సాక్షి, హైదరాబాద్: రుతుపవనాల ఆలస్యంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే.. రైతులకు సాగు నీటిని సరఫరా చేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. అందుకు ఎంత ఖర్చ యినా ఫర్వాలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల కోసం ఏర్పాట్లు చేయాలని, అన్ని రిజర్వాయర్లను నింపాలని సూచించారు.
వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. అయితే.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీటి విడుదలకు కొన్నిరోజులు విరామం ఇచ్చి, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జూలై తొలి వారం నాటికి వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఇతర అంశాలపై మరోసారి సమీక్షించుకుని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సీఎం కేసీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్షించారు.
కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతలతో..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను ఆగస్టులోనే సమీక్షించి.. కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30– 35 టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది మల్లన్నసాగర్‌లో మరో 10 టీఎంసీలు నింపాలన్నారు. రంగనాయకసాగర్‌లో 3 టీఎంసీల సామర్థ్యానికిగాను 0.69 టీఎంసీలే ఉన్నాయని ఇంజనీర్లు వివరించగా.. మిడ్‌మానేరు నుంచి వెంటనే 2 టీఎంసీలను ఎత్తిపోయాలని, దీంతో రంగనాయకసాగర్ కింద వానాకాలం పంటలకు నీరు అందించడానికి వీలవుతుందని సూచించారు. నిజాంసాగర్‌లో ఉన్న 4.95 టీఎంసీల నీళ్లు ఆగస్టు చివరివరకు 3 తడులకు సరిపోతాయని, తర్వాత మరో 3 తడులకు 5 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు సమీక్షలో వివరించారు. దీనితో ఆగస్టులో కొండపోచమ్మసాగర్ ద్వారా 5 టీఎంసీలను నిజాంసాగర్‌కు తరలించాలని సీఎం సూచించారు.
జలాశయాలన్నీ నింపి పెట్టుకోవాలి
వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో ఆగిపోయాక కూడా.. అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరిలో ప్రవాహాలు ఉంటాయి. రెండో పంట అవసరాలకు ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్లలో తగినంత నీటిని నింపి పెట్టుకోవాలని సమీక్షలో నిర్ణయించారు. ఇందుకోసం ఎన్ని పంపులు, ఏ సమయంలో ఆన్ చేయాలనే విషయంపై ఒక ఆపరేషన్ మ్యాన్యువల్ తయారు చేయాలని సీఎం ఆదేశించారు.
వార్ధా ప్రాజెక్టుకు అనుమతులివ్వండి
వార్ధా బ్యారేజీ ప్రాజెక్టు కోసం రూ.4,252.53 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, పరిపాలన అనుమతులు త్వరగా ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ కోరగా.. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతికుమారి, ఈఎన్సీలు మురళీధర్, ఎన్.వెంకటేశ్వర్లు, శంకర్, సీఈలు హమీద్‌ఖాన్, రమణారెడ్డి, శ్రీనివాస్, అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘పాలమూరు’ లిఫ్టింగ్‌కు సిద్ధం చేయండి
తాగునీటి అవసరాల కోసం ఆగస్టు చివరికల్లా పాలమూరు–రంగారెడ్డి నుంచి నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్ధండాపూర్ జలాశయాల్లోకి నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, సమర్థులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని సూచించారు. ఇక తాగునీటి అవసరాల కోసం మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి జలాశయంలోకి నీటిని ఎత్తిపోయాలని ఆదేశించారు. గౌరవెల్లి ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం కాల్వల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.
26 నుంచి రైతుబంధు
వానాకాలం పంటల కోసం జూన్ 26 నుంచి రైతుబంధు సొమ్ము పంపిణీని ప్రారంభించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోడు భూముల పట్టాల పంపిణీ పూర్తయ్యాక పట్టాలు పొందిన గిరిజన రైతులకు రైతుబంధు అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment