బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌.. మోసకారి పార్టీలు! | Kishan Reddy Comments on Congress Party and BRS | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌.. మోసకారి పార్టీలు!

Published Wed, Feb 21 2024 4:52 AM | Last Updated on Wed, Feb 21 2024 5:01 AM

Kishan Reddy Comments on Congress Party and BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/ సాక్షి, యాదాద్రి/ తాండూరు/ నిర్మల్‌: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ రెండూ ప్రజలను మోసం చేసే దొంగల పార్టీ లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఈ రెండూ అవినీతి, కుటుంబ పా ర్టీ లు అని, వాటితో ప్రజలకు అన్యాయమే జరుగుతుందని ఆరోపించారు. ఇన్నాళ్లూ తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటే.. ఇప్పుడు రాహుల్‌ గాంధీ దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు సాధించే లక్ష్యంతో.. మంగళవారం ఒకేరోజున రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచి బీజేపీ ‘విజయ సంకల్ప రథయాత్ర’లు మొదలయ్యాయి.

అస్సాం, గోవా రాష్ట్రాల సీఎం హిమంత బిశ్వశర్మ, ప్రమోద్‌ సావంత్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బీఎల్‌ వర్మ లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఆయా ప్రాంతాల్లోని ముఖ్యమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో పూజలు చేశాక.. రోడ్‌షోలు, మినీ సభలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. ఆయా ప్రాంతాల బీజేపీ సీనియర్‌ నేతలు వీటిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు ప్రజలను, బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. 

రాష్ట్రం నుంచి ఢిల్లీకి సూట్‌కేసులు..: కిషన్‌రెడ్డి 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌లో కృష్ణానది తీరాన దత్తాత్రేయుడు, కృష్ణమ్మ విగ్రహాలకు పూజలు చేసి బీజేపీ విజయ సంకల్పయాత్రను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. మక్తల్‌ బస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబం, నాయకుల దోపిడీ తప్ప తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇన్నాళ్లూ కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటే.. ఇప్పుడు రాహుల్‌గాంధీ దోచుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ సర్కారు తెలంగాణ ప్రజల సంపదను దోచి ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం సూట్‌కేసులు పంపిస్తోందని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలపై ‘రాహుల్‌ ట్యాక్స్‌’ వేస్తున్న పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. అదే కేంద్రంలో తొమ్మిదిన్నరేళ్ల బీజేపీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. కాగా.. 500ఏళ్ల హిందువుల కల రామమందిరాన్ని మోదీ సర్కారు సాకారం చేసిందని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా చెప్పారు. అన్ని పా ర్టీ లు తమ కుటుంబ సభ్యులను అందలం ఎక్కించాలని చూస్తుంటే.. ప్రధాని మోదీ సర్కారు ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ చెప్పేవన్నీ అబద్ధాలే..: హిమంత బిశ్వశర్మ 
ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే హామీలన్నీ అబద్ధాలేనని.. రాహుల్‌గాంధీ రాజకీయాల్లో అబద్ధాలు తప్ప ఏదీ నేర్చుకోలేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదేనని, ఎవరితోనూ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిర్మల్‌ జిల్లా బాసరలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను హిమంత బిశ్వశర్మ ప్రారంభించారు.

అనంతరం భైంసాలో నిర్వహించిన సభలో మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో ఉండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎనిమిది మంది అయ్యారని.. రానున్న రోజుల్లో 80మందితో బీజేపీ సర్కారు ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి తెలుగు అంటే ఇష్టమని, తెలంగాణవాడైన మాజీ ప్రధాని పీవీకి భారతరత్నతో గౌరవించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్, ఎంపీ సోయం బాçపూరావు తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో పది ఎంపీ సీట్లు బీజేపీకే: ప్రమోద్‌ సావంత్‌ 
పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో పది ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ చెప్పారు. ఆయన యాదాద్రి జిల్లా భువనగిరిలో విజయ సంకల్ప యాత్రను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. అవన్నీ తమ కుటుంబానికే ఇచ్చుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్‌ అబద్ధపు గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచి్చందని ఆరోపించారు. కాగా.. దేశంలో ప్రధాని మోదీ శకం నడుస్తోందని బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భువనగిరి కోట కేంద్రబిందువని.. ఇక్కడ బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 

కేసీఆర్‌ అంటేనే డేంజర్‌: బండి సంజయ్‌ 
కేసీఆర్‌ అంటేనే డేంజర్‌ అని, ఆయన వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్‌.. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని కాలం వెళ్లదీయాల ని చూస్తోందని మండిపడ్డారు. మంగళవారం తాండూరులో కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సంజయ్‌ కలసి విజయ సంకల్పయాత్రను ప్రారంభించారు.

తర్వాత స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో సంజయ్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరగడంతోనే.. కేసీఆర్‌ ఎమ్మెల్యేలను పిలిపించుకుని, బీజేపీతో పొత్తు అంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు కొంపలు ముంచడం ఒక్కటే పని అని, మళ్లీ ఢిల్లీకి వెళ్లి ఎవరి కొంప ముంచుతారో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మూడో సారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి బీఎల్‌ వర్మ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో అంతా అవినీతి, అక్రమాలేనని ఆరోపించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement