
బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క టీచర్ పోస్టునూ భర్తీ చేయలేదు: మంత్రి శ్రీధర్‌బాబు
26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని హరీశ్‌రావు కౌంటర్
విద్యారంగంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలి: కూనంనేని
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కుప్పకూలిన విద్యావ్యవస్థను బాగు చేసుకుంటూ ముందుకువెళుతున్నామని, పూర్తిగా సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందన్నారు.
గత ప్రభుత్వం విద్యాశాఖలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 11 వేలకుపైగా టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా చేపట్టామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో విద్యాశాఖ, రోడ్లు భవనాలు, పర్యాటకం, ఎక్సైజ్‌శాఖ పద్దులపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ పద్దుపై సుదీర్ఘంగా ప్రసంగించారు.
ప్రస్తుతం విద్యావ్యవస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఇదే సమయంలో కలుగజేసుకున్న శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. పైవిధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 79 పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించామని, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరగడంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని మంత్రి వివరించారు.
బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క టీచర్ పోస్టును సైతం భర్తీ చేయలేదంటూ మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించడంతో బీఆర్‌ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు కలుగజేసుకున్నారు. ‘మా హయాంలో 26 వేల ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. 8 వేల ఉద్యోగాలు పబ్లిక్ సర్విస్ కమిషన్ ద్వారా చేశాం. గురుకులాల్లో 18 వేల నియామకాలు పూర్తి చేశాం’అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,913 స్కూళ్లు మూతపడ్డాయని, 257 గ్రామపంచాయతీల్లో అసలు ప్రభుత్వ పాఠశాలలే లేవని సబిత తెలిపారు.
కాళేశ్వరం అప్పుల కుప్ప: యెన్నం
బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్లలో చేయని పనులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. బీటెక్ చదివిన విద్యార్థులు సైతం ఎందు కూ పనికిరానివారిగా మారుతున్న దుర్భర స్థితి ప్రస్తుత విద్యావ్యస్థలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో తెలుగు మీడియం ఉపాధ్యాయులనే పెట్టడంతో విద్యార్థులకు తీరని అన్యా యం జరుగుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, దశ దిశ లేకుండా బీఆర్‌ఎస్ హయాంలో లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికి ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల కు ప్ప చేశారని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణంతో ఎన్నో మార్పులు వచ్చాయని, విద్యారంగంలోనూ విద్యారి్థనులు పోటీపడుతున్నారని వివరించారు.