
ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 లక్షల్లోపు రుణాలు మాఫీ
అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన
ప్రభుత్వం మాట తప్పిందంటూ సభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయలు: హరీశ్‌రావు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘రైతు రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం రూ. 2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ. రూ. 2 లక్షలపైన మాఫీ లేదు. కుటుంబానికి రూ. 2 లక్షలలోపు రుణం ఉన్న వాటిని మాఫీ చేస్తామన్నాం. ఇలాంటి కుటుంబాలు 25 లక్షలు ఉన్నట్లు మాకు వివరాలు అందాయి. ఆయా కుటుంబాలకు రూ. 20,616 కోట్లు జమ చేశాం. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గందరగోళపడి రైతులను గందరగోళం చేయొద్దు’అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలు, పశుసంవర్థక శాఖ పద్దులపై శనివారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా తుమ్మల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఆది శ్రీనివాస్ మహేశ్వర్‌రెడ్డి సహా మొత్తం 13 మంది సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులపై రుణభారం ఉండొద్దన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం రుణమాఫీని ప్రధానాంశంగా తీసుకుందన్నారు. అలాగే రైతు భరోసా కోసం రూ. 7,625 కోట్లు విడుదల చేశామని.. ఈ పంటకు కూడా రైతు భరోసా నిధులు ఇస్తామన్నారు.
ప్రభుత్వంపై భారం పడినా రైతులకు ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులను ప్రోత్సహించడంతోపాటు కౌలు రైతులకు మేలు చేసేందుకే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నామన్నారు. సన్నాలకు ఇప్పటివరకు రూ. 1,200 కోట్ల మేర బోనస్ ఇచ్చినట్లు తుమ్మల వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నాల సాగు 25 శాతం నుంచి 45 శాతానికి పెరిగిందన్నారు.
ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. పంట నష్టపరిహారం ఎకరానికి రూ. 10 వేలు ఇస్తున్నామని.. రైతులు నష్టపోయిన పూర్తి పంటకు కూడా నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. భవిష్యత్తులో బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, రైతు రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.
రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబయలు: హరీశ్‌రావు
రైతు రుణమాఫీపై కాంగ్రెస్ మోసం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ‘రూ. 2 లక్షలు పైబడిన రైతు రుణాలను మాఫీ చేయలేమని వ్యవసాయ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడం సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలకు.. చేతలకు పొంతన లేదని రుజువు చేసింది. సీఎం మాటలు నమ్మి రూ. 2 లక్షలు పైబడిన రుణాలకు సంబంధించి వడ్డీ చెల్లించిన రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలోకి నెట్టింది.
అలాగే రూ. 2 లక్షలలోపు తీసుకున్న రుణం ఇంకా మాఫీ కాక చాలా మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాల్లోని లోపాలను సవరించకుండా రైతులపైనే నెపం నెట్టి రుణమాఫీ నుంచి ప్రభుత్వం తప్పించుకుంది. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని అసెంబ్లీ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. బడ్జెట్లో పెట్టిన విధంగా రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేయాలి’అని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment