9 మంది ఎమ్మెల్యేలున్నా.. 9 మందిని కాపాడలేకపోయారు
ప్రజల కన్నీళ్లు తుడవకుండా ప్రతిపక్షాలపై విమర్శలా: హరీశ్
సాక్షి, హైదరాబాద్, చేగుంట(తూప్రాన్): ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వరదల్లో చిక్కుకున్న 9 మందిని కూడా కాపాడలేకపోయారని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాతావరణశాఖ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే అనేక మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు.
వర్షాలతో 16 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 31 మంది మృతి చెందారని తెలిపారు. ఖమ్మంలో కాపాడమని కోరుతున్న వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సహాయక చర్యలు చేపట్టడం మానేసి బీఆర్‌ఎస్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని నిందించారు.
ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారమివ్వాలి
ఓ వైపు ప్రజలు ఆపదలో ఉంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజకీయాలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల కన్నీళ్లు తుడవకుండా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, శాసన మండలి మాజీ సభ్యులు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై సోషల్ మీడియా వేదికగా బీజేపీ చేస్తున్న దాడిని హరీశ్‌రావు ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment