
పాత కాపుకేనా లేక కొత్తగా చేరిన వారికి అవకాశం ఇస్తారా?
బీసీ నేతను నియమిస్తారా... ఓసీకి దక్కుతుందా?
ముందు వరుసలో ఈటల పేరు, పరిశీలనలో ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు కూడా..
అనూహ్యంగా తెరపైకి కేంద్రమంత్రి బండి సంజయ్...అయితే తాను పోటీలో లేనని వివరణ... సంజయ్‌కు దక్కినా దక్కొచ్చని పార్టీలో ఊహాగానాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి ఉగాదిలోపు కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం పార్టీవర్గాల్లో ఊపందుకుంది. దీనికి సంబంధించి ఒకటి, రెండురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్యనేతలు చెబుతున్నారు. తాజాగా కేరళ పార్టీ అధ్యక్షుడిగా రాజీవ్‌చంద్రశేఖర్‌ను నియమించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. త్వరలోనే కేంద్రమంత్రి శోభకరాంద్లజే తెలంగాణకు వచ్చి అభిప్రాయసేకరణ జరుపుతారని తెలుస్తోంది. ఇది ముగిశాక ఒకనేత పేరుతో నామినేషన్ పత్రాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి.. మరుసటి రోజు అధ్యక్షుడి ప్రకటన ఉండొచ్చునని అంటున్నారు.
అధ్యక్ష పదవి కోసం పార్టీలో పాత–కొత్త నేతల మధ్య ‘జాతివైరం’స్థాయిలో ఇప్పటికీ సాగుతోంది. పార్టీ సిద్ధాంతాలు, హిందుత్వ భావాలున్న పాత నాయకులకే ఈ పదవి ఇవ్వాలని కొందరు పట్టు పడుతున్నారు. పార్టీలో చేరాక, ఎంపీగా, ఎమ్మెల్యేగా లేదా మరో పదవికో ఎన్నికయ్యాక పాత–కొత్త అంటూ ఉండదని కొందరు (గత మూడు, నాలుగేళ్లలో చేరి ఆయా పదవులు పొందినవారు) వాదిస్తున్నారు. పార్టీలో కొత్తరక్తం నింపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనేక మార్పులు చేయాల్సి ఉంటుందని ఈ వర్గం సూచిస్తోంది.
అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ
రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముఖ్యనేతలు, సీనియర్ నేతలు, పాత–కొత్త నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
⇒ ఈసారి బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం దక్కొచ్చుననే ఊహాగానాలు ఎక్కువగా సాగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరి్వంద్, బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి తదితరులు పోటీపడుతున్నారు.
⇒ ఇక ఓసీ నాయకుల విషయానికొస్తే ఎంపీలు డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, ఇంకా పి.మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
⇒ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న వారిలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారు. అయితే కొన్నిరోజులుగా అనూహ్యంగా కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంజయ్‌ను మళ్లీ అధ్యక్షుడిగా నియమించేందుకు బీజేపీ అధినాయకత్వం మొగ్గుచూపొచ్చుననేది ఈ ప్రచార సారాంశం. అయితే అధ్యక్ష పదవి కోసం తాను పోటీలో లేనంటూ తాజాగా సంజయ్ వివరణ ఇచ్చారు. అయినా, పార్టీని ముందుండి నడిపించేందుకు ఆయన్నే అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కొందరు నేతలు చెబుతున్నారు. బీసీ నేతకు ఇస్తే ఈటల రాజేందర్‌కు దక్కొచ్చునని గతంలోనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పీఎం మోదీ, సీనియర్ నేతలు అమిత్ షా, నడ్డా వంటివారు ఈటలకే ఓటేస్తారనే ప్రచారం జరిగింది.
నేనంటే నేను అని ప్రచారం
గతంలో ఎన్నడూలేని విధంగా తనకే అధ్యక్ష పదవి వస్తుందంటూ కొందరు ముఖ్యనేతలు సైతం ప్రచారం చేసుకోవడం పట్ల రాష్ట్ర పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తాను అధ్యక్షుడిని అవుతున్నానంటూ వారు మీడియాకు, అనుచరులకు లీక్‌లు ఇచ్చుకోవడం ఇటీవల బాగా పెరిగిపోయింది. పార్టీనాయకుల్లో ఇలాంటి పోకడలు గతంలో ఎప్పుడూ లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై రాష్ట్రపార్టీలో ఏకాభిప్రాయం కుదరని కారణంగానే జాతీయ నాయకత్వం కూడా డైలమాలో పడిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment