రైతు సంక్షేమం కాంగ్రెస్‌ పేటెంట్‌: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Says Farmers welfare is Congress patent | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమం కాంగ్రెస్‌ పేటెంట్‌: సీఎం రేవంత్‌

Published Sun, Dec 1 2024 4:22 AM | Last Updated on Sun, Dec 1 2024 10:16 AM

CM Revanth Reddy Says Farmers welfare is Congress patent

మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌లో సభకు హాజరైన ప్రజలు , అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి

నాడు ఉచిత విద్యుత్‌ నుంచి నేటి బోనస్‌ దాకా తెచ్చింది మేమే

చర్చిద్దాం.. మోదీ వస్తారా? కేసీఆర్‌ వస్తారా?: రేవంత్‌ సవాల్‌ 

లగచర్లలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు చిచ్చుపెట్టారు 

వారి మాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు వెళ్లారు 

మీ కుట్రలు, కుతంత్రాలకు నేను బెదిరేవాడిని కాదు.. 

తోడేళ్లు, పులులు ఎన్నో చూశా.. మానవ మృగాలు మీరెంత? 

కేసీఆర్‌ చేసిన రుణమాఫీ మిత్తీలకే పోయింది 

మేం తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం 

పాలమూరు జిల్లా కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడి 

రైతు పండుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు

నా ప్రాంత అభివృద్ధి, 25 వేల మంది యువతకు ఉపాధి  కోసం కొడంగల్‌లో పారిశ్రామిక వాడ నిర్మించాలనుకున్నా. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లగచర్లలో చిచ్చుపెట్టి అధికారులపై దాడులు చేయించారు. వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు వెళ్లారు. మీ కుట్రలు, కుతంత్రాలకు నేను బెదిరేవాడిని కాదు. తోడేళ్లు, పులులు ఎన్నో చూశా.. మానవ మృగాలు మీరెంత? నేను ఆనాడే చెప్పాను వాళ్లని నమ్మొద్దని. లగచర్లలో కేసులు ఎదుర్కొంటున్న వారు నా దగ్గరకు వస్తున్నారు. ఒక్క కేసీఆర్‌కే గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ ఉంది. మా పారిశ్రామిక వాడ కోసం 1,300 ఎకరాలు ఉండొద్దా? నాడు అధికారులపై దాడులు చేసి ఉంటే సాగర్‌ వంటి ప్రాజెక్టులు పూర్తయ్యేవా? అభివృద్ధి కోసం కొందరు నష్టపోక తప్పదు.       
– సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రైతు సంక్షేమం అంటేనే కాంగ్రెస్‌ పార్టీకి పేటెంట్‌ అని...వైఎస్సార్‌ హయాంలో ఉచిత విద్యుత్‌ నుంచి ఇప్పుడు వరి ధాన్యానికి రూ.500 బోనస్‌ దాకా ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ప్రధాని మోదీ వస్తారో.. మాజీ సీఎం కేసీఆర్‌ వస్తారో.. ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలసి వస్తారో... రండి... చర్చిద్దాం..’’ అని సవాల్‌ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ‘లగచర్ల’లో చిచ్చుపెట్టి అధికారులు, కలెక్టర్‌పై దాడులు చేయించారని... వాళ్ల మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయారని పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా అమిస్తాపూర్‌లో రైతు పండుగ అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శనలు, స్టాళ్లను తిలకించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. సీఎం రేవంత్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

‘‘బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో ప్రజలు గమనించాలి. గత పదేళ్లలో కేసీఆర్‌ కేవలం సాగునీటి ప్రాజెక్టులు, కాంట్రాక్టర్ల కోసం రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అందులో కాళేశ్వరానికే రూ.1.02 లక్షల కోట్లు ఖర్చుపెట్టారు. కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతానని చెప్పారు. కానీ సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ కుప్పకూలిపోయాయి. అదే కాంగ్రెస్‌ హయాంలో ఎప్పుడో కట్టిన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, మంజీరా, ఎల్లంపల్లి భద్రంగా ఉన్నాయి. కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాకున్నా... వరుణుడి దయవల్ల 75 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర చర్రితలో, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 లక్షల కోట్ల టన్నుల వడ్లు తెలంగాణలో పండాయి. వరి వేస్తే ఉరేనని నాడు కేసీఆర్‌ అన్నారు. ఈ రోజు వరి ధాన్యానికి బోనస్‌ డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. దానితో బీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయి. 

రైతు కుటుంబాలకు రుణమాఫీ చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చిత్రంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్‌ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, అనిరు«ద్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, తదితరులు. 

కేసీఆర్‌ రుణమాఫీ మిత్తీలకే పోయింది.. 
కేసీఆర్‌ మొదట ఐదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ అన్నారు. నాలుగు విడతలు అన్నారు, మిత్తి తాను కడతానన్నారు. మళ్లీ 2018–23 వరకు లక్షన్నర రుణమాఫీ చేస్తానన్నారు. మొదటి నాలుగేళ్లు పైసా ఇవ్వలేదు. ఆఖరి ఏడాదిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డును రూ.7,500 కోట్లకు తెగనమ్మి మాఫీ డబ్బులు వేశారు. ఐదేళ్లలో వాళ్లు రుణమాఫీకి ఖర్చు చేసింది రూ.11 వేల కోట్లే. అందులో రూ.8,596 కోట్లు మిత్తిలకే పోయాయి. రైతులకు చెల్లించింది రూ.2,500 కోట్లే. హరీశ్‌రావు ఇది విను.. లెక్కలు కావాలంటే మళ్లీ చెబుతాం. 

సవాల్‌ చేస్తున్నా... ఎవరు వస్తారో రండి.. 
కేసీఆర్‌కు ఈ వేదికగా సవాల్‌ విసురుతున్నా. 25 రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా నిరూపించండి.  మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు మొత్తం రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. మోదీ వస్తారో.. కేసీఆర్‌ వస్తారో రండి. ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి.. అసెంబ్లీలో చర్చిద్దాం. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది.. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచి్చన చరిత్ర మాది.. రైతు బీమా తెచ్చింది కాంగ్రెస్‌.. వరి ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చింది కాంగ్రెస్‌. అసలు రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ పేటెంట్‌. పని చేయడమే మాకు తెలుసు.. పనిలోపడి చేసింది చెప్పుకోలేకపోతున్నాం. 



నాకీ పదవి ఆషామాషీగా రాలేదు.. 
కేసీఆర్‌.. పాలమూరు బిడ్డలు నిన్ను పల్లకీలో మోసి ఎంపీని చేశారు. పాలమూరు ప్రజలు ఆదరిస్తే సీఎం అయ్యానని చెప్పి పదేళ్లు మోసం చేశావు. నాడు పాలమూరును దత్తత తీసుకుంటా అన్నారు. కానీ పదేళ్ల పాలనలో ఈ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. ఇవాళ మేం నారాయణపేట–మక్తల్‌–కొడంగల్‌ ప్రాజెక్టు చేపడితే వద్దంటున్నావ్‌. కాళ్లలో కట్టెలు పెడుతున్నావ్‌. ఎందుకీ ద్వేషం. నేను రైతు బిడ్డగా కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరి రాష్ట్రానికి సీఎంగా ఇక్కడికి వచ్చా. నాకీ పదవి ఆషామాషీగా వచ్చింది కాదు. ఒక బాధ్యత. పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య, కేసీఆర్‌ చేసిందేమీ లేదు. మేం అభివృద్ధి చేసుకోలేమా? నేను ఇక్కడే పుట్టినోడిని, ఇక్కడి మట్టిలో కలిసే వాడిని.. సీఎంగా ఉండి నా జిల్లాకు ఏమీ చేయకపోతే చరిత్ర క్షమిస్తుందా? ఎవరు అడ్డం వచి్చనా తొక్కుకుంటూ జిల్లాకు నిధులు తెస్తా. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించేవరకు గ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తాం..’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.  

మార్పు కోసం వేసిన ఓటు అభయహస్తమైంది
సాక్షి, హైదరాబాద్‌: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు (నవంబర్‌ 30) పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్‌ బూత్‌కెళ్లి మార్పు కోసం ఓటేశాడని, ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ.. రూ.7,625 కోట్ల రైతు భరోసా.. ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌... రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్‌.. రూ.1,433 కోట్ల రైతుబీమా.. రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం.. రూ.10,547 కోట్ల ధాన్యం కొను గోళ్లు.. ఇలా ఒక్క ఏడాదిలో రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చాం. ఇది నంబర్‌ కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం..’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

పాలమూరుకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు తెచ్చుకుందాం 
పాలమూరుకు నీళ్లు తెస్తామంటే కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు అడ్డుపడుతున్నారు. ఎవరో వచ్చి పాలమూరును దత్తత తీసుకోవడం కాదు. మీ పాలమూరు బిడ్డనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరి దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా? పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసుకోవద్దా? ఒకే సంతకంతో మన జిల్లాకు కావాల్సిన అన్నీ తెచ్చుకుందాం. ఏడాదికి రూ.20 వేల కోట్లు మా జిల్లాకు ఇవ్వాలని మీ తరఫున మంత్రివర్గాన్ని అడుగుతా. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఈ జిల్లాకు తెచ్చుకుంటే బంజరు భూములు బంగారు భూములుగా మారవా? కేసీఆర్‌ కమీషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు తీసుకెళ్లారు. అలాంటిది మన గడ్డ అభివృద్ధికి లక్ష కోట్లు తెచ్చుకోలేమా? కచి్చతంగా తెచ్చుకుందాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20లక్షల ఎకరాల్లో నీరు పారించి సస్యశ్యామలం చేస్తాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement