![Manne Srinivas Reddy Lok Sabha candidate of BRS from Mahabubnagar - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/5/Manne-Srinivas-Reddy.jpg.webp?itok=ddOhsGIa)
సాక్షి, హైదరాబాద్: మరో లోక్‌సభ అభ్యర్థిని బీఆర్‌ఎస్ ప్రకటించింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఇప్పటివరకు 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.
నలుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించగా, అందులో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలకు తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. నామా నాగేశ్వర్‌రావు ఖమ్మం నుంచి, మాలోత్ కవిత మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాల నుంచి తిరిగి బరిలోకి దిగనున్నారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారు.
కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి దాదాపుగా కొత్తవారే బరిలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒకరిద్దరు సిట్టింగ్‌లు మినహా మిగతా చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొత్త నేతలు పోటీచేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, మరికొందరు పోటీకి దూరంగా ఉండనుండటమే దీనికి కారణమని అంటున్నాయి. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. అందులో ముగ్గురు పార్టీని వీడారు.
దీంతోపాటు ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి కారు గుర్తుపై పోటీచేసే విషయంలో పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఈక్రమంలో పక్షం రోజులుగా ఆయన బీఆర్‌ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఇప్పటికే చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైన నేపథ్యంలో.. రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరవచ్చని లేదా బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్ నుంచి లోక్‌సభకు కొత్త వారే..
Comments
Please login to add a commentAdd a comment