
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సెంటిమెంట్‌తో మరోసారి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆయన తన తొమ్మిదిన్నరేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్దిని ప్రస్తావిస్తూనే, తన సహజశైలిలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయితే తాము అధికారంలో ఉండగా జరిగిన తప్పులను సమీక్షించుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు.
ప్రత్యేకించి.. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను తేలికగా తీసుకుంటున్న అభిప్రాయం కలుగుతుంది. శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయడం లేదంటే అర్థం చేసుకోవచ్చు కాని లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడం బీఆర్‌ఎస్(BRS)కు పెద్ద షాకే. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత ఘోరమైన ఫలితాన్ని చవిచూడలేదు. ఈ పరిస్థితి ఎందుకు అనేదానిపై ఆయన దృష్టి పెట్టారో, లేదో తెలియదు. కేసీఆర్(KCR) పార్టీ కంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కే ఎక్కువగా పరిమితమవుతున్నారు అని పార్టీ భావిస్తోంది. బీఆర్‌ఎస్ శ్రేణులు సైతం ఆయనను కలవాలంటే అంత దూరం వెళ్లాల్సి వస్తోంది. కేసీఆర్ కుమారుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావులు యాక్టివ్ గా ఉండడం బాగానే ఉన్నా.. ప్రధాన నాయకుడిగా కేసీఆర్ కూడా అందుబాటులో ఉండవలసిన అవసరముంది.
తెలంగాణ రక్షణ కవచం బీఆర్‌ఎస్ అని చెప్పుకున్నా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ టీఆర్‌ఎస్ నుంచి పేరు మారిన బీఆర్‌ఎస్ అని ప్రకటించినా.. పార్టీకి కొత్తగా వచ్చేదేమీ ఉండదు. తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన మాట నిజం. ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్దిలో విశేష కృషి ఉంది. అందువల్లే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో బీఆర్‌ఎస్ పూర్తి మెజార్టీని సాధించింది. తెలంగాణ రూరల్ ప్రాంతంలో మాత్రం పార్టీ బాగా దెబ్బతింది. ఫలితంగా అనూహ్యమైన ఓటమిని చవిచూడవలసి వచ్చింది. ఇందుకు.. కాంగ్రెస్ ప్రకటించిన హామీల ప్రభావం కొంత ఉండవచ్చు. కాని అదే టైమ్ లో కెసిఆర్ యాటిట్యూడ్ , అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్లు, మొదలైన కారణాల వల్ల కూడా పార్టీకి నష్టం జరిగింది.
శాసనసభ ఎన్నికలలో 38 సీట్లు గెలుచుకున్న బీఆర్‌ఎస్‌లోక్ సభ ఎన్నికలలో దారుణ పరాజయం ఎదుర్కొనప్పటికీ.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్న మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ తప్పులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి.. ఇందుకు ఉపకరిస్తున్నాయి. కాంగ్రెస్ వాగ్దానాల అమలుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అవి అలవి కావడం లేదు. ఈ అంశాల ఆధారంగా బీఆర్‌ఎస్‌లో జోష్ నింపడానికి కేసీఆర్ యత్నించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉంది.
కానీ.. కేసీఆర్ కేవలం ప్రసంగం చేసి తిరిగి ఫామ్ హౌస్‌కే పరిమితమైతే అంత ఉపయోగపడకపోవచ్చు. ఈ విషయాన్ని పక్కనబెడితే కేసీఆర్ ఉపన్యాసంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలను ప్రస్తావించారు. తద్వారా తెలంగాణ ఫీలింగ్‌ను పెంచడం ద్వారా రాజకీయం చేయడం అంత తేలిక కాకపోవచ్చు. కేసీఆర్‌తో పోటీగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా దానిని రెచ్చగొట్టగలరు. ఆ విషయాన్ని ఆయన మర్చిపోరాదు. తామే రాష్ట్రాన్ని సాధించామని చెప్పుకోవడం వరకు ఓకే. దానిని జనం నమ్ముతారు కూడా. కాని చరిత్రను తనకు అనుకూలంగా మలచుకుని మాట్లాడుతున్న వైనం ఎంతవరకు ప్రయోజనమన్నది ప్రశ్న.
కేసీఆర్ ఏమన్నారో చూడండి.. 'తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్‌ఎస్ , తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్‌ఎస్" అన్నారు. 'తెలంగాణ కన్నీళ్లు తెలిసిన పార్టీగా.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్థిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను, తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు.
ప్రతి పదంలో తెలంగాణ సెంటిమెంట్ ను చొప్పించడానికి కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఇదే ప్రసంగంలో ఆయన ఒక మాట అన్నారు. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల ఓటమి గురించి మాట్లాడుతూ రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, కొత్తతరంలో తెలంగాణ సోయి లేనందునే పార్లమెంటు ఎన్నికలలో ఓడిపోయామని చెప్పారు. ఇందులో వాస్తవం ఉందా? లేదా? అనేదాని కన్నా, ఆయన ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రేకెత్తించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్నదే ఆయన లక్ష్యం అనే విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు.
తన పదవీకాలంలో ఎప్పుడైనా ఒకసారి సెంటిమెంట్ గురించి మాట్లాడినా, సాధ్యమైనంత వరకు ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారైనా తెలంగాణ ప్రజలగానే చూడాలని అనేవారు. అది ఆయనకు కలిసి వచ్చింది కూడా. అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్న వారిలో మెజార్టీ బీఆర్‌ఎస్‌కే మద్దతు ఇచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆనాటి టీఆర్‌ఎస్ ఉనికే పెద్దగా లేదన్నది వాస్తవం. కాని అధికారంలోకి వచ్చాక ఎలాంటి గొడవలు లేకుండా, ఉద్యమం వివాదాలు కనిపించకుండా కేసీఆర్ ప్రభుత్వం సాగింది. కనుకే వారి మన్ననలు పొందగలిగారు.
అయితే.. నిజాం సంస్థానాన్ని ఆనాటి కేంద్ర ప్రభుత్వం సర్దార్ పటేల్ నేతృత్వంలో భారత్‌లో విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య గురించి కేసీఆర్ మాట్లాడిన తీరు అంత సబబు కాదేమో!. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి తెలంగాణకు ద్రోహం చేసిందని వాదించడానికి ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్నారు. 'దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదని, తెలంగాణ ఇంకా నిజాం పాలనలో ఉంటే భారత మిలటరీ సైనిక ఆక్రమణకు పాల్పడిందని కేసీఆర్ వివరించారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో 20-30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో కొంత మంది రజాకార్లు ఉన్నా మరికొంత మంది సామాన్యులు, కమ్యూనిస్టులు కూడా ఉన్నారని, మాజీ హోంమంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి తండ్రి వంటివారు ఎందరో మరణించారని గుర్తు చేశారు. సాయుధ పోరాటం తర్వాత తెలంగాణను ఆంధ్రాలో అన్యాయంగా విలీనం చేయడం వల్ల యువత, ప్రజల్లో అలజడి పెరిగిందని తెలిపారు.
‘ఆత్మగౌరవ పోరాటాలు చేసిండ్రు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ వంటి అనేక ఉద్యమాలు మొదలైనయి." అంటూ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కాంగ్రెస్ పార్టీని విమర్శించదలచుకుంటే ప్రస్తుత పరిణామాలలో చాలా దొరుకుతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్నైనా విమర్శలు చేయవచ్చు. కాని భారత మిలటరీ సైనిక ఆక్రమణలకు పాల్పడిందని అనడం చరిత్రాత్మకంగా ఎంత వరకు కరెక్టు? ఆనాడు భారత మిలటరీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు స్వాగతం పలికిన సన్నివేశాలు కూడా ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు.
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులను విమర్శించడానికి, అప్పట్లో తెలంగాణలో పెద్దగా అభివృద్ది సాగలేదని చెప్పడానికి కేసీఆర్ యత్నించినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో.. ఇప్పుడు సమైక్య రాష్ట్ర ఊసు అంత అవసరమా?. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేసీఆర్ గళమెత్తారు. ఎన్డీయే రూపంలో చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజకీయాలలోకి వస్తున్నారన్న సంశయాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశేషం ఏమిటంటే 2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తెలుగుదేశంతో స్నేహం చేసి ఓటమి చవి చూసింది. ఏపీలో 2024లో బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీతో భాగస్వామిగా ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు. తెలంగాణ వరకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు. కాని రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు(Chandrababu)కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నది అందరి భావన. అందువల్ల తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ఏమి అవుతుందన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును విమర్శించి, జాతీయ పార్టీ అయిన బీజేపీ జోలికి కేసీఆర్ పెద్దగా వెళ్లినట్లు కనబడదు. దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయవచ్చు. ఇక ఫిరాయింపులు, ఉప ఎన్నికల గురించి కేసీఆర్ బాగానే మాట్లాడారు. కాని ఆయన కూడా తను అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను పెద్ద ఎత్తునే ప్రోత్సహించారు. దానివల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే.. తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించడానికి పాత తరం వ్యూహరచన చేస్తున్నట్లుగా ఉంది. కాని కేసీఆర్ చెబుతున్నట్లే కాలం మారింది. తరం మారింది. దానికి తగినట్లుగా ఆయన వ్యూహం మార్చుకోరా? అనేదే ప్రశ్న.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment