
నాతో సహా అందరమూ కేసీఆర్ సైనికులమే
వరుస ఎన్నికలతో రాజకీయ పరిణతి సాధించా
ఏడాదిన్నరలోనే రేవంత్ ప్రభుత్వం తేలిపోయింది
ఎన్‌డీఎస్‌ఏ నివేదిక కాదు. అది ఎన్‌డీఏ రిపోర్టు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో హరీశ్‌రావు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని విద్యుత్ చార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం వంటివి టీఆర్‌ఎస్ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేనూ భాగస్వామిని కావడంతో ఉద్యమంవైపు ఆకర్షితుడినయ్యా.
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ పార్టీ అంటూ బీఆర్‌ఎస్‌పై చేసే విమర్శలు అర్థ రహితమని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించిన తాము.. ప్రజల ఆశీర్వాదంతోనే పదవులు చేపట్టామన్నారు. బ్యాక్‌డోర్‌లో తాము పదవులు పొందలేదని చెప్పారు. కేటీఆర్, కవిత సహా ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) ఇచి్చన నివేదిక ఎన్‌డీఏ ప్రభుత్వ నివేదిక తరహాలో ఉందని తెలిపారు.
మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులో ఉద్దేశపూర్వకంగా కాలయాపన జరుగుతోందన్నారు. ఏడాదిన్నరలోనే రేవంత్ పాలన తేలిపోయిందని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ బలమైన శక్తిగా తిరిగి అధికారంలోకి వచ్చి కేంద్రంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవం నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి నడిచిన హరీశ్‌రావు ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో నెమరువేసుకున్నారు. ఉద్యమంలో తన అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు.
పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. నాటి పరిస్థితులతోనే టీఆర్‌ఎస్ స్థాపన
తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు, వలసలు, రైతు ఆత్మహత్యలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం తదితరాలు టీఆర్‌ఎస్ స్థాపనకు పురికొల్పాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు కేసీఆర్ ఏడాది పాటు చేసిన కసరత్తులో నేనూ భాగస్వామిని కావడంతో ఉద్యమం పట్ల ఆకర్షితుడిని అయ్యా. ప్రొఫెసర్ జయశంకర్ తదితరులతో జరిగిన చర్చల్లో అనేక అంశాల పట్ల అవగాహన ఏర్పడటంతో ఉద్యమం పట్ల ఆకర్షణ, పాల్గొనాలనే ఉత్సాహం పెరిగింది.
తెలంగాణకు సంబంధించిన అంశాలను ఆకళింపు చేసుకునే క్రమంలో కేసీఆర్ వందలాది మందితో గంటల కొద్దీ సంప్రదింపులు జరిపారు. వారిని సమన్వయం చేయడం నా ప్రధాన బాధ్యతగా ఉండేది. టీఆర్‌ఎస్ ఆరంభంలోనే పార్టీ కోశాధికారిగా, ప్రచార కార్యదర్శిగా మీడియా బాధ్యతలు, ఆర్థిక అంశాలు, ఎన్నికల బాధ్యతలు చూసేవాడిని. పార్టీ పెట్టిన రెండు నెలల్లోనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు జెడ్పీటీసీ సభ్యులతో క్యాంప్‌ల నిర్వహణ బాధ్యత కేసీఆర్ నాకు అప్పగించారు.
వైఎస్ మంత్రివర్గంలోకి అనగానే..
నాకు ఎమ్మెల్యే పదవి లేకున్నా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చేరమని కేసీఆర్ ఆదేశించినప్పుడు నేను ఆశ్చర్యానికి లోనయ్యా. మంత్రివర్గంలో కొనసాగుతూ పార్టీ బలోపేతం చేయమని ఆదేశిస్తూ టీఆర్‌ఎస్ తరఫున మంత్రివర్గంలో చేరే వారి జాబితాను నాతోనే కేసీఆర్ రాయించి కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చారు. 33 ఏళ్ల వయసులోనే రాష్ట్ర మంత్రివర్గంలో చేరినా, పాలన కంటే ఉద్యమం మీదే ఎక్కువ దృష్టి ఉండేది. మంత్రిగా పనిచేస్తూనే 2004 అక్టోబర్‌లో సిద్దిపేట ఉప ఎన్నికలో తొలిసారి పోటీ చేశాం. అంతకు మునుపే కేసీఆర్‌కు సంబంధించిన 2001 ఉపఎన్నిక, 2004 అసెంబ్లీ ఎన్నిక బాధ్యతలను నేనే చూశా. దీంతో నాకు సిద్దిపేట, ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో ఉన్న సన్నిహిత సంబంధం ఉండటం కలిసొచి్చంది.
నివేదికల పేరిట పార్టీని దెబ్బతీసే కుట్ర
తెలంగాణలో ఏర్పడిన తొలి మంత్రివర్గంలో మిషన్ కాకతీయతోపాటు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఆయకట్టును పెంచాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా పనులు వేగంగా పూర్తి చేసేందుకు సైట్ వద్దే నిద్రించిన సందర్భాలు అనేకం. ఈడీ, సీబీఐ
తరహాలోనే ఎన్‌డీఎస్‌ఏ కూడా ఎన్‌డీఏ జేబు సంస్థగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల సమయంలో మధ్యంతర నివేదిక, రజతోత్సవ సందర్భంలో తుది నివేదిక అంటూ మా పార్టీని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి.
పదవులొస్తాయని అనుకోలేదు
కుటుంబ పార్టీ, ఆ నలుగురు అంటూ మాపై చేసే విమర్శలు అర్థ రహితం. రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉద్యమించడం మినహా, అధికారం, పదవులు వస్తాయని మాలో ఎవరూ అనుకోలేదు. మేము వెనుక డోర్ నుంచి పదవుల్లోకి రాలేదు. ప్రజల ఆశీర్వాదంతో వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వాళ్లం. కేసీఆర్ నాయకత్వంలో, మార్గదర్శకత్వంలో కార్యకర్తలుగా పనిచేస్తాం. నాతో సహా పార్టీలో అందరమూ కేసీఆర్ సైనికులమే.
బీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతుంది ఏడాదిన్నరలోనే రేవంత్ ప్రభుత్వం తేలిపోయింది. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగితే వారి పాలన సామర్థ్యం ప్రజలకు మరింత అర్థమవుతుంది. ఇప్పటికే బీజేపీ కేంద్రంలో ప్రాంతీయ పార్టీల మద్దతు వల్లే మనుగడలో ఉంది. రేపు కేంద్రంలో అధికారంలోకి వచి్చనా ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి. బీఆర్‌ఎస్ బలమైన శక్తిగా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తుంది.
మహాగర్జన అపురూప జ్ఞాపకం
Harish Rao ,Interview with Sakshi, telanganaఉద్యమ సమయంలో వరంగల్‌లో 25 లక్షల మందితో నిర్వహించిన మహాగర్జన అపురూప జ్ఞాపకంగా మిగిలిపోయింది. కేసీఆర్ ఈ సభకు సిద్దిపేట నుంచి సైకిల్‌పై వచ్చారు. అలాంటి సభలు ఈ రోజుల్లో నిర్వహించడం సాధ్యం కాదు. పార్టీ వద్ద అప్పట్లో పెద్దగా డబ్బులు లేకున్నా ప్రజలు ఈ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చారు.