చాలాకాలం తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పులిలా గాండ్రించారా?. ఆ పులిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదరగొట్టే ప్రయత్నం చేశారా?. రేవంత్‌కు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. కేసీఆర్‌ను ముగ్గులోకి దించి ఆయనతో విమర్శలలో సైతం తలపడి పైచేయి సాధించాలన్నది వాంఛగా కనిపిస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ పదిహేను నెలల కాలంలో పలుమార్లు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శాసనసభలో సైతం ఘాటుగా మాట్లాడారు. ఎలాగైనా కేసీఆర్‌ను రెచ్చగొట్టాలన్నది ఆయన వ్యూహంగా కనిపించేది. ఇప్పటికైతే రేవంత్ ఆశించినట్లు జరిగిందని చెప్పాలి. కానీ, వాదోపవాదాలలో ఆయన ఎంత వరకు సఫలం అయ్యారన్నదే ప్రశ్న..
కేసీఆర్ ఇంతకాలం దాదాపు పూర్తి మౌనం పాటించారు. కారణం ఏదైనా ఒక కార్యక్రమంలో బీఆర్ఎస్‌కు ఉత్తేజం తెచ్చేలా ప్రసంగం చేశారు. తెలుగు రాష్ట్రాలలో మంచి భాషలో పదునైన పదాలు వాడే శక్తి కేసీఆర్ సొంతం అని చెప్పాలి. ఆయనకు ధీటుగా తెలంగాణలో కాంగ్రెస్ గతంలో స్పందించలేకపోయేది. రేవంత్ రెడ్డి పీసీపీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ లోటు కొంత తగ్గిందని చెప్పాలి. రేవంత్ చాలా దూకుడుగా కేసీఆర్‌పైన, ఆయన కుటుంబంపైన విమర్శలు చేసేవారు. కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదాలు, ఈగో సమస్యతో పాటు గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్‌పై ఏర్పడిన వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది.
ఆరు గ్యారంటీలు, తదితర హామీలు కూడా కాంగ్రెస్‌కు ఉపయోగపడ్డాయి. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కేసీఆర్ ముందున్న సవాలు అయితే, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం రేవంత్‌కు ఉన్న ఛాలెంజ్. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరో చిన్న నేత ఎక్స్‌లో పెట్టిన పోల్ కేసీఆర్‌కు ప్రయోజనకరంగా మారింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కావాలా?. ఫాం హౌస్ ప్రభుత్వం కావాలా? అని పోల్ పెడితే 67 శాతం మంది ఫాం హౌస్ పాలనే బెటర్ అని, మిగిలిన 33 శాతం కాంగ్రెస్‌కు అనుకూలంగా అభిప్రాయం తెలిపారు. ఇది సహజంగానే రేవంత్‌కు కాస్త చికాకు తెప్పిస్తుంది. కేసీఆర్ తన ప్రసంగంలో ఆ పాయింట్‌ను అడ్వాంటేజ్ చేసుకోవడానికి గాను ప్రజాభిప్రాయం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణ శక్తి ఏమిటో మళ్లీ చూపిస్తామని, తాను కొడితే వట్టిగా ఉండదు అంటూ సీరియస్ వ్యాఖ్య చేశారు. ఇంతకాలం గంభీరంగా, మౌనంగా చూస్తూ వచ్చానని, ఏడాదిలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ దివాళా తీయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాళ్లు దొరికితే జనం కొట్టేలా ఉన్నారని కూడా ఆయన అన్నారు.
ఈ ఊపులో ఆయన ఫిబ్రవరిలో ఒక భారీ బహిరంగ సభ పెడతామని ప్రకటించారు. కేసీఆర్ వ్యాఖ్యలు సహజంగానే బీఆర్‌ఎస్ నేతలలో, కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. కాంగ్రెస్‌లో కాకను పెంచుతాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు పార్టీని గట్టిగానే నడుపుతున్నప్పటికీ అసలు నేత కేసీఆర్ కావడంతో ఆయన ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారా అని కేడర్ ఎదురు చూసింది. కేసీఆర్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ పులి లేచింది అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏడాదిపాటు సైలెంట్‌గా ఉన్నారు. కానీ, ఇకపై నిజంగానే జనంలోకి వచ్చి తిరుగుతారా? లేక అప్పుడప్పుడు ఇలా స్పెషల్ షోలకు పరిమితం అవుతారా? అన్నది అప్పుడే చెప్పలేం. నగరానికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్ లోనే ఆయన ఎక్కువకాలం గడపడం బలహీనతగానే చెప్పాలి.
కేటీఆర్, హరీష్ రావులు ఇంత గట్టిగా పనిచేయడం కష్టం అవుతుందని అనుకున్నారేమో తెలియదు కానీ, ఆయన కార్యకర్తలకు అంతగా అందుబాటులో లేరని చెబుతారు. శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలైన తర్వాత కేసీఆర్ బాగా డీలా పడ్డారు. తాను బాగా పని చేశానని, అయినా ఓటమి పాలయ్యాయని బాధపడుతుండవచ్చు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు దీనికి కారణమని ఆయన అభిప్రాయపడుతున్నారు. దీనిని కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని వీక్ పాయింట్స్‌ను పట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. కానీ, ముందుగా బీఆర్ఎస్‌లో ఉన్న బలహీనతలను ఆయన గుర్తించగలగాలి. భారతీయ జనతా పార్టీ ఒకవైపు బీఆర్ఎస్ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోంది. దానికి తగినట్లుగానే ఆ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలలో ఎనిమిది స్థానాలు సంపాదించి సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు రాకపోవడం బాగా ఇబ్బంది కలిగించే అంశమే.
బీజేపీ గెలుపునకు పరోక్షంగా బీఆర్ఎస్ సహాయపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కేసీఆర్ అంత యాక్టివ్ కాకపోయినా, కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేకపోవడం, ప్రభుత్వపరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీఆర్ఎస్‌కు ప్రయోజనం కలిగించాయి. పార్లమెంటు ఎన్నికలలో ఓటమి పాలైనా, అసెంబ్లీ ఎన్నికలలో ఆ పరిస్థితి ఉండదని బీఆర్ఎస్ భావన. కాకపోతే ఇంకా దాదాపు నాలుగేళ్లు పోరాటాలు సాగించాలి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అధికంగా మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే స్థానిక ఎన్నికలలో బీఆర్‌ఎస్ కనుక గణనీయమైన స్థానాలు సాధించగలిగితే అప్పుడు కాంగ్రెస్ భయపడే పరిస్థితి వస్తుంది. కానీ, అది అంత తేలికకాదు. అంతేకాక కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ తలనొప్పి కాకుండా ఉండాలి. ఇకపై రేవంత్ మరింతగా కవ్విస్తుంటారు. దానిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు? అన్నది కూడా ఆసక్తికరమైన అంశమే అవుతుంది.
మరికొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చూసుకోగలగాలి. దానివల్ల పార్టీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇక రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వ్యూహాలను ఎలా ఎదుర్కుంటారన్న దానిపై కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అనాలోచితంగా ఏదో మంచి జరుగుతుందనుకుని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో పోల్ పెట్టి నాలుక కరచుకోవాల్సి వచ్చింది. ఈ పోల్ నిజంగానే ప్రజలలో ఉన్న అభిప్రాయానికి దర్పణం పడుతోందా? లేదా? అన్నదానిపై రేవంత్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హైడ్రా దూకుడు, ఆరు గ్యారంటీల అమలులో ఉన్న ఇబ్బందులు, అవి కాక ఎన్నికల ప్రణాళికలోని ఇతర హామీలు, వివిధ వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్లు .. ఇవన్నీ కూడా కాంగ్రెస్‌కు ఇరకాటమైనవే అని చెప్పాలి. హామీలను నెరవేర్చాలన్న తాపత్రయం ఉన్నా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అందుకు అవకాశం ఇవ్వడం లేదు. తెలంగాణాకు ఆదాయం బాగానే ఉన్నా, ఈ హామీలకు అది సరిపోవడం లేదు. అందుకే పైలట్ ప్రాజెక్టు పేరుతో మండలానికి ఒక గ్రామం చొప్పున తీసుకుని స్కీముల అమలుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల కూడా కొంత నష్టం జరగవచ్చు.
గతంలో కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టి అందరికీ ఇవ్వలేక సతమతమయ్యారు. దాని ఫలితంగా బీఆర్ఎస్‌కు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు అలాంటి వాతావరణమే కాంగ్రెస్‌కు ఎదురవుతోంది. ఈ నేపధ్యంలో పోల్ లో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏర్పడిన అభిప్రాయం కలిగింది. దీనిపై రేవంత్ స్పందన అంత బాగోలేదని చెప్పాలి. కేసీఆర్‌ను రాకీ సావంత్ తో పోల్చడం సరికాకపోవచ్చు. కేసీఆర్ తాను కొడితే వట్టిగా ఉండదన్న వ్యాఖ్య కేవలం హైప్ కోసమే చేసింది అయినా, రేవంత్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే వ్యక్తిగతంగానే మాట్లాడారనిపిస్తుంది. ముందు సరిగా నిలబడడం నేర్చుకో అని ఆయన అన్నారు. కేసీఆర్‌ను చెల్లని వెయ్యి రూపాయల నోటుతో పోల్చారు. దమ్ముంటే అసెంబ్లీకి రా అని సవాల్ చేయడం సరైనదే అని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్‌కు ప్రతిపక్షనేత హోదా ఉందన్న సంగతి మర్చిపోకూడదు.
ఈ విషయంలో బీఆర్ఎస్‌కు కొంత ఇబ్బందే. అయితే, కేసీఆర్ నిత్యం ప్రజలకు, ముఖ్యంగా కేడర్‌కు అందుబాటులోకి వచ్చి, టూర్లు మొదలు పెడితే వచ్చే స్పందనపై బీఆర్ఎస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజలలో కొంత వ్యతిరేకత ఎదుర్కుంటున్న మాట నిజం. దానిని అధిగమించడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రేవంత్ ఏ చర్యలు తీసుకుంటారన్నదానిపై, ప్రజలలో సానుకూల అభిప్రాయం ఎలా కలిగిస్తారన్న దానిపై కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్‌ను బలహీనపరచాలన్న లక్ష్యంతో ఆ పార్టీ వారిని కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చినంత మాత్రాన పూర్తి ఫలితాన్ని ఇవ్వదన్న సంగతి ఆ పార్టీ నేతలకు అర్దం అయి ఉండాలి.
కేసీఆర్ చేస్తున్న మరో ముఖ్యమైన విమర్శ రియల్ ఎస్టేట్ బలహీనంగా ఉండడం. అది దేశవ్యాప్తంగా ఉన్న విషయమే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ద్వారా చేసిన కూల్చివేతలు కూడా కొంత నష్టం చేశాయి. దానిని కవర్ చేసుకోవడానికి ప్రభుత్వం కొంత యత్నం చేస్తోంది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు బాగా జరిగితే రేవంత్ ప్రభుత్వం అడ్వాంటేజ్‌లోకి వెళుతుంది. కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని వినియోగించుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను దెబ్బకొట్టడానికి బీజేపీ సహజంగానే యత్నిస్తుంది. రాష్ట్రంలోని అధికారంతో పట్టు బిగించాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. పులిగా మారతారో లేదో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవడం కేసీఆర్ ముందున్న అతి పెద్ద సవాల్ అని చెప్పక తప్పదు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment