సాక్షి, హైదరాబాద్: ఇంకా మే నెల రానేలేదు. ఏప్రిల్ మధ్యలోనే ఉన్నాం. అయినా ఎండల తీవ్రతతో జనం గుండెలు ఆగిపోతున్నాయి. ప్రభుత్వానికి అందిన అనధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 మందికి పైగా మృతి చెందినట్లు అంచనా. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే మే నెల వచ్చాక ఎండల తీవ్రత, వడగాడ్పులు ఏ స్థాయిలో ఉంటాయోనని వాతావరణశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే.. రాష్ట్రంలో సాధారణం కంటే 2–4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో ఏకంగా 43 డిగ్రీల వంతున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మరోవైపు ఎండల ప్రభావం పంటలపై పడింది. వ్యవసాయశాఖ వర్గాల అంచనా ప్రకారం రాష్ట్రంలో 2.50 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయినట్లు చెబుతున్నారు. అంతేగాక అనేక చోట్ల వరి కోతలు నిలిచిపోయాయి. ఎండలకు కూలీలు కూడా రావడంలేదు. మరోవైపు వరి కోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో అనేకచోట్ల ధాన్యం భూమి మీదే రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డేంజర్ జోన్‌లో తెలంగాణ
దేశంలోనే అధికంగా వడగాడ్పులు వచ్చే డేంజర్ జోన్‌లో తెలంగాణ ఉంది. ఫలితంగా రానున్న రోజుల్లో రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాల్పులు వీస్తాయి. మే నెలలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. డేంజర్‌జోన్‌లో తెలంగాణ ఉండటంతో మరో 20 రోజుల వరకు వడగాడ్పులు తప్పవని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
వేసవి ప్రణాళిక అమలే కీలకం
వేసవి ప్రణాళికను విపత్తు నిర్వహణశాఖ తయారుచేసి కలెక్టర్లు, ఇతర అన్ని శాఖల అధికారులకు అందజేసింది. దాని ప్రకారం మొబైల్ ఫోన్లలో మెసేజ్‌లు, వాట్సాప్ తదితర పద్దతుల ద్వారా వడదెబ్బ, ఎండ వేడిమి హెచ్చరికలను ఎప్పటికప్పుడు జనానికి చేరవేయాలన్న విపత్తు నిర్వహణశాఖ సూచనలను కిందిస్థాయి అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం ఎక్కడా అమలుకావడంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయీడ్స్ అందుబాటులో ఉంచాలి. కానీ ఇవేవీ ఆచరణకు నోచుకోవడంలేదు. కార్మికులు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆరుబయట పనిచేయకూడదన్న నిబంధనను అనేక కంపెనీలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ఎండల తీవ్రత, జాగ్రత్తలపై విరివిగా కరపత్రాలు, గోడ పత్రికలు, ఇతరత్రా సమాచారాన్ని ముద్రించి ఇవ్వాలని ఆదేశించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదు.
నేడు రేపు అధిక ఉష్ణోగ్రతలు
దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోమోరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని కారణంగా సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పలుచోట్ల సాధారణం కంటే 2–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చంది.
డయేరియా వచ్చే ప్రమాదం
వేసవిలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు వడదెబ్బ, డయేరియా బారినపడే ప్రమాదముంది. కాబట్టి ఎండలకు వెళ్లకుండా చూసుకోవాలి. వెళ్లాల్సి వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వాంతులు, వీరోచనాలు వచ్చే ప్రమాదముంది. పిల్లలు, పెద్దలు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ నరహరి, పిల్లల వైద్య నిపుణులు, నీలోఫర్
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి.
- తెలుపు లేదా లేత రంగు పలుచటి కాటన్ దుస్తులు ధరించాలి.
- తలకు వేడి తగలకుండా టోపీ రుమాలు కట్టుకోవాలి.
- పలుచటి మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు, చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని తయారుచేసిన ఓఆర్‌ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది.
- వడదెబ్బ తగిలిన వారిని నీడలో చల్లని ప్రదేశంలో ఉంచాలి.
- శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి.
- వడదెబ్బకు గురైనవారు ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి.
Comments
Please login to add a commentAdd a comment