
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే ఆరు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా 37 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 5 డిగ్రీలు ఎక్కువగా, ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు బలహీనం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగానే హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో మంగళవారం క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ఇదిలావుండగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాజారావు తెలిపారు.
వర్షపాత వివరాలు..
చార్మినార్ సమీపంలోని శారదామహల్‌లో అత్యధికంగా 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్‌నగర్‌లో 6.3 సెంటీమీటర్లు, మాదాపూర్‌లో 5.7 సెంటీమీటర్లు, బహదూర్‌పుర, అమీర్‌పేట ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment