కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్‌ వ్యూహం ఫలించేనా? | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్‌ వ్యూహం ఫలించేనా?

Published Tue, Nov 28 2023 10:59 AM

KSR Comments Over EC Stop BRS Rythu Bhandhu In Telangana - Sakshi

తెలంగాణ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ఒకదానిపై ఒకటి పోటీ పడుతూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన వివాదం రైతుబంధు నిధుల పంపిణీ. తొలుత రైతులకు ఈ నిధుల పంపిణీకి అనుమతించిన ఎన్నికల సంఘం, మళ్లీ దానిని నిలిపివేయడంతో పార్టీల మధ్య రచ్చరచ్చ అయింది. 

రైతుబంధు ఆగడం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి ప్రయోజనం అన్నది ఆలోచిస్తే రాజకీయంగా బీఆర్ఎస్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పక తప్పదు. నిజానికి రైతుబంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ పేటెంట్. ఆయన కొన్ని సంవత్సరాలుగా దీనిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రతీ సీజన్‌లోనూ ఎకరాకు ఐదువేల రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలలో పెట్టుబడి సాయం కింద జమ చేస్తున్నారు. ఎన్నికల ముందు ఈ డబ్బు వేస్తే రాజకీయంగా ఉపయోగం ఉంటుందని ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంటుంది. అలా చేయడం రైటా? రాంగా? అన్న చర్చలోకి వెళ్లడం లేదు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం  ఎన్నికల సంఘం అనుమతి కోరడం, దానికి ఈసీ ఓకే చేస్తూ కొన్ని కండీషన్‌లు పెట్టడం జరిగింది. వాటి ప్రకారం ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోరాదు.

కానీ,  మంత్రి హరీశ్‌రావు అత్యుత్సాహంతో ఎన్నికల ప్రచార సభలో పోలింగ్‌కు ముందే రైతుబంధు డబ్బులు జమ అవుతాయంటూ  చేసిన వ్యాఖ్య ఆ పార్టీకి చికాకు అయింది. తాను కేవలం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించానని, కాంగ్రెస్ ఫిర్యాదువల్లే ఇది ఆగిందని ఆయన అంటున్నారు. ఈ పరిణామంతో నెగిటివ్ రాకుండా చూసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌ రావు, ఎమ్మెల్సీ కవిత తదితర బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా రంగంలోకి దూకారు. రైతు బంధు నిలిపివేత అంశం అంతటిని కాంగ్రెస్‌పై నెట్టడానికి బీఆర్ఎస్ నేతలు  తీవ్రంగా యత్నించారు. కానీ,  ఎన్నికల సంఘం నేరుగా హరీశ్‌ రావు పేరు ప్రస్తావించడంపై వివరణ ఇవ్వలేని పరిస్థితిలో వారు పడ్డారు.

అయితే, ఎటూ తామే పవర్‌లోకి వస్తామని, డిసెంబర్ ఆరో తేదీన ఈ డబ్బు రైతులకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఇన్నేళ్లుగా ఈ స్కీమును అమలు చేస్తున్నారు కనుక రైతులు విశ్వసించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ కోణంలో బీఆర్ఎస్‌కు పెద్ద నష్టం ఉండదు. నిజానికి రైతులకు మరో పది రోజుల తర్వాత వారి ఖాతాలలోకి రైతుబంధు నిధులు జమ చేస్తే వచ్చే సమస్య ఏమీ ఉండదు. ఇన్నాళ్లు ఆగిన రైతులు మరో పది రోజులు ఆగలేకపోరు. కానీ, బీఆర్ఎస్ వేసిన వ్యూహానికి ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. సరిగ్గా పోలింగ్ రెండు రోజుల మందు డబ్బులు పడితే రైతులంతా సంతోషిస్తారని, తద్వారా రాజకీయంగా తమకు మేలు కలుగుతుందని అనుకొని ఉండవచ్చు. కానీ, అనూహ్యంగా ప్లాన్ రివర్స్ అవడం వారికి నిరుత్సాహం కలిగించవచ్చు.  

బీఆర్ఎస్ నేతలంతా జనంలోకి వెళ్లి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదువల్లే రైతుబంధు ఆగిందని  చెబుతున్నారు. దీనిని కాంగ్రెస్ తిప్పికొట్టడానికి కృషి చేస్తున్నా, రైతులు ఈ పార్టీ వల్లే రైతుబంధు నిలిచిందని నమ్మితే కొంత నష్టం జరగవచ్చు. ఇప్పటికే రేవంత్, తదితరులపై రైతు వ్యతిరేక ముద్ర వేస్తూ కేసీఆర్ తదితరులు ప్రచారం సాగిస్తున్నారు. మూడు గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని రేవంత్ అన్నారని, రైతుబంధు డబ్బులు దండగ అని మరో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెప్పారంటూ వీరు ఈ నెల రోజులపాటు విపరీత ప్రచారం చేశారు. దానిని తోసిపుచ్చలేక కాంగ్రెస్ సతమతమైంది. ఇప్పుడు రైతుబంధు నిధులను కాంగ్రెస్ ఆపిందన్న విమర్శను ఎదుర్కోవలసి వస్తోంది. 

అందుకే రేవంత్ రెడ్డి తెలివిగా  కౌంటర్ ఇస్తూ, కాంగ్రెస్  అధికారంలోకి రాగానే  తాము హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. దీనికి రైతులు ఆకర్షితులైతే కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్రయోజనం జరగవచ్చు. కాకపోతే అధికారంలోకి వచ్చిన ఎన్నాళ్లకు పదిహేనువేలు ఇస్తారో రేవంత్ చెప్పలేదు. పైగా అది అంత తేలికకాదన్న విషయం అందరికీ తెలుసు. పదివేల రూపాయలనే  రెండు విడతలుగా ఇవ్వడానికే వేల కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. అలాంటిది ఒకేసారి ఎకరాకు పదిహేనువేల చొప్పున ఇవ్వడం అంటే దాదాపు అసాధ్యమే కావచ్చు. అయినా రైతులు తమకు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని నమ్మితే అది కాంగ్రెస్‌కు మేలు చేయవచ్చు.  

బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ  విషయంలో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి ఘట్టాలు జరగకపోలేదు. 1999 ఎన్నికల సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఆనాటి కాంగ్రెస్ నేత రోశయ్య ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దానిపై తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేసింది. కాంగ్రెస్ వల్ల పేదలకు నష్టం జరుగుతోందని చంద్రబాబు ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో దీని ప్రభావం ఎంత పడిందన్నది వేరే విషయం. ఎందుకంటే వాజ్ పేయిపై ప్రజలలో ఉన్న సానుభూతి ఉపయోగపడి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆయా  స్కీములలో ఎన్నికల ముందు  డబ్బులు ఇచ్చినంత మాత్రాన పార్టీలు అధికారంలోకి రావాలని లేదు. ఒక్కోసారి ప్రయోజనం ఉంటుంది. ఇంకోసారి ఉండకపోవచ్చు.

ఉదాహరణకు 2019లో ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ హడావుడిగా రెండు స్కీములు తెచ్చి వేల కోట్ల పందారం చేసింది. అయినా ఆ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. 2018 ఎన్నికలలో  తెలంగాణలో బీఆర్ఎస్‌కు రైతుబంధు పథకం బాగా ఉపయోగపడింది. దానికి కారణం కేసీఆర్‌ను జనం నమ్మడమే.

అయితే,  ఎన్నికల సమయంలో ఇలాంటివి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఈ తరహా  స్కీముల విషయంలో ఫిర్యాదు చేస్తే ఒకరకంగా, ఫిర్యాదు చేయకపోతే ఇంకో రకంగా రాజకీయం ఉంటుంది. అది ఆ సందర్భాన్ని బట్టి ప్రజల మూడ్‌ను బట్టి ఉంటుంది. రైతుబంధు నిధుల తాత్కాలిక నిలిపివేత వల్ల రాజకీయ పార్టీలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో కానీ, రైతులకు పెద్ద నష్టం ఉండదని చెప్పవచ్చు.


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
 
Advertisement