భవనం పైనుంచి దూకి ప్రియురాలి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారానగర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాములు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రం, బస్కంది గ్రామానికి చెందిన సుల్తానా బేగం(26) సిద్ధిఖీనగర్‌లో ఉంటూ గచ్చిబౌలిలోని అంతేరా హోటల్‌లో సర్వర్‌గా పని చేస్తోంది.
వెస్ట్ బెంగాల్‌కు చెందిన సైదుల్లా షేక్ గచ్చిబౌలిలోని నావాబ్ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తూనే పెస్ట్ కంట్రోల్ పని చేసేవాడు. సుల్తానా, సైదుల్లా షేక్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుల్తానా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండటంతో తనను పెళ్లి చేసుకోవాలని సుల్తానా సైదుల్లాపై ఒత్తిడి పెంచింది. బుధవారం సాయత్రం పెళ్లి విషయమై గొడవ జరిగింది. దీంతో పెళ్లికి నిరాకరించిన అతను ఆమె ఫోన్‌ను బ్లాక్‌లో పెట్టాడు. దీంతో సుల్తానా మరో యువతికి ఫోన్ చేసి షైదుల్లా ఉంటున్న ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది.
దీంతో ఆమె ఈ విషయాన్ని సైదుల్లాకు చెప్పినా అతను పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి లోనైన సుల్తానా గురువారం ఉదయం సైదుల్లా నివాసం ఉండే భవనంపైకి ఎక్కి 6వ అంతస్తు నుంచి దూకడంతో కింద పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించగా ఉదయం మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.