Temperatures increasing
-
TS: మార్చిలోనే మండుతున్న ఎండలు
సాక్షి,హైదరాబాద్: మార్చినెల సగం గడవక ముందే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.గత ఏడాదితో పోల్చితే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ప్రస్తుతం రోజువారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. రెండుమూడు రోజులుగా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో మంగళవారం 40.5 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ లో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటివరకు.. రాష్ట్రంలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 40.3 డిగ్రీల సంగారెడ్డి జిల్లాలో 39.6 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 38.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదీ చదవండి.. ఇక టీఎస్ బదులు టీజీ -
భానుడి ఉగ్రరూపం: భవిష్యత్తులో సమ్మర్లో చుక్కలే..!
తిరువనంతపురం: భారత్‌లో రానున్న సంవత్సరాలలో వేసవి ఉగ్రరూపం చూపిస్తుందని వరల్డ్ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. ముందస్తుగా వేసవి కాలం రావడంతో పాటు వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగి ప్రమాదకరంగా మారుతాయని తెలిపింది. ప్రపంచంలో వేసవి తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని, మానవ మనుగడకే ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. గత కొన్ని దశాబ్దాలుగా ప్రతీ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం, వడగాడ్పులకు వేలాది మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని ఆ నివేదిక గుర్తు చేసింది. ‘‘క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియాస్ కూలింగ్ సెక్టార్’’ అన్న పేరుతో వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను రూపొందించింది. కేరళ ప్రభుత్వ భాగస్వామ్యంతో తిరువనంతపురంలో వరల్డ్ బ్యాంకు రెండు రోజులు నిర్వహించనున్న భారత వాతావరణం, అభివృద్ధి భాగస్వామ్యుల సదస్సులో ఈ నివేదికను విడుదల చేయనుంది. ఈ సారి వేసవి ముందస్తుగా రావడంతో పాటు, ఎక్కువ కాలం కొనసాగుతుందని, ప్రజల ఆయుష్షు పరిమితిని తగ్గించే అవకాశం ఉందని, ఆర్థికంగా సైతం తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది. భారత్‌లో పని చేసే వర్గంలో 75% మంది అంటే దాదాపుగా 38 కోట్లమంది మండుటెండల్లో చెమటోడుస్తూ పని చేస్తారని, వారందరి ప్రాణాలకు వడగాడ్పులు ముప్పుగా మారుతాయని నివేదిక వెల్లడించింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా వడగాడ్పుల వల్ల 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే, వారిలో 3.4 కోట్ల మంది భారత్‌లో ఉంటారని బ్యాంక్ అంచనా వేసింది. ఇదీ చదవండి: ‘ఫోర్బ్స్’ శక్తివంతమైన మహిళ నిర్మలా సీతారామన్ -
మరో రెండ్రోజులు భగభగలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు ఇదేస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించింది. కాగా, నైరుతి రుతుపవనాలు వాయవ్య బంగాళాఖాతం లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని అనేక ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
మే రాకుండానే మంటలు
సాక్షి, హైదరాబాద్: ఇంకా మే నెల రానేలేదు. ఏప్రిల్ మధ్యలోనే ఉన్నాం. అయినా ఎండల తీవ్రతతో జనం గుండెలు ఆగిపోతున్నాయి. ప్రభుత్వానికి అందిన అనధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 మందికి పైగా మృతి చెందినట్లు అంచనా. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెల వచ్చాక ఎండల తీవ్రత, వడగాడ్పులు ఏ స్థాయిలో ఉంటాయోనని వాతావరణశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే.. రాష్ట్రంలో సాధారణం కంటే 2–4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో ఏకంగా 43 డిగ్రీల వంతున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మరోవైపు ఎండల ప్రభావం పంటలపై పడింది. వ్యవసాయశాఖ వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయినట్లు చెబుతున్నారు. అంతేగాక అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. ఎండలకు కూలీలు కూడా రావడంలేదు. మరోవైపు వరి కోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో అనేకచోట్ల ధాన్యం భూమి మీదే రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డేంజర్ జోన్లో తెలంగాణ దేశంలోనే అధికంగా వడగాడ్పులు వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉంది. ఫలితంగా రానున్న రోజుల్లో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాల్పులు వీస్తాయి. మే నెలలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. డేంజర్‌జోన్‌లో తెలంగాణ ఉండటంతో మరో 20 రోజుల వరకు వడగాడ్పులు తప్పవని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వేసవి ప్రణాళిక అమలే కీలకం వేసవి ప్రణాళికను విపత్తు నిర్వహణశాఖ తయారుచేసి కలెక్టర్లు, ఇతర అన్ని శాఖల అధికారులకు అందజేసింది. దాని ప్రకారం మొబైల్ ఫోన్లలో మెసేజ్‌లు, వాట్సాప్ తదితర పద్దతుల ద్వారా వడదెబ్బ, ఎండ వేడిమి హెచ్చరికలను ఎప్పటికప్పుడు జనానికి చేరవేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను కిందిస్థాయి అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం ఎక్కడా అమలుకావడంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయీడ్స్ అందుబాటులో ఉంచాలి. కానీ ఇవేవీ ఆచరణకు నోచుకోవడంలేదు. కార్మికులు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ఎండల తీవ్రత, జాగ్రత్తలపై విరివిగా కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతరత్రా సమాచారాన్ని ముద్రించి ఇవ్వాలని ఆదేశించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదు. నేడు రేపు అధిక ఉష్ణోగ్రతలు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పలుచోట్ల సాధారణం కంటే 2–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చంది. డయేరియా వచ్చే ప్రమాదం వేసవిలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు వడదెబ్బ, డయేరియా బారినపడే ప్రమాదముంది. కాబట్టి ఎండలకు వెళ్లకుండా చూసుకోవాలి. వెళ్లాల్సి వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వాంతులు, వీరోచనాలు వచ్చే ప్రమాదముంది. పిల్లలు, పెద్దలు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ నరహరి, పిల్లల వైద్య నిపుణులు, నీలోఫర్ ఈ జాగ్రత్తలు తప్పనిసరి - ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. - తెలుపు లేదా లేత రంగు పలుచటి కాటన్ దుస్తులు ధరించాలి. - తలకు వేడి తగలకుండా టోపీ రుమాలు కట్టుకోవాలి. - పలుచటి మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని తయారుచేసిన ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. - వడదెబ్బ తగిలిన వారిని నీడలో చల్లని ప్రదేశంలో ఉంచాలి. - శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. - వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. -
రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే ఆరు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా 37 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 5 డిగ్రీలు ఎక్కువగా, ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు బలహీనం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగానే హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో మంగళవారం క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ఇదిలావుండగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాజారావు తెలిపారు. వర్షపాత వివరాలు.. చార్మినార్ సమీపంలోని శారదామహల్‌లో అత్యధికంగా 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్‌నగర్‌లో 6.3 సెంటీమీటర్లు, మాదాపూర్‌లో 5.7 సెంటీమీటర్లు, బహదూర్‌పుర, అమీర్‌పేట ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఎడారి నగరాలను మించిన ఎండ..
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు వడగాలులతో జనం ఇంటికే పరిమితమవుతున్నారు. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్),ఉత్తరాదిలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇదే రోజు దుబాయ్, అబుదాబి, మస్కట్ వంటి ఎడారి నగరాల్లో ఉష్ణోగ్రత కంటే ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. మంగళవారం ఢిల్లీలో రెండేళ్ల గరిష్టస్థాయిలో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక దుబాయ్‌లో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రానున్న రోజుల్లో ఇక్కడ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయని అంచనా కాగా. అబుదాబి, ఒమన్‌లలోనూ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఇక రాజస్ధాన్‌లోని బికనీర్, జోథ్‌పూర్‌లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి నగరాలను మించి భారత నగరాల్లో ఉష్ణోగ్రతలు నమోదవడం బెంబేలెత్తిస్తోంది. -
నిప్పులు కక్కిన సూరీడు
►రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ►ఇళ్లకే పరిమితం అవుతున్న జనం ►పార్వతీపురంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలు తాళలేక ప్రజలు భయపడుతున్నారు. అగ్నిపర్వతం బద్దలైందా అన్నట్టుగా ఎండ వేడి చండప్రచండగా ఉంది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే ఎండవేడిమి అధికంగా ఉండడంతో ఇళ్లకే పరితమవుతున్నారు. కూలీలు మాత్రం మొండిధైర్యం చేసి పనులకెళ్తున్నారు. విజయనగరం వ్యవసాయం : జిల్లాలో మంగళవారంం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, బుధవారానికి 41 డిగ్రీలకు పెరిగింది. ఉత్తర భారతదేశం నుంచి వీ స్తున్న వేడిగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయని శా స్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం పార్వతీపురంలో మంగళవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, విజయనగరంలో 39 డిగ్రీలు, కొత్తవలసలో 39 డిగ్రీలు, సాలురులో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. టోపీ , హెల్మెట్, కళ్లాద్దాలు వంటి రక్షణ కవచాలు ధరించినప్పటికీ ఎండలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండతీవ్రత ఎక్కువుగా ఉండడంతో జనం అవస్థలు పడుతున్నారు. గత ఏడాది మే 20 తేదీ నాటికి గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలుండగా, ఈ ఏడాది 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయాన్నే పనులకెళ్తున్న వేతనదారులు: ఎండ తీవ్రతను తట్టుకోలేక ఉపాధి హామీ పథకం వేతనదారులు ఉదయం 6 గంటలకే పనికి వెళ్లి 10 గంటలయ్యేసరికి ఇళ్లకు చేరుకుంటున్నారు. టెంటలున్నా ఉపయోగంలేకుండా పోతోంది. సాగులో ఉన్న నువ్వు పంట సూర్య ప్రతాపానికి ఎండిపోయింది. చెరువుల్లో నీరు లేకపోవడంతో పశుపక్ష్యాదులు దాహార్తితో అల్లాడిపోతున్నాయి. గీత కార్మికులు, ఇటుకబట్టీల కార్మికులు, పరిశ్రమల్లో పనిచేస్తున్నవారు విధులు నిర్వహించలేకపోతున్నారు. తోపుడు బళ్ల పై వ్యాపారం చేసుకునే వారు ఎండలో తిరగలేక ఏదో ఒకచోటకే పరిమితమవుతున్నారు. వృద్ధులు, పిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. దీర్ఘకాల వ్యాధిగ్రస్తుల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఎండలో బయటకు వెళ్లొద్దు వేడి ఎక్కువగా ఉన్నందున మరీ అవసరమైతే తప్పా బయటకు వెళ్లకుండా ఉంటే మంచింది. ఒక వేళ వెళ్లవలసి వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా మజ్జిగ, కొబ్బరినీళ్లు, గంజి వాటిని తీసుకోవాలి. లేదంటే డిహైడ్రిషన్ గురై కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి. -డాక్టర్ బోళెం పద్మావతి, జనరల్ పిజీషియన్ , కేంద్రాస్పత్రి, విజయనగరం.