
రాష్ట్రంలో సాధారణాన్ని మించిపోనున్న వేసవి ఉష్ణోగ్రతలు
వరుసగా ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి ఎండలు మండిపోనున్నాయి. వడగాడ్పులూ తీవ్రరూపం దాల్చనున్నాయి. ఈ వేసవి సీజన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు 2025 మార్చి నుంచి మే నెల వరకు వేసవి సీజన్‌కు సంబంధించిన అంచనాలను శనివారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఈ ఎండాకాలంలో వరుసగా ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
సాధారణంగా వేసవిలో నాలుగైదు రోజుల పాటు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం, తర్వాత సాధారణ స్థాయికి తగ్గడం వంటివి జరుగుతాయి. కానీ ఈసారి వరుసగా ఎక్కువ రోజులు ఎండలు మండిపోతాయని, దానితో వడగాడ్పులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా వడగాడ్పులు ఏప్రిల్ నెలాఖరు నుంచి మే నెల మధ్య వరకు ఉంటాయని, కానీ ఈసారి మార్చి నెలలోనే ఈ పరిస్థితి కనిపించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
విభిన్నంగా వాతావరణం..
వేసవి సీజన్‌లో ఉష్ణోగ్రతల తీరు ఎప్పుడూ కూడా.. అంతకు ముందు వర్షాలు, శీతాకాల వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత వానాకాలంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినా.. కృష్ణా పరీవాహకంలో అంతంత మాత్రంగానే నమోదయ్యాయి.
రాష్ట్రంలో సగటు కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనా.. చాలా ప్రాంతాల్లో లోటు ఉండటం గమనార్హం. ఇక చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గినా.. గరిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగా నమోదయ్యాయి. అంతేకాదు సగటున చూస్తే ఈసారి జనవరి, ఫిబ్రవరి నెలలు అత్యధిక వేడిమి నెలలుగా నిలుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
లానినా బలహీనపడటంతో..
పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఏర్పడిన లానినా బలహీనంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. దీనితో ముందస్తు వేసవిని ఆహ్వానించినట్టు అయిందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే జనవరి, ఫిబ్రవరి నెలల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదైనట్టు చెబుతున్నారు.
మరోవైపు హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయని పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో లానినా పరిస్థితులు మరింత బలహీనపడతాయని, అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలలో వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
125 ఏళ్ల రికార్డులు దాటేయొచ్చు!
రాష్ట్రంలో గతేడాది జగిత్యాల, నల్లగొండ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈసారి అంతకంటే అధికంగా నమోదవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 1901 నుంచి 2025 వరకు గత 125 సంవత్సరాల కాలంలో సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుంటే... 2025 వేసవిలో ఎక్కువ సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.