
మహబూబ్‌నగర్,సాక్షి: మహబూబ్ నగర్‌లో లేఖ కలకలం సృష్టించాయి. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను హెచ్చరిస్తూ రాసిన లేఖలు మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్‌పేట్ జిల్లా మక్తల్‌లో వెలుగులోకి వచ్చాయి.
ఆ లేఖలో ‘మేం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం. సీఎం రేవంత్‌రెడ్డికి ఇదే మా హెచ్చరిక. ఖబడ్దార్. మీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకి(మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి) మంత్రి పదవి రాకుండా చేశావో అప్పుడు నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. మిమ్మల్ని సీఎం పదవి నుంచి దించడం’ అని హెచ్చరిస్తూ లేఖలో రాశారు.
ముదిరాజు సామాజిక వర్గం పేరుతో ఆ లేఖలు వెలుగులోకి రావడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ఆ లేఖలు ఎవరు రాశారా? అని ఆరా తీస్తున్నారు.ఆ లేఖలపై సమాచారం అందుకున్న ముదిరాజు సంఘం నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ లేఖలతో తమకు సంబంధం లేదని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.