Weather Department
-
మానవాళికి ప్రకృతి శాపం!
‘వాతావరణం కూడా ప్రభుత్వాల వంటిదే. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది’ అంటాడు బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్. అది ముమ్మాటికీ నిజం. దేశంలో గత 123 ఏళ్లలో కనీవినీ ఎరగనంత స్థాయి ఉష్ణోగ్రతలు నిరుడు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చేసిన ప్రకటన హడలెత్తిస్తోంది. అంతేకాదు... వచ్చే ఏడాది సైతం రికార్డులు బద్దలయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మనదేశం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుటి ఉష్ణో గ్రతలు అధికంగానే ఉన్నాయని వివిధ దేశాల వాతావరణ విభాగాల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. మన పొరుగునున్న చైనాలో 1961 నుంచీ పోల్చిచూస్తే గత నాలుగేళ్ల ఉష్ణోగ్రతలు చాలా చాలా ఎక్కువని అక్కడి వాతావరణ విభాగం తెలియజేసింది. నిజానికి 2024లో ప్రపంచ ఉష్ణో గ్రతల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఇంకా అధికారిక నివేదిక విడుదల చేయలేదు. అందుకు మార్చి వరకూ సమయం ఉంది. కానీ ఈలోగా కొన్ని కొన్ని అంశాల్లో వెల్లడైన వాతావరణ వైపరీత్యాలను అది ఏకరువు పెట్టింది. అవి చాలు... మనం ఆందోళన పడటానికి! వాటి ప్రకారం– నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ నెలలమధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కాలం నాటికంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్ అధికం. అలాగే అంటార్కిటిక్ సముద్రంలో మంచు పలకలు మునుపటితో పోలిస్తే అధికంగా కరుగుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాతావరణం వల్ల నిరుడు మరణాలు, ఆర్థిక నష్టాలు కూడా బాగా పెరిగాయి. సాగర జలాల ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. సముద్ర మట్టాలు ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డయిన 29 వాతావరణ ఘటనలను విశ్లేషిస్తే అందులో 26 కేవలం వాతావరణ మార్పులవల్ల జరిగినవేనని తేలిందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ ఉదంతాల్లో 3,700 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది.స్వర్గనరకాలు మరెక్కడో లేవు... మన ప్రవర్తన కారణంగా ఆ రెండూ ఇక్కడే నిర్మితమవుతా యంటారు. వాతావరణం విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మానవ కార్యకలాపాలే వాతా వరణ వైపరీత్యాలకు మూలకారణం. నూతన సంవత్సర సందేశంలో గత దశాబ్దకాలపు వార్షిక ఉష్ణోగ్రతలన్నీ రికార్డు స్థాయివేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ వినాశకర దోవ విడనాడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తోంది. వినూత్న ఆవిష్కర ణలు అందుబాటులోకొస్తున్నాయి. కానీ వీటిని చూసి విర్రవీగి, ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టిన పర్యవసానంగా అది ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రకృతి చెప్పినట్టు వింటూ అది విధించిన పరిమితులను శిరసావహించాలి తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదని ఏటా వెలువడే నివేదికలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వినేదెవరు? లాభార్జనే తప్ప మరేమీ పట్టని పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ఎడాపెడా అనుమతులు మంజూరు చేస్తున్న పాలకులు, వాతావరణం నాశనమవు తున్నదని గ్రహించే చైతన్యం లోపించిన ప్రజలు పర్యావరణ క్షీణతకు దోహదపడుతున్నారు. అయి దేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పర్యావరణ పరిరక్షణ అంశం ఏనాడూ ప్రస్తావనకు రాదు. మన దేశంలోనే కాదు... ప్రపంచంలో వాతావరణ శిఖరాగ్ర సదస్సుల వంటివి నిర్వహించినప్పుడు తప్ప మరెక్కడా పర్యావరణం గురించి చర్చ జరగటం లేదు. ఇది ప్రకృతి విధ్వంసానికి పాల్పడే పారిశ్రామికవేత్తలకూ, పాలకులకూ చక్కగా ఉపయోగపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిందే. అందుకవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అభివృద్ధి అవసరాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టే విధానాలు మొత్తంగా మానవాళికే ప్రమాదకరం. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదనే విషయంలో ఎవరూ పెద్దగా విభేదించటం లేదు. కానీ దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలే నత్తనడకన ఉంటున్నాయి. ప్రపంచంలో కర్బన ఉద్గా రాల తగ్గింపునకు 2015 పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చెప్పాలంటే ఆ దిశగా ఎంతోకొంత అడుగులేస్తున్నది మనమే. ఆ శిఖరాగ్ర సదస్సు 2050 నాటికి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నిలువరించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అయితే దాన్ని చేరుకోవటానికి వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణానికి తూట్లు పొడవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంపన్న రాజ్యాలు బడుగు దేశాలకు హరిత ఇంధన సాంకే తికతలను అందించటంలో, అందుకవసరమైన నిధులు సమకూర్చటంలో ముఖం చాటేస్తున్నాయి. వాతావరణ మార్పుపై చెప్తున్నదంతా బోగస్ అనీ, పారిస్ ఒడంబడిక నుంచి తాము వైదొలగు తున్నామనీ అమెరికాలో క్రితంసారి అధికారంలోకొచ్చినప్పుడే ప్రకటించిన ట్రంప్... ఈసారి కూడా ఆ పనే చేస్తారు. ప్రపంచ దేశాల మాటెలావున్నా ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావొచ్చన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ అట్టడుగు స్థాయివరకూ తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి. మండే ఎండలు మాత్రమే కాదు... జనావాసాలను ముంచెత్తే వరదలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను గరిష్ట స్థాయిలో ఉంచటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. బాధిత ప్రజానీకానికి సాయం అందించటానికి అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. -
Cyclone Alert: తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం..
-
మొదలైన ‘గజగజ’!.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుత సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవటంతో జ్వరాలు, జలుబు, దగ్గులాంటి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యారోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రమంతా పడిపోతున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధాన పట్టణాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం నిజామాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీలు నమోదుకాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 11.8 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. ఆదిలాబాద్, హనుమ కొండ, మెదక్, పటాన్చెరు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు.. హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడురోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
-
వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'!
బోట్ల యజమాని.. టీడీపీ వర్గీయుడు... ఆ బోట్లకు అనుమతులిచ్చిందీ టీడీపీ ప్రభుత్వమే.. టీడీపీ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నవి అవే బోట్లు... అయినా సరే ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం వైఎస్సార్సీపీ కుట్రే...! వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేయండి.. ఇదీ సర్కారు ఆదేశం! ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కు రాజకీయ కుట్ర ఇదీ!!– సాక్షి, అమరావతి అతి భారీ వర్షాలపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు అప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండుకుండలను తలపిస్తున్నా దిగువకు ప్రవాహాన్ని విడుదల చేసేందుకు ప్లడ్ కుషన్ నిబంధనను పాటించకుండా సీఎం చంద్రబాబు లక్షల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. వరద ముంపు ముంచుకొస్తున్నా రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖలతో కనీసం సమీక్ష నిర్వహించకుండా.. ప్రజలను అప్రమత్తం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. మానవ తప్పిదంతో విజయవాడను వరదలు ముంచెత్తేందుకు కారణమయ్యారు. వరద నియంత్రణ, సహాయ, పునరావాస చర్యల్లో ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘బోట్ల’ రాజకీయానికి తెర తీశారు. ఏకంగా రాజద్రోహం లాంటి కఠిన సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించాలని ఆదేశించడం ఈ కుతంత్రానికి పరాకాష్ట. అయితే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడన్న విషయం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఆ బోట్లను కోమటి రామ్మోహన్ అనే వ్యక్తికి విక్రయించారన్న ప్రభుత్వ ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది. ఇక ఆ బోట్లకు అనుమతులిచ్చింది కూడా టీడీపీ హయాంలోనే కావడం గమనార్హం. అక్రమ కేసు కుట్రదారు బాబే.. ఓ వైపు విజయవాడలో 7 లక్షల మందికిపైగా వరదలో చిక్కుకుని అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు బోట్ల ఉదంతానికి ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్యమిచ్చారు. తద్వారా అక్రమ కేసు నమోదు చేయాల్సిందేనని పోలీసులకు çసంకేతాలిచ్చారు. దీంతో బోట్లు ఢీకొనడం యాధృచి్ఛకమేనని అప్పటివరకు చెబుతూ వచ్చిన నీటిపారుదల శాఖ, పోలీసు శాఖ అధికారులకు ప్రభుత్వ పెద్దల ఆంతర్యం బోధపడింది. ఇక చేసేదిలేక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు వైఎస్సార్సీపీపై బురదజల్లుతూ ఎల్లో మీడియాలో చర్చలతో హడావుడి చేస్తున్నారు. ఉషాద్రి టీడీపీ వర్గీయుడే బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఉషాద్రి వారితో కలసి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2014–19 మధ్య టీడీపీ హయాంలోనే ఉషాద్రి బోట్లకు లైసెన్స్‌లు మంజూరయ్యాయి. ఆయన బోట్లకు మారిటైమ్ బోర్డ్ అనుమతులతోపాటు అమరావతి బోటింగ్ క్లబ్లో సభ్యత్వం కూడా ఇచ్చారు. దాంతో కృష్ణా నదిలో ఇసుక తవ్వి విక్రయించేవారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తరువాత నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఉషాద్రి బోట్లు కూడా ఉన్నాయి. ఆ బోట్లకు టీడీపీ జెండాలు కట్టి పార్టీ నేతలు వాటిపై కృష్ణా నదిలో విహరిస్తూ బాణసంచా కాల్చారు. ఆ ఫొటోలు, వీడియోలు తాజాగా వైరలయ్యాయి. టీడీపీలో అత్యంత క్రియాశీల సభ్యుడైన ఉషాద్రి బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొంటే అందుకు ఆ పారీ్టనే బాధ్యత వహించాలి కదా? వైఎస్సార్సీపీపై రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నట్లు పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. గోప్యత వెనుక గుట్టు ఇదీ..! పోలీసులు అరెస్ట్ చేసిన రెండో నిందితుడు కోమటి రామ్మోహన్కూ టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మేనల్లుడు అని పోలీసులు పేర్కొన్నారు. రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో కీలక నేత కోమటి జయరాం సోదరుడి కుమారుడు అనే విషయాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది. ఇప్పటికీ రామ్మోహన్ టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆ విషయాలనూ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఉషాద్రి, రామ్మోహన్లకు మరో వ్యాపార భాగస్వామి ఉన్నారు. ఆయనే టీడీపీ నేత అలూరి చిన్న. ఈ ఉదంతంలో టీడీపీకి సంబంధాలున్నాయనే విషయాన్ని కప్పిపుచ్చేందుకే పోలీసులు ఆలూరి చిన్న పేరును తప్పించారన్న విషయం కీలకంగా మారింది. టీడీపీ ప్రభుత్వ రాజకీయ కుట్రే వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేశ్, తలశిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం.తేలిపోయిన ప్రభుత్వ కుట్ర...⇒ ప్రకాశం బ్యారేజీకి తీవ్ర నష్టం కలిగించేందుకే కృష్ణా నదికి అటువైపు ఉన్న బోట్లను కొద్ది రోజుల ముందు ఇటువైపు తెచ్చారని మంత్రి రామానాయుడు చెబుతున్నారు. కానీ ఆ అభియోగాలు పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో వెల్లడైంది. ఆ బోట్లను నాలుగు నెలలుగా గొల్లపూడి సమీపంలో కృష్ణా నదిని ఆనుకుని ఉన్న శ్మశానం సమీపంలోనే లంగరు వేసి ఉంచారు. గూగుల్ శాటిలైట్ ఫొటోలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.⇒ బోట్లను ఉద్దేశపూర్వకంగానే ప్లాస్టిక్ తాళ్లతో కట్టారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేసులో ప్రస్తావించారు. కానీ ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న ఆ బోట్లే కాదు.. కృష్ణా నదిలో అన్ని బోట్లను అవే బలమైన ప్లాస్టిక్ తాళ్లతో లంగరు వేసి ఉంచుతున్నారు. అందుకోసమే తయారు చేసిన ప్లాస్టిక్ తాళ్లను అమరావతి బోటింగ్ క్లబ్ తమ సభ్యులకు సరఫరా చేస్తోంది.⇒ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద ఉన్న స్లూయిజ్ చైన్లను తెంపేశారని ప్రభుత్వం ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ‘అవేమీ చిన్నా చితకా తాళ్లు కాదు తెంపేయడానికి. బలమైన ఇనుప గొలుసులు. వాటిని తెంపడం అసాధ్యం’ అని నీటిపారుదల శాఖ అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం.⇒ 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలే కృష్ణా నది వద్ద ఇసుక వ్యాపారం చేస్తున్నారు. విజయవాడలో అన్ని బోట్లు ఆ పార్టీ నేతల ఆదీనంలోనే ఉన్నాయి. అవి బ్యారేజీని ఢీకొంటే అందుకు బాధ్యత టీడీపీ వర్గీయులదే అవుతుంది కానీ వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?ఈ ప్రశ్నలకు బదులేది బాబూ?⇒ ఈ కేసులో కీలక నిందితుడు ఉషాద్రి స్వయంగా సీఎం చంద్రబాబుతోపాటు లోకేశ్, దేవినేని ఉమాకు సన్నిహితుడు కాదా? ⇒ ఆ బోట్లు నాలుగు నెలలుగా కృష్ణా ఒడ్డున లంగరు వేసి ఉండటం నిజం కాదా? వరద సమయంలో వాటిని తొలగించకుండా నీటిపారుదల, పోలీసులు, పర్యాటక శాఖ అధికారులను ఎవరు అడ్డుకున్నారు? ⇒ జూన్‌లో టీడీపీ విజయోత్సవ వేడుకల్లో ఆ బోట్లతో ర్యాలీ నిర్వహించలేదా? ⇒ తలశిల రఘురాం, నందిగం సురేశ్‌తోపాటు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసుల నమోదుకు పోలీసులపై ఒత్తిడి తేవడం నిజం కాదా? -
ఉత్తరాంధ్ర ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ఎచ్చెర్ల క్యాంపస్/అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులు, వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లాయి. ఈ వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టినా.. ఇంకా నదులు, కాలువలు పొంగిపొర్లుతునే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పరివాహక ప్రాంతాల్లోని వాగులు, ఏర్లు పొంగి ప్రవహించాయి. పలుచోట్ల చెరువులు దెబ్బతిన్నాయి. అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఫలితంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఏడువేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. ఈ జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో కాకినాడ జిల్లా ఏలేరు పరీవాహక ప్రాంతం రైతుల కొంప ముంచింది. విజయనగరం జిల్లాలో మాత్రం ఈ వర్షాలు మేలు చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆయా జిల్లాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నష్టం..భారీ వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 1,230 హెక్టార్లలో పంట నీట మునిగినట్లు సమాచారం. కానీ, వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మూడువేల హెక్టార్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కె.కొత్తూరు, గార, రాగోలు వంటి ప్రాంతాల్లో కూరగాయల పంటలు సుమారు 78 ఎకరాల్లో నీటమునిగింది. జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరోవైపు.. జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు.. రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు కల్వర్టులు కొట్టుకుపోయాయి. పొలాల నుంచి వరద నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలు కొన్నిచోట్ల పాక్షికంగా నీటమునిగి ఉండగా మరికొన్నిచోట్ల పూర్తిగా మునిగిపోయాయి. విజయనగరం జిల్లాలో..విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కొన్నిచోట్ల నష్టం కలిగించినా వ్యవసాయానికి ఎంతో మేలు చేశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు విజయనగరం జిల్లాలో సుమారు 513 హెక్టార్లలో వరి పొలాలు నీటమునిగాయి. స్వల్పంగా 6.2 హెక్టార్లలో మొక్కజొన్న దెబ్బతింది. పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 66 హెక్టార్లలో ఉద్యాన తోటలు నేలకొరిగాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 ఇళ్లు శిథిలమవగా.. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెల్లిగడ్డపై కల్వర్టు దెబ్బతినగా.. బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిలోని కాజ్వే కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 70 స్తంభాలు నేలకొరిగాయి. 26 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ మంగళవారం పునరుద్ధరించారు. తాటిపూడి, వట్టిగెడ్డ, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లు నిండిపోవడంతో దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. \అనకాపల్లి జిల్లాలో ఏడువేల ఎకరాలు..అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 7 వేల ఎకరాలు నీట మునిగినట్లు తెలుస్తోంది. వీటిలో 6 వేల ఎకరాల్లో వరి పంట, మరో ఒక వెయ్యి ఎకరాల్లో చెరకు, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన, ఇతర పంటలు నీట మునిగాయి. వ్యవసాయ అధికారుల ఇచ్చిన నివేదిక ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్ల వరి పంట నీట మునిగింది. జిల్లాలో 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో 4 పూర్తిగా, 36 పాక్షికంగా దెబ్బతిన్నాయి. 48 విద్యుత్ పోల్స్‌కు నష్టం వాటిల్లింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని తాండవ, కోనాం, కళ్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవడంతో సోమవారం గేట్లు ఎత్తివేశారు. తాండవ రిజర్వాయర్ మినహా మిగతా రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో అదుపులోనే ఉంది. ‘కోనసీమ’ను ముంచేస్తున్న వర్షాలు.. వరదలుఅధిక వర్షాలు, వరుసగా మూడుసార్లు వరదలతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు, పరిశ్రమలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు తొలి నుంచి అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. మొత్తం వరి ఆయకట్టు 1.90 లక్షల ఎకరాలు కాగా అధికారులు 1.63 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేశారు. జూలై వర్షాలు, వరదలకు సుమారు 3 వేల ఎకరాల్లో వరిచేలు దెబ్బతిన్నాయి. తాజాగా వరదలకు ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి.ఇవి కాకుండా లంక గ్రామాల్లో 5,996.30 ఎకరాల్లో అరటి, కురపాదులు, బొప్పాయి, తమలపాకు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. అలాగే, జిల్లాలో 1,800 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా.. రోజుకు 30 లక్షల ఇటుక తయారుచేయాల్సి ఉండగా, సగటున 12 లక్షల కూడా జరగడంలేదు. మరోవైపు.. కొబ్బరి పీచు పరిశ్రమల్లో కూడా సగం ఉత్పత్తి మించి జరగడంలేదు. కోనసీమ జిల్లాలో 400 వరకు చిన్నా, పెద్ద పరిశ్రమలున్నాయి. వర్షాలవల్ల డొక్క తడిచిపోవడంతో పీచు చేసే పరిస్థితి లేదు. అలాగే పీచు తడిసిపోవడంవల్ల తాడు తయారీ... క్వాయరు పిత్ బ్రిక్ తయారీ ఆగిపోతుంది.ముందుచూపులేకే ఏలేరు ముంచింది..ప్రభుత్వానికి ముందుచూపు కొరవడడంతో ఏలేరు పరీవాహక ప్రాంత రైతుల కొంప ముంచింది. ఊళ్లకు ఊళ్లు, వేలాది ఎకరాల్లో వరి, ఇతర వాణిజ్య పంటలు నీట మునిగి రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలను నియంత్రించడంలో ఘోర వైఫల్యం ఏలేరు ముంపునకు కారణమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాకినాడ జిల్లాలో జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాలలో సుమారు 67 వేల ఎకరాలు సాగవుతుంటాయి. ఈ ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు విడుదల చేసిన ప్రతి సందర్భంలో దిగువన పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి.పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో గట్లకు గండిపడి గ్రామాలపైకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తింది. ఉగ్రరూపం దాల్చిన ఏలేరు, సుద్దగడ్డలతో పిఠాపురం నియోజకవర్గంలోని కాలనీలు, రోడ్లు పూర్తిగా నీటి మునిగాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా పెరిగిన వరద నీటితో పంట భూములు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు కాలనీలు ముంపులోనే ఉన్నాయి. 216 జాతీయ రహదారిలో గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద వరద నీరు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చచ్చినా ఇళ్లు ఖాళీ చేయం చింతూరులో వరదనీటిలోనే బాధితుల ఆందోళనచింతూరు: ఏటా వరదలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తేనే ఇళ్లను ఖాళీచేస్తామని లేదంటే వరద నీటిలోనే చచ్చిపోతామంటూ అల్లూరి జిల్లా చింతూరుకు చెందిన వరద బాధితులు తమ ఇళ్లను ఖాళీచేయకుండా వరదనీటిలో ఆందోళన చేపట్టారు. శబరి నది ఉధృతికి మంగళవారం చింతూరులో వరద పెరగడంతో శబరి ఒడ్డు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని గ్రామస్తులకు సూచించారు.దీనిపై ఆగ్రహించిన బాధితులు ఈ ఏడాది ఇప్పటికే రెండుసార్లు ఇళ్లను వరద ముంచెత్తిందన్నారు. వరద అంతకంతకూ పెరుగుతుండడం, బాధితులు ఇళ్లను ఖాళీచేసేందుకు ససేమిరా అనడంతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వభరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ వెళ్లి బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్ము వరద పాలవుతోందని, ఇక తాము ఈ కష్టాలు పడలేమని స్పష్టంచేశారు. దీంతో.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హమీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించి ఇళ్లను ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలివరద ముంపులో ఉన్న బాధితులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ఏటా వస్తున్న వరద నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లుచేయాలి. ప్రజలు ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టాలి.– వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, కాకినారైతాంగాన్ని నట్టేట ముంచిన వరద..పభుత్వం, అధికారుల నిర్లక్ష్యంవల్లే ఏలేరు వరద ఉధృతి రైతులను నట్టేట ముంచింది. ఏలేరు ప్రాజెక్టులో 24 టీఎంసీల నీరుచేరే వరకు నీటిని నిల్వ ఉంచడం దారుణం. 19 టీఎంసీలు ఉన్నప్పుడే అధికారులు మెల్లమెల్లగా నీటిని విడుదల చేసి ఉంటే ఇంత ఉధృతి ఉత్పన్నమయ్యేది కాదు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గంథం శ్రీను, రైతు, మర్లావ, పెద్దాపురం మండలంబీర పంట పోయింది..రెండు ఎకరాల్లో బీర పంట సాగుచేశాను. గత జూలై వరదలకు పంట మొత్తం దెబ్బతింది. అప్పటికే ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.80 వేలు పెట్టుబడిగా పెట్టాను. పదకొండు రోజులు వరద నీరు ఉండడంతో పంట అంతా కుళ్లిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, ముమ్మిడివరం మండలం, కోనసీమ జిల్లా -
AP: నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశి్చమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతం కళింగపటా్ననికి 240 కి.మీ., పూరీకి ఆగ్నేయంగా 150 కి.మీ., పశి్చమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణంగా 350 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటే సూచనలున్నాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతరం ఒడిశా, ఛత్తీస్గడ్ మీదుగా ప్రయాణిస్తూ బలహీన పడనుందని వెల్లడించారు.వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై సోమవారం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం వరకూ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 10వ తేదీ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, కోస్తాంధ్రలో మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీరం అల్లకల్లోలంగా మారింది. కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రపు అలలు 1.3 నుంచి 1.6 మీటర్/సెకెను వేగంతో దూసుకొస్తుండటంతో, పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. -
ముంచుకొస్తున్న ముప్పు!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్ : వాయు గుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఉత్తరాం«ధ్ర జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 10 నుంచి 14 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గడిచిన 48 గంటల్లో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 168.5 మి.మీ., చీపురుపల్లిలో 167.75 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 158.75, ఆమదాలవలసలో 142 మి.మీ. వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా వై.రామవరంలో 133.5, నెల్లిమర్లలో 129.75 మి.మీ. వర్షపాతం నమోదైంది.ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లోని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కొండవాలు ప్రాంతాల్లో మట్టి కోతకు గురవుతోంది. గోపాలపట్నంలోని రామకృష్ణనగర్ వద్ద మట్టి కోతకు గురవుతుండటంతో.. 15కు పైగా ఇళ్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఆ ఇళ్లన్నీ ఖాళీ చేయించి స్థానికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కంచరపాలెంలో కొండచరియలు విరిగిపడి.. కార్లు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. ప్రధాన మార్గమైన జ్ఞానాపురం వద్ద ఎర్రిగెడ్డ పొంగిపొర్లుతుండటంతో రోడ్లు జలదిగ్బంధంలోచిక్కుకున్నాయి. దీంతో విశాఖ నుంచి గాజువాక వైపు రాకపోకల్ని నిలిపేసి.. ప్రధాన రహదారి వైపు మళ్లించారు. జిల్లాలోని 12 మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని 81 లోతట్టు ప్రాంతాల్ని గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మేయర్ గొలగాని హరివెంకటకుమారి ఆదేశాలిచ్చారు. జీవీఎంసీలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 98 వార్డుల్లో పరిస్థితిని ఆమె ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 110 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మరోవైపు గంభీరం రిజర్వాయర్ గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. గంభీరం రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 126 అడుగులు కాగా.. ప్రస్తుతం 123.8 అడుగులకు వరద నీరు చేరుకుంది. 50 క్యూసెక్కుల నీరు చేరుతున్న తరుణంలో.. గేట్లు ఎత్తేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. వంశధార, నాగావళి, బహుదా ఉగ్రరూపం ⇒ శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదాతో పాటు గెడ్డలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. వంశధార గొట్టా బ్యారేజీ వద్ద పది గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. జిల్లాలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 వరకు 1461.6 మి.మీ వర్షం కురవగా, ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 620 మి.మీ వర్షం కురిసింది. బెజ్జిపురం వద్ద గడ్డలో వాహనం కొట్టుకుపోయింది. ⇒ శ్రీకాకుళం పరిధి కల్లేపల్లిలో శనివారం పిడుగుపడి 6 గొర్రెలు మృతి చెందాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మత్స్యగెడ్డ ఉగ్రరూపం దాల్చడంతో పాడేరు, పెదబయలు మండలాల్లోని సుమారు వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకులోయ, అనంతగిరి, పాడేరు, లంబసింగి ఘాట్ మార్గాల్లో కొండచరియలు విరిగి పడుతున్నందున ఆదివారం సాయంత్రం నుంచి ఘాట్ మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. ముంచంగిపుట్టు మండలంలో అత్యధికంగా 72.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ⇒ చాపరాయి జలపాతం ఉధృతంగా ప్రవహించడంతో జలవిహారి సందర్శనను నిలిపివేశారు. జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లకు నీరందించే డొంకరాయి జలాశయానికి వరద తాకిడి నెలకొంది. ఆదివారం సాయంత్రం నుంచి నాలుగు గేట్లు ఎత్తి 16 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన డుడుమ, జోలాపుట్టు జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో నీటిమట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. ⇒ విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే çపగలు, రాత్రి బస్సు సరీ్వసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరి పొలాలు నీట మునిగాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా శనివారం అర్థరాతి నుంచి భారీగా వర్షాలు కురిశాయి. తాండవ రిజర్వాయర్, రైవాడ, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తేశారు. ⇒ విజయనగరం జిల్లా మడ్డువలస ప్రాజెక్టులోకి 11,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేశారు. నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోంది. తాటిపూడి జలాశయం గేట్లు ఎత్తి వేసి 350 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు చేయకపోవడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. వారంతా తుపానులో చిక్కుకుపోయారని మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మరబోట్లకు గోపాల్పూర్ పోర్టులో ఆశ్రయంభావనపాడు పోర్టులో 6 బోట్లు, సిబ్బందికి ఆశ్రయం మహారాణిపేట : ప్రతికూల వాతావరణం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల విశాఖకు చెందిన పలు మరబోట్లు సముద్రంలో చిక్కుకున్నాయి. ఒడిశాలోని గోపాలపూర్, గజ్జాం జిల్లాల్లో పోర్టు లోపలికి అనుమతించకపోవడంతో మరబోట్లు, మత్స్యకారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. దీంతో అక్కడ మరబోట్ల యజమానులు, సిబ్బంది విశాఖలో ఉన్న ఏపీ మరపడవల సంఘం గౌరవ అధ్యక్షుడు పి.సి.అప్పారావు దృష్టికి తెచ్చారు.అప్పారావు వెంటనే మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ విజయ కలిసి గోపాలపూర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. సముద్రంలో చిక్కుకున్న 14 మరబోట్లను, మత్స్యకారులకు గోపాలపురం పోర్టులో ఆశ్రయం కలి్పంచాలని కోరారు. దానికి కలెక్టర్ సమ్మతించి హార్బర్లో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 14 బోట్లు, సిబ్బంది గోపాలపూర్ పోర్టులో ఆశ్రయం పొందినట్టు అప్పారావు తెలిపారు. అలాగే భావనపాడు పోర్టులో 6 మరబోట్లు, సిబ్బంది ఆశ్రయం పొందారని, మిగతా బోట్లకు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. ఆందోళనలో సిక్కోలు ప్రజలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నాగవాళికి వరద మరింత పెరిగితే తమ పరిస్థితేంటని సిక్కోలు ప్రజలు భయపడిపోతున్నారు. విజయవాడలో వరదలు సృష్టించిన బీభత్సాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య కాలంలో చేసిన ఓ ఘోర తప్పిదం.. జిల్లా కేంద్రాన్ని ముంపు ముప్పు బారిన పడేసింది. వేసవి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నాగావళి నదిలో నీటికి అడ్డుకట్ట వేసి, నిల్వ చేసుకునేందుకు శ్రీకాకుళం వద్ద డైక్ నిరి్మంచాలని 2017లో చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2018లో విశాఖపట్నానికి చెందిన తమ అనుకూల కాంట్రాక్టర్‌కు రూ.4.95 కోట్లతో పనులు అప్పగించింది. సాధారణంగా నదులపై చేపట్టే డైక్ నిర్మాణాలను జల వనరుల శాఖ అధికారులు పర్యవేక్షించాలి. కానీ, ఇక్కడి పనులను మున్సిపల్ వర్క్స్ ఇంజనీర్లకు అప్పగించారు.నేతలు చెప్పినట్టు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు వ్యవహరించి, కాంట్రాక్టర్ ఇష్టానికే పనులను వదిలేశారు. దీంతో నాసిరకం పనులు జరిగాయి. ఈ లోగా నాగావళి నదిలోకి భారీ వరద నీరు రావడంతో అప్పట్లో అంతవరకు నిర్మించిన డైక్ కొట్టుకుపోయింది. పనులు నాసిరకంగా జరగడం దీనికి ఒక కారణమైతే, ఆ డైక్ నిర్మాణానికి ముందు నాగావళి నదీ ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన ప్రాథమిక నిర్మాణాలు చేపట్టకపోవడం మరో కారణంగా చెప్పొచ్చు. నాసిరకం నిర్మాణం, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో భారీ వరదలకు డైక్ కొంత భాగం కొట్టుకుపోవడమే కాకుండా మిగిలిన నిర్మాణం కొంతమేర కిందకు దిగిపోయింది. దాని కింద ఇసుక కొట్టుకుపోయింది. దానికి తోడు ఎడమ వైపు గట్టు కోతకు గురవడంతో సమస్య జఠిలంగా మారింది. అప్పటి నుంచి నదీ గమనం పూర్తిగా మారిపోయింది. దీన్ని అధిగమించాలంటే ముందు రక్షణ గోడ నిరి్మంచాలి. డైక్ సమీపంలో వంద మీటర్ల వరకు రింగ్‌బండ్ వేసి రివిట్మెంట్ లాంచింగ్ ఏప్రాన్ వేయాల్సి ఉంది. దీంతో మళ్లీ పరిస్థితి మొదటికొచి్చనట్టయింది. డైక్ నిర్మాణాన్ని కొత్తగా చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కొట్టుకుపోయిన డైక్‌ను పరిశీలించేందుకు వచి్చన ఇంజనీరింగ్ సాంకేతిక బృందమే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నాగావళి మరింతగా పొంగి ప్రవహిస్తే నగరంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా ఇలిసిపురం, రెల్లివీధి, మరికొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిని ఊహించి నగర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.వరదెత్తిన నదులుసాక్షి, అమరావతి : పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, ఏలేరు నదులు వరదెత్తుతున్నాయి. మహోగ్రరూపం దాల్చి శాంతించినట్లు శాంతించిన కృష్ణమ్మ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల ప్రభావంతో మళ్లీ ఉగ్రరూపం దాలి్చంది. ఎగువ నుంచి వస్తున్న కృష్ణా వరదకు మున్నేరు, కట్టలేరు తదితర వాగుల వరద తోడవుతుండటంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు 4,50,442 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 202 క్యూసెక్కులు వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 4,50,240 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పశి్చమ కనుమల్లో శనివారం, ఆదివారం విస్తారంగా వర్షాలు కురువడంతో కృష్ణాలో ఎగువన వరద మళ్లీ పెరిగింది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 1.10 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి బీమా నుంచి 33 వేల క్యూసెక్కులు జత కలుస్తుండటంతో జూరాల ప్రాజెక్టులోకి 1.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.70 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి 34 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 3.07 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌లోకి చేరుతున్న 2.60 లక్షల క్యూసెక్కులను అదే రీతిలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.56 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 2.03 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. స్థిరంగా గోదావరి వరద గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరంలోకి 6,59,942 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 2,300 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 6,57,642 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భారీ వరద వస్తుండటంతో ఏలేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తి 5,775 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో నాగావళి, వంశధార పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురం ఆనకట్టలోకి నాగావళి నుంచి 18,500 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక వంశధార నది నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 7,439 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 1152 క్యూసెక్కులను విడుదల చేస్తున్న అధికారులు మిగులుగా ఉన్న 6,287 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
Telangana: మళ్లీ 'మున్నేరు' ముంపు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్నేరు పరీవాహక ప్రాంత ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోడు ఖమ్మం జిల్లాలోనూ శనివారం నుంచి వర్షం కురుస్తుండడం, వర్షాలు మరో రెండురోజుల పాటు కొనసాగే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనలతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆకేరు, మున్నేరుల్లో పెరుగుతూ తగ్గుతున్న వరద కలవరపరుస్తోంది. కనీవిని ఎరుగని కుండపోత నేపథ్యంలో ఈనెల 1న మున్నేరు, ఆకేరు ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా విరుచుకుపడిన వరద ప్రధానంగా ఖమ్మం నగరంలోని 50 కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలను ముంచెత్తి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు వరద పరిస్థితులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం సాయంత్రం 8.25 అడుగులుగా ఉన్న మున్నేరు నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ అర్ధరాత్రి 12 గంటలకు 14.80 అడుగులుగా నమోదైంది. ఆదివారం 15.75 అడుగులకు చేరుకుని తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, ఈనెల 1నాటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా శనివారం రాత్రి నుంచే ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బాధితులు కూడా ఇటీవలి భయానక పరిస్థితిని తలుచుకుంటూ బెంబేలెత్తిపోతున్నారు. అక్కడ భారీ వర్షం.. ఇక్కడ భయం ఖమ్మం జిల్లాకు ఎగువన మహబూబాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. అక్కడ ఏ ప్రాంతంలో భారీ వర్షం పడినా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాలకు వరద పోటెత్తుతుంది. ఆ విధంగానే ఈ నెల 1న భారీయెత్తున వరద ముంచెత్తింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టించింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలో ఉన్న నిత్యావసరాలు, గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 16 మండలాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి వరంగల్‌లో భారీ వర్షాలు కురిస్తే ఖమ్మం జిల్లాలోని 11 మండలాలు వరద తాకిడికి గురవుతున్నాయి. ఇక ఆకేరు పరీవాహకంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మండలాలు, ఖమ్మం జిల్లాలో రెండు మండలాలు ఉంటాయి. ఆకేరు వరద మున్నేరులోకి చేరుతుండటంతో మున్నేరు ఉధృతి మరింత తీవ్రమై ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా ఆకేరు, మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని మండలాల్లో గత పది రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. మహబూబాబాద్ జిల్లాలో గత నెల 31న, ఈనెల 1న పలు ప్రాంతాల్లో 40.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే ఖమ్మం జిల్లాలోనూ ఈ రెండు రోజుల్లో సగటు వర్షపాతం అన్ని మండలాల్లో కలిపి 20 సెం.మీ. పైగా నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయి వర్షం ఈ రెండు ఏర్ల పరీవాహక ప్రాంతాల్లో గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు. రికార్డు స్థాయి వర్షాల నేపథ్యంలోనే వరద ఉప్పెనలా పోటెత్తి లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ రెండు వాగుల వేగ ఉధృతి కూడా గతంతో పోలిస్తే పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఎన్ని గంటల్లో లోతట్టు ప్రాంతాలకు వరద చేరుతుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇటీవలి వరదలతో ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్‌నగర్, ధంసలాపురం కాలనీ.. ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. నాటి వరదతో అప్రమత్తం మున్నేరు, ఆకేరు వరదలు అధికార యంత్రాంగాన్ని షాక్‌కు గురి చేశాయి. ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. శని, ఆదివారాల్లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిõÙక్ అగస్త్య.. వరద ముప్పు ఉన్నందున ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఇంకొన్ని రోజులు ఉండాలంటూ సూచించారు. శనివారం రాత్రి కాలనీల్లో మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అర్ధరాత్రి ముంపు ప్రాంతాల ఇళ్లల్లో ఉన్న వారందరినీ మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ తర్వాత ఆయా కేంద్రాలను డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించారు. ఆదివారం కొందరు బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకుని రాత్రికి తిరిగి వచ్చారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం తరఫున నిత్యావసరాలు, మందుల పంపిణీని వేగవంతం చేశారు. -
వచ్చే వారం రోజులూ వర్షాలే
సాక్షి, అమరావతి/ మహారాణిపేట(విశాఖ): రాష్ట్రాన్ని వర్షాలు భయపెడుతూనే ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయుగుండంగా మారడానికి అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇది ఒడిశా వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, యానాం, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. -
రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: కోస్తా ఆంధ్రా, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, ఈ ఆవ ర్తనం క్రమంగా బలపడి గురువారం ఉదయం కల్లా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేసింది. 2.06 సెంటీమీటర్ల వర్షపాతం.. బుధవారం రాష్ట్రంలో సగటున 2.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలో 5.47 సెంటీమీటర్లు, మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లాలో 4.3 సెంటీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లాలో 3.12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 59.77 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 83.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 40 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళికా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. -
సహాయక చర్యల్లో ఆ మంత్రులు విఫలం
సాక్షి, హైదరాబాద్, చేగుంట(తూప్రాన్): ఖమ్మం జిల్లాలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వరదల్లో చిక్కుకున్న 9 మందిని కూడా కాపాడలేకపోయారని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం మెదక్ జిల్లా చేగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాతావరణశాఖ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే అనేక మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు.వర్షాలతో 16 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 31 మంది మృతి చెందారని తెలిపారు. ఖమ్మంలో కాపాడమని కోరుతున్న వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు సహాయక చర్యలు చేపట్టడం మానేసి బీఆర్ఎస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని నిందించారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారమివ్వాలి ఓ వైపు ప్రజలు ఆపదలో ఉంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాజకీయాలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల కన్నీళ్లు తుడవకుండా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారని ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఎకరాకు రూ.10వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, శాసన మండలి మాజీ సభ్యులు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై సోషల్ మీడియా వేదికగా బీజేపీ చేస్తున్న దాడిని హరీశ్‌రావు ఖండించారు. -
Telangana: వర్షం.. విలయం
రాత్రీ పగలూ ఎడతెరిపి లేకుండా ఒకటే వాన.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు కుండపోత.. అడుగు బయటపెట్టలేకుండా ఎటు చూసినా నీళ్లే.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు మిగిలింది కన్నీళ్లే. వాగులు, వంకలు ఉప్పొంగుతూ, చెరువులు అలుగుపారుతూ.. ఊర్లు, రోడ్లను ముంచేస్తూ అతలాకుతలం చేస్తున్నాయి. వరద దాటే ప్రయత్నం చేసిన ఎన్నో ప్రాణాలను మింగేస్తున్నాయి. ఇది మరో రెండు రోజులూ కొనసాగుతుందని, మరింతగా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చేసిన హెచ్చరికలు ఆందోళన రేపుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానల తీవ్రత శనివారం రాత్రి నుంచి మరింత పెరిగింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆగకుండా కురిసింది. దీనితో జనజీవనం అతలాకుతలమైంది. వరద పోటెత్తి, రహదారులు కోతకు గురై రాకపోకలు స్తంభించాయి. రైలు మార్గాలు దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలూ నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు నిండి అలుగెత్తాయి. వాగులు, వంకలు పోటెత్తాయి. దీనితో పదులకొద్దీ గ్రామా లు జలదిగ్భంధం అయ్యాయి. పలుచోట్ల వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలు, సహాయక చర్యలు, ముందు జాగ్రత్తల గురించి దిశానిర్దేశం చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్రూమ్భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో 040–23454088 నంబర్ ద్వారా.. వర్షాలు, వరదల పరిస్థితిపై కలెక్టర్లతో సంప్రదిస్తూ.. అవసరమైన సహాయ సహకారాలు, సూచనలను అందిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.రికార్డు స్థాయిలో వర్షపాతం..రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు సరికొత్త రికార్డును నమో దు చేశాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 9.87 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఒక్కరోజే ఇంత భారీగా వానలు కురవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో సెప్టెంబర్ 1 నాటికి 58.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతంనమోదుకావాల్సి ఉండగా.. ఈసారి 76.19 సెంటీమీటర్లు కురిసింది. ఇది సాధారణం కంటే 31శాతం అధికం కావడం గమనార్హం. మొత్తం సీజన్లో నమోదవాల్సిన వర్షపాతం.. మరో నెల రోజులు ఉండగానే కురిసింది.మరో రెండు రోజులు భారీ వర్షాలురాష్ట్రంలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షా లు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ.. ఆదిలాబాద్, నిజామాబాద్, రా జన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగా రెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, నల్లగొండ, సూర్యా పేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారా యణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.తడిసి ముద్దయిన హైదరాబాద్రెండు రోజులుగా కురుస్తున్న వానలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. శనివారం రాత్రి నుంచీ ఆదివారం మధ్యాహ్నం వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. నాలాలలో వరద పెరిగి, డ్రైనేజీలు పొంగుతున్నాయి. దీనితో లోతట్టు ప్రాంతాల కాలనీలు, బస్తీలు జలమయం అయ్యాయి. హుస్సేన్‌సాగర్ నిండిపోవడంతో తూముల ద్వారా మూసీలోకి నీటి విడుదల చేస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాలకు జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. దాదాపు 165 వాటర్ ల్యాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో.. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్‌బోర్డుల ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు ఎప్పటికప్పుడు నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి.ఖమ్మం.. అల్లకల్లోలం భారీ వర్షాల ధాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అల్లకల్లోలమైంది. పాలేరు, మున్నేరు, వైరా, ఆకేరు, కట్టలేరు నదులు పోటెత్తాయి. చాలాచోట్ల రాకపోకలు స్తంభించాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా వర్షం పడటం, ఎగువన మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షం కురవడంతో.. ఒక్కసారిగా మున్నేరు, ఆకేరు ఉగ్రరూపం దాల్చాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనట్టుగా ఖమ్మం నగరానికి వరద పోటెత్తింది. 35 కాలనీలు నీటమునిగాయి. తమను కాపాడాలంటూ కాలనీలు, గ్రామాల వాసులు నేతలు, అధికారులకు ఫోన్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇంకా చాలా మంది తమ భవనాలపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 39 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. 5వేల మంది వరద బాధితులను తరలించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్ నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వరదలను, సహాయక చర్యలను పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు కూడా పలుచోట్ల సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మణుగూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ మండలంలో సీతారామ ప్రధాన కెనాల్‌కు గండి పడింది. ములకలపల్లి మండలంలో సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడింది. వరంగల్.. ఎటు చూసినా వరదే! ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవడంతో.. జలదిగ్బంధమైంది. మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, మసి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. 56 చెరువులు తెగిపోయాయి. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ కింద కట్ట కొట్టుకుపోయింది. దీనితో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలం రావిరాల, మరిపెడ మండలం తండా ధర్మారం గ్రామపంచాయతీ సీతారాం తండాలు నీటమునిగాయి. ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్తులు.. ‘ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఆదుకోండి’ అంటూ అధికారులు, బంధువులకు ఫోన్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా వందల కొద్దీ పాత ఇళ్లు కూలిపోయాయి. వేములవాడ నుంచి భద్రాచలానికి 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. శనివారం రాత్రి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం– తోపనపల్లి శివార్లలో వరదలో చిక్కుకుంది. ప్రయాణికులు వరద మధ్య బస్సులోనే రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉమ్మడి నల్లగొండ వాన బీభత్సం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సూర్యాపేట జిల్లా కాగితరామచంద్రాపురం వద్ద, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం శివారు రంగులబ్రిడ్జి వద్ద గండ్లు పడ్డాయి. సూర్యాపేట మండలం పిల్లలమర్రి– పిన్నాయిపాలెం మధ్య మూసీ ఎడమ కాలువకు గండిపడింది. వేల ఎకరాలు నీట మునిగాయి. పలుగ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైకి వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. మఠంపల్లి మండలం చౌటపల్లిలో ఊరచెరువుకు, హుజూర్నగర్ మండలం బూరుగడ్డ చెరువు, మేళ్లచెరువులో నాగుల చెరువులు తెగిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రామన్నపేట, చౌల్లరామారం, అడ్డగూడూరులలో చెట్లు విరిగిపడ్డాయి. ఉమ్మడి మెదక్ నిలిచిన రాకపోకలు మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో నారింజ వాగు ఉప్పొంగడంతో కర్ణాటక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నర్సాపూర్–హైదరాబాద్ రహదారిపై చెట్లు కూలిపడటంతో వాహనాలు నిలిచిపోయాయి. గుండువాగు, పెద్దవాగు, గంగమ్మ వాగులు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణం జలదిగ్బంధమైంది. ఉమ్మడి రంగారెడ్డి దెబ్బతిన్న పంటలు రంగారెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలో కాగ్నా, ఈసీ, మూసీ నదులకు వరద పోటెత్తింది. దీనితో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జిల్లాలో టమాటా, ఆకుకూరల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు పరిధిలోని గౌతాపూర్ సబ్‌స్టేషన్‌లో వరద నీరు చేరడంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ నిండుకుండల్లా ప్రాజెక్టులు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వరదలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. కుమురం భీం, కడెం, వట్టివాగు, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జైనథ్ మండలం పెండల్వాడ, సాంగ్వి, ఆనంద్పూర్లలో పంటలు నీట మునిగాయి. బోథ్ మండలం పొచ్చెర జలపాతం ఉప్పొంగుతోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి వాగు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో సిద్దాపూర్ వాగు పొంగడంతో సిద్దాపూర్, కౌట్ల, ముజ్జిగి గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. నిర్మల్ మండలం చిట్యాల వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి వాగులో పడిపోయింది. వాహనంలోని వారికి ఈతరావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ రోడ్లు జలమయం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వర్షం దంచికొట్టింది. కలెక్టరేట్ ఆవరణలోని భారీ వృక్షం కూలిపడి, విద్యుత్ స్తంభం విరిగింది. వీణవంక, మామిడాలపల్లిలో వాగులు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణిలోని ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి– తాండ్య్రాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందపల్లెలోని బ్రిడ్జిపై వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి బస్టాండ్, రంగంపల్లి, పెద్దకల్వల, సుల్తానాబాద్ బస్టాండ్, రామగుండం–మల్యాలపల్లి సమీపంలో రాజీవ్ రహదారి (ఎస్‌హెచ్–1)పై వరద నీరు చేరి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి పాలమూరు దెబ్బతిన్న రోడ్లు రెండు రోజులుగా కురుస్తున్న వానలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. మహబూబ్‌నగర్ లోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. జడ్చర్ల పట్టణంలోని యాసాయకుంట తెగి పలు కాలనీలు నీటమునిగాయి. పెద్దగుట్ట రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై దోమలపెంట వద్ద కొండచరియలు విరిగిపడి.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మిడ్జిల్ మండలం మున్ననూర్ వాగు వద్ద కేఎల్ఐ ప్రధాన కాల్వకు గండిపడి 167 జాతీయ రహదారిపై నీళ్లు చేరాయి. ఇదే రహదారిపై మహమ్మదాబాద్‌లో రెండు చోట్ల రోడ్డు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ దంచికొట్టిన వాన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా పోచారం ప్రాజెక్టు నిండి అలుగు పోస్తోంది. మాచారెడ్డి, బీబీపేట, లింగంపేట, తాడ్వాయి మండలాల్లో వాగులు పొంగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాలు నీట మునిగాయి. చెట్లు కూలిపడటంతో మెదక్–ఎల్లారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వానలకు 18 ప్రాణాలు బలివానలు, వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 18 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు జరుగుతోంది. ⇒ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో పవన్ నక్కల వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు. రామగిరి మండలం రాజాపూర్‌లో అంకరి రాజమ్మ (65) విద్యుత్ షాక్‌తో మృతిచెందింది. కమాన్‌పూర్ మండలం జూలపల్లిలో వ్యవసాయ కూలీ ఇలాసారం కిరణ్ (36)కు ఫిట్స్ వచ్చాయి. వర్షంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోవడంతో మృతి చెందాడు. ⇒ నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం ఎక్కమేడులో వర్షానికి పాత ఇల్లు పైకప్పు కూలి హన్మమ్మ (60), అంజులమ్మ (40) మృతిచెందారు. ⇒ రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం దేవునిపల్లికి చెందిన ఎరుకలి శేఖర్ (35) పల్లం చెరువులో మునిగి కన్నుమూశాడు. ఇదే జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడలో రైతు యాదయ్య (50) పశువుల కొట్టానికి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి మృతి చెందాడు. ⇒ కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బొందగూడకు చెందిన టేకం గణేశ్ (35) గ్రామశివార్లలో వాగుదాటుతూ కొట్టుకుపోయి మృతి చెందాడు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రీకూతుళ్లు నునావత్ మోతీలాల్, అశి్వని.. మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయిగూడెం వద్ద వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. మధిర మండలం దెందుకూరులో గేదెలు కాసేందుకు వెళ్లిన పద్మావతి వరదలో కొట్టుకుపోయి మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వరద నీటిలో చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. అశ్వాపురం మండలంలో తోగువాగు ఉప్పొంగడంతో ఇద్దరు పశువుల కాపర్లు కొట్టుకుపోయి మృతి చెందారు. ⇒ వరంగల్ జిల్లా రాజీపేటలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన రాములు (58) మృతిచెందాడు. ఇదే జిల్లా దుగ్గొండి మండలం మందపల్లిలో వృద్ధురాలు కొండ్ర సమ్మక్క (75) వరద నీటిలో పడిపోయి మృతి చెందింది. ⇒ సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగం రవికుమార్ వాగు దాటే క్రమంలో కారుతో సహా కొట్టుకుపోయి మరణించాడు. ఉత్తమ్ పద్మావతినగర్ వద్ద యారమాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బైక్‌పై వరదను దాటుతూ ప్రమాదానికి గురై మరణించారు. -
AP: నేడు, రేపు మోస్తరు వానలు
సాక్షి, విశాఖపట్నం: కళింగపట్నం మీదుగా ఆగ్నేయంగా మధ్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.ఇది ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్యలో విస్తరించి నైరుతి వైపు వంగి ఉంది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం, బుధవారం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. రాయలసీమలో పలుచోట్ల మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయి. -
వరుణించిన నైరుతి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు సీజన్ ఆరంభం నుంచే అధిక వర్షాలు కురిపించాయి. రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 91.2 మి.మీ. కాగా.. 143.7 మి.మీ. వర్షం కురిసింది. 52.5 మి.మీ. అధిక వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 58 శాతం అధికం. సస్యశ్యామల ‘సీమ’ నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది రాయలసీమను కరుణించాయి. రాయలసీమలోని 8 జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతమే నమోదైంది. కోస్తాంధ్రలోని అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే అత్యధిక వర్షం కురవగా.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. ఇక తూర్పు గోదావరి, కాకినాడ, ఎనీ్టఆర్, పార్వతీపురం మన్యం, విజయనగరం, పశి్చమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. రాష్ట్రంలోకెల్లా శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 180 శాతం వర్షపాతం కురిసింది.ఆ జిల్లాలో జూన్‌లో 55.1 మి.మీ.లకు గాను 154.2 మి.మీ. వర్షం పడింది. ఆ తర్వాత 177 శాతంతో అనంతపురం రెండో అత్యధిక వర్షం కురిసిన జిల్లాల్లో నిలిచింది. అక్కడ 63.6 మి.మీ.లకు 176.2 మి.మీ. వర్షం కురిసింది. రాష్ట్రంలో వాతావరణ విభాగం పరిధిలో కోస్తాంధ్ర, రాయలసీమ సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ లెక్కన కోస్తాంధ్రలో 105.6 మి.మీ.లకు 129.1 మి.మీ. (22 శాతం అధికం), రాయలసీమలో 70.7 మి.మీ.లకు 160 మి.మీ. (127 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. సీమలోనే ఎక్కువ ఎందుకంటే.. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణాలున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు జూన్ ఆరంభంలోనే రాయలసీమ మీదుగా కోస్తాంధ్రలోకి ప్రవేశించాయి. ఆ సమయంలో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాలోకి విస్తరించిన రుతుపవనాలు ముందుకు కదలకుండా 10 రోజులపాటు స్తబ్దుగా ఉండిపోయాయి. దీంతో ఆ సమయంలో రాయలసీమలో వర్షాలు కొనసాగాయి. కోస్తాంధ్రలో.. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో తేలికపాటి జల్లులే కురిశాయి. దీంతో రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతం రికార్డయింది.జూలైలోనూ సమృద్ధిగా.. జూన్ నెలలో ఆశాజనకంగా కురిసిన వర్షాలు జూలైలో మరింత సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతు పవనాల ప్రభావం జూలైలో అధికంగా ఉంటుందని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. అలాగే జూలై నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉందని.. ఇవి కూడా వర్షాలు కురవడానికి దోహదపడతాయని చెబుతున్నారు. -
మళ్లీ అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగనున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో గత పది రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ వచ్చాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారడం, నైరుతి సీజన్‌కు సమయం అనుకూలంగా మారుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. ఉక్కపోత కూడా తీవ్రం కానుందని తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరానికి సమీప నైరుతి ప్రాంతంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్ప పీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్ప పీడనం ఈశాన్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికీ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత ఈ వాయుగుండం ఈశాన్య దిశలో కదులుతూ మరింత బలపడి ఈ నెల 25న ఈశాన్య, దానికి ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని తెలిపారు. రుతుపవనాలకు అనుకూలంగా..నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచిమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్టంగా మెదక్‌లో 24.3 డిగ్రీ సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
రేపు అల్పపీడనం! రాష్ట్రానికి మూడు రోజులు వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తొలుత వాయవ్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. కాగా సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పసుమాములలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సరిహద్దు జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం చాలాచోట్ల సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
రెండ్రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో అత్యధికంగా 40.5 డిగ్రీ సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో అత్యధికంగా 24.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఈనెల 14 నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని ఆ శాఖ తెలిపింది. -
3 రోజులు తేలికపాటి వానలు!
సాక్షి, హైదరాబాద్: అధిక ఉష్ణోగ్రతలు, ఉక్క పోతతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ కాస్త చల్లని కబురు చెప్పింది. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడతాయని ప్రకటించింది. మరోవైపు ఈ మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదుకావొచ్చని పేర్కొంది.19 జిల్లాల్లో వానలకు చాన్స్: ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో మంగళ, బుధ, గురు వారాల్లో ఉరు ములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన తేలిక పాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకా శం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్ద పల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జన గామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. వానలకు సంబంధించి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.జల్లులు పడినా ఎండల మంటలే..రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దానితో ఆదివారం రాత్రి వాతావరణం కాస్త చల్లబడింది. అయినా సోమవారం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా గుల్లకోట, అల్లిపూర్‌లో 46.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైనే నమోదైంది. వచ్చే మూడు రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
నిడమనూరు@44.5 రాష్ట్రం నిప్పుల కొలిమి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేగంగా వీస్తున్న వడగాడ్పులు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరుసగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ మూడో వారం లేదా చివరి వారంలో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మొదటి వారం నుంచే వేడి గాలులు వీయడం ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని అధికారులు వివరిస్తున్నారు. సోమవారం సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఏప్రిల్ 8న రాష్ట్రంలో నమోదు కావాల్సిన సగటు ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్ కాగా 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సాధారణ సగటు కంటే 32 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 42 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదు కావడం గమనార్హం. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలతో కుతకుతలాడాయి. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదైంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడంతో తక్కువ ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ వాతావరణంలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత అధికంగా ఉంది. తప్పనిసరైతేనే బయటకెళ్లాలి రానున్న రెండ్రోజులు భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సీయస్ నుంచి 44 డిగ్రీ సెల్సీయస్ మధ్యన నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళ, బుధ వారాల్లో ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్నిచోట్ల వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. -
సమ్మర్ సలసల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల తొలివా రం నుంచి క్రమంగా పెరగాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డవుతున్నాయి. దీంతో ఇక నడి వేసవి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన అందరిలో కలుగుతోంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పు లతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితిలో తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతేడాది కంటే 2.5 డిగ్రీలు అధికంగా... నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజున 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గురువారం రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఈ ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతతో పోలిస్తే ప్రస్తుతం సగటున 1 డిగ్రీల సెల్సీయస్ నుంచి 2.5 డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదవగా హైదరాబాద్‌లో 2.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
AP: జర జాగ్రత్త.. మూడు రోజులు మండే ఎండలే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత పెరగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో ఏప్రిల్, మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, రానున్న మూడు రోజుల్లో ప్రతీరోజు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో అత్యధికంగా 42.2, నంద్యాలలో 42 డిగ్రీలు, అనంతపూర్‌లో 41.2 డిగ్రీలు, కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే 2.6 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న(సోమవారం) రికార్డు అయ్యింది. ఇక, రాష్ట్రంలో విశాఖలోనే అత్యల్పంగా 31.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. సోమవారం అనకాపల్లి, విజయనగరం, నంద్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రంగా వడగాలులు వీచాయి. మంగళ, బుధవారాల్లో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం ఆరు మండలాల్లో తీవ్రవడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
చలి పెరిగింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు నెలకొన్నాయి. దీంతో క్రమంగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు మరింత పడిపోయాయి. ఉష్ణోగ్రతల పతనానికి తో డుగా ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కుమ్రుంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదారిలో 6.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. అంతటా తగ్గుదలే... రాష్ట్ర మంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్. కానీ ప్రస్తుతం సగటు కనిష్ట ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల వారీగా పరిశీలిస్తే మెదక్, హన్మకొండలో సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ, రామగుండంలో, అదిలాబాద్ కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర తక్కువగా, ఇతర ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర తక్కువగా నమోదై నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకో రెండు రోజులు ఇలానే రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 30డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
రాష్ట్రం గజగజ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈసారి ఉత్తరాంధ్రతోపాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుంతలంలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అరకు ఏజెన్సీలో ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయని, జనవరి మొదటి, రెండు వారాల్లో 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతాయని, దీనివల్ల చలి తీవ్రత ఇంకా పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం తక్కువగానే... రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గాయి. సాధారణంగా ఈ సమయంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాలి. ఇప్పుడు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగుతోంది. లక్షద్వీప్, తమిళనాడుతోపాటు అరేబియా సముద్రంలో ఆవర్తనాల వల్ల దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ ఆవర్తనాల ప్రభావంతో కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ నెలాఖరులో బంగాళాఖాతంలో తమిళనాడులోని మహాబలిపురం వద్ద తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 4వ తేదీన బంగాళాఖాతంలో మరో తుపానుకు అవకాశం ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. -
తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన.. తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన అతి తీవ్ర తుపాను మంగళవారం సాయంత్రం తుపానుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల ప్రాంతంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా బలహీన పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో సగటున 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వారావుపేటలో ఏకంగా 13.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా దమ్మపల్లి, ముల్కలపల్లి, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు! వాతావరణ పరిస్థితుల దృష్ట్యా బుధవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు నమోదు కావొచ్చని హెచ్చరించింది. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల నమోదుకు అవకాశం ఉన్నట్లు వివరించింది. తగ్గిన ఉష్ణోగ్రతలు తుపాను ప్రభావంతో వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. గత రెండ్రోజుల వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా... మంగళవారం సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధ, గురు వారాల్లో ఇదే తరహాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మంగళవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 28.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్‌లో 18.7 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. వరి, పత్తి పంటలకు నష్టం ♦ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం ♦ నేల కొండపల్లిలో గుడిసె కూలి భార్యాభర్తలు మృతి ♦ సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. ♦ నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు సాక్షి నెట్వర్క్, ఖమ్మం, నేలకొండపల్లి: తుపాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. సోమవారం సాయంత్రం మొదలైన వాన మంగళవారం తగ్గుముఖం పట్టినా మళ్లీ సాయంత్రం పెరిగింది. రాత్రి పొద్దుపోయే వరకు జిల్లావ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. కొన్నిచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో విద్యాసంస్థలకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించారు. మరోపక్క కలెక్టరేట్లలో కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేసిన అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు బోట్లు సమకూర్చడంతో పాటు గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. భద్రాచలానికి 20 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, పది మందితో కూడిన ఇతర అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యా రు. సింగరేణి ఓసీల్లో నీరు నిలవడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న వర్షం రోజంతా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో గోడలు నాని పూరిగుడిసె కూలడంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామానికి చెందిన నూకతోటి పుల్లారావు(40) – లక్ష్మి (30) దంపతులు మృత్యువాత పడ్డారు. మట్టిపెళ్లలు మీద పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. అప్పటివరకు చుట్టుపక్కల వారితో మాట్లాడి ఆ దంపతులు ఇంట్లోకి వెళ్లగా.. ఒక్కసారిగా శబ్దం రావటంతో స్థానికులు వెంటనే స్పందించారు. 108కు సమాచారం ఇవ్వగా అక్కడి చేరుకున్న సిబ్బంది అప్పటికే భార్యాభర్తలు మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే నిరుపేద దంపతులు అకాల వర్షంతో మృతి చెందడం గ్రామస్తుల్లో విషాదాన్ని నింపింది.