new president of BJP
-
బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఫిబ్రవరిలో జరుగుతుందని పార్టీలోని విశ్వసనీవర్గాలు వెల్లడించాయి. జేపీ నడ్డా నుంచి కొత్త అధ్యక్షుడు ఫిబ్రవరిలో పగ్గాలు చేపడతారని వెల్లడించాయి. సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జనవరి మధ్యకల్లా పూర్తవుతాయని, తదుపరి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉటుందని వివరించాయి. 60 శాతం రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల పదవీకాలం ముగిసిందని, వీరి స్థానాల్లో .జనవరి మధ్యకల్లా కొత్త అధ్యక్షులు ఎన్నికవుతారని తెలిపాయి. కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే.. సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తికావాలని బీజేపీ నిబంధనావళి చెబుతోంది. మంత్రివర్గంలో నుంచి ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా అని ప్రశ్నించగా.. మంత్రి కావొచ్చు లేదా పార్టీలో ఒకరు కావొచ్చు.. అని విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. కొత్త అధ్యక్షుడెవరనే విషయంలో ఇంకా ఏదీ ఖరారు కాలేదని వివరించాయి. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా 2020 ఫిబ్రవరిలో పార్టీ పగ్గాలు చేపట్టారు. సాధారణంగా అధ్యక్షుడికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. అయితే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నడ్డాకు పొడిగింపునిచ్చిన విషయం తెలిసిందే. -
కమలానికి కొత్త సారధి..?
-
బీజేపీ అధ్యక్ష పదవికి నేనంటే నేనే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తుది దశకు చేరుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్, జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు భైజయంత్ పాండ సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 39 మంది నేతల అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో పార్టీ బలపడాలంటే ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందో చెప్పాలని పరిశీలకులు నేతలకు సూచించారు. ప్రతి ఒక్కరితో వన్ టు వన్‌గా మాట్లాడి అభిప్రాయాలను స్వీకరించారు. 39 మందిలో 10 మంది నేతలు తమకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అబ్జర్వర్లకు చెప్పుకున్నారు. అయితే అబ్జర్వర్లు మీరు కాకుండా అధ్యక్షుడిగా ఇంకా ఎవరి పేరునైనా ప్రత్యామ్నాయంగా ప్రపోజ్ చేయాలని సూచించడంతో వారు కంగుతిన్నట్లు తెలిసింది. తమకే అవకాశం ఇవ్వాలన్న వారిలో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, పేరాల చంద్రశేఖర్, ఎంపీ అరవింద్ తదితరులు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీలోని కోర్ కమిటీ నేతలతోపాటు కొంత మంది వైస్ ప్రెసిడెంట్లు, మరికొంత మంది అధికార ప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. కొంత మంది రాష్ట్ర పార్టీలో మార్పు అవసరమని పేర్కొనగా, కొంత మంది ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడికే అవకాశం ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది. అధ్యక్షుడి మార్పు జరగాల్సిందే.. మెజారిటీ నేతలు పార్టీ అధ్యక్షుడి మార్పు జరగాల్సిందేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే పాత వాళ్లకు ఇస్తారా? లేదా కొత్త వాళ్లకు ఇస్తారా? అనే దానిపై అభిప్రాయ సేకరణకు వచ్చిన నేతలు విషయాన్ని బయటకు చెప్పలేదు. మరోవైపు సీనియర్ నేతలు మాత్రం అభిప్రాయ సేకరణ విషయంలో కోర్ కమిటీ అభిప్రాయానికే పరిమితం కాకూడదని, గ్రౌండ్ లెవల్లో నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకొని నియామకంపై తుది నిర్ణయం తీసుకోవాలని అబ్జర్వర్లకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. పార్టీలోనే ఉంటూ కీలకంగా మారిన ఒకరిద్దరు నేతలు అభిప్రాయ సేకరణలో పాల్గొనే నేతల పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల కోర్ కమిటీలో కొత్తగా నియమితులైన వారి పేర్లే జాబితాలో ఉన్నాయని, కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ల పేర్లు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఓ సీనియర్ నాయకుడు పేర్కొన్నారు. -
నిశ్శబ్ద వ్యూహకర్త
న్యూఢిల్లీ: అధికార బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన జగత్ ప్రకాష్ నడ్డా(59)కు మృదు స్వభావిగా పేరుంది. స్వభావరీత్యా ఒదిగి ఉండే నడ్డా కార్యాచరణలో మాత్రం దృఢ సంకల్పంతో వ్యవహరిస్తారు. ఆర్భాటాలపై ఆసక్తిలేని నడ్డా అనతికాలంలోనే ఎదిగి, అపరచాణుక్యుడిగా పేరొందిన అమిత్‌షా నిర్వర్తించిన బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. నడ్డా నిశ్శబ్ద వ్యూహకర్త. ఆయన నిశ్శబ్దం వెనుక పట్టుదల, నిబద్ధత, సంస్థాగత నైపుణ్యం దాగి ఉన్నాయంటారు ఆయనను ఎరిగిన వారు. ఆరెస్సెస్‌కు నమ్మకస్తుడు ఆరెస్సెస్‌తో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తి నడ్డా. బీజేపీలో ప్రస్తుతం నడ్డా అత్యంత బలమైన మూడో వ్యక్తి. పార్టీ భవిష్యత్ వ్యూహంలో భాగంగానే గత ఏడాది నడ్డాని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి జేపీ నడ్డా 1960 డిసెంబర్ 2వ తేదీన బిహార్‌లోని పట్నాలో జన్మించారు. నడ్డా తండ్రి ఎన్.ఎల్. నడ్డా. ఈయన పాట్నా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. విద్యార్థి దశనుంచే బీజేపీ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)లో చురుకైన కార్యకర్తగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకి ఉంది. పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయాలంటూ నిర్వహించిన ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు నడ్డాని 45 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. ‘ఛత్రా సంఘర్‡్ష సమితిలో చేరడానికి జేపీ ఉద్యమం నుంచి ప్రేరణ పొందాను’ అని నడ్డా ఒకచోట ప్రస్తావించారు. ఆ తరువాత ఏబీవీపీ, బీజేపీ యువజన సంఘం భారతీయ యువ మోర్చాతో కలిసి పనిచేశారు. రాజకీయ కుటుంబం కాదు నడ్డాది సామాన్య బ్రాహ్మణ కుటుంబం. కానీ, రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన యువతిని వివాహం చేసుకున్నారు. నడ్డా భార్య మల్లిక జబల్పూర్ ఎంపీ జయశ్రీ బెనర్జీ కుమార్తె. జేపీ నడ్డా రాజకీయాల్లో ఆసక్తి కనపరిస్తే, మల్లిక నడ్డా విద్యారంగం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. బిలాస్పూర్ నుంచి అసెంబ్లీలోకి డిగ్రీ వరకు బిహార్‌లో చదివిన నడ్డా.. ఎల్ఎల్బీని హిమాచల్‌ప్రదేశ్‌లో చదివారు. బిలాస్పూర్ నుంచి 1993లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పలుమార్లు నడ్డా ఇదే స్థానం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రాష్ట్రంలో అటవీశాఖ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా కూడా నడ్డా పనిచేశారు. -
కమలనాథులకు కొత్త దళపతి
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా బీజేపీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని సోమవారం పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ప్రకటించారు. నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్న అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు. ఐదున్నర ఏళ్ల పాటు పార్టీని విజయవంతంగా నడిపి, పలు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నిలిపిన అమిత్ షా స్థానంలో నడ్డా పార్టీ పగ్గాలు చేపట్టారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నడ్డాకు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండే నేతగా పేరుంది. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ సైద్ధాంతిక దిక్సూచి ఆరెస్సెస్, ప్రధాని మోదీ, అమిత్ షా సమర్ధించారు. ఈ సంస్థాగత ఎన్నికలో నడ్డా తరఫున మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగానే ముగిసింది. నడ్డా తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పలువురు రాష్ట్ర శాఖల ప్రతినిధులు నామినేషన్లు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించడం కొత్త అధ్యక్షుడిగా నడ్డా ముందున్న తక్షణ సవాలు. ఇప్పటివరకు విజయం సాధించని రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని సాధించిపెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని నడ్డా పేర్కొన్నారు. ఎన్నిక అనంతరం నడ్డా అభినందన కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి షా, పార్టీ అగ్ర నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. మోదీ కొత్త ప్రభుత్వంలో హోంమంత్రిగా అమిత్ షా చేరడంతో.. గత జూన్‌లోనే బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికయ్యారు. అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉండటం వల్ల.. ఒక వ్యక్తికి ఒకే పదవి అని బీజేపీలో ఉన్న సంప్రదాయం నేపథ్యంలో నడ్డా నాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు అయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా నడ్డా ఎన్నికవడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడి హయాంలో, మోదీ మార్గనిర్దేశంలో బీజేపీ కొత్త శిఖరాలకు చేరుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘నడ్డా నేతృత్వంలో పార్టీ మరింత వైభవాన్ని, మరిన్ని విజయాలను సాధించాలి’ అని రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి నడ్డా ఎదగడం బీజేపీ కార్యకర్తల పార్టీ అనే విషయాన్ని స్పష్టం చేస్తోందని మరోమంత్రి గడ్కరీ పేర్కొన్నారు. ఇది బీజేపీలోనే సాధ్యం ఒక సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్షుడు కావడం కేవలం బీజేపీలోనే సాధ్యమని కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ‘దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ బీజేపీనే. అయితే, మనం ఇక్కడే ఆగిపోం. కొన్ని రాష్ట్రాలు మిగిలాయి. మన దృష్టి ఇకపై వాటిపైననే. త్వరలో వాటినీ సాధిస్తాం’ అన్నారు. కలిసి స్కూటర్‌పై తిరిగాం నడ్డా అభినందన కార్యక్రమంలో ప్రధాని మోదీ.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. నడ్డా, తాను పాత స్నేహితులమని, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా తాము కలిసి స్కూటర్‌పై తిరిగేవారమని చెప్పారు. నడ్డా హయాంలో పార్టీకి కొత్త శక్తి, ఆశ, ఆకాంక్షలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యక్షుడికి అందరం పూర్తి సహకారం అందించాలన్నారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్న అమిత్ షా నిరుపమాన కార్యకర్త అని ప్రశంసించారు. మరోవైపు, ఇదే వేదికపై నుంచి మోదీ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారు కొత్త ఆయుధాలను పట్టుకు తిరుగుతున్నారని ఆరోపించారు. అబద్ధాలను, గందరగోళాన్ని వ్యాప్తి చేయడమే వారు పనిగా పెట్టుకున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలను ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోవాలని, అదే బీజేపీ బలమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
బీజేపీ చీఫ్‌గా నడ్డా!
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డాను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. జేపీ నడ్డా ప్రస్తుతం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. పోటీ లేకుండానే సోమవారం నడ్డా ఎన్నిక జరిగే అవకాశముంది. నడ్డాకు మద్దతుగా నామినేషన్లను సమర్పించేందుకు కేంద్రమంత్రులు సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్రాల ప్రతినిధులు సోమవారం ఢిల్లీ వస్తున్నారు. విద్యార్థి సంఘ కార్యకలాపాలు సహా దశాబ్దాలుగా పార్టీలో పనిచేసిన అనుభవం, కీలక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన తీరు, ఆరెస్సెస్‌తో అనుబంధం, వివాద రహితుడిగా ఉన్న పేరు.. మొదలైనవి జేపీ నడ్డాకు అనుకూలంగా పరిణమించాయి. దాంతో, ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ కూడా ఆయనకే మొగ్గు చూపుతున్నారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్లను జనవరి 20న దాఖలు చేస్తారని, అవసరమైతే, ఆ మర్నాడు ఎన్నిక నిర్వహిస్తామని బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ రాధామోహన్ సింగ్ ఆదివారం ప్రకటించారు. అమిత్ షా అడుగు జాడల్లో.. ఐదున్నర ఏళ్లకు పైగా బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారు. షా హయాంలో బీజేపీ అత్యున్నత దశను అనుభవించింది. పలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. మోదీ తాజా ప్రభుత్వంలో అమిత్ షా హోంమంత్రిగా చేరడంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సంప్రదాయం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి కోసం మరొకరిని ఎన్నుకోవడం అనివార్యమైంది. నడ్డా ప్రస్తుతం పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. గత మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్చార్జ్గా నడ్డా వ్యవహరించారు. -
'దేశంలో పార్టీ మరింత బలపడుతుంది'
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ఎన్నిక కావడంతో హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం బీజేపీ సీనియర్ నేతలు డాక్టర్ లక్ష్మణ్, ఎన్. ఇంద్రసేనారెడ్డి, సీహెచ్ విద్యాసాగర్ రావులు మాట్లాడుతూ... అమిత్ షా సారథ్యంలో బీజేపీ దేశంలో మరింత బలపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారం చేపడుతుందని వారు జోస్యం చెప్పారు.