
సాక్షి, హైదరాబాద్: ఓవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం, మరోవైపు అల్పపీడనం కారణంగా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అంచనావేసింది. పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని వెల్లడించింది.
రెండు రోజులు (గురువారం, శుక్రవారం) మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావారణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
(చదవండి: వాన లోటు తీరినట్టే!)
కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
(చదవండి: తెలంగాణలో నేడు, రేపు స్కూల్స్ బంద్)