రాష్ట్ర అభివృద్ధిలో రెండు పార్టీలూ విఫలం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీజేపీదే విజయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ప్రజలు చూస్తున్నారని, అభివృద్ధిలో ఈ రెండు పార్టీల వైఖరి బొమ్మ, బొరుసు మాదిరి ఉందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పలువురు యువకులు ఆదివారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ కాలయాపన చేస్తున్నాయని, రెండు పార్టీలు కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలని ఆరోపించారు.
ఈ రెండు పార్టీల నేతలు రాష్ట్ర ఖజానాను దోపిడీ చేశారని మండిపడ్డారు. విశ్వనగరమని చెబుతూ వీధుల్లో కనీసం లైట్లు కూడా లేవన్నారు. ప్రభుత్వ శాఖల్లో కిందిస్థాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. లిక్కర్ మీద వచ్చే డబ్బులు కూడా ఇతర వాటికి మళ్లిస్తున్నారని, దీంతో లిక్కర్ కంపెనీలు కూడా రాష్ట్రానికి మద్యం ఇవ్వమని చెబుతున్నాయన్నారు. బీజేపీపై నమ్మకంతో ప్రజలు 8 పార్లమెంటు సీట్లు కట్టబెట్టారన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నా రు. రాష్ట్రంæ అప్పుల కుప్పగా మారడానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని మండిపడ్డారు. అవినీతి మచ్చ లేకుండా మూడు దఫాలుగా మోదీ ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాం«దీకి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment