాక్షి, హైదరాబాద్: ఇంకా మే నెల రానేలేదు. ఏప్రిల్ మధ్యలోనే ఉన్నాం. అయినా ఎండల తీవ్రతతో జనం గుండెలు ఆగిపోతున్నాయి. ప్రభుత్వానికి అందిన అనధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 మందికి పైగా మృతి చెందినట్లు అంచనా. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెల వచ్చాక ఎండల తీవ్రత, వడగాడ్పులు ఏ స్థాయిలో ఉంటాయోనని వాతావరణశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే.. రాష్ట్రంలో సాధారణం కంటే 2–4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో ఏకంగా 43 డిగ్రీల వంతున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మరోవైపు ఎండల ప్రభావం పంటలపై పడింది. వ్యవసాయశాఖ వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయినట్లు చెబుతున్నారు. అంతేగాక అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. ఎండలకు కూలీలు కూడా రావడంలేదు. మరోవైపు వరి కోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో అనేకచోట్ల ధాన్యం భూమి మీదే రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డేంజర్ జోన్లో తెలంగాణ దేశంలోనే అధికంగా వడగాడ్పులు వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉంది. ఫలితంగా రానున్న రోజుల్లో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాల్పులు వీస్తాయి. మే నెలలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. డేంజర్‌జోన్‌లో తెలంగాణ ఉండటంతో మరో 20 రోజుల వరకు వడగాడ్పులు తప్పవని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వేసవి ప్రణాళిక అమలే కీలకం వేసవి ప్రణాళికను విపత్తు నిర్వహణశాఖ తయారుచేసి కలెక్టర్లు, ఇతర అన్ని శాఖల అధికారులకు అందజేసింది. దాని ప్రకారం మొబైల్ ఫోన్లలో మెసేజ్‌లు, వాట్సాప్ తదితర పద్దతుల ద్వారా వడదెబ్బ, ఎండ వేడిమి హెచ్చరికలను ఎప్పటికప్పుడు జనానికి చేరవేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను కిందిస్థాయి అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం ఎక్కడా అమలుకావడంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయీడ్స్ అందుబాటులో ఉంచాలి. కానీ ఇవేవీ ఆచరణకు నోచుకోవడంలేదు. కార్మికులు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ఎండల తీవ్రత, జాగ్రత్తలపై విరివిగా కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతరత్రా సమాచారాన్ని ముద్రించి ఇవ్వాలని ఆదేశించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదు. నేడు రేపు అధిక ఉష్ణోగ్రతలు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పలుచోట్ల సాధారణం కంటే 2–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చంది. డయేరియా వచ్చే ప్రమాదం వేసవిలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు వడదెబ్బ, డయేరియా బారినపడే ప్రమాదముంది. కాబట్టి ఎండలకు వెళ్లకుండా చూసుకోవాలి. వెళ్లాల్సి వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వాంతులు, వీరోచనాలు వచ్చే ప్రమాదముంది. పిల్లలు, పెద్దలు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ నరహరి, పిల్లల వైద్య నిపుణులు, నీలోఫర్ ఈ జాగ్రత్తలు తప్పనిసరి - ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. - తెలుపు లేదా లేత రంగు పలుచటి కాటన్ దుస్తులు ధరించాలి. - తలకు వేడి తగలకుండా టోపీ రుమాలు కట్టుకోవాలి. - పలుచటి మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని తయారుచేసిన ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. - వడదెబ్బ తగిలిన వారిని నీడలో చల్లని ప్రదేశంలో ఉంచాలి. - శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. - వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. -
తెలంగాణపై ఉపరితల ద్రోణి
సాక్షి, హైదరాబాద్: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరట్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆదివారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. అలాగే సోమవారం అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఈదురుగాలుల కారణంగా అనేకచోట్ల మామిడి కాయలు పడిపోయే ప్రమాదం ఉందని ఉద్యానశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇదిలావుండగా శనివారం ఆదిలాబాద్‌లో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. అలాగే మెదక్, నిజామాబాద్, రామగుండంలలో 41 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్‌లలో 39 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాష్ట్రంలో మూడు నెలలు తీవ్రమైన ఎండలు
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్, మే, జూన్లలో రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారత వాతావరణ హెచ్చరికల కేంద్రం తాజా అంచనాలను బుధవారం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ హీట్ వేవ్ జోన్లో ఉందని హెచ్చరించింది. ప్రతి ప్రాంతంలో 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుందని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదు అవుతాయని హెచ్చరికలు జారీచేసింది. హైదరాబాద్‌లో 40, కొత్తగూడెం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇదిలా వుండగా బుధవారం ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ల్లో 41 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మెదక్‌లో 40 డిగ్రీలు నమోదైందని ఆయన వెల్లడించారు. -
రాష్ట్రంలో మండుతున్న ఎండలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మెదక్‌లో ఆదివారం పగటి ఉష్ణోగ్రత ఏకంగా 39 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంలలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డు అయింది. భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండల్లో 37 డిగ్రీల చొప్పున నమోదైంది. మరోవైపు ఇంటీరియర్ ఒడిశా నుంచి తూర్పు, మధ్య అరేబియా సముద్రం వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సహా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
బయట నుంచి రాగానే తేనె తినకండి
సాక్షి, హైదరాబాద్: మార్చి నెల రాకముందే ఎండ తీవ్రత పెరుగుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదవుతుండటంతో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం కొన్ని సూచనలతో కూడిన ప్రకటనను జారీ చేసింది. తల తిరగడం, తీవ్ర జ్వరం, మత్తు నిద్ర, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి వంటి వడదెబ్బ లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలని పేర్కొంది. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలని సూచించింది. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.. - తెలుపు రంగు పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి. - తలకు టోపి పెట్టుకోవాలి లేదా రుమాలు కట్టుకోవాలి. - ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు కలిపిన నీటిని, ఓరల్ రీ హైడ్రేషన్ కలిపిన నీటిని తాగాలి. - వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడ ఉన్న ప్రాంతానికి చేర్చాలి. - వడదెబ్బకు గురైన వారిని తడిగుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి. ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం అంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే లోపునకు వచ్చే వరకు బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఫ్యాను కింద ఉంచాలి. - వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానట్లయితే వారిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించాలి. - మంచినీరు ఎక్కువగా తాగాలి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నిమ్మరసం గానీ కొబ్బరినీరు లేదా చల్లని నీరు తాగాలి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి.. - నలుపురంగు, మందపాటి దుస్తులు ధరించరాదు. - మధ్యాహ్నం (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయవద్దు. - ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు. - శీతల పానీయాలు, మంచుముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుంది. రాష్ట్రంలో దంచికొట్టిన ఎండలు భద్రాచలం, మహబూబ్‌నగర్‌ల్లో 38 డిగ్రీలు నమోదు రాష్ట్రంలో ఎండలు దంచికొట్టాయి. శనివారం భద్రాచలం, మహబూబ్‌నగర్‌ల్లో ఏకంగా 38 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. ఇక ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండంల్లో 37 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే ఈ స్థాయిలో ఎండలున్నాయంటే మున్ముందు పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆదివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. -
రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణం
సాక్షి, హైదరాబాద్: మాల్దీవుల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆగ్నేయ దిశ నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఆది, సోమ, మంగళ వారాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. అలాగే రెండు రోజులుగా మెదక్ జిల్లాలో అత్యంత తక్కువ 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించింది -
రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం
సాక్షి, హైదరాబాద్: హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, ఉదయం సమయాల్లో పొగమంచు ఏర్పడే అవకాశముందన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 7 డిగ్రీలకు పడిపోయింది. రామగుండంలో 12, హకీంపేట, హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మహబూబ్‌నగర్‌లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏకంగా 9 డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీలు నమోదైంది. ఏడు డిగ్రీలు తక్కువగా భద్రాచలంలో 25, హన్మకొండలో 24, హైదరాబాద్‌లో 23 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
మబ్బే.. ముసురేసిందిలే..
సాక్షి, హైదరాబాద్: రోజంతా మబ్బు.. ఉదయమే చీకటైనట్లు.. రోజంతా సన్నగా వర్షం.. ఆకాశానికి లీకేజీ పడ్డట్లు.. రెండ్రోజులుగా రాష్ట్రంలో వర్షాలు.. వాటికి చలిగాలులు తోడవడంతో జనం గజగజలాడుతున్నారు. అటు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి.. ఇటు తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం.. దీంతో ఈ ఆవర్తనం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి బలహీన పడింది. వీటి ప్రభావాల కారణంగా తెలంగాణలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట జిల్లా నంగనూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లో పలుచోట్ల 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లోనూ 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో శనివారం సాయం త్రం నుంచి మొదలైన చిరు జల్లులు ఆదివారం కూడా కొనసాగాయి. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పగలు తగ్గి.. రాత్రి పెరిగి.. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోగా, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా 24 డిగ్రీలు నమోదైంది. అక్కడే పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు తగ్గి 28 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా 18 డిగ్రీలు నమోదు కాగా, పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీలు తక్కువగా 27 డిగ్రీలు రికార్డయింది. రామగుండంలో పగటి ఉష్ణోగ్రత 9 డిగ్రీలు తక్కువగా 22 డిగ్రీలు నమోదైంది. అక్కడ రాత్రి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఎక్కువగా 18 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్‌లోనూ పగటి ఉష్ణోగ్రత 8 డిగ్రీలు తక్కువగా 24 డిగ్రీలు నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 2 డిగ్రీలు ఎక్కువగా 18 డిగ్రీలు నమోదైంది. రబీ పంటలకు ఊతం.. ఈ వర్షాలకు రబీ పంటలతో మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. వరి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలకు ప్రయోజనం ఉం టుందని ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్ తెలి పారు. భూగర్భ జలాలు పెరిగి వరికి మరింత ఊతమిస్తుందని విశ్లేషించారు. రబీ సీజన్లో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 20.26 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. అందులో ఆహార పంటలు ఇప్పటివరకు 16.08 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.2 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మొక్కజొన్న 2.47 లక్షల ఎకరాల్లో సాగైంది. వేరుశనగ ఇప్పటివరకు 2.61 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పటివరకు రబీ సీజన్లో సాగు కాని చోట్ల ప్రస్తుత వర్షాలతో పుంజు కుంటుందని అధికారులు అంటున్నారు. తడిసిన ధాన్యం, మిర్చి.. రబీధాన్యం, మిర్చి పంటలు కొన్నిచోట్ల మార్కెట్లోకి వచ్చాయి. ముందు జాగ్రత్తలు తీసుకోని చోట్ల అక్కడక్కడ వరి, మిర్చి పంటలు తడిసిపోయాయని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఎంతమేరకు తడిసిందో ఇంకా సమాచారం రాలేదని అంటున్నారు. కొందరు రైతులు మార్కెట్లోనే ఉంచి పోవడంతో తడిసి ఉంటుందని పేర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో మిర్చిపంట దెబ్బతిన్నది. దుగ్గొండి, నర్సంపేట, పరకాల, దామెర, ఆత్మకూరు, భూపాలపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో మొత్తం ఆరు వేల ఎకరాల్లో చపాటా రకం మిరప పంట సాగుచేశారు. విదేశాలకు ఎగుమతి చేసే ఈ చపాటా రకం పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అక్కడక్కడా ఇటీవల వేసిన మొక్కజొన్న పంట నేల వాలిన ట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. పెద్దపల్లి మం డలం రాఘవాపూర్‌లో 8 మంది పెంపకందారులకు చెందిన 96 గొర్రెలు వర్షానికి మృత్యువాత పడటంతో వారికి లక్షల్లో ఆర్థిక నష్టం జరిగింది. -
మళ్లీ చలి పంజా
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో చలి మళ్లీ ఉధృతమైంది. పది రోజుల క్రితం పెథాయ్ తుపాను సందర్భంగా రాష్ట్రంపై పంజా విసిరిన చలిపులి.. మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు తీవ్రం కావడంతో జనం వణికిపోయారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 2013 డిసెంబర్ 9న 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తాజాగా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. మెదక్‌లో శుక్రవారం 6.8 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత.. శనివారం 5.8 డిగ్రీలకు పడిపోయింది. దక్షిణ కోస్తా ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారడంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌నూ చలి వణికిస్తోంది. శనివారం గ్రేటర్లో రికార్టు స్థాయిలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. 2010 డిసెంబర్ 21న 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, ఎనిమిదేళ్ల తర్వాత సాధారణం కన్నా ఐదు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. చల్లటి గాలులు వీస్తుండడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. స్వైన్‌ఫ్లూ మరింత విజృంభించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
చలి చంపేస్తోంది!
న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్: చలి గజగజ వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోసహా దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువకి పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా తెలంగాణ నుంచి ఒడిశా వరకు చలిగాలులు బలంగా వీస్తాయి. తెలంగాణ, ఏపీలలో పొడి వాతావరణం ఉండటం వల్ల ఆ గాలుల ప్రభావం తీవ్రంగా ఉండి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రతి ఏడాది ఇలా నాలుగైదుసార్లు జరుగుతుం ది. గతవారంలో పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తే, ఇప్పుడు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి దుప్పట్లో ఉత్తర భారతం ఉత్తరభారతం చలి గుప్పిట్లో చిక్కుకుంది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీసహా వాయవ్య భారతంలో వచ్చే రెండు మూడ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్‌కి చేరుకోవడంతో పంటలపై కూడా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఒకట్రెండు రోజుల్లో రెండు డిగ్రీలకు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడ్డకట్టిన దాల్ సరస్సు చలితో జమ్ము కశ్మీర్ వాసులు గజగజలాడుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత 11 ఏళ్లలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 6.8 డిగ్రీలకు పడిపోయాయి. ఫలితంగా ప్రఖ్యాత దాల్ సరస్సులో కొంత భాగం గడ్డ కట్టింది. వాటర్ పైపులలో కూడా నీరు గడ్డ కట్టేయడంతో ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఇలా సరస్సులు కూడా గడ్డ కట్టేయడం గత పదకొండేళ్లలో ఇప్పుడే జరిగింది. ఇక కార్గిల్‌లో మైనస్ 15.3 డిగ్రీల సెల్సియల్ నమోదైంది. తెలంగాణలో పొడి వాతావరణం ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తెలంగాణలో మాత్రం వచ్చే రెండ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో వచ్చే రెండ్రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వణుకుతున్న హైదరాబాద్ వేగంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ గజగజలాడుతోంది. మంగళవారం కనిష్టంగా 16.3 డిగ్రీలు, గరిష్టంగా 31.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంకంటే 2–3 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాగల మూడురోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ శాతం కూడా 44 శాతానికి తగ్గడంతో చలితీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో వీస్తోన్న శీతలగాలులు వృద్ధులు, రోగులు, చిన్నారులను గజగజలాడిస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు ‘సాక్షి’కి తెలిపారు. -
లక్ష దీవుల్లో ఉపరితల ద్రోణి
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ అరేబియా సముద్రం దాన్ని ఆనుకుని ఉన్న మాల్దీవులు, లక్ష దీవుల ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. హిందూ మహాసముద్రం, సుమత్రా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే రాష్ట్రంపై వాటి ప్రభావం ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న రెండ్రోజులు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు లేవు. ఆదిలాబాద్‌లో మాత్రం రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీలు, మెదక్‌లో 13 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. -
నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 6న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా వాతావరణం మేఘావృతమై ఉండటంతో గత 24 గంటల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. -
నేడు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర కేరళ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక రాయలసీమ ప్రాంతాల్లో శుక్రవారం ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయి. కోమోరిన్ ప్రాంతం నుంచి లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. మరో వైపు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో 6వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావాల కారణంగా శనివారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుం చి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. -
రాష్ట్రంలో పెరిగిన చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి మొదలైంది. తెలంగాణలో అన్ని చోట్లా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు చలి పెరిగింది. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. రామగుండంలో 16, హన్మకొండలో 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో రెండు డిగ్రీలు తక్కువగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలావుంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిం ది. ఫలితంగా గురువారం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
రేపు ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవన వర్షాలు బుధవారం నుంచి మొదలయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని కారణంగా రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంలో ఉండదని, రానున్న మూడ్రోజులు పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. -
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపైకి ఉత్తర దిక్కు నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవలే నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడం, ఈశాన్య రుతు పవనాలు ప్రవేశిస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో అత్యంత తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హన్మకొండలో 5 డిగ్రీలు తక్కువగా, రామగుండంలో 4 డిగ్రీలు తక్కువగా, హైదరాబాద్‌లో 3 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్క ఖమ్మంలోనే సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, డిసెంబర్ నాటికి తీవ్రమైన చలి ఉంటుందని రాజారావు వెల్లడించారు. -
రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు ఓ మోస్త రు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం 11:30 గంటలకు ‘టిట్లీ’తుపానుగా మారి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేం ద్రం పేర్కొంది. తదుపరి వాయవ్య దిశగా ప్రయా ణించి గురువారం ఉదయానికి ఒడిశా దాన్ని ఆనుకు ని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లోని గోపాల్పూర్, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. అనంతరం ఈశాన్య దిశగా ప్రయాణించి కోస్తా, ఒడిశా మీదుగా గాంగ్టక్, పశ్చిమ బెంగాల్ ప్రాం తం వైపు ప్రయాణించి తర్వాత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. -
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాజస్థాన్, కచ్, ఉత్తర అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాల నుంచి శనివారం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల్లో రాజస్థాన్‌లో మిగిలిన ప్రాంతాలు సహా పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది. నైరుతి సీజన్ మొదలైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో సరాసరి సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొంది. సాధారణంగా ఈ కాలంలో తెలంగాణలో 754.7 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 741.4 ఎంఎంలు రికార్డు అయినట్లు తెలిపింది. పది జిల్లాల్లో లోటు వర్షపాతం, ఐదు జిల్లాల్లో అధికం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మొత్తంగా నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగానే ముగుస్తున్నట్లు పేర్కొంది. నేడు రాష్ట్రంలో వర్షాలు.. శ్రీలంక నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. -
రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే ఆరు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా 37 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 5 డిగ్రీలు ఎక్కువగా, ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు బలహీనం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగానే హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో మంగళవారం క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ఇదిలావుండగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాజారావు తెలిపారు. వర్షపాత వివరాలు.. చార్మినార్ సమీపంలోని శారదామహల్‌లో అత్యధికంగా 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్‌నగర్‌లో 6.3 సెంటీమీటర్లు, మాదాపూర్‌లో 5.7 సెంటీమీటర్లు, బహదూర్‌పుర, అమీర్‌పేట ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం బుధవారం వాయుగుండంగా మారి కోస్తా, ఒడిశా దాని పరిసర ప్రాంతాలలో భువనేశ్వర్‌కి తూర్పు ఆగ్నేయ దిశగా 30కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ కారణంగా గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మెదక్, సిద్దిపేట, వరంగల్, మహ బూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో సారంగపూర్ (జగిత్యాల) 2 సెంటీమీటర్లు, తాడ్వాయి (కామారెడ్డి) 2 సెంటీమీటర్లు, నవీపేట్ (నిజామాబాద్) 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. -
మూడ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, గత 24 గంటల్లో గోల్కొండ, హయత్‌నగర్ 6 సెం.మీ, సరూర్‌నగర్, మంచల్ (మేడ్చల్ మల్కాజ్గిరి) 4 సెం.మీ, హైదరాబాద్, బొనకల్ (ఖమ్మం), నల్లగొండ, మొగుళ్లపల్లి (జయశంకర్ భూపాలపల్లి) 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేడు పలు చోట్ల వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం ఉత్తర ఒడిశా, పశ్చి మ బెంగాల్ తీరాల మధ్య బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటింది. తదుపరి ఉత్తర ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్ప పీడనంగా మారింది. దీని వల్ల తెలంగాణలో గురువారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, రాజ న్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురంలో 6 సెం.మీ, భూపాలపల్లిలో 6 సెం.మీ, పెరూర్లో 5 సెం.మీ, ఏటూ రునాగారంలో 5 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో 5 సెం.మీ, బూర్గంపాడులో 5 సెం.మీ, మణుగూరులో 5 సెం.మీ, భద్రాచలం లో 4 సెం.మీల మేర వర్షపాతం నమోదైంది. -
రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల వాయవ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం: చింతకం(ఖమ్మం)1 సెం.మీ., అశ్వాపురం(కొత్తగూడెం)1 సెం.మీ., జడ్చర్ల(మహబూబ్‌నగర్) 1 సెం.మీ. -
మరో రెండు రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 9.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంగా రాగల 24 గంటల్లో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంగా ఆదివారం తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు సోమవారం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం ఖానాపూర్(వరంగల్ రూరల్) 5 సెం.మీ, మణుగూరు (భద్రాద్రి కొత్తగూడెం), ధర్మసాగర్ (వరంగల్ అర్బన్), పెరూర్(జయశంకర్ భూ పాలపల్లి), బెజ్జంకి (సిద్దిపేట్), నర్సంపేట (వరంగల్ రూరల్), ఆత్మకూర్ (వరంగల్ రూర ల్), హుజూరాబాద్ (కరీంనగర్) 4 సెం.మీ. చొప్పున వర్షపాతం శనివారం నమోదైంది. -
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరి తల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మరోవైపు గత 24 గంటల్లో కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 9 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. అలాగే ఏన్కూరులో 7 సెంటీమీటర్లు, వెంకటాపూర్, ఖమ్మం అర్బన్, జూలూరుపాడులలో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షాలు కురిశాయి. చింతకాని, ఎల్లారెడ్డి, డోర్నకల్, బయ్యారం, అశ్వారావుపేట, మణుగూరు, కొత్తగూడెం, మధిర, గోవిందరావుపేట, నాగరెడ్డిపేట, భిక్నూరు, తల్లాడ, బోనకల్, గార్ల, జుక్కల్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వర్షాలు ఊపందుకోవడంతో అన్నదాత కాస్తంత ఊరట చెందుతున్నాడు. ఇప్పటివరకు వర్షాలు సరిగా లేకపోవడంతో అనేక చోట్ల వేసిన విత్తనాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. తాజా వర్షాలతో ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. 11 జిల్లాల్లో అధికం... హైదరాబాద్‌లో లోటు రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్లో జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల ఏడో తేదీ నాటికి రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 169.66 మిల్లీమీటర్లు కాగా, 189.1 ఎంఎం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 397.4 ఎంఎం, అతితక్కువగా జోగులాంబ గద్వాల జిల్లాలో 80.9 ఎంఎం వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 11 జిల్లాల్లో సాధారణంకంటే అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్ (అర్బన్), కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. హైదరాబాద్ జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. హైదరాబాద్‌లో ఈ కాలంలో సాధారణంగా 126.6 ఎంఎం వర్షం కురవాల్సి ఉండగా 100.6 ఎంఎం వర్షం మాత్రమే కురిసింది. అంటే 21 శాతంలో లోటు వర్షపాతం నగరంలో నమోదైంది. మిగిలిన 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయినట్లు తెలిపింది. 15 వరకు వరి నార్లు పోసుకోవచ్చు... దీర్ఘకాలిక వరి నార్లు పోసుకోవడానికి జూన్ 30తో గడువు ముగిసింది. కానీ స్వల్పకాలిక వరి సాగు కోసం ఈ నెల 15 వరకు నార్లు పోసుకోవచ్చని వ్యవసాయశాఖ తెలిపింది. అలాగే పత్తి, మొక్కజొన్న, కంది విత్తనాలు చల్లుకోవడానికి ఈ నెల 15 వరకు అవకాశముందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. సోయాబీన్ విత్తనాలు చల్లుకోవడానికి గత నెల 30తో గడువు ముగిసింది. అయితే చాలాచోట్ల వర్షాలు రాకపోవడంతో సోయా పంట చేతికి రాకుండా పోయిందంటున్నారు. దీంతో రైతులు తిరిగి వేసుకోవడానికి కూడా అవకాశం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిస్తున్న భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1,2,3 ఏరియాల్లోని ఓసీపీ–1,2,3, మేడిపల్లి ఓసీపీల్లో రోజుకు 42వేల చొప్పున రెండు రోజుల్లో 84వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. మూడో రోజు నిలిచిన ‘కాళేశ్వరం’ పనులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు రోజలుగా నిలిచిపోయాయి. అన్నారం బ్యారేజీ వద్ద గోదావరిలో వరద ఉధృతికి అడ్డుకట్ట వేసి పక్కకు మళ్లిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డతండా గ్రామానికి చెందిన ఓ మహిళ భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. అయినవారి చావే బాధాకరం అయితే.. వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న మల్లన్న వాగు ను దాటి... ఆ మృతదేహాన్ని ఇంటికి చేర్చడం బంధువులకు ఆ బాధలోనూ ఓ అనివార్యత. పది మంది గ్రామస్తులు ఓ తాడు సాయంతో నానా అగచాట్లు పడి ఆ మృతదేహాన్ని అతి కష్టంగా వాగు దాటించారు. భౌతికకాయాన్ని గౌరవంగా ఇంటికి చేర్చలేకపోతున్నామని, బురద నీటి లో తడుస్తూ తీసుకురావాల్సి వచ్చిందని వాపోయారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ కష్టాలు తప్పడంలేదని, వాగును దాటేందుకు వంతెన లేకపోవడం వల్ల వర్షాకాలంలో ఎవరైనా చనిపోతే అది మా ప్రాణాలమీదకొస్తుందని వారు బాధగా చెప్పారు. -
రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, దీనికి అనుబంధంగా 7.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఏపీ, తెలంగాణలోని అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సూర్యపేట, భద్రాద్రి కొత్త గూడెం, జైశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు కొమరంభీం, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జైశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కోస్తాంధ్రలో చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
మరో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం, దీనికి అనుబంధంగా 7.5 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఏపీ, తెలంగాణలోని అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలతోపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమ అల్పపీడనం కారణంగా రాయలసీమ మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. నగరంలో పలు చోట్ల వర్షాలు నగరంలో శనివారం పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, ఘట్కేసర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి. మలక్‌పేట, చంపాపేట, చదర్ఘూట్, భవానీ నగర్ ప్రాంతాల్లో నిరంతరాయంగా వర్షం కురుస్తోంది. గోల్కొండ ప్రాంతంలో 3 సెం.మీ, జూ పార్క్ పరిసర ప్రాంతాల్లో 3.7సెం.మీగా వర్షాపాతం నమోదయింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ నగరంలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురవడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసింది. -
మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని పేర్కొంది. దీని ఫలితంగా రానున్న మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయని ప్రకటించింది. తెలంగాణ ఉపరితల ఆవర్తనం కారణంగా..ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల, మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర ఆది, సోమ వారాల్లో కొన్ని చోట్ల, మంగళవారం అన్ని కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమ ఆది, సోమ, మంగళ వారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
మూడు రోజుల్లో వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బిహార్ నుంచి తెలంగాణ వరకు జార్ఖండ్, ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల రానున్న మూడురోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్‌లో 3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రవేశంతో దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బిహార్ నుంచి తెలంగాణ వరకు.. జార్ఖండ్, ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారుగా 40 నుంచి 42 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు(ఆదివారం) కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని, సోమవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో కూడా రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. -
బలహీనంగా రుతుపవనాలు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే వారం రోజుల్లో రుతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి వెల్లడించారు. అయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలను కొట్టివేయలేమని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర మధ్య కర్ణాటక వరకు విదర్భ, తెలంగాణ మీదుగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి పెరిగింది. శుక్రవారం హైదరాబాద్, ఖమ్మం, మెదక్‌లలో సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, భద్రాచలం, రామగుండంలో 39 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, హన్మకొండ, హైదరాబాద్, మెదక్‌లలో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. -
5, 6 తేదీల్లో రాష్ట్రంలోకి ‘నైరుతి’
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనా లు తెలంగాణలోకి ఈ నెల 5, 6 తేదీల్లో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాల రాకకు ముందు కురిసేవని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సంబంధిత ప్రాంతంలో వాతావరణశాఖ ఆధ్వర్యం లోని రెయిన్‌గేజ్ స్టేషన్లలో 60 శాతం వర్షపాతం నమోదు కావడం, ఆయా చోట్ల 2.5 మిల్లీమీటర్లకు మించి వర్షం కురవడం, గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీయడం ద్వారా రుతుపవనాల ఆగమనా న్ని గుర్తిస్తామన్నారు. ఈ ప్రమాణాలతో పాటు రేడియేషన్ తగ్గాల్సి ఉంటుందని, అప్పుడే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లుగా ప్రకటిస్తావన్నారు. ప్రస్తుతం కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇంకా సాధారణంగా ఉన్నాయన్నారు. అయితే ఈ పరిస్థితి తెలంగాణపై ప్రభావం చూపబోదని ఆయన తెలిపారు. క్యుములోనింబస్ కారణంగా.. రుతుపవనాలకు ముందుగా తేమ గాలు లు వీస్తుండటంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని వై.కె.రెడ్డి తెలి పారు. దీంతో ఎండలు తగ్గుతున్నాయన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. మంథనిలో 8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. గుండాల, అచ్చంపేటల్లో 7 సెంటీమీటర్ల చొప్పున, వికారాబాద్, మోమినపేటల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
రాష్ట్ర ప్రజలకు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. శనివారం, ఆదివారం రాష్ట్రంలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చిరస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఎండలు మండుతున్నయి. శుక్రవారం అనేక చోట్ల 42 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరికతో ప్రజలు బంబెలెత్తిపోతున్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రతత తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. మరో వైపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో శుక్రవారం అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయట తిరగరాదని అధికారులు తెలిపారు. బయటకు రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
కొనసాగుతున్న చలి తీవ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాత ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హె చ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 2 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 6 డిగ్రీలు, మెదక్‌లో 9, భద్రాచలంలో 10, ఖమ్మం, రామగుండంలలో 11, హైదరాబాద్‌లో 12, నల్లగొండలో 13, హకీంపేట, హన్మకొండ, నిజామాబాద్‌లలో 14, మహబూబ్‌నగర్ లో 15 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
వణుకుతున్న తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలను చలి వణికిస్తోంది. హిమాలయాల నుంచి వీస్తున్న శీతల గాలులు, మధ్య భారతంలో అధిక పీడనంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 8 డిగ్రీల వరకు తగ్గాయి. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. మెదక్‌లో సాధారణం కన్నా 6 డిగ్రీలు తక్కువగా 7 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం, భద్రాచలంలో 8 డిగ్రీలు తక్కువగా 9 డిగ్రీలు రికార్డయింది. భద్రాచలంలో 1962 జనవరి 5న 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఆ తర్వాత ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. ఖమ్మంలో 1946 జనవరి 8న 9.4 డిగ్రీలు నమోదవగా, తాజాగా ఆ రికార్డు బద్దలైంది. ఇక రామగుండంలో 10 డిగ్రీలు, నిజామాబాద్, హైదరాబాద్‌లలో 11, హన్మకొండలో 12, హకీంపేటలో 13, మహబూబ్‌నగర్‌లో 14, నల్లగొండలో 15 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పాత ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గురువారం చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మంలో తీవ్రమైన చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
చ.. చ.. చలి బాబోయ్!
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్ టౌన్: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో ఇంత తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారని, 2014 డిసెంబర్ 20న ఆదిలాబాద్‌లో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. మరో రెండ్రోజులు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా 8, భద్రాచలంలోనూ 5 డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది. రామగుండంలో 12 డిగ్రీలు, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్‌లలో 13, హకీంపేటలో 14, నల్లగొండలో 15, మహబూబ్‌నగర్‌లో 16 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత కంటే పగటి ఉష్ణోగ్రత 7 రెట్లకు మించి 29 డిగ్రీలు రికార్డయింది. -
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ నుంచి నైరుతి రుతుపవనాలు మంగళవారం నిష్క్రమించాయి. ఒకట్రెండు రోజుల్లో మిగిలిన ప్రాంతాల నుంచి కూడా నిష్క్రమించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది జూన్ 12న ‘నైరుతి’ రాష్ట్రంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. రుతుపవనాలు వాస్తవంగా సెప్టెంబర్ నెలాఖరుకు నిష్క్రమించాలి. అయితే అప్పుడప్పుడు అక్టోబర్ 15 వరకు విస్తరిస్తాయి. ఈసారి 17 వరకు కొనసాగాయి. ఈసారి నైరుతి రుతుపవనాల కారణంగా 99–100 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ జూన్ నుంచి సెప్టెంబర్ చివరికి 13 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 49 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 41 శాతం లోటు నమోదైంది. ఆ తర్వాత ఆగస్టులో 8 శాతం, సెప్టెంబర్‌లో 30 శాతం లోటు వర్షపాతమే నమోదైంది. అక్టోబర్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో ఈనెల 1 నుంచి ఇప్పటివరకు 17 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో సీజన్ మొత్తంగా సాధారణ వర్షపాతమే నమోదైనట్లు వై.కె.రెడ్డి విశ్లేషించారు. వారంలో ఈశాన్య రుతుపవనాలు.. తెలంగాణ, ఏపీలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన మరో వారంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వై.కె.రెడ్డి తెలిపారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినందున తెలంగాణలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలపై వాయుగుండం ప్రభావం ఉంటుందన్నారు. -
నేడు ఈదురు గాలులతో కూడిన వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు ఇంకా ఊపందుకుంటున్నాయి. శనివారం ఉరుములు, మెరుపులతో పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దాంతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అన్ని జిల్లాల్లోనూ ఈ పరిస్థితి ఉంటుందని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో సంగారెడ్డిలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పర్వతగిరి, నాగర్ కర్నూలు, భీంగల్, శాయంపేట, ఘన్పూర్, జఫర్ఘడ్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. నారాయణపేట్, మహబూబాబాద్, పెద్దెముల్, బూర్గుంపాడు, సరూర్‌నగర్, సదాశివనగర్, వెంకటాపూర్, ధర్పల్లి, భీమదేవరపల్లిలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేడు ఉరుములతో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గురువారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత 24 గంటల్లో మాగ్నూరులో అధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమదేవరపల్లిలో 8 సెంటీమీటర్లు, లక్సెట్టిపేటలో 7, మక్తల్, సంగారెడ్డిలలో 5, ధర్మపురి, నారాయణఖేడ్, పెద్దేముల్, ధర్పల్లి, హుజూరా బాద్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
నేడు అక్కడక్కడ భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో బుధవారం అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ తర్వాత మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇదిలావుండగా గత 24 గంటల్లో బూర్గుంపాడు, పినపాక, నల్లగొండల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్, మిర్యాలగూడ, ముల్కలపల్లి, బయ్యారం, ఖమ్మం పట్టణం, గోవిందరావుపేట, హయత్‌నగర్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. -
నేడు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఊపందుకున్నాయి. దీంతో తెలంగాణలో మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నా రు. అదే రోజు మళ్లీ రుతుపవనాలు ఊపందుకొని మరో 2 రోజులు వానలు కురుస్తాయన్నారు. గత 24 గంటల్లో కొల్హాపూర్‌లో 6 సెం.మీ. అధిక వర్షం కురిసింది. కూసుమంచి, సంగారెడ్డి, కొత్తగూడెంలలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నారాయణఖేడ్, జుక్కల్, మధిర, మాచారెడ్డిల్లో 3 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. వెంకటాపురం, మెదక్, పినపాక, మార్పల్లి, గట్టు, బోధన్, నల్లబెల్లి, బోనకల్, ఆలంపూర్ల్లో 2 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. -
నేడు, రేపు భారీ వర్షాలు
వాతావరణ కేంద్రం వెల్లడి సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు ఊపందుకో వడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురు స్తున్నాయని... ఆది, సోమవారాల్లోనూ వానలు పడ తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలి పింది. అక్కడక్కడా భారీ వర్షాలు నమోదవుతా యని వెల్లడించింది. అనంతరం రెండుమూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి చెప్పారు. కాగా గత 24 గంటల్లో మాచా రెడ్డి, సదాశివనగర్‌లలో 12 సెంటీమీటర్లు, హైదరా బాద్, హకీంపేటల్లో 11 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షపాతం నమో దైంది. లింగంపేట, ఇబ్రహీం పట్నం, డిచ్పల్లి, ఆదిలాబాద్, గోల్కొండల్లో 9.. సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, గాంధారి, హయత్ నగర్లలో 8.. నిజామాబాద్, మెదక్, మోమిన్‌పేట, రెంజల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, మెట్‌పల్లిలలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. పలు జిల్లాల్లో లోటే.. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా పలు జిల్లాల్లో మాత్రం ఇంకా లోటు వర్షపాతమే కొనసాగుతోంది. పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటికీ 23 శాతం లోటు ఉంది. మహబూబ్‌నగర్ 20 శాతం, కరీంనగర్, నిజామాబాద్‌లలో 16 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం 17 శాతం అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఇక భారీ వర్షాలు కురుస్తుండటంతో కొన్నిచోట్ల పత్తిని పట్టి పీడిస్తున్న గులాబీ రంగు కాయతొలుచు పురుగు నశించిపోతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని మెట్ట పంటలకు ఈ వర్షాలు ప్రయోజనం చేకూర్చాయని చెబుతున్నారు. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండినచోట వరి నాట్లు ఊపందుకుంటాయని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి పేర్కొన్నారు. -
నేడు రేపు మోస్తరు తర్వాత భారీ వర్షాలు
-
నేడు రేపు మోస్తరు.. తర్వాత భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు ఊపందుకోవడంతో మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత 24, 25 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదిలావుండగా గత 24 గంటల్లో సారంగాపూర్, బాన్సువాడ, లింగంపేట్, నాగరెడ్డి పేట్, ఎల్లారెడ్డి, తాడ్వాయిలలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరికొన్నిచోట్ల ఒక సెంటీమీటర్ చొప్పున వర్షం కురిసింది.